Previous Page Next Page 
నల్లతంబి పేజి 29

కమెండో చేయి పడకుండా వుంటే ఇన్ కంటాక్స్ వారికి సంపదంతా చిక్కిపోయి వుండేది.
ఇద్దరి ఎత్తుల్నీ చిత్తుచేసి మధ్యలోనే టోపీ పెట్టేశాడు కమెండో.
ఈ విషయమేమీ తెలియని డిపార్ట్ మెంట్ వాళ్ళు విజయవాడ స్టేషన్ లో ట్రెయిన్ ఆగీ ఆగడంతో విషన్న వదనాలతో దిగుతున్న తార కుటుంబ సభ్యులను చుట్టుముట్టారు. ఏం జరిగిందో తెలియడంతో తెల్లగా పాలిపోయాయి వారి ముఖాలు.
"మేడమ్...ఎంత సొమ్మును కాజేసి వుంటారో వివరంగా చెబుతారా?" అప్పటికీ ఆశ చావక ఒక ఇన్ స్పెక్టరు అడిగాడు.
"పోవడానికేముంది నా దగ్గర! పుట్టింటి కెళుతున్నానుగా అందుకే ఏమీ తెచ్చుకోలేదు. బట్టలు వున్న సూట్ కేసుల్లో ఏదో వుంటుందని ఆశపడి ఎత్తుకెళ్ళి వుంటారు" అంతకు మించి చెప్పడానికి ఏముందన్నట్టుగా మిన్నకుండిపోయింది తార.
తేలుకుట్టిన దొంగలా వుంది ఆమె పరిస్థితి. జరిగిందీ బాహాటంగానే పైకి చెప్పుకోలేదు. చెప్పుకుంటే న్యాయం జరగకపోగా....డిపార్ట్ మెంట్ కు దొరికిపోవలసి వస్తుంది.
మౌనాన్ని ఆశ్రయించి.....కష్టార్జితనని పోగొట్టుకుని.....తనలో తాను కుమిలిపోవడం మినహా చేసేదేమీ లేదని తెలుసు కాబట్టి.....ప్రస్తుతం ఆమె అంతరంగం అలాంటి స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నది.
రిపోర్టు అయితే ఇచ్చింది కానీ, తన సొమ్ము దొరుకుతుందన్న నమ్మకం లేదు. అయితే, అప్పటికే ఇద్దరూ ఇన్ స్పెక్టర్లు రంగంలోకి దిగారు.
ఒకరు గుంటూరు రైల్వే ఇన్ స్పెక్టరయితే, రెండో వ్యక్తి విజయవాడ రైల్వే ఇన్ స్పెక్టర్ ధీరజ్.
తాము వెదుకుతున్న నేరస్తులే ఈ ఇద్దరూ అయి వుండవచ్చునని వూహించాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
ఎన్ని రూట్లలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత నిఘా ఏర్పాటు చేసినా, తెలివిగా ప్రతిసారీ నేరాలుచేసి చేజారిపోతూనే వున్నారు. ఈసారి ఎత్తి పరిస్థితుల్లోనూ వారిని వదలకూడదని అనుకున్నాడు ధీరజ్.
దోపిడీ జరిగిన సమయంలో రైలు పిడుగురాళ్ళ ప్రాంతంలో వుంది వుండవచ్చు. అంటే నేరం జరిగి రెండు గంటలే అవుతోంది. ఇప్పుడే తెలివిగా ప్రవర్తించాలి. ఆనేరస్తులు గుంటూరు దాటి ఇటు వైపుకు రాలేదు కనుక, తిరిగి హైదరాబాదు వైపుకే వెళ్ళి వుండాలి!
వాళ్ళు వెళ్ళే రూట్ లో వారికన్నా ముందుగా వెళ్ళి వారికోసం కాపుకాయాలి. సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడికుడి, విష్ణుపురం, మిర్యాల గూడా, నల్గొండ స్టేషన్లకు ఈ విషయాన్ని ఇన్ ఫామ్ చేసి గుంటూరు ఇన్ స్పెక్టరు ఆధ్వర్యాన ఒక టీమ్ ణు అటుగా వెళ్ళవలసిందిగా సూచించాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
 ప్రతి స్టేషన్ దగ్గరా ఎంక్వయిరీ చేసుకుంటూ విష్ణుపురం దగ్గరకు చేరుకునేసరికి తాను విజయవాడ నుంచి బయలుదేరి జగ్గయ్యపేట రూట్ మీదుగా పొందుగల దగ్గరకు చేరుకోవాలని ప్లాన్ ణు సిద్దం చేసుకున్నాడతను.
ఎందుకంటే, ఏమాత్రం అలక్ష్యం చేసినా నేరస్థులు పొందుగల చుట్టుప్రక్కల వున్న ఫారెస్టులలోకి దూరి మాయమైపోయే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అందుకే వెంటనే కార్యరంగంలోకి దిగాడు ధీరజ్.
మరుక్షణం పరుగుపందెం ప్రారంభమైంది.
ఒక టీం గుంటూరు ఇన్ స్పెక్టరు ఆధ్వర్యాన సత్తెనపల్లి వెళ్ళే స్ట్రీట్ హైవే మీద దూసుకుపోతుంటే, మరొక టీం ఇన్ స్పెక్టర్ ధీరజ్ సారధ్యాన హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేమీద రాకెట్ వేగంతో బయలుదేరింది.

