Previous Page Next Page 
అసావేరి పేజి 30

    "పల్లెల్లో గడ్డివాముల కథలేమన్నా తెలుసా.....?"
   
    ఈ ప్రశ్నకీ జవాబు తెలిసినట్టు వెంటనే అన్నాడు- "అని పశువు లకి మేతగా వుపయోగపడతాయి."
   
    "అంతేకాదు పరాయి మగాడితో పడుకోడానికి పరువులా వుపయోగపడతాయి. నిజం" రెచ్చగొడుతున్నట్టుగా అంది. "సావేరి ఇలాంటి గడ్డి వాముల దగ్గరికి రాలేదు శంకూ."
   
    "అసలు నేను సావేరిని...."
   
    "అందుకు ఇష్టపడటం లేదంటావ్?"
   
    తలూపాడు అవునన్నట్టు....
   
    "మరెందుకట.....?"
   
    జవాబు చెప్పలేకపోయాడు.
   
    "ప్రేమిస్తున్నావా....?"
   
    తలూపాడు ఈసారి కూడా.
   
    "ప్రేమించాక ఏం చేస్తావ్...."
   
    "........"
   
    "పెళ్ళాడుతావ్"
   
    "........"
   
    "పెళ్ళాడాక...." ఫకాల్న నవ్వేసింది. "మళ్ళీ నువ్వు చేసేది ఇదే పనిగా చూడూ....సావేరిని ప్రేమించడం సులభం. కానీ, సావేరితో పెళ్ళి సాధ్యం కానిది. అంటే ఆ తరువాత అనుభవమూ నీకు అందుకే అన్నినెలలు తీరుబాటుగా ప్రేమించుకుని చివరికి పెళ్ళి కాక పిల్ల దొరక్క కుమిలి పోవడంకన్నా ఆ కోరిక యిప్పుడు సులభంగా శ్రమలేకుండా నాతో తీర్చుకోవచ్చుగా."
   
    "త....ప్పు"
   
    "ఏమిటి అలాంటి అనుభవమా....ఆ అనుభవాన్ని నాతో పంచుకోవడమా? పిచ్చి శంకూ.... నిజానికి మీది ప్రేమ కాదు.....యిష్టం....ఒకరంటే ఒకరికి మోజు. ఇంతకన్నా నాకు విడమరిచి చెప్పడం తెలీదు.....కానీ యీ వయసులో మీరెలా ఆలోచిస్తారంటే యిష్టమయిన సినిమా చూసినట్టు....యిష్టమయిన తిండి తిన్నట్టు....యిష్టం వున్న వాళ్ళకోసం వెంపర్లాడుతుంటారు. ఒక్కసారి సావేరిని అనుభవించావనుకో...ఆ తరువాత కోరిక చచ్చిపోతుంది. అంతే శంకూ! అందుకే సావేరితో కలయిక చాలా ఖరీదైనదని తెలిసిన నేను ఖర్చు లేకుండా సరిగ్గా అలానే....అలానే ఏమిటి? అంతకన్నా బాగా నీకు....."
   
    లేవబోయిన శంకూ చేతిని ఒడిసిపట్టుకుంది. "ఏం....అర్ధంకావడం లేదా?"
   
    "నన్నొదులు....."
   
    "అలా అనాల్సింది సావేరిని. నన్ను కాదు."
   
    "మధ్యలో నీకేంటి లాభం?"
   
    అరలిప్తపాటు నిశ్శబ్దం. "నువ్వు బ్రతుకుతావు నా పొందుతో నీవు సావేరిని మరచిపోగలిగితే నాకు జరిగే నష్టంకన్నా నువ్వు లాభంగా మిగిలిపోతావు. నువ్వు మిగిలిననాడు బామ్మ బ్రతుకుతుంది. సావేరి తన బావతో మనశ్శాంతిగా మసగలుగుతుంది అందుకే రా...."
   
    బలంగా పైకి లాక్కోవడంతో వచ్చి మంగ ఒడిలో పడిపోయాడు. అప్పుడు చూసింది మంగ తాత్వికంగా  తననే గమనిస్తూన్న శంకూ కళ్ళలోకి.
   
    అతడి చూపుల్లో ఓ వయసులో ఉన్న అమ్మాయి పైకి చేరినప్పుడు మగాడిలో సహజంగా కనిపించే కాంక్షేలేదు. నిర్లిప్తత.....మరేదో సత్యాన్ని గ్రహించిన వ్యక్తిలో నిర్వేదం.
   
    "అంటే...." స్వప్నంలోలా అన్నాడు. "ఇదంతా చేయించింది రాజేందరన్నమాట...."
   
    తల పంకించిన మంగ ఇంకా స్పష్టంగా చెప్పాలనుకుంది. కానీ అప్పటికే వెళ్ళిపోతున్నాడు శంకూ.
   
    ఒక అనుభవం ఖర్చుతో అతడ్ని మళ్ళించాలనుకున్న మంగ అర్ధం చేసుకొన్నదొక్కటే.
   
    సావేరిలానే శంకూ సైతం స్థిరమైన సంకల్పంతో వున్నాడు.
   
    అది మోహం కాదు.
   
