Previous Page Next Page 
బెస్ట్ జోక్స్ పేజి 30


    "అదేంటో త్వరగా చెప్పు!"
    అతను గొంతు తగ్గించి రహస్యంగా చెప్పాడు.
    "వచ్చే ఆరునెలల్లోపలే మీ భర్త అతి దారుణమయిన హత్యకు గురవ్వబోతున్నాడు-"
    ఆమె జ్యోతిష్యుడివైపు చిరాగ్గా చూసింది.
    "ఆ సంగతి సరేనోయ్- నాకూ తెలుసది! కానీ నువ్ చెప్పేడవాల్సింది- ఏంటంటే ఆ తరువాత నేను పోలీసులకు దొరికిపోతానా, తప్పించుకుంటానా అనే విషయం"
    జ్యోతిష్యుడు కోమాలో కెళ్ళిపోయాడు.
    
    చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హైద్రాబాద్ తెగ డెవలప్ అయిపోయిందన్న పొలిటికల్ ర్యూమర్స్ లాలూ ప్రసాద్ యాదవ్ వరకూ పాకినయ్.
    "క్యా డెవలప్ హువా- దేఖేంగే" అనుకుని ఆంద్రప్రదేశ్ వచ్చాడు లాలూ.
    చంద్రబాబు అతనిని తన ఛాంబర్ కి ఆహ్వానించాడు.
    లాలూ వచ్చి కూర్చున్నాడు.
    చంద్రబాబు ప్రతి రెండు నిమిషాలకూ ఒక కొత్త టైప్ కార్డ్ లెస్ ఫోన్ తీసి ప్రపంచ నాయకులందరితోనూ మాట్లాడటం చూసి లాలూ అదిరిపోయాడు.
    "అదేం ఫోన్ చంద్రబాబు సాబ్?" అనడిగాడు లాలూ.
    "ఇది కేవలం నాకోసం కొత్తగా మా హైటెక్ సిటీవాళ్ళు కనిపెట్టారు! దీని కాస్ట్ పదికోట్లు- అన్నాడు చంద్రబాబు గర్వంగా.
    "పది కోట్లే? అందులో స్పెషాలిటీ ఏంటీ?"
    "ఎప్పుడయినా అవసరం వస్తే మనం భూతాలతో కూడా మాట్లాడవచ్చు"
    "వ్వాట్! భూతాలతో కూడా మాట్లాడవచ్చా-" థ్రిల్లయిపోతూ అడిగాడు లాలూ.
    "అవును! మనం టేకప్ చేసిన అభివృద్ధి పనుల గురించి భూతాలు కరెక్ట్ గా ఎసెస్ మెంట్ ఇస్తాయ్! అందుకే నేను వాటితో మాట్లాడుతూంటాను" అన్నాడు చంద్రబాబు.
    "ఏదీ నన్నొకసారి భూతంతో మాట్లాడనిస్తారా?" రిక్వెస్ట్ చేశాడు లాలూ.
    చంద్రబాబు వెంటనే ఒక భూతానికి రింగ్ చేసి మాట్లాడమని ఫోన్ లాలూ కిచ్చాడు.
    "హలో! లాలూ! బాగున్నావా?" అంది భూతం.
    "నేను తెలుసా నీకు?" ఆశ్చర్యంగా అన్నాడు లాలూ.
    "మీపేరు మా భూతాల్లో చాలా ఫేమస్ లాలూ"
    లాలూ "థాంక్యూ" అని ఫోన్ కట్ చేశాడు.
    వెంటనే ఆపరేటర్ లైన్ లో కొచ్చి "కాల్ చార్జెస్ రెండువేల రూపాయలు సార్" అన్నాడు.
    "అబ్బ! ఎక్కడో ఉన్న భూతంతో మాట్లాడితే రెండు వేలు బిల్లా? చంద్రబాబూ! నాకు ఇలాంటి ఫోన్ ఒకటి తెప్పిస్తావా" అడిగాడు లాలూ.
    చంద్రబాబు వెంటనే ఇంకో ఫోన్ తెప్పించి లాలూ కిచ్చాడు.
    బీహార్ కెళ్ళగానే లాలూ తన మంత్రులనూ, రబ్రీదేవినీ అందరినీ పిలిపించి వారి ఎదురుగ్గా భూతాలతో ఫోన్లో మాట్లాడాడు.
    చాలాసేపు మాట్లాడాక రబ్రీదేవి భయపడింది.
    "ఇంక ఆపేయండి! బిల్ ఎంత అయిందో ఏమో!" అందామె.
    ఫోన్ కట్ చేయగానే ఆపరేటర్ లైన్లో కొచ్చాడు.
    "మొత్తం బిల్ నాలుగు రూపాయలే సార్" అన్నాడతను.
    లాలూతోపాటు అందరూ షాకయ్యారు.
    "అదేంటి? హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక్క భూతంతో ఒక్క నిమిషం మాట్లాడినందుకే రెండువేల రూపాయలు ఎస్.టి.డి బిల్ అయింది. ఇక్కడ నేను బోలెడు భూతాలతో ఇంతసేపు మాట్లాడినా నాలుగు రూపాయలేనా?" ఆశ్చర్యంగా ఆపరేటర్ నడిగాడు లాలూ.
    "భూతాలతో ఏ రాష్ట్రం నుంచి మాట్లాడిన ఎస్.టి.డి. రేట్లు పడ్తాయి సార్! కానీ అదే బీహార్ నుంచీ మాట్లాడితే అది లోకల్ కాల్ అవుతుంది"
    "ఏమోయ్ నువ్వు పాతిక దొంగతనాలు చేసినట్లు రుజువయింది. శిక్షవేసే ముందు నువ్వు చెప్పుకునే దేమైనా వుందా?" అడిగాడు జడ్జీగారు.
    "వుంది సార్! నిజానికి బై హార్ట్ నేను చాలా నీతీ నిజాయితీగల వాడిని సార్! కానీ ఇదిగో నా కుడిచెయ్యి ఉంది చూశారూ- నేనెంత వద్దనుకున్నా దీనికి దొంగతనాలు చేయటం అలవాటయిపోయింది. అందుకని యువరానర్- నేరం నాది కాదు. నా రైట్ హాండ్ ది-" అన్నాడు దొంగ.
    "అడెడెడెడె! అయితే ఈ దొంగతనాలు నీ కుడిచేయి చేసింది గనుక నిన్ను వదిలేయమంటావ్ - అంతేనా?"
    "ఆహా! నా మనసు ఎంత చక్కగా అర్ధం చేసుకున్నారు సార్!"
    "సరే ఓ పనిచేస్తా! నిన్ను వదిలేస్తానుగానీ ఇన్ని నేరాలకు పాల్పడిన నీ కుడిచేతికి మాత్రం అయిదేళ్ళు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నా! ఎలావుంది నా జడ్జిమెంట్ లెవల్?" గర్వంగా అడిగాడు జడ్జి.
    "అద్భుతమయిన జడ్జిమెంట్ సార్! నా కుడి చేతికి ఆ మాత్రం శిక్ష పడాల్సిందే! అయితే ఇదిగోండి సార్! నా కుడిచేయి- దీన్ని జైల్లో పడేయండి- అయిదేళ్ళ తరువాత వచ్చి మళ్ళీ తీసుకుంటా!" అంటూ తన జైపూర్ టైప్ చెక్క చెయ్యి తీసి జడ్జి టేబుల్ మీదుంచి ఒంటి చేత్తో హాబీగా వెళ్ళిపోయాడు దొంగ.
    
