Previous Page Next Page 
హృదయాంజలి పేజి 29

   
    "మా ఉషోదయం పత్రికలో ఒక పేజీ మీ లాంటివాళ్ళ కోసమే ఉందండీ! చక్కని సాహితీ విలువలతో నడుపబడుతున్న పత్రిక అది! ప్రత్యేకంగా స్త్రీలకోసం ఒక నవలా సీరియల్......ఒక..."

    టకటకా చెబుతున్న అపురూప టక్కున ఆగిపోయింది.
 
    "మమ్మీ! నా ఆఫీస్ కీస్ చూశావా?"
 
    హడావిడిగా వచ్చాడొక యువకుడు ఆమెకీ తనకీ మధ్యగా.

    ఆరడుగుల అందగాడు!
 
    అప్పుడప్పుడే స్నానంచేసి తయారయినట్టున్నాడు. అతడిమీద నుండి కమ్మటి వాసన తేలివస్తూంది. నలుపు పాంటుకి తెల్లటి షర్టు టక్ చేసి టై కట్టుకొన్నాడు!
 
    "వారానికి రెండు సార్లయినా కీస్ పోగొట్టుకుంటావు! ఒకసారి ఆఫీసుకి పోయాయంటావు! అంత అజాగ్రత్త ఏమిటిరా? డ్రెస్సింగ్ టేబిల్ మీద, మంచం మీద చూశావా?" వెతికిపెట్టడానికన్నట్టు ఆవిడ లేచిపోయింది.

    అతడు ఇటు తిరిగాడు.

    హఠాత్తుగా ఒక మెరుపుతీగ ముఖాన కొట్టినట్టుగా అతడి ముఖంలో ఉలికిపాటుతో కూడిన విభ్రమం. చిరకాలంగా వెదుకుతున్న తీగ కాళ్ళకి తగిలిన సంభ్రమం.
 
    అతడి చూపుల్లో ఉవ్వెత్తున పొంగిన ఆత్మీయత!

    "మిస్.........మీరు......మీ పేరు?" అన్నాడు తడబాటుగా.
 
    అదృష్టవశాత్తూ తన వ్యవహారం ఇంతవరకు గృహిణులతోనే నడిచింది. రకరకాల వాళ్ళు! 'ఛీ! ఏం ఆడవాళ్ళు? చదువుకొన్నారెందుకు?' అనిపించినవాళ్ళూ ఉన్నారు. కాని, ఇంతవరకు రోమియోలు ఎదురు పడలేదు. ఇతడా బాపతులా వున్నట్టున్నాడు! ఎక్కడో, ఎప్పుడో పరిచయం పెంచుకొని ముగ్గులోకి దింపడానికి ఈ మగవాళ్ళు ఎన్నెన్ని నాటకాలు ఆడతారో! మగపిల్లల్ని నమ్మకూడదు! అసలు ధనవంతుల పిల్లల్ని నమ్మకూడదు. ఆ క్షణంలో అతడి ముఖంలో ప్రదీప్ కనిపించినట్టుగా అయ్యాడు.

    అతడి ముఖంలోకి ఒక తిరస్కార బాణం వదిలి వడివడిగా బయటికి వచ్చేసింది.

    ఆమె చర్యకు అతడెంత హతాశుడయ్యాడో, అతడి ముఖమెంత నల్లబడిందో ఆమె చూడలేదు. చూసివుంటే....

    అపురూప కష్టాల కడలికి అప్పుడే వారధి పడివుండేది.

    విధి బలీయమని ఇలాంటప్పుడే అనుకోవాలి.

    "కీస్ నీ బెడ్ మీదే వున్నాయి కదరా!" అంటూ వచ్చిన తల్లి, హాలు మధ్య కొయ్యబారినట్టుగా నిలబడిన కొడుకుని చూసి, "ఏమిట్రా? ఏమైంది? ఆ పిల్ల ఏదీ?" అనడిగింది.

    "వెళ్ళిపోయింది!"
 
    "అరె! ఏమైనా అన్నావా?"
 
    "ఏమనలేదు! పేరడిగాను!"
 
    "ఆ పిల్ల పేరుతో నీకేం కావలసివచ్చింది? క్రొత్తగా ఈ బుద్దెప్పటి నుండి? బ్రహ్మచారీ శతమర్కటః అని ఊరికే అన్నారా?" ఆవిడ ఆటపట్టిస్తున్నట్టుగా అంది.  "అందుకే చెప్పాను మీ డాడీకి, అబ్బాయికి పెళ్ళీడు వచ్చిందనీ, త్వరగా పెళ్ళి చేయాలనీ!"

    మరోసారైతే ఉడుక్కుని తల్లితో పోట్లాడేవాడు! ఇప్పుడామెకు జవాబేమీ ఇవ్వలేదడతు గబగబ బయటికివచ్చి కారెక్కి స్టార్ట్ చేసాడు. గేటు దాటుతూ అటుఇటు ఆత్రుతగా చూసాడు. ఆ అమ్మాయి ఎడం వైపు రోడ్డుమీద గబగబా నడిచి వెళుతూ కనిపించింది. అతడు వెళ్లాల్సింది ఆ వైపుకే. కారు ఆమె ప్రక్కనుండే వెళ్ళింది. ఆపాలనిపించినా ఆపలేదు, ఆమె దృష్టిలో తనిప్పటికే జులాయివెధవ అయ్యాడేమో! అందుకే అలా తిరస్కారంగా చూసి రివ్వున వెళ్ళిపోయింది. మళ్లీ రోడ్డుమీద పట్టుకొని పలకరిస్తే ఆమెను వెంటాడి పట్టుకొన్నట్టుగా ఫీలవుతుందేమో!
 
    కాని, మళ్ళీ ఆమె నెక్కడ చూస్తాడు?
 
    ఆమెను దాటి ముందుకి వచ్చాక కూడా వెనక్కి వెళ్ళి ఆమెను కలుద్దామా అనుకొన్నాడు. బలవంతంగా నిగ్రహించుకుని ముందుకే పోనిచ్చాడు. ఆఫీసుకైతే వెళ్ళాడుగాని ఏ పనీ చేయాలనిపించలేదు. ఏ ఫైలునీ చూడాలనిపించలేదు. మనస్సంతా ఆ అమ్మాయే ఆక్రమించుకొంది.

    ఏదో ఆలోచన స్ఫురించి ఇంటికి ఫోను చేశాడు.

    "మమ్మీ! ఇందాక ఆ అమ్మాయి ఏ పత్రికనుండి వచ్చింది?"
 
    "ఉషోదయం!"

    "పత్రిక మనింట్లో ఉందా?"

    "ఇక్కడే వదిలిపోయింది. ఎందుకు?" ఆవిడ కంఠంలో చెప్పలేనంత కుతూహలం.
 
    "నేననుకొన్నట్టు ఆ అమ్మాయే ఐతే ఇంటికి వచ్చి చెబుతానుగాని పత్రికలో ఆఫీసు ఫోను నంబరు వుందేమో చూడు!"

 Previous Page Next Page