                                            *    *    *
గుంటూరు రైల్వే ఇన్ స్పెక్టర్ ప్రయాణిస్తున్న జీప్....దాచేపల్లి మిర్యాలగూడా మధ్యనవున్న విష్ణుపురం వద్దా కృష్ణానదికి ఇవతల ఒడ్డు దగ్గర ఆగి వుంది.
సరిగ్గా అదే సమయానికి విజయవాడ నుంచి బయలుదేరిన ఇన్ స్పెక్టరు ధీరజ్ కొండపల్లి, నందిగామ, జగ్గయ్యపేట, హుజూర్ నగర్ లో ఎంక్వయిరీ చేసుకుంటూ పొందుగల చేరుకున్నాడు.
హుజూర్ నగర్-మిర్యాలగూడా మధ్యలో కృష్ణానది ఆవలి ఒడ్డున వున్నది పొందుగల.
వచ్చీరావడంతోనే తన దగ్గరవున్న వైర్ లెస్ ను ఆన్ చేసి గుంటూరు ఇన్ స్పెక్తారును కాంటాక్ట్ చేశాడు ధీరజ్.
"ఎవ్విరిథింగ్ ఈజ్ ఓకే సర్! మధ్యలో వున్న ప్రతి స్టేషన్ లోనూ విచారించే వస్తున్నాను. ఎత్తి పరిస్ధితుల్లోనూ గుంటూరు వైపు వాళ్ళు రాలేదని ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళు హైదరాబాదు వేపు వెళ్ళిపోయి వుంటారేమోననిపిస్తున్నది" అన్నాడు గుంటూరు ఇన్ స్పెక్టరు.
"నో....నో...యు ఆర్ రాంగ్....మామూలుగా ఎవరు చేసినా అలానే చేస్తారు. పోలీసులు కూడా అదే వూహించి ఆ రూట్ లోనే ప్రయాణం చేస్తారని వారికి తెలుసు. కానీ, వాళ్ళు మాత్రం మరోమార్గాన్ని ఎన్నుకుంటారు. నా అనుమానం నిజమైతే నదిని దాటి పొందుగల మీదుగా హైదరాబాదు వెళ్ళే ప్రయత్నంలో వుండివుండాలి. సాధ్యమైనంత త్వరగా ఇవతల ఒడ్డుకి చేరుకునే ప్రయత్నం చేయండి. ఈలోపు నేను ఇక్కడ చుట్టుప్రక్కల వుండే ఫారెస్టు ఏరియాను వాచ్ చేస్తుంటాను" అన్నాడు ధీరజ్.
"ఓకే, సర్!"
జీప్ ను అక్కడే వదిలి, కాలి నడకన సిబ్బందితో ముందుకు కదిలాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
ఎంతో దూరం వెళ్లకముందే ఇద్దరూ యువతీ యువకులు అతని కంటపడ్డారు.
తీరం వెంతవున్న మట్టిరోడ్డుమీద అడుగులు వేస్తున్న ఆ ఇద్దరు కూడా పోలీసులను గమనించి ఉలిక్కిపడ్డారు. తల తిప్పి చూసింది ఆ యువతి.
"బాప్ రే! పోలీసులు మనలను గుర్తుపట్టారు అధికారీ....మనకోసం పోలీసులు వస్తున్నారు" అన్నది సంజీవి కంగారుగా.
ఎప్పుడూలేనిదీ ఎందుకో ఈసారి అధికారిలో భీతి మొదలైంది.
"మన కోసమేనంటావా..." మళ్ళీ రెట్టించింది సంజీవి.
"కావచ్చు....ఇంతవరకూ ఎప్పుడూ మనసు చూసినవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మనమే ఆ నేరస్తులమని నిర్ధారించుకోవడానికి పోలీసులకేమీ దివ్యదృష్టి వుండదు. కేవలం అనుమానంతో ఆపుతారంతే. కాబట్టి ఎలాంటి కంగారూ పడకుండా షికారుకు వచ్చిన జంటలా అడుగులో అడుగు వేస్తూవుండు."

 Previous Page Next Page