ఆ నటనలే వద్దంటున్నాను కామ్రేడ్! మనిద్దరం మన పాత్రల్లో జీవిద్దాం! ప్రతి మూవ్ మెంతులోను సహజత్వం ఉట్టిపడే విధంగా నిజాలు మాట్లాడుకుందాం!" పెదాలమీద నవ్వు చేరగనీయకుండా మాట్లాడుతున్నాడతను.
"నేను నిజమే చెపుతున్నాను" కోపం అణుచుకుంటూ అందామె.
"చెప్పటం లేదు కామ్రేడ్! చెపుతున్నావని భ్రమపడుతున్నారు. అంతే! ఇల;ఇలా ఇద్దరం భ్రమపడుతూ , భ్రమింపజేస్తూ, జీవితం గడిపేస్తుంటే చివరకు ఇంక అందులోనుంచి బయటపడటం కష్టమైపోతుంది. అసలు సిసలయిన నిజం ఏమిటంటే మీరు ఓ వస్తువు కోసం సంద్యారాణి ప్లాట్ కొచ్చారు. దొంగతనంగా మారుతాళాలతో ఫ్లాటులోకి ప్రవేశించారు. " అంటూ చటుక్కున మాట్లాడటం ఆపివేశాడతను. అతని కళ్ళు టేబుల్ మీదున్న పుస్తకాల రాక మీద పడినాయ్. వాటిల్లో ఓ నవల కొంచెం పైకి లేచి వుంది. దానిమీద పేరు చూశాడతను "హంచ్ బాక్ ఆఫ్ వాటర్ డామ్" అని వుంది! మరుక్షణం అతనికి మెరుపులా భార్గవ్ డైరీ గుర్తుకొచ్చింది! అంతకు ముందు రోజు హత్య చేయబడ్డ భార్గవ్ డైరీ అంతా చూస్తుంటే ఓ పేజీలో కనిపించిందా పేరు. "హంచ్ బాక్ ఆఫ్ వాటర్ డామ్" అని! ఈ పేరు తప్పితే ఆ పేజీలో ఇంకే వివరాలు లేవు అందులో. నెమ్మదిగా ఆ నవలను బయటకు లాగి చూశాడతను. చాలా అందంగా, ప్రత్యేకంగా ప్లాస్టిక్ కవరుతో బైడింగ్ చేసి వుంది. లోపల మనీ పర్సు లాగా ప్లాస్టిక్ అరలు, ఫోమ్ లేయర్స్ అన్ని అరలు చూశాడతను. అన్నీ ఖాళీగానే వున్నాయి. అట్టమీదంతా దుమ్ము పేరుకుపోయి వుంది!@ ఆ దుమ్ములో ఆమె సన్నటి చేతివేళ్లు స్పష్టంగా ముద్రించబడి కనబడుతున్నాయ్. ప్లాస్టిక్ అట్టకు లోపలవేపు కిందభాగంలో స్టీలు బటన్ లాంటిది కనిపించిందతనికి. అది తిప్పడానికి ప్రయత్నించాడతను. కానీ తిరగటం లేదు. ఈసారి దానిని గట్టిగా నొక్కాడు. ప్లాస్టిక్ కవరులోంచి స్ప్రింగు యాక్షన్ లో చిన్న మూత తెరుచుకుంది. లోపల చిన్న అర! ఖాళీగా ఉంది.
ఆ యువతి వేపు చిరునవ్వుతో చూసాడు భవానీశంకర్. ఆమె మొహం పాలిపోయి ఉంది.
"చాలా బ్రహ్మాండంగా వుంది దొంగ అర! ఏమంటారు కామ్ర్రేడ్ .
ఆమె కళ్ళల్లో బెదురూ కనిపించిందతనికి.
"మాట్లాడు కామ్రేడ్! ఈ రహస్య అరలోంచి మీరు కాజేసిన వస్తువు గురించి మనిద్దరం త్వరగా రాజీకి రావాలి."
ఆమె కొద్ది క్షణాలు తర్వాత షాకులోంచి కోలుకుంది.
