తనకెలాగూ పెళ్ళి అవటం అసంభవం.
వయసు పెరిగిపోయింది. తను కట్నం యివ్వటానికి వప్పుకోడు.
అదా మగా సమానం అని నమ్మేవాడినే తను భర్తగా వప్పుకుంటుంది. కానీ అప్పుడప్పుడూ యవ్వనం తనను అశాంతి పాలు చేస్తుంది.
ఆ సమయంలో అనిపిస్తుంది.......
తనకు నచ్చిన మగాడితో తాత్కాలిక సంబంధం పెట్టుకుందామా అని. రామచంద్రమూర్తి వయసులో తనకంటే చాలా పెద్దాడయినా ఎందుకో అతని రూపం తనకు ఆకర్షణీయంగా కనబడుతుంది.
అతనితో ఎఫైర్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందనిపించింది. ఎవరికీ అనుమానం రాదు. కంప్లికేషన్స్ వుండవు.
కానీ తనను సీత పసిగట్టిందేమో రామచంద్రమూర్తితో మసిలే అవకాశమే రానీకుండా జాగ్రత్తపడుతోంది.
ఈ పరిస్థితిలో తన యవ్వనం గురించి, యవ్వనం తాలుకూ కోరికల గురించి మరచిపోతున్న సమయంలో యిప్పుడు శ్రీనాద్ వచ్చాడు.
ఒక్కసారిగా నిద్రపోతున్న యవ్వనాన్ని మేల్కొలిపాడు.
నటరాజ్ హల్లో కొచ్చాడు వక్కపొడి తీసుకుని.
"గురూగారూ! ఒక్కసారి రికార్డ్ డాన్స్ చేస్తాను చూడండి. అచ్చం మీరేసిన స్టెప్పులే వేస్తాను. తేడా వుంటే చెప్పు తీసుక్కోట్టండి" అంటూ డాన్స్ ప్రారంభించాడు.
అతనే పాడుతూ డాన్స్ చేస్తుంటే చాలా సరదాగా వుంది చూడటానికి.
మధ్య మధ్యలో ఉమాదేవి తన వేపే చూపులు విసరటం గమనించాడు శ్రీనాద్.
ఉమాదేవికి ఆ రాత్రి కలొచ్చింది.
అచ్చం సినిమాల్లో హీరోయిన్లు కనే కలల్లాగానే వుందది.
కాశ్మీర్, బృందావన్ గార్డెన్స్ లాంటి లోకేషన్స్ లో తను ఒంటరిగా నడుస్తుంటే సినిమా యాక్టర్ శ్రీనాద్ కనిపించి ఓ అందమయిన భవనం లోకి తీసుకెళ్ళాడు.
అక్కడ యిద్దరూ ప్రణయం జరిపారు. అంతలోనే వర్షంలోకి పరుగెత్తారు.
ఆ ప్రణయం క్లయిమాక్స్ చేరుతుండగానే నిద్ర మెలకువ వచ్చేసింది. ఒక్క ఉదుటున లేచి కూర్చుంది ఉమాదేవి.
అంతా నిశ్శబ్ధం.
బెడ్ లైట్ డిమ్ గా వెలుగుతోంది.
వళ్ళంతా వేడి సెగలతో చెమటలు పోస్తున్నాయి.
గుండె వేగంగా కొట్టుకుంటోంది.
అదంతా కల అని తెలిసేసరికి ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించిందామెని.
ఆ కల ఎందుకొచ్చిందో కూడా ఆమెకు అర్ధమయ్యింది.
తనకు శ్రీనాద్ నటించిన ఓ సినిమాలోని వర్షం పాట చాలా ఇష్టం. ఆ పాటలో పూర్తిగా తడిసిపోయిన శ్రీనాద్ అప్పటి నటి నీరజా దేవి ప్రణయ కలాపాలు జరుపుతోంటే తనకెందుకో చాలా థ్రిల్ కలిగింది.
ఆ పాటనే తను కొన్ని వేలసార్లు వింటూ ఆ దృశ్యాన్ని చూసేది.
అందుకే యిప్పుడు శ్రీనాద్ పరిచయమయ్యేసరికి అదే సీక్వెన్స్ కలగా వచ్చింది కానీ తనను పజిల్ చేస్తోన్న విషయం ఏమిటంటే ఆ పాటలో శ్రీనాద్ కౌగిట్లో నీరజాదేవి బదులుగా తనుంది. పైగా అతను పాటలో సున్నితంగా ప్రణయం జరిపినట్లు కాకుండా తనతో చాలా రఫ్ కి ప్రవర్తిస్తున్నాడు.
ఇంకా తన వంటిని అతని స్పర్శ అంటుకుని వున్నట్లే అనిపిస్తోంది ఆమెకి.