    నేను పుట్టిందే నిప్పుల కొలిమిలో కాలటానికని సమిధ చెప్పే కాలజ్ఞానంలా వున్నాడు. ప్రేమంటే అదేనా?
   
                                         *    *    *    *    *
   
    ఉదయం తొమ్మిదిన్నర కావస్తూంది.
   
    కాలేజీ ఆవరణలో సురేంద్ర స్కూటర్ ని ఆపగానే శంకూ తన క్లాస్ రూమ్ వేపు నడుస్తుంటే ఎదురయ్యాడు వెంకట్.
   
    "నా కవిత నీకు లింకు" మొన్న ప్రిపేర్ చేసిన కవిత నిన్ననే చదివేయాలనుకున్నాడు. కానీ శంకూ నిన్న రాకపోవడంతో కలతచెందిన వాడై యిప్పుడు లంకించుకున్నాడు. అసలు సావేరిలాంటి అమ్మాయి శంకూని యిష్టపడటం కొంత సంతృప్తినిస్తే మొన్న పోరాటంలో రవిని శంకూ బాదేయడం మరింత వూపునిచ్చింది.
   
    "గేలిచేసిన వాళ్ళను గగ్గోలు పెట్టించి.
   
    గాలమై తాళమై నీలమై కాలమై.....అహహ.....శంకూ.
   
    శంకూ నా కవితే నీకు లింకు...."
   
    వెంకట్ అనుసరిస్తున్నాడు.
   
    శంకూ అసలు వినడంలేదని వెంకట్ కి తెలీదు.
   
    కానీ వెంకట్ కవిత విన్న కారిడార్ పై విద్యార్ధులు కకావికలౌతున్నారు. ఈ మధ్యకాలంలో విశ్రాంతి తీసుకున్న వెంకట్ ఈ రోజు ఎందుకంత రెచ్చిపోతున్నాడో తెలీక విస్తుపోతున్నారు.
   
    "శంకూ....శంకూ.....నా కవితే నీకు లింకు...."
   
    "అంకమై శంఖమై.....శుభమైంకమై" ఆంగింకం ఉధృతమై ఇక లాభంలేదని శంకూకి అడ్డంపడ్డాడు.
   
    ఆగిన అతని మొహంలోని చిరాకుని చూస్తూ తొట్రుపడుతూ అడిగాడు "ఎలా వుంది?"
   
    "కొంచెం ఇంప్రూవ్ అయ్యింది."
   
    ఘొల్లుమన్నారు ఓ మూలనున్న జూనియర్లు.
   
    వెంకట్ మరో బలిపశువు కోసం చూస్తుండగానే అతను కారిడార్ మలుపు తిరిగాడు.
   
    అక్కడ ఎదురయ్యింది సావేరి.
   
    కాదు, అతడికోసమే ఎదురుచూస్తున్నట్టుగా వుంది.
   
    కాదు, అతడికోసమే ఎదురుచూస్తునట్టుగా వుంది.
   
    అతడు దృష్టి కలిపిందీ అరక్షణమే.
   
    వెంటనే ముందుకు నడవబోయాడు.
   
    అదికాదు అతను కోరింది-ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు ఎంతెంత నిరీక్షించిందని .....కాలేజీకి రానందుకే కాదు, కనిపించనందుకు కథలు కథలుగా అబద్దం చెప్పయినా వూరడిస్తాడనుకుంటే యింత నిర్లక్ష్యం ఎందుకని? అందుకే అడ్డంపడింది. "ఆగు...."
   
    "నన్ను వెళ్ళనియ్"
   
    సుమారు నలభై గంటలుగా శంకూ సైతం కలతచెందుతూనే గడిపాడు. సావేరిని చూడాలని తనకీ వుంది.కానీ రాజేందర్ చేసిన దారుణం క్షణ క్షణమూ గుర్తుకొస్తుంది.
   
    సావేరి కోసం శిక్షకు తను సిద్దమే.
   
    కానీ తనకేమన్నా అయితే బామ్మపడే యాతనకి తాను సిద్దంగా లేడు.
   
    "ఆగమంటున్నది నిన్నే" ఉక్రోషంగా అంది.
   
    "అందరూ చూస్తున్నారు."
   
    "చూడనియ్! నీతో మాట్లాడాలి...." మరింత మొండిగా అడ్డంపడి అతడ్ని వెనక్కి నెట్టబోయింది.
   
    "ఆడ గూండా"
   
    వెళ్ళిపోతున్నాడు శంకూ ఆమెను తోసుకుని.
   
    సావేరికి కళ్ళనీళ్ళ పర్యంతమయింది.
   
                                        *    *    *    *    *
   
    క్లాస్ ఓ కూర్చున్న శంకూకి మనసు మనసులో లేదు.
   
    సావేరి లంచవర్ కి ముందు ఎంత రోషంగా చూసిందీ అంటే ఆమె ఏ క్షణంలో అయినా పగిలే నిప్పుల కుంపటిలా వుంది.
   
    శంకూ చేసుకున్న మరో దురదృష్టం ఆ రోజు అసంకల్పితంగా అప్పారావు ప్రక్కన కూర్చోవడం.

 Previous Page Next Page