"హీరోయిన్ గా అవ్వాలంటే మీ రికమండేషన్ సరిపోతుందంటారా?" అనుమానంగా అడిగింది.
"అచ్చం మీకొచ్చిన అనుమానమే మా టైం లో చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఓ హీరోయిన్ కి కూడా వచ్చింది. ఆమెకింకా పెళ్ళి కాలేదు.
అందుకని కొంచెం చనువున్న ప్రతి వాళ్ళు 'పెళ్ళి చేసుకుందాం ' అంటూ ప్రాణం తీసేయటం మొదలుపెట్టారు.
డైరెక్టరేమో నా దగ్గర కొచ్చే ప్రొడ్యుసర్లందరికి నిన్ను పెట్టి చేస్తేనే సినిమా తీస్తానంటాను అన్నాడు.
ఆమె పర్సనల్ మేకప్ మెన్ తనను పెళ్ళి చేసుకుంటే అందమయిన మేకప్ చేసి ఎంత ముసలిదయిపోయినా , ముఖంలో ఎన్ని ముడతలోచ్చినా పదహారేళ్ళ పిల్లలాగానే కనపడేట్లు చేస్తానన్నాడు.
జీవితాంతం ఆమె హీరోయిన్ గానే వుండే అవకాశం ఉందన్నాడు.
"ఇప్పుడు మీరే చెప్పండి. ఆమె ఎవర్ని చేసుకుంటుందో....."
రామచంద్రమూర్తి, నటరాజ్, ఉమాదేవి ఆలోచనల్లో పడ్డారు.
"మేకప్ మాన్ " ముగ్గురూ ఒకేసారి అరిచారు.
"కరెక్ట్"
"ఏమిటింకా భోజనాలు చేయరా?" అంటూ వచ్చింది సీత. ఉమాదేవి కిటికిలో కనిపించేసరికి ఆమె కొంచెం చిరాకుపడింది.
"ఓ! నేను రెడీ! ఆకలి దంచేస్తోంది!"
"అయితే పదండి!"
అందరూ డైనింగ్ రూమ్ లోకి నడిచారు.
నటరాజ్ అందరికీ వడ్డన ప్రారంభించాడు.
"మీ సినిమావాళ్ళకు మా వంటకాలు నచ్చుతాయో , నచ్చవో" అంది సీత శ్రీనాద్ వేపు చూస్తూ.
"మా భోజనాలే చెప్పాలి. ప్రొడ్యుసర్ మంచివాడయితే ఫర్లేదు గానీ ఒకోసారి కక్కుర్తి ప్రొడ్యుసర్ల చేతిలో పడతాం అప్పుడు చూడాలి మా అవస్థ.
అందరూ నవ్వేశారు.
"ఆహా! ఈ దొండకాయ వేపుడు , ఎవరు చేశారో గానీ ఒండర్ ఫుల్! మళ్ళీ బాల్యం గుర్తుకొస్తుంది. మా అంటీ చేసేదిలా. సినిమాల్లో కెళ్ళాక మొత్తం ఈ రుచులన్నీ మర్చిపోయాం. అక్కడ ఇరవై నాలుగ్గంటలూ ఒకటే రుచి. మందు! అంతే! నిద్రలేవగానే మందు, బ్రేక్ ఫాస్ట్ మందు, లంచ్, డిన్నర్ మందు."
భోజనాలు ముగించాక ఉయ్యాల బల్లమీద పడుకున్నాడు శ్రీనాద్.
"ఆహా! అద్బుతంగా వుందోయ్ నటరాజ్ ఈ సెటప్. అన్నట్లు రామచంద్రమూర్తి గారేమిటి నిజంగానే దేవుడు శ్రీరామచంద్రమూర్తిలాగానే వున్నారు. ఇంతవరకూ నన్ను అడ్వాన్స్ అడగలేదు. డబ్బు అవసరం లేదా ఏమిటి?"
రామచంద్రమూర్తి నవ్వాడు.
"డబ్బు అవసరం సంగతెలా వున్నా అడగటం అనేది బొత్తిగా అలవాటు లేని వ్యవహారం అయిపొయింది."
"ఎప్పుడూ అడిగించుకోవటమే అప్పులవాళ్ళతో" అన్నాడు నటరాజ్.
"ప్రస్తుతానికి మన దగ్గర డబ్బుల్లెదనుకొండి! కానీ సాయంత్రానికల్లా అరేంజ్ చేస్తాను. రాజేశ్వరరావ్ అని మల్కాజ్ గిరిలో వుంటాడు. నేను సినిమాల్లో బ్రతికి వున్న రోజుల్లో చాలా పెద్ద ఫాన్ నాకు . నా సినిమా రిలీజయినప్పుదల్లా స్వయంగా మద్రాస్ వచ్చి పూలదండ వేసి వెళ్ళేవాడు ప్రస్తుతం మనకీ యిక్కడ ఫుడ్ కి సహాయం చేస్తోంది తనే. సినిమా ఆర్టిస్ట్ లందరికి వాళ్ళెంత చెడ్డ వాళ్ళయినా భగవంతుడిచ్చిన వరం యిదొక్కటే . దేశంలో ఏ మూలకి వెళ్ళినా ఎవరో ఒకరు ఫుడ్ పెడతారు. ఫుట్ పాట్ మీద పడుకోకుండా ఇంట్లో చోటిస్తారు. ఇంతకాలం రాజేశ్వర్రావ్ వాళ్ళ ఇంట్లోనే నాకు గది యిచ్చాడు. గానీ ఎవరయినా గానీ ఎంతకాలం ఓ మనిషిని భరిస్తాడు చెప్పండి. అతనికి వచ్చేది నాలుగువేల జీతం. అందులో ఇల్లు గడవాలి. నాకు రోజూ మందు, సిగరెట్లు, తిండి యివన్నీ భరించమంటే మాటలా? దివాలా తీశాడు. నావల్ల భార్యభర్తలిద్దరూ పోట్లాడుకున్నారు.
నన్ను యింట్లో నుంచి బయటకు గెంటమందామే. ససేమిరా వీల్లేదు అన్నాడతను. ఆమె పుట్టింటి కెళ్ళిపోయింది. నాకింక అక్కడ వుండబుద్ది కాలేదు. అప్పుడే మీ ప్రకటన పేపర్లో చూశాను. వాళ్ళ సంసారం బాగు పడాలంటే తక్షణం అక్కడి నుంచి తప్పుకోవాలని యిక్కడికొచ్చాను. నేనెక్కడున్నా నా కోసం కొంత డబ్బు స్పేర్ చేస్తానన్నాడు రాజేశ్వర్రావ్. సాయంత్రం తప్పకుండా తెస్తాడు" అన్నాడతను.
అతని కధంతా వినేసరికి అందరి హృదయమూ బరువేక్కినాయి.
ఉమాదేవి కొత్త గెటప్ లో వచ్చింది సారి.
ఆమె కళ్ళలో నిజంగానే సినిమా స్టార్ అయిపోతానేమో అన్న ఆశ కదలాడుతోంది.
"ఆహా! సూపర్బ్ మేజర్ మెంట్స్' అన్నాడు శ్రీనాద్ ఆమె వంక తదేకంగా చూస్తూ.
"చూశారా! నేడు మీలోని నిజమయిన అందం బయటపడింది . అందుకే వజ్రనికయినా సాన బెట్టందే రాణించదంటారు.'
ఆమె సిగ్గుపడింది.