కుటుంబరావ్ ఎల్ కేజీ నుంచి- కాలేజ్ వరకూ- ఆ తరువాత జాబ్ లో చేరే వరకూ ఒకే ఒక్క ప్రశ్నతో విసిగి వేసారిపోయాడు. అది వాళ్ళమ్మ 24 గంటలూ అడిగే ప్రశ్న-
"ఎప్పుడూ ఎక్కడికెళ్తావో ఏమో! నాకేం అర్ధం కావటంలా!"
ఆప్రశ్నంటేనే అలర్జీ అయిపోతున్నటైమ్ లో కుటుంబరావ్ కి పెళ్ళయింది. అతను చాలా హాపీగా ఫీలయ్యాడు.
ఇకనుంచీ తల్లి ఆ కొశ్చెన్ అడగదు అన్న సంతోషం. కానీ పెళ్ళయిన మర్నాడే అతని భార్య అదే డైలాగ్ కొట్టింది.
"అలా ఎక్కడికెళ్తారో ఏమో- ఇంట్లో ఉండనే ఉండరు" మరో నలభై ఏళ్ళ వరకూ ఆ డైలాగ్ వింటూ నరకయాతన అనుభవించాడు కుటుంబరావ్.
చివరకి అతనికి అవసానదశ వచ్చింది. అందరూ విచారంగా ఉండే సమయంగానీ కుటుంబరావ్ మాత్రం చాలా హాపీగా ఫీలయ్యాడు. ఎందుకంటే తను చనిపోతే ఇంక ఆ డైలాగ్ నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది.
తీరా అతను పోగానే బంధువులంతా గుమికూడారు.
"పాపం- చాలా మంచివాడండీ- ఏలోకానికెళ్ళాడో ఏమో-"
ఆ డైలాగ్ మళ్ళీ వినిపించే సరికి కుటుంబరావ్ ఆత్మ భోరున ఏడ్చింది.
కొత్తగా ఓపెనయినా ఓ ఫాక్టరీ యజమాని ఒకరోజు వర్కర్స్ అందరినీ మీటింగ్ కి పిలచాడు.
"చూడండి! నేను మిగతా వాళ్ళల్లాంటి వాడిని కాదు. వర్కర్ ఫ్రెండ్లీ అన్నమాట! వర్కర్స్ అంతా నా బ్రదర్ అనుకుంటా! అందుకే రోజు కొకసారయినా వర్క్ షాప్ లో కొచ్చి, మీరందరూ హాపీగా పనిచేస్తున్నారా, లేదా. మీకేమయినా ప్రాబ్లెమ్స్ ఉన్నాయా అనే విషయం తెలుసుకుంటూ- ఆ ప్రాబ్లెమ్స్ అక్కడికక్కడే సాల్వ్ చేసేస్తానన్నమాట- మీ సమస్యల్ని నాతో డైరెక్ట్ గా చెప్పలేనివారు ఒక కాగితం మీద వ్రాసి సజెషన్ బాక్స్ లో వేయండి" అంటూ ముగించాడు.
రెండోరోజుల తరువాత బాక్స్ లో ఒక కాగితం వేశారెవరో.
"సార్- దయచేసి మీరు రబ్బర్ హీల్స్ ఉన్న బూట్లు వేసుకోకండి! కన్ ఫ్యూజన్ గా ఉంది- ఇట్లు ప్రియమైన వర్కర్-"
హైద్రాబాద్ 'జూ'లో నుంచి సడెన్ గా రెండు పెద్దపులులు- తప్పించుకొని పారిపోయాయి.
"మనిద్దరం ఎవరి దారిన వారు పారిపోదాం మిత్రమా! ఏ అడవుల్లోకో వెళ్ళి హాపీగా బ్రతుకుదాం' అందో పెద్దపులి.
రెండూ షేక్ హాండిచ్చుకుని విడిపోయాయ్.
