"అలా తెప్పించేవాళ్ళు ఇడియట్స్ అంటాను"
"అవునండీ!"
కర్నల్ సింహాద్రిని చూసి ఠక్కునమళ్ళీ ప్రోగ్రామ్ గుర్తు తెచ్చుకున్నాడు. వెంటనే చిరంజీవి వేపు చూసి "నువ్వు కూడా మేడ మీదకు పద" అన్నాడు కర్కశంగా.
"నేనా? నేనెందుకు సార్?"
"ఈ ధనుంజయ్ గాడి స్నేహితుడు వయినందుకు. అసలీ ధనుంజయ్ గాడికి సంబంధించిన వారందరినీ కూడా షూట్ చేయాలని షెడ్యూల్ వేసుకున్నాను"
సింహాద్రి చప్పున భయంలో నుంచి తేరుకున్నాడు. అతని మెదడుకో అద్భుతమయిన వుపాయం తట్టింది.
"సార్! నేనికముందు నవలలు రాయడం మానేస్తున్నానండీ! నిన్నే డెసిషన్ తీసుకున్నాను" అన్నాడు కర్నల్ మనసు మారుతుందన్న ఉత్సాహంతో.
"అయినా సరే! దివరకు రాసిన వాటికే నిన్ను షూట్ చేయబోతున్నాను" ఊ!.. గెటప్! పదండి మేడమీదకు!"
"ఇది అన్యాయం సార్! మేము శ్రీదేవిగారి స్నేహితులం"
"ఏం ఫర్వాలేదు ముందు రచయితగా చద్దూగాని, తరువాత మా బేబీ ఫ్రెండ్ గా చావవచ్చు. కమాన్ మేడమీదకు పదండి"
చిరంజీవికి పరిస్థితి విషమించి పోతోందని అర్దమయిపోతోంది.
"సార్! వాడు రాసిన నవలలకు బోలెడు పశ్చాత్తాపపడుతున్నాడు కదా! క్షమించేయగూడదూ?"
"ఆర్మీలో పశ్చాత్తాపం పనిష్మెంట్ కాదు"
సరిగ్గా అప్పుడే శ్రీదేవి లోపల్నుంచి వచ్చేసింది.
"డాడీ! ఏం చేస్తున్నారు మీరు?" అంది తండ్రి చేతిలోని పిస్టల్ నూ, పిస్టల్ కెదురుగ్గా నిలబడ్డ సింహాద్రినీ, చిరంజీవినీ చూసి.
"వీళ్ళను కాల్చడానికి మేడమీదకు తీసుకెళ్తున్నాను"
"ఓకే డాడీ! ఇంకా ఇక్కడే కాలుస్తారేమోనని భయపడ్డాను! ఫర్నిచరంతా రక్తం మరకలు అయిందంటే మళ్ళీ అన్నీ క్లీన్ చేయించలేక పెద్ద హెడేక్"
* * * * *
సింహాద్రీ, చిరంజీవీ ఉలిక్కిపడ్డారు.
సింహాద్రి ఏడుపు మొఖంతో శ్రీదేవివంక చూశాడు.
"అయినా నీకిలాంటి టుమ్రీగాళ్ళతో ఎలా ఫ్రెండ్ షిప్ అయిందమ్మా?" ఆప్యాయంగా అడిగాడు కర్నల్.
"టుమరీ అంటే ఏమిటండీ?" అడిగాడు సింహాద్రి.
"డోంటాక్" అరచాడు కర్నల్.
"అతని నవలలు చదవడం మూలాన ఫ్రెండ్ షిప్ చేసుకున్నాను డాడీ" చెప్పింది శ్రీదేవి.
"ఏవీ ఆ హిప్నాటిజం నవలలా?"
"హిప్నాటిజమే కాదు డాడీ, టెలీపతీ, అలోపతీ, విలోపతీ- ఇంకొకటి ఏమిటబ్బా" ఆలోచనలో పడిందామె.
"సైకోపతి అండీ" అందించాడు చిరంజీవి.
"కరెక్ట్, సైకోపతి ఇవన్నీ రాస్తాడు డాడీ!"
"అదంతా ట్రాష్" అరచాడు కర్నల్.
"ట్రాష్ కాదు డాడీ! మొన్న అతనే హిప్నాటిజం చేసి చూపించాడు."
"ఏడ్చాడు"
"కాదు డాడీ! నిజమే! మనుషులనే కాదు కుక్కని కూడా చేస్తాడు"
"కుక్కనా?"
"అవును డాడీ"
"ఆల్ ట్రాష్" బిగ్గరగా అన్నాడు.
"ట్రాష్ కాదండీ! నిజమే" కల్పించుకుంటూ అన్నాడు చిరంజీవి.
కర్నల్ కి ఛటుక్కున ఓ ఆలోచన వచ్చింది.
"ఐ సీ" అన్నాడు తల పంకిస్తూ.
"మిస్టర్ సింహాద్రీ" నెమ్మదిగా పిలిచాడతను.
"ఏమిటండీ"
"మనుషుల్నీ, జంతువుల్నీ కూడా హిప్నటైజ్ చేస్తావన్నమాట నువ్వు"
"అఫ్ కోర్స్. ఇహి.... అవునండీ! ఆల్ మోస్టాల్ చేయగలనండి. కాపోతే ఇహిహి.....అంతేనండీ" భయంగా అన్నాడతను.
"ఆల్ రైట్! నన్ను హిప్నటైజ్ చెయ్ చూద్దాం" అన్నాడు నడుంమీద రెండు చేతులు పెట్టుకుని.
సింహాద్రి కంగారుపడిపోయాడు.
"ఇప్పుడాండీ?"
"అవును! ఇప్పుడే ఈ నిమిషంలోనే"
"మిమ్మల్నాండీ"
"నన్నే!"
"ఇప్పుడు చేయడం కొంచెం కష్టమండీ"
"ఏం... ఎందుకు కష్టం?"
"మూడ్ బాగోలేదండీ?"
"ఎవరిది"
"నాదేనండీ"
"మిస్టర్ సింహాద్రీ"
"యస్సార్"
"నన్ను హిప్నటైజ్ చేస్తావా, ఇక్కడే కాల్చిపారేయమన్నావా?"
శ్రీదేవి కెవ్వున అరచింది.
"అయ్యో ఇక్కడ కాల్చొద్దు డాడీ! ప్లీజ్! సోఫాలన్నీ బ్లడ్ స్టెయిన్స్ అవుతాయ్"
"ఓ... సారీ బేబీ! మర్చేపోయానా విషయం"
"పోనీ ఓ పనిచేయనాండీ" నెమ్మదిగా దీనంగా అడిగాడు సింహాద్రి.
"ఏమిటది?"
"మా చిరంజీవిని చేసి చూపిస్తానండీ" ఆశగా అన్నాడు.
"డోంట్ థింక్ అయామేఫూల్"
"అబ్బే.... అలా అనుకోవడం లేదండీ"
"ష్యూర్?"
"ష్యూరండీ"
"అయితే నోర్మూసుకుని నేను చెప్పినట్లు చెయ్"
"ఏం చెప్పారండీ?"
"నన్ను హిప్నటైజ్ చేయమని"
"కానీ..."
"త్రీ వరకూ లెక్కపెడతాను! ఈలోగా ప్ర్రారంభించపోయావో ఫట్"
"కానీ సార్! అసలు హిప్నటిజం చేయడానికి....."
"వన్"
"అది కాద్సార్! పోనీ ఇవాళ్టికి చిరంజీవిని....."