మనసు నిండుగా అసంతృప్తిగా పేరుకుపోయింది - ఆ కల సడెన్ గా చెదిరిపోవడంతో.
ఉమాదేవి నిట్టూర్చి మంచం దిగి టేబుల్ మీదున్న మంచినీళ్ళు తాగింది.
కుర్చీలో కూలబడి గోడకున్న ఫోటోల వేపు చూసింది.
తన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నో సందర్భాలలో తీసిన ఫోటోలు.
స్కూల్లో డిబేటింగ్ లో ఫ్రైజ్ అందుకుంటున్నప్పుడు, టెన్త్ లో ఎక్స్ కర్షన్ వెళ్ళినప్పుడు, ఇంటర్ చదువుతోండగా తల్లి దండ్రులతో షిరిడి వెళ్ళినప్పుడూ , కాలేజ్ లో మాక్ పార్లమెంటులో మాట్లాడుతున్నప్పుడు, ఆ తర్వాత విప్లవనారీ సమితిలో అసిస్టెంట్ సెక్రటరీ గా ఎన్నికయినప్పుడు-
జీవితంలో సగభాగం లేదా ముఖ్యమయిన భాగం అయిపోయిందా?
ఆమె హృదయం బరువెక్కిపోయింది.
ఇక జీవితాంతం యిలా ఒంటరిగా గడపాల్సిందే నా?
స్రీ పురుషులు సమానమనీ, స్రీకి పురుషుడికి అవసరం ఎంతుందో, పురుషుడికి స్రీ అవసరం అంతే వుంటుందనీ , అంచేత కట్నాలు అడిగే మగాదినీ పెళ్ళి చేసుకోకూడదనీ తను ఏర్పరుచుకున్న సిద్దాంతాలు తన జీవితాన్ని బలి తీసేసుకుంటాయా?
పెళ్ళి చేసుకోక పోయినంత మాత్రాన నష్టమేమీ లేదనీ, జీవితాంతం ఒంటరిగానే గడపవచ్చనీ తాను తీసుకున్న నిర్ణయం సరయినదో కాదో అన్న అనుమానం ఈ మధ్యకాలంలో చాలా తరచుగా కలుగుతోంది. ఈ వయసులో తనకు తగ్గ వరుడు దొరకడం కష్టమే.
పెళ్ళి చేసుకోకపోయినంత మాత్రాన తను శారీరక వాంచ వదులుకోవాలని ఎక్కడుంది? తనకు నచ్చిన వ్యక్తితో అలాంటి సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి? అన్న ఆలోచనలు గత కొద్ది నెలలుగా సతమతం చేస్తూనే వున్నాయి.
కానీ లోలోపల ఏదో సంకోచం.
విప్లవనారీ సమితి ఫంక్షన్ లో పరిచయమైనా ఏ యస్ రావ్, ఎమ్మెల్యే కుమార్, తోటి నారీ సమితి మెంబర్ విజయలక్ష్మి రాఘవరావ్- అందరూ తనమీద అమితమయిన ఆసక్తి చూపారు. అందరూ తనని ఆకర్షించిన వాళ్ళే.
రావ్ తనను నగరం వెలుపల వున్న కాటేజీ పార్టీకి ఆహ్వానించాడు. తనను తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ కారు కూడా పంపించాడు.
తను వెళ్ళడానికీ సిద్ద్దపడింది. ఎన్నడూ లేనంత అలంకరణతో కారు ఎక్కింది. కారు టాంక్ బండ్ దాటుతుండగా మనసు మరి కారాపమని చెప్పి దిగి ఇంటికోచ్చేసింది. తర్వాత రావ్ తనను కలవడానికి ఎన్నో ప్రయత్ననాలు చేశాడు. బహుశా తను మళ్ళీ మెత్తబడేదే కాని అతను ఫోన్ లో మాట్లాడిన మాటలు తనను హార్ట్ చేశాయి.
"ఉమా! అయాం సిన్సియర్లీ లవింగ్ యూ.......! ఐ వాంట్ ఫరేవర్ . మన సంబంధం రహస్యంగా వుంచుదాం. దీనివల్ల నీకు ప్రాబ్లం ఉండదు. జూబ్లిహిల్స్ లో ఒక ఫ్లాట్ కూడా నీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తాను."
అక్కడే తను హార్ట్ అయ్యింది.
ఈ సంభందాన్ని అతను 'డబ్బు' తో కొలుస్తున్నాడు.
అంటే తను ఫ్లాట్ కోసం శరీరాన్ని అమ్ముకుంటోందన్న ఫీలింగ్ కలిగించాడు.
ఎమ్మెల్యే స్త్రయిట్ గా అడిగేశాడు.