Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 31


    "టూ"
    "పోనీ మిమ్మల్నే రేపు తెల్లారుజామున..."
    "త్రీ" అనేసి పిస్టల్ అతని ఛాతీకి గురిపెట్టాడు కర్నల్.
    "బాబోయ్ వద్దులెండి! చేస్తాను....ఇప్పుడే చేస్తాను" వణుకుతున్న గొంతుతో అన్నాడు సింహాద్రి.
    "అయితే చెయ్"
    "మీరలా కూర్చుని నా కళ్ళల్లోకే చూడండి" అన్నాడతను.
    "ఎందుకు?"
    "హిప్నటిజంలో అలా చూడాలని ఓ ఆచారం ఉందండీ" సర్ది చెప్పాడు చిరంజీవి.
    కల్నల్ ఎదురుగ్గా కూర్చుని సింహాద్రి కళ్ళల్లోకి భీకరంగా చూడసాగాడు.
    "మీరు నావంకే చూస్తున్నారు- నా వంకే చూస్తున్నారు నావంకే చూస్తున్నారు" అన్నాడు సింహాద్రి.
    "అవును! చూస్తున్నాను" అన్నాడు కర్నల్.
    "మీరు నిద్రవస్థలోకెళ్తున్నారు - నిద్రావస్థలోకెళ్తున్నారు" అన్నాడు మళ్ళీ.
    "ఎక్కడికి?" ఆశ్చర్యంగా అడిగాడు కర్నల్.
    "నిద్రావస్థలోకి"
    "అంటే?"
    "అంటే నిద్రలోకెళ్తున్నారని అర్ధమండీ?"
    "నేను వెళ్ళటం లేదు" అన్నాడు కర్నల్.
    "వెళ్ళటం లేదాండీ?" అడిగాడు సింహాద్రి.
    "లేదు"
    "ఎందుకనండీ?"
    "ఎందుకెళ్ళాలి?"
    "హిప్నాటిజంలో ఎదుటివ్యక్తి చెప్పినట్లు చేయాలి కదండీ?"
    "నేను చేయను"
    సింహాద్రికేం చేయాలో తోచలేదు.
    "సరేనండీ! మరోసారి ప్రయత్నిస్తాను. మీరు కళ్ళుమూసుకుంటున్నారు - మీరు కళ్ళుమూసుకుంటున్నారు - మీరు కళ్ళుమూసుకుంటున్నారు"
    "మూసుకోవటం లేదు" అన్నాడు కర్నల్.
    "మీరు నిన్నటిలోకి వెళ్తున్నారు - నిన్నటిలోకి వెళ్తున్నారు- నిన్నటిలోకి వెళ్తున్నారు" అన్నాడతను మళ్ళీ.
    "ఎక్కడికీ వెళ్ళటం లేదు" అన్నాడు కర్నల్.
    "ఇలా అన్నిటికీ ఎదురు తిరిగితే కష్టమండీ" బుంగమూతితో అన్నాడు సింహాద్రి.
    "కష్టమా! మరి మా బేబీ ఎదురుగ్గా ప్రదర్శన ఇచ్చావుగా? ఇప్పుడేమయింది ఆ ఫోజంతా? చూశావా బేబీ- నేను చెప్పలేదూ ఇదంతా ట్రాష్!"
    "కావాలంటే మా చిరంజీవిని చేస్తానండీ" బతిమాలసాగాడు సింహాద్రి.
    "అవునండీ! మొన్న భలే బాగా చేశాడు నన్ను"
    "కంప్లీట్ బంకమ్"
    "బంకమ్ అంటే ఏమిటి సార్?"
    "ఆల్ ట్రాష్"
    "కాద్సార్ మూడు బావుండలేదు కదా?"
    "అవున్సార్"
    "అయితే మా కుక్కను చెయ్"
    "కుక్కనా?" నీరసంగా అన్నాడు సింహాద్రి.
    "అవును! ఒరే రంగా" గట్టిగా పిలిచాడు కల్నల్.
    రంగా పరుగుతో వచ్చాడక్కడికి.
    "ఏం సార్?"
    "మన ఆల్సేషన్ని తీసుకురా!"
    "అలాగే సార్" అంటూ పరుగుతో బయటికెళ్ళి అయిదు నిమిషాల్లో మనిషంత ఎత్తున్న ఆల్సేషన్ తో తిరిగి వచ్చాడు.
    "హలో జిబ్రికా" అన్నాడు కర్నల్.
    ఆల్సేషన్ ఆనందంగా అతని దగ్గరకెళ్ళి అతని చేతులు నాకి ఆజ్ఞకోసం ఎదురుచూస్తూ నిలబడింది.
    "గోటూ దట్ డెకాయిట్ అండ్ సిట్ దేర్ జిబ్రికా" అన్నాడు కర్నల్.
    జిబ్రికా సింహాద్రి దగ్గరకొచ్చి అతని కెదురుగ్గా కూర్చుంది.
    సింహాద్రి కాళ్ళు, చేతులు వణుకుతున్నాయ్ దానిని చూస్తూంటే.
    "కమాన్! డూ ఇట్" అరిచాడు కర్నల్ సింహాద్రి వంక చూస్తూ.
    సింహాద్రికేమీ పాలు పోవడం లేదు.
    "ఆల్సేషన్ ని హిప్నటైజ్ చేయడం కుదరదండీ" అన్నాడు చిరంజీవి.
    "కల్నల్ చిరంజీవివైపు కోపంగా చూశాడు.
    "ఏం? ఎందుకని కుదరదు?"
    "ఏమోసార్! కుదరదని పుస్తకాల్లోరాశారండీ"
    "చూశావా బేబీ! నేను నీకు ముందే చెప్పాను కదా! అంతా ట్రాష్" అన్నాడు కర్నల్ శ్రీదేవితో.
    శ్రీదేవి కోపంగా సింహాద్రి వేపు చూసింది. సింహాద్రి చిరంజీవివేపు చూశాడు. చిరంజీవి సీలింగ్స్ వేపు చూశాడు.
    "జిబ్రికా! వెరీగుడ్ నేమ్" అన్నాడు కర్నల్ తో.
    "డోంటాక్" అన్నాడు కల్నల్.
    "ఒరే రంగా" మళ్ళీ పిల్చాడు కల్నల్.
    "సార్"
    "గన్ క్లీన్ చేశావా?"
    "చేశాన్సార్?"
    "ఏదీ.... తీసుకురా!"
    రంగా జిబ్రికాను తీసుకెళ్ళి రెండు నిమిషాల తర్వాత గన్ తో తిరిగి వచ్చాడు.
    కల్నల్ గన్ తీసుకుని పరీక్షించాడు.
    "బారెల్లో వేడినీళ్ళు పోశావా?"
    "పోశాన్సార్"
    "ఫుల్ త్రూ కొట్టావా?"
    "కొట్టాన్సార్"
    "మాగజైన్ తీసి క్లీన్ చేశావా?"
    "అది రావటం లేదండీ! ఎలా తీయాలో మర్చిపోయాను"
    కల్నల్ కోపంతో మండిపడ్డాడు.
    "ఇడియట్! మాగజైన్ ఎలా తీయాలో తెలీదుట్రా!"
    "తెలుసుగానండీ! మర్చిపోయాను. ఎంత లాగినా రావటం లేదు"
    "బ్లడీఫూల్! మాగజైన్ తీయటం తెలీదా? ఎవడినడిగినా చెప్తాడా విషయం! ఏ వెధవాయిని తీయమన్నా తీసి చూపిస్తాడు"
    అని ఆ పని ఎవరితో చేయించాలా అని చుట్టూ చూశాడు. అతనికి చిరంజీవి తప్పుతే ఇంకెవరూ కనిపించలేదు.

 Previous Page Next Page