Previous Page Next Page 
నల్లతంబి పేజి 28

"రొంబ థాంక్స్ మాడమ్..."
కలెక్టరుగారి శ్రీమతితో తార కూపేలోకి వచ్చింది. కూపే తలుపు మూసుకుపోయింది.
ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ సుతిమెత్తగా చిక్కని చీకటిని చీల్చుకుంటూ సాగిపోతోంది.
కాలం క్రమేపీ కరిగిపోతున్న కొద్దీ....
గుంటూరు స్టేషన్లో ఆగింది నర్సాపూర్ ఎక్స్ ప్రెస్.
ఫ్లాట్ ఫారం మీద కాలు మోపిన రామ్ కుమార్ ప్రక్క బోగీలో వుండవలసిన వేలాయుధం, సుబ్బారావుళ కోసం చూశాడు. ఆ ఇద్దరిలో ఎవరూ కనిపించలేదు అతనికి. అయినా ఆ విషయాన్ని గూర్చి పెద్దగా పట్టించుకోలేదతను.
ముందుకెళ్ళబోయే వాడల్లా ఏదో గుర్తొచ్చి ఆగిపోయాడు రామ్ కుమార్. ప్రముఖ సినీ నటి 'తార' అంతకుముందు తనతో చెప్పిన మాటలు గుర్తొచ్చి అప్రయత్నంగానే ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు అతను.
తాను టిక్కెట్టు తీసుకున్నది నర్సాపూర్ కి అయినప్పటికీ పర్సనల్ పనులకోసం విజయవాడలోనే దిగిపోవాలనీ, అందుకని విజయవాడ రాక ముందే వచ్చి గుర్తుచేయమని ఆమె మరీ మరీ చెప్పింది రామ కుమార్ తో.
ట్రయిన్ బయలుదేరే హడావుడిలో తను వుండడంతో ఈ విషయాన్ని వేలాయుధానికి తాను చెప్పలేదు.
అందుకే ఎటూ గుంటూరు వచ్చేసింది కాబట్టి వారి కూపే తలుపుని తట్టి తయారుగా వుండమని చేపుదామనే ఉద్దేశంతో 'తార' వున్న కూపేవైపు అడుగులు వేశాడతను.
తలుపు ఎంత కొట్టినా ఎవరూ తీయకపోగా దగ్గరకు లాగి వున్నట్లు అనిపించడంతో తానే తలుపు తెరిచాడు రామ్ కుమార్. మరుక్షణం లోపల కన్పించిన దృశ్యం చూసి అతని నోటమాట పెగలలేదు. అతను తేరుకోవడానికి రెండునిమిషాలు పట్టింది.
తార కుటుంబ సభ్యులందరికీ తలొకప్రక్కన కొందరైతే క్రిందే అస్తవ్యస్తంగా పడిపోయివున్నారు. కొంపతీసి ప్రాణాలు పోలేదుకదా అని కంగారుగా వారి వద్దకు వెళ్ళి పరిశీలనగా చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది వారి వాలకం. వెంటనే రియాక్టయ్యాడతను.
నిమిషాల మీద రైల్వే డాక్టర్ ని పిలిపించడంతో వారిని పరీక్ష చేసిన ఆ డాక్టరు భయపడవలసిందేమీ లేదని తెలిపాడు. మత్తు మందును హెచ్చుశాతం ఇవ్వడంవల్ల అపస్మారక స్థితికి చేరుకున్నారని చెప్పి, వారు కోలుకునేలా చేశాడు డాక్టర్.
తమ చుట్టూ గుమిగూడివున్న వారిని చూడగానే ఖంగారుగా పైకి లేచింది తార.
"ఏమైంది నాకు....? ఏమిటి మీరంతా!"
క్లుప్తంగా చెప్పాడు డాక్టరు.
"ఎస్....ఎస్....ఇప్పుడే గుర్తుకువస్తోంది. రాత్రి మంచినీళ్ళు కావాలని టి.టి.ఇ.ని అడిగాను. అతను తెచ్చిఇచ్చిన మంచినీళ్ళు త్రాగాక మాకు ఏదో మైకం కమ్మినట్టుగా అయి స్పృహతప్పి పడిపోయాము."
ఆమె మాటలు విన్న మరుక్షణం ఉలిక్కిపడ్డాడు రామ్ కుమార్. అంతవరకూ అతని విషయమే మరచిపోయినందువల్ల ఎక్కడున్నాడో చూశాడు. అక్కడ వుంటే కదా కనిపించడానికి!