"మీకన్నీ తెలుసనీ నాకు నాకు తెలీదు. నేను కొన్ని ఫోటోలు వెతకటం కోసం ఇక్కడి కొచ్చాను."
"ఏం ఫోటోలవి?"
"నేను నా భర్తకు తెలీకుండా ఒక వ్యక్తితో జరుపుతున్న ప్రేమ కలాపాలను సంభందించిన ఫోటోలు. సంధ్యారాణి ఆ ఫోటోలు తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోంది. అందుకని ఆ బ్లాకు మెయిల్ నుంచి తప్పించుకొనేందుకని వాటిని దొంగాలించాడానికి వచ్చాను. కాని అవి దొరకలేదు ఇంతకంటే నాకింకేమీ తెలీదు. ఇంక దేనితోనూ సంబంధం లేదు.......' అందామె దీనంగా.
భవానీ శంకర్ చప్పట్లు కొట్టాడు.
"కధ బాగా అల్లారు కామ్రేడ్. వండర్ ఫుల్ సినిమా అవుతుంది. మందు కొట్టేసి సినిమా చూడ్డానికొచ్చే భారత ప్రజానీకం ఆ సినిమాని వెయ్యి రోజులులాడిస్తారనటంలో నాకేం డౌట్ లేదు. కానీ దురదృష్టవశాత్తూ మనక్కావలసింది సినిమా కధలు కాదు కామ్రేడ్. క్లీన్ ఫాక్ట్! పచ్చి నిజాలు" నీ జాకెట్లో దాచిన ఆ పాకెట్ బయటకు తీస్తే మన మధ్య వున్న అపార్ధాలు తొలిగిపోయే అవకాశం ఉంది!"
ఆమె విస్తుపోయింది కొద్ది క్షణాల పాటు.
తర్వాత వుడికిపోతూ చూసిందతనివేపు.
"అవి నాకు సంబంధించిన ఫోటోలు! వాతినిఒ ఎవ్వరికీ ఇవ్వను......"
భవానీశంకర్ ఆమెకు సమీపంగా నడిచాడు.
"అలా మొండిపట్టు పట్టటం అన్ని వెళ్ళల్లోనూ మంచిది కాదు కామ్రేడ్. ఆ పాకెట్ ని నా చేతితోనే తీసుకునే పరిస్థితి కల్పించుకుండా ఉంటే మంచిది. ఇంతవరకూ నా కండాక్టు సర్టిఫికెట్టు మీద ఎవరూ "బాడ్" అని రాయలేదు. గానీ రాసినా పట్టించుకునే రకం కాదు నేను."
ఆమె చటుక్కున వెనకకు గెంతి తన పిడికిలితో బలంగా అతని ముఖం మీద కొట్టింది. భవానీ శంకర్ కి కొద్ది క్షణాల పాటు కళ్ళముందు చుక్కలు కనిపించినాయ్. ఇనుపచువ్వ ముఖం మీద తగిలినంత నొప్పి అతనిని ఊగించివేసింది. నెమ్మదిగా కళ్ళకడ్డం పెట్టుకున్న చెయ్యి తీసి ఆమె వేపు చూశాడు. అతని పెదాల మీదకు మళ్ళీ చిరునవ్వు వచ్చింది.
ఈసారి మళ్ళీ మెరుపులా అతని ముఖం మీద కొట్టబోయిందామె. కానీ ఆమె చేతిని పట్టుకుని తన దగ్గరకు బలంగా లాక్కుని కౌగిట్లో కదలకుండా బంధించాడు.
ఆమె ముఖం కోపంతోనూ, అవమానంతోనూ దహించుకు పోతోంది. అతని చేతుల్లోంచి తప్పించుకోడానికి తన బలమంతా ప్రయోగించి పెనుగులాడసాగింది. ఆమె శక్తి గమనిస్తోంటే భావనీశంకర్ కే ఆశ్చర్యంగా వుంది. ఓ అమ్మాయికి ఇంతటి రాక