    ఒక దొంగ, తను దొంగలించిన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూంటే, పోలీసులు ఆపి ఓవర్ స్పీడ్ వెళ్తున్నందుకు రెండొందలు లంచం ఇమ్మన్నారు.
    దొంగ నాలుగొందలు తీసి ఇచ్చాడు.
    పోలీసులు ఆశ్చర్యపోయారు.
    "రెండొందలు అడిగితే నాలుగొంద లిచ్చావేంటి?" అడిగారు వాళ్ళు.
    "మరేం లేద్సార్! అర్జంటు పనిమీద వెళ్తున్నా! అంటే ఇక ముందు కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళాలి. అందుకని చేయబోయే తప్పుకు కూడా ముందే చలాన్ కట్టేస్తున్నానన్నమాట"
    "సరే ఫో" అతని తెలివితక్కువ తనానికి నవ్వుకుంటూ వదిలేశారు పోలీసులు.
    కాసేపటికి వెనుకే వచ్చిన పోలీస్ జీప్ నుంచి ఇన్ స్పెక్టర్ దిగాడు.
    "ఇప్పుడు ఒక దొంగ ఎవరైనా కారులో పారిపోతూ వచ్చాడా ఇటు" అని అడిగాడు.
    అప్పుడర్ధమైంది ఆ పోలీసులకి.
    భార్య భర్త షష్టి పూర్తి రోజున గుడికెళ్ళి దేవుడిని ప్రార్ధిస్తూ సాయంత్రం వరకూ గుళ్ళోనే కూర్చునేసరికి దేవుడు జాలిపడి ప్రత్యక్షమయ్యాడు.
    "అహా! మీ అన్యోన్య దాంపత్యం, దైవభక్తి మాకెంతో ఆనందం కలిగించింది. అందుకని మీ ఇద్దరికీ చెరో వరం ఇద్దామని వచ్చా, ఏం కావాలో కోరుకోండి!" అన్నాడు దేవుడు.
    భార్య ఓ క్షణం ఆలోచించి తన కోరిక బయటపెట్టింది.
    "నాకు ఇంతకంటే ఇంకేం కావాలి స్వామీ! నా జీవితమంతా హాపీగానే గడిచిపోయింది. అయినా ఒక కోరిక తీరుస్తానన్నారు కాబట్టి కోరుతున్నా! మా ఆయన పాపం చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయనకు ఆ సమస్యల నుంచీ విముక్తి కలిగించి పూర్తి ఆరోగ్యవంతుడిగా మారేట్లు అనుగ్రహించు- స్వామీ!" అంటూ ప్ర్రార్ధించింది.
    "సరే! నీ కోరిక నెరవేరుతుంది" అని భగవంతుడు పలికేసరికి క్షణంలో ఆమె భర్త హాపీగా లేచినిలబడి ఆనందం పట్టలేక మైఖేల్ జాక్సన్ లాగా డాన్స్ చేశాడు.
    "ఇప్పుడు నీ వంతే నోయ్ భర్తాగ్రేసరా! నీ కోరికేంటో చెప్పు" భర్త నడిగాడు దేవుడు.
    "స్వామీ నా మిసెస్ ముసలిది అయిపోయింది. అందుకని నా కన్నా 30 ఏళ్ళు తక్కువ వయసున్న పెళ్ళాన్ని ప్రసాదించండి స్వామీ" అన్నాడతను ఆశగా.
    దేవుడు అతని వంక చూసి నవ్వాడు.
    "నీ కోరిక నెరవేరుస్తున్నారా భక్తా!" అనే సరికి క్షణంలో ఆ ముసలామె భర్త 80 ఏళ్ల వాడయిపోయాడు.

 Previous Page Next Page