ఓ సంవత్సరం తర్వాత వాటిల్లో ఒకటి మళ్ళీ 'జూ' గేటు దగ్గర తచ్చాడుతూంటే స్టాఫ్ దానిని తీసుకెళ్ళి పాత కేజ్ లోనే పడేశారు. లోపల అప్పటికే పాత దోస్త్ ఉండడంతో రెండూ హాపీగా ఫీలయ్యాయి.
"నువ్వేంటోయ్ అలా అస్థిపంజరంలా అయిపోయావ్? నువ్ వెళ్ళినచోట తిండి దొరకలేదా?" అడిగింది లోపలున్న పులి.
"తిండా? నా బొందా! నా ఖర్మకాలి నేను పారిపోయి బీహార్ అనే రాష్ట్రంలో సెటిలయాను. అక్కడ రోజుకి పదిమంది మనుషుల్ని తినేసినా గవర్నమెంట్ పట్టించుకోదని న్యూస్ పేపర్లో ఎవరో చదువుతూంటే విన్నా! అయితే ఇంక హాఫీగా అక్కడే సెటిలయిపోవచ్చని అనుకున్నా కానీ జరిగిందేంటనుకున్నావ్? ఎవడిని చంపుకు తిందామని మాటేసినా నేను వాడిని చంపే లోపలే ఇంకెవరో గన్ తీసుకొచ్చి వాడిని కాల్చేయటం- ఆ శవాన్ని పాతేయటం- ఆ తరువాత పోలీసులొచ్చి ఆ శవాన్ని తవ్వి తీసుకెళ్ళిపోవటం- లేదా నేను చంపుదామనుకున్నవాడే ఇంకెవరిమీదో బాంబులేసి జీపుల్లో పారిపోవటం-అంతెందుకు ఎవరిని చంపుదామనుకున్నా అందరి జేబుల్లో కత్తులు, రివాల్వర్లు, బాంబులు- ఇంక తిండెలా దొరుకుతుంది. ఆకలికి తాళలేక చివరకు గడ్డయినా తిందామనుకుంటే అది కూడా లాలూ అనేవాడు తినేశాడంట! బ్రతికుంటే ఈ జూలో వాళ్ళు పెట్టే రేషన్ కూడు తినొచ్చని మళ్ళీ ఇక్కడకూ చేరుకున్నా! నా సంగతి సరే గానీ నువ్ చాలా లావయ్యావే- నీకేదో మంచి రాష్ట్రం దొరికినట్లుంది" అంది రెండోపులి.
"ఏం లావవ్వటం లే! మనిద్దరం విడిపోయాక ఈ హైద్రాబాద్ సిటీలోనే కొంచెం నిర్మానుష్యంగా ఉండే వీధుల్లో ఎవరో ఒకరిని పట్టుకుని హాపీగా తినేదాన్ని. అలా చాలా రోజులు హాపీగా గడిచిపోయినయ్. ఆఖరికి సెక్రటేరియట్ లో దూరాను. తంతే గారెల బుట్టలో పడ్డట్లయిందనుకో! అక్కడ ఏదొక మూల దాక్కుని రోజుకో గుమాస్తానో, సెక్షనాఫీసర్నో, సెక్రతరీనో చంపి తినేయటం మొదలుపెట్టా! అయినా ఎవరికీ ఫలానా వాళ్ళు మిస్సయ్యారన్న విషయం తెలియలేదు. ఇకలైఫంతా హాపీగా అక్కడే గడపొచ్చని అనుకున్నాగానీ ఒకరోజు పెద్ద గొడవ అయిపోయింది."
