రాధమ్మగారి కళ్ళు చూస్తుండగానే ఎర్రబడిపోయాయి. ఈ అనారోగ్యస్థితిలో అలాంటి ఆవేశాన్ని తట్టుకోలేక ఆయాస పడసాగింది. శుష్కించిన ఆమె శరీరము వెర్రిఉద్రేకంతో వొణికిపోసాగింది. "ఈ ఇంట్లోకి..." పెదాలుదాటి మాట వెలికిరావటం కష్టముగా వుంది. "ఇంట్లోకి వచ్చిన ఇన్నాళ్ళకి....ఇన్నేళ్ళకి నన్నే ఎదిరిస్తున్నావట్రా? అంతటి మొన గాడివైనావేం? కాస్త ఆస్తి చేజిక్కేసరికి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? అప్రాచ్యుడా? పిలు. వెళ్ళి ప్లీడర్లని పిల్చుకురా. ఇవాళే...ఇప్పుడే నీభాగం, నా భాగం ఎవరికేమేమిటి రావాలో పైసలు చేసేసుకుందాం. వీలు అట్లా రాశాక కూడా వుమ్మడిగా వుండటం యిహ ఒక్క క్షణం కుదరదు" వెనక బాలీసుకు అనుకుని ముఖం చెమటలు గ్రక్కుతూండగా వగర్చసాగింది.
అంతకంటే గట్టిగా తనూ కేకలు, పెడబొబ్బలూ పెడదామన్నంత వుధృతముగా వున్నా కష్టంమీద సత్యమూర్తి సంబాళించుకున్నాడు. నేరం తనమీద వుంచుకోకుండా తల్లిమీదకే త్రోసివేయటం మంచిదని అతనికి హఠాత్తుగా తట్టింది "మంచిది. నీకెలా తోస్తే అలానే చేద్దామమ్మా?" అన్నాడు తెచ్చిపెట్టుకున్న శాంతంతో.
"ఈ ఠోళా వ్యవహారాలూ శషభిషలూ నాదగ్గర పనికిరావు. వెంటనే జరిగితీరాలి. అది తేలిపోయిన ఉత్తర క్షణంలో నేను యీ యిల్లు ఖాళీచేసి పోతాను. ఇంక నీపొడనాకు గిట్టదు ఆఁ అంతే."
"మంచిది" అని సత్యమూర్తి యిహ అక్కడ నిల్చోకుండా విస విస తన గదివైపు నడిచిపోయాడు.
ఇక్కడింత రాద్దాంతము జరుగుతూంటే కన్నులారా కాంచటానికి ముందుగా ఎందుకు లేపారు. కాదని మరోగదిలో సుభద్రమ్మ పెనిమిటితో దెబ్బలాడుతోంది.
* * *
నుదుటన అలుముకున్న స్వేదబిందువులు తడుచుకుంటూ, ఎర్రబడ్డ ముఖముతో తన గదిలోకి అడుగుపెట్టిన సత్యమూర్తి గుమ్మందగ్గరే చకితుడై నిలబడిపోయాడు.
పైప్ కాల్చుకుంటూ సత్యానందంగారూ, లేతగా పువ్వులా ప్రక్కనే సున్నితంగా ఆసీనురాలై వున్న సుధా అతనివైపు తలలు త్రిప్పిచూశారు.
అతను పెదాల మీదకు బలవంతాన చిరునవ్వు తెచ్చుకుంటూ "ఎప్పుడొచ్చారు?" అనడిగాడు జీవంలేని కంఠంతో.
"ఇప్పుడే ఓ రెండు నిమిషాలయింది" అని జవాబు చెప్పి, ఆయన హఠాత్తుగా కారణంలేని నవ్వుతో యిల్లదర కొడుతూ "కంగ్రాట్యులేషన్స్ ఫస్టుక్లాసులో ప్యాసయ్యారుట, మీ ఆహ్వానాన్ని అందుకొని పార్టీకివచ్చాం ఏదీ? ఏయే తినుబండారాలు తినిపిస్తారో తినిపించండి చూద్దాం" అన్నాడు అట్టహాసంగా.
సుధ ముసిముసిగా నవ్వుతూ "మీ భోజన ప్రయత్నాన్ని గురించి వారికి ముందుగానే చెప్పి వుంచానులే నాన్నా. బహుశా తగు ప్రయత్నంలోనే వుండివుంటారు" అంది.
సత్యమూర్తి లజ్జితుడైనాడు. కాని వాళ్ళిద్దరి అనురాగంతో కూడిన సంభాషణ వల్లా, అసహ్య భూయిష్టమైన గత సంఘటనను విస్మృతిలో పడవేసి "మిమ్మల్ని సెంట్ పర్సెంట్ రంజింపచేయగలనని ఛాలెంజి చేయలేను సుమండీ. నా శక్తికొద్దీ నిర్వహిస్తాను. ఏమంటారు?" అన్నాడు తనూ, వాళ్ళతో శృతి కలుపుతూ.
"ఆమాత్రం భరోసా యిస్తేచాలు, మీ నాన్నగారిలా చేయకుండా వుంటే...?"
"ఏమిటి నాన్నా?" అని అడిగింది సుధ కుతూహలంగా.
"విత్ ఎపాలజీస్...మిస్టర్ సత్యమూర్తి!" అని ఆయన అతని వంక క్రీగంట చూసి "ఒకసారేం జరిగిందంటే...ఏదో సందర్భం. పుట్టిన రోజు లాంటిది. ఎందుకో ఎన్నడూలేనిది ఆయనకు జరుపుకోవాలని బుద్ది పుట్టింది. సరే స్నేహితులు పదిమందిని యిన్ వైట్ చేశారు. మేమింకా వచ్చి నోటికి ఏమీ తీపి తగుల్తుందోనని ఎదురు చూస్తున్నాం...కాని చివరకు వచ్చిన పదార్ధాలు చూసేసరికి గుండె దిగజారిపోయింది. అంతటి ఆశాభంగాన్ని జన్మలో పొందివుండలేదు. మాకు లభించింది. ఉల్లిపాయ పకోడీలూ, టీనీళ్ళూ" ఆయన పక పక మని నవ్వసాగాడు.
సత్యమూర్తి కూడు నవ్వుదామని ప్రయత్నించాడు. ఎంత తాపత్రయపడినా నల్లటి రేఖ ముఖంమీద పొడగట్టక తప్పలేదు.
సుధ పసిగట్టింది. తండ్రి ఆ ప్రసక్తి తీసుకురావటం కొంతవరకూ ఆమెకు కూడా అమర్యాదగా తోచింది. "ఊరుకోండి నాన్నగారు! ఎప్పుడో జరిగినా విషయాల ప్రసక్తి యిప్పుడు దేనికి? అనేక సందర్భాలలో అనేకం జరుగుతాయి." అన్నది మృదువుగా మందలిస్తూ.
ఆయన యిహ ఆ ప్రసంగము మార్చివేస్తూ "అది సరేగాని మీరు నిలబడే వున్నారే. రండి. వచ్చి కూర్చోండి" అని పైప్ పీలుస్తూ నోటినిండా పొగ వదలసాగాడు.
సత్యమూర్తి వచ్చి దగ్గరగా వున్న ఓ కుర్చీలో కూర్చున్నాడు. అనుకోకుండా ముగ్గురూ వివిధ విషయాలపై మాట్లాడుకోసాగారు.
"అమ్మాయి రిజల్ట్సు కూడా ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తాయి" అన్నాడాయన మాటల మధ్యలో.
"తర్వాత ఏం చేస్తారు?"