అతనే కాదు, అతనితోపాటు కోచ్ అటెండెంట్ గా చెప్పబడిన సుబ్బారావు కూడా మాయమైపోయాడని క్షణాల మీద అర్ధమైపోయింది.
"అవునూ...మాతోపాటు కలెక్టర్ గారి శ్రీమతి కూడా కూపేలోనే వుండాలే...ఆమె ఏమైంది?" ఏదో అనుమానం వచ్చి గొణుగుతున్నట్టు అన్నది తార.
గతుక్కుమన్నాడు టి.టి.ఇ. రామ్ కుమార్. "ఏమిటి...ఏమంటున్నారు మీరు?"
"రాత్రి నల్గొండలో ఎక్కారు. ఒక యువతిని నా కూపేలో కూర్చోనివ్వమని చెప్పి వెళ్ళిపోయాడు వేలాయుధం..." అని ఖంగారుగా బెర్త్ లకింద వెదుక్కోసాగింది తార.
విషయం అర్ధం కావడంతో ఆమె తల్లీ, చెల్లెలు కూడా ఒక్క మొఖాలొకరు చూసుకున్నారు. ఎవరి ముఖంలోనూ జీవకళ లేదు.
వేలాయుధం వేలికి డైమండ్ రింగ్ వుండడం చూసినప్పుడే అనుమానం వచ్చింది నాకు. అంత ఖరీదైన ఉంగరాన్ని ఒక టి.టి.ఇ. పెట్టడమేమీటని అనుకున్నానే తప్ప అప్పుడే పోలీసులకు కంప్లయింట్ చేసి వుంటే నా సూట్ కేసులు పోయివుండేవి కావు" అంటూ బావురు మన్నది తార.
సినీ నటి తార బెర్త్ పై అంటించి వున్న "కమెండో" అన్న స్టిక్కర్ చూడడంతో ఏం జరిగివుంటుందో వూహించిన రామ్ కుమార్ బిత్తరపోయాడు.
డైమండ్ రింగ్ ధరించిన యువకుడు, యువతి కలసి తాత సూట్ కేసులను దొంగిలించారని, ఆ యువకుడే కమెండో అనీ...గుంటూరు రైల్వే పోలీసులకు కంప్లయింట్ చేశాడు టి.టి.ఇ రామ్ కుమార్.
గుంటూరు నుంచి విజయవాడకు ఆలస్యంగా బయలుదేరిన నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లొ ప్రయాణిస్తున్న ప్రఖ్యాత నటీమణి కుమారి తారను చూడడానికి వేలాదిగా జనం పోగయ్యారు ప్లాట్ ఫారమ్ మీద.
తార ముఖంలో జీవకళ లేదు. పోలీసులకయితే డబ్బు, నగలు వున్న సూట్ కేసులు పోయాయని చెప్పింది. కానీ.....జరిగింది తలచుకుంటుంటే ఏడుపు ఒక్కటే తక్కువ ఆమెకు.
ఎంతోకాలం నుంచీ మురగాపెడుతున్న కోట్లతో పాటు తాను విజయవాడలో అత్యంతాధునికంగా ప్రారంభించబోతున్న జ్యూయలరీ షాపుకోసం వజ్రాల నగలను తెస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. అందుకోసం మంచి సెంటర్ లో ఒక షాపు చూడడం అయిపోయిందనీ, ఆ బిల్డింగ్ ఓనర్ కు డబ్బుఇచ్చి తన స్వంతం చేసుకుని జ్యూయలరీ షాపును ప్రారంభించడానికి తాను వతున్న విషయమూ మూడో కంటికి తెలీకుండా జాగ్రత్తలు తీసుకుంది తార.
తనకు వున్న ఇన్ ఫ్లుయెన్స్ తో పాటు, తన ముద్దుల పలుకులతో ఇన్ కంటాక్స్ అధికారుల కళ్ళు కప్పి హైదరాబాద్ లో తప్పించుకో గలిగింది.
ఒకవేళ ఈ విషయం తెలిసినా, నర్సాపూర్ స్టేషన్లో ఇన్ కంటాక్స్ వాళ్ళు తనకోసం కాపుకాసి వుంటారు కాబట్టి....తను విజయవాడలోనే దిగి పోదామనే పధకంలో వున్నదామె.
అయితే, తనకన్నా వాళ్ళు తెలివిగానే ఆలోచిస్తారనే విషయం గ్రహించాలేకపోయింది. ఇలాంటిదేదో వుంటుందనే విజయవాడ స్టేషన్ లోనే ఆమెకోసం కాపుకాసి వున్నారు వాళ్ళు.

 Previous Page Next Page