చూసి నంబరు చెప్పిందామె.
వెంటనే ఆ నెంబరుకి ఫోను చేసాడతను.
ఎత్తింది ఎడిటరే.
అక్కడే ఉంది అపురూప.
అతడు తనను పరిచయం చేసుకొని "సర్! జస్ట్ ఇన్ ఫర్మేషన్ కావాలి" ఆగాడు.
"ఏమిటి?"
"మీ ఆఫీసులో ఎంతమంది ఆడపిల్లలు పని చేస్తున్నారు?"
"ముగ్గురు!"
"మీ పత్రిక కాన్వాసింగ్ కి వచ్చే ఆడపిల్ల లెంతమంది?"
"ఒక్కతే!"
అతడి స్వరం ఉద్విగ్నంగా అడిగింది - "ఆ అమ్మాయి పేరేమిటి?"
పరంజ్యోతి జవాబు ఇవ్వకుండా అపురూప ముఖంలోకి చూసాడు! "సంగతేమిటి?" అన్నట్టుగా.
ఆమె ఏదో సైగ చేసింది.
"ఆ అమ్మాయి పేరు సరస్వతి!" ఫోను పెట్టేసాడు పరంజ్యోతి. "ఏమిటి సంగతి?అతడెవరు?నీ గురించిఅడుగుతున్నాడు?" నీలిమబ్బు మేడలో జరిగిన సంఘటనగురించి చెప్పింది "ఇప్పుడు ఫోను చేసి నా పేరు అడిగింది అతడే కావచ్చు!"
"అతడితో పూర్వం పరిచయముందేమో గుర్తు తెచ్చుకో!"
"ఇంటర్ లో, డిగ్రీలో కో -ఎడ్యుకేషన్ వుండేది! కాని అతడిని చూసిన గుర్తులేదు! గుర్తుచేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు."
"మగ పిల్లల్ని ఆమడదూరంలో నిలబెట్టేదానివని నాకు తెలుసు. అందువల్ల నీ జీవితానికి రిస్క్ లేకపోవచ్చునే మోగాని అందువల్ల నువ్వు ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావేమోనని నా కనిపిస్తుంది."
"పోగొట్టుకుంటున్న అవకాశమా?" విస్మయంగా చూసింది.
"నువ్వున్న పరిస్థితిలో నీకు వివాహయోగం కనుచూపుమేరలో కనిపించడంలేదు. నీ కోసం వరుడ్ని చూచే పెద్దవాళ్ళెవరూ నీకులేరు. కట్నం ఇవ్వగలవా, లాంఛనాలివ్వగలవా అంటే అదీలేదు. నీ భుజాల మీదే ఇద్దరున్నారు. మీ నాన్నగారు కడతేరేసరికి, నీ చెల్లెలి చదువు పూర్తి అయి తన కాళ్ళమీద నిలబడేసరికి నువ్వు వృద్దకన్యవై పోతావేమోనని పిస్తూంది. ఈ బాదరబందీ అంతా నీ ఒక్కదానికే ఎందుకు చెప్పు?"
అతడు చెప్పదల్చుకున్నదేమిటా అన్నట్టు నిశితంగా చూడసాగింది అపురూప.
"ఎవరైనా నీ గురింతి ఆసక్తి వ్యక్తం చేస్తే నువ్వురెస్పాన్సు ఇవ్వడం మంచిదని నా ఉద్దేశం?"
"ఎవరైనా అంటే?"
"ఇందాక ఫోను చేసిన అబ్బాయే ననుకో!"
"ఎటువంటి రెస్పాన్సు ఇవ్వాలని మీ ఉద్దేశ్యం!"
"ఆ అబ్బాయిని కొంచెం ముందుకు ప్రొసీడ్ అయ్యే అవకాశాన్ని ఇస్తే బాగుండేదని నా ఉద్దేశ్యం."
"ప్రొసీడయ్యి నన్ను ముగ్గులోకి దింపి నవ్వులపాలు చేయాలనా?"
"మగపిల్లలంతా ఆడపిల్లల్ని ముగ్గులోకి దింపే బాపతు అని నువ్వనుకుంటే నీ దొట్టి దురభిప్రాయమని ఖచ్చితంగా చెప్పగలను!"
"మన సంస్కృతి సంప్రదాయాలను ఎంతో గౌరవించేమీరు. హిందూ కన్యకు పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారం ఉండాలని సలహా ఇస్తున్నారా?"
"అది మన సంస్కృతి సంప్రదాయాలకు విరుద్దమని ఎలా అనుకొంటున్నావు? మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో గాంధర్వ వివాహాలున్నాయి! రాక్షసవివాహాలున్నాయి! మన సాహిత్యంలోనూ అపూర్వమైన ప్రణయకథలెన్నో ఉన్నాయి. అంతెందుకు? మీ ఎడిటరుగారి జీవితంలోనూ అటువంటి ప్రేమకథే ఒకటుంది. నేను వెంటపడి. వేధించి ముగ్గులోకి దింపిన అమ్మాయోవరో తెలుసా?"
తెలీదన్నట్టుగా అపురూప తల అడ్డంగా ఊపింది. ఆమె కళ్ళలో ఏదో కంపరం! ఈయన పైకి కనిపించేంత పెద్దమనిషి కాదన్నమాట. మనసులో ఆడపిల్లల్తో అల్లరి చిల్లరిగా ఆడుకొన్న బాపతన్నమాట. అందుకే తనకీ సలహా ఇవ్వగలుగుతున్నాడు. ఈయన అల్లరికి బలైపోయిన అమాయకురాలెవరో పాపం!
"ఎవరో కాదులే మీ ఆంటీ లక్ష్మీప్రసన్నకుమారి. వెంటపడి, వేధించి మరీ పెళ్లాడాను తెలుసా?"
"అమ్మయ్య! గుండెలమీద బరువు తీసేసినట్లుగా అయింది అపురూపకు. వయసులో ఉండగా వెధవపని చేసానని అతడు భుజాలు ఎగరేస్తూ సగర్వంగా చెప్పివుంటే అతడిక్రింద పనిచెయ్యడం తనకిక సాధ్యమయ్యేది కాదు. యజమాని మంచివాడేకాదు, మచ్చలేనివాడుకూడా ఐతేనే వాళ్ళకింద నిర్భయంగా, నిస్సంకోచంగా చేయగలరు ఎవరైనా!