"అలాగా? ఏం జరిగింది"
"ఒకరోజు ఆఫీస్ స్టాఫ్ అనుకుని ఒకడు ఒంటరిగా సూట్ కేస్ తీసుకెళ్తుంటే వాడిని తినేశా! వాడిపేరు 'సింగ్' అంట. వాడు కంట్రాక్టరే గానీ ఆ సెక్రటేరియట్ కి కింగ్ లాంటి బ్రోకరంట. వారానికొక రోజు వాడు సెక్రటేరియట్ కి వచ్చి సిబ్బందికీ, మంత్రులకూ ముఖ్యమంత్రికీ అందరికీ లక్షల రూపాయలు లంచాలిచ్చి వెళ్ళిపోతూంటాడంట! వాడు ఆ డబ్బు తెచ్చిచ్చేవరకూ సిబ్బందీ, మంత్రులూ. ఎవ్వరూ ఇళ్ళకు వెళ్ళరంట! అలాంటి వాడు కనిపించకపోయే సరికి అందరూ కలిసి సెక్రటేరియెట్ అంతా వెతకటం మొదలుపెట్టారు దాంతో నేను దొరికిపోయాను. తీసుకొచ్చి జూలో పడేశారు మళ్ళీ-" కన్నీళ్ళతో చెప్పిందది.
భార్య పైకెళ్ళి పోయిన నెలరోజులకే ఒక అందమయిన సీతాకోకచిలుకతో ఓ పార్టీలో కనిపించాడు మన్మథరావ్.
అందరూ అతనికంత అందమయిన అమ్మాయి ఎలా దొరికిందా అని ఈర్ష్య పడటం మొదలుపెట్టారు.
"ఇంత అందమయిన అమ్మాయిని- పైగా ఇంత యంగ్ గాళ్ ని ఎలా పట్టావ్ గురూ! ఒకవేళ ఇంతకుముందే ఈమె నీ గాళ్ ఫ్రెండా?" అడిగారు ఫ్రెండ్స్.
"ఈమె నా గాళ్ ఫ్రెండ్ కాదు. నాభార్య-" అందరూ స్టన్ అయ్యారు.
"అంటే ఎరేంజ్ డ్ మ్యారేజా?"
"లవ్ మ్యారేజే" సిగ్గుపడుతూ అన్నాడు మన్మథరావ్.
వాళ్ళు కిందపడబోయి నిలదొక్కుకున్నారు.
"ఇంత అందమయిన అమ్మాయి- నీలాంటి ఏజ్ డ్ ఫెలోవి - పైగా విడోవర్ వి- లవ్ చేసి పెళ్ళి చేసుకుందా? నీ మాటలు ఛస్తే నమ్మం! నీ వయసు అరవై కదా- ఆ పిల్లకి నలభై అని చెప్పి ఉంటావ్" అన్నారు వాళ్ళు.
"ఛ! నేనలా మోసం చేసే టైప్ కాదు- నిజం చెప్పాలంటే నా వయసు ఇంకొంచెం ఎక్కువేసి చెప్పా- అయినాగానీ లవ్ లో పడిపోయి తాళికట్టే దాకా వదల్లేదు-"
అందరూ మొఖాలు చూసుకున్నారు.
"ఇంతకూ నీ వయసు ఎంతని చెప్పావ్?"
"నా వయసు అరవైకదా- ఇంకో ఇరవై ఎక్కువేసి ఎనభయ్ అని చెప్పా-"
ఒక గ్లామరస్ టీవీ హీరోయిన్ ఓ ఫేమస్ జ్యోతిష్యుడి దగ్గరకొచ్చింది.
"చూడు జ్యోతిష్! నా భవిష్యత్ లో ఏం జరుగబోతుందో కేర్ ఫుల్ గా స్టడీ చేసి చెప్పు!"
జ్యోతిష్యుడు ఆమె వివరాలన్నీ జాగ్రత్తగా స్టడీ చేసి లెక్కలు వేసి- చెప్పటం మొదలుపెట్టారు.
"మీ స్టార్ బ్రహ్మాండంగా ఉంది మేడమ్! మీరు ఎన్నో మంచిపనులూ, చెడ్డపనులూ చాల సక్సెస్ ఫుల్ గా చేశారు. అయితే మీ జీవితంలో అతి త్వరలో ఒక విషాదకర సంఘటన జరుగబోతోంది" ఆ మాట చెప్పాలా వద్దా అని సంశయిస్తూ అన్నాడు జ్యోతిష్యుడు.