Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 29


    "వాడెవరు?"
    "మా ఫ్రెండండీ"
    "వాడెందుకు చెప్పాడా విషయం?"
    "వాడి రచనలంటే పడిచచ్చే ఓ మిలటరీ ఆఫీసర్ గారు రిటైరయ్యాక వాడిని ఇంటికి పిలిచి ఎంతో గౌరవించారటండీ"
    "ఐసీ"
    చప్పున సింహాద్రి అందుకున్నాడు.
    "పాపం ఎప్పుడూ బోర్డర్స్ లో ఉంటారు కదండీ! అంచేత సాహిత్యం అంటే మరీ అభిమానం అటండీ!"
    "నీకెవరు చెప్పారు?"
    "వాడేనండి"
    "దటీజాల్ ట్రాష్!"
    "అలాగాండీ?"
    "అవును మియర్ ట్రాష్"
    "సరేనండీ"
    "నన్నడిగితే మేమంతా బోర్డర్స్ లో అందరికీ దూరంగా ఉండడం మీ అదృష్టం అంటాను"
    "ఎందుకండీ?"
    "మాకు సమీపంగా ఉన్నట్లయితే ఏం జరిగేదో నేనే చెప్పలేను"
    "అదేనండి మా శ్రీనివాసులు చెప్పాడు. పాపం అతని అభిమాని..."
    "సైలెన్స్" అరిచాడు కర్నల్.
    "ఎందుకు సార్ అలా అరచారు?"
    "టు హెల్ విత్ యువర్ శ్రీనివాసరావ్"
    "శ్రీనివాసరావ్ కాదండీ! శ్రీనివాసులు"
    "అయ్ సే షటప్"
    చిరంజీవికి ఇంకా మాట్లాడడం భావ్యంగా కనిపించక సైలెంటయిపోయాడు.
    "మిష్టర్ ధనుంజయ్" శాంతంగా పిలిచాడు కర్నల్.
    "ఏంటండీ?" అతని గొంతులోని మార్పుకి సంతోషిస్తూ అన్నాడు సింహాద్రి.
    "అలాంటి నవలలు యికముందు కూడా రాయాలన్న ఆలోచన వుందా నీకు?" కర్నల్ తాపీగా అడిగాడు.
    సింహాద్రి గర్వంతో పొంగిపోయాడు.
    "అవునండీ! ప్రస్తుతం కూడా ఓ నవల రాస్తున్నారండీ కథేమిటంటేనండీ ఓ జమీందారు వుంటాడండీ. ఆ జమీందారుకి ఏడుగురు కొడుకులండీ. అందులో ఆరోవాడు రిక్షా తొక్కుతూంటాడన్న మాటండీ. ఎందుకంటే వాడు చాలా ప్రిన్సిపుల్ద్ అన్నమాట. ఎవరిమీదా ఆధారపడడం ఇష్టం లేదన్న మాట కేవలం స్వార్జితం..."
    "స్టాపిట్!" అరిచాడు కర్నల్.
    సింహాద్రి ఆశ్చర్యపోయాడు.
    ఈ మనిషి తత్వం బొత్తిగా బోధపడడం లేదు తనకి. అతనే కొశ్చెన్స్ వేస్తాడు. జవాబు వివరంగా చెప్తూంటే కరవబోతాడు.
    "అయితే యింకేమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు" అన్నాడు కర్నల్.
    సింహాద్రి మళ్ళీ ఉత్సాహంతో పుంజుకున్నాడు.
    "అవునండీ అలస్యాత్ విషయం అమృత్ అన్నారండీ"
    "అంటేవాడు చెప్పింది శాంస్క్రీట్ లెండి! బైది వే హి నోస్ శాంస్క్రీట్ ఆల్సో" అన్నాడు చిరంజీవి.
    "టు హెల్ విత్ హిజ్ శాన్ స్క్రీట్' అరచారు కర్నల్.
    "సరేనండీ!"
    "మీరు తప్పక చదవాలి సార్! పబ్లిష్ అవగానే కాపీ నేనే స్వయంగా తెచ్చిస్తాను"అన్నాడు సింహాద్రి. టాపిక్ మార్చేస్తూ.
    "షటప్" అరచాడు కర్నల్.
    సింహాద్రికి ఏమీ అంతుబట్టటం లేదు.
    "ఆల్ రైట్" అన్నాడు.
    "పోనీ అర్జంటుగా చదవాలనుకుంటే యిప్పుడే వినిపిస్తాను. ఇప్పుడే అంటే యిప్పుడే కాదులెండి. రాత్రి డిన్నర్ అయాక మూన్ లైన్ లో అయ్ మీన్ లైట్ లేకుండా అని కాదు చిన్న బల్బు సిక్స్టీ వాట్స్ ది సరిపోతుంది. లేదా స్క్రిప్ట్ రడీ అవగానే ముందు మీకే చదవడానికి యిస్తాను"
    'నీ నవల చదవాలనుకునే చిల్లర వెధవని కాదు నేను"
    "అలాగాండీ!"
    "అయితే ఆలస్యం చేయడానికి వీల్లేదు" అన్నాడు.
    "ఏ  విషయం గురించి?" అనుమానంగా అడిగాడు సింహాద్రి.
    "నిన్ను కాల్చిపారేసే విషయం"
    సింహాద్రితోపాటు ఈసారి చిరంజీవి కూడా అదిరిపడ్డాడు.
    "కా..... కా..... కాల్చేస్తారా?"
    "అవును! పిస్టల్ తో కాల్చారా రివాల్వర్ తో కాల్చాలా అనేది నేనింకా నిర్ణయించుకోలేదు. బైది వే - ఈ రెండింట్లో నీకేదంటే యిష్టం?"
    "కాని.... కాని.... యిప్పుడెందుకు సార్ అనవసరంగా కాల్చటం నన్ను? నేనేం చేశానని?"
    "ఏం చేసావా? దేశాన్ని నాశనం చేస్తున్నావ్- మా శ్రీదేవి నీ హిప్నాటిజం రచనల మాయలోపడి- పెళ్ళంటూ చేసుకుంటే హిప్నాటిజం వచ్చినవాడినే చేసుకుంటానని మొండికేసింది. అందువల్ల ఎన్నో మంచి సంబంధాలను తిరకొట్టేసింది. హిప్నాటిజం వచ్చిన మా స్టేటస్ కి తగ్గ వెధవాయి ఒక్కడూ దొరకడం లేదు. అప్పట్నుంచే అసలు దీనికంతటికీ కారణమయిన నిన్ను షూట్ చేయాలని చాలా రోజుల్నుంచి ప్లాన్ చేస్తున్నాను కానీ అడ్రస్ దొరకలేదు. అసలు నీ అడ్రసేమిటి?"
    "అడ్రస్ చాలా తేలికండీ కనుక్కోవడం. తిన్నగా మలక్ పేట వచ్చేసి అక్కడ 6-6-3-2-8-1-2-628/319 ఎ-ఎస్-కె-ఎన్- సి-"
    "స్టాపిట్" అరచాడు కల్నల్.
    "ఇంకా పూర్తి కాలేదండీ అడ్రస్" చెప్పబోయాడు చిరంజీవి.
    "టు హెల్ విత్ యువర్ అడ్రస్. యిప్పుడు నువ్వే పర్సనల్ గా దొరికాకా యింకా అడ్రసెందుకు? ఆల్ రైట్ పద! మేడ మీద కెళ్దాం"
    సింహాద్రి ఆశ్చర్యపోయాడు.
    "మేడమీదకా?"
    "అవును"
    "ఎందుకు సార్?"
    "డ్రాయింగ్ రూమ్ లో నిన్ను కాల్చడం నాకిష్టం లేదు- ఫర్నీచర్ పాడయిపోతుంది. ఇది చాలా కాస్టలీ ఫర్నీచర్"
    చిరంజీవి యిదే అదునుగా తీసుకొని కల్నల్ ని మాట మరిపించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు.
    "ఫర్నీచర్ నిజంగా చాలా ఒండర్ ఫుల్ గా వుంది సార్! అద్భుతమైన టేస్ట్ మీది. ఎక్కడినుంచి తెప్పించారు సార్ దీన్ని?"
    "స్విట్జర్లాండ్ నుంచి!"
    "సూపర్ ఛాయిస్! చాలామంది తెలివితక్కువ వెధవలు ఛిలీ, ఉగాండా దేశాల నుంచి తెప్పిస్తూంటారండీ".

 Previous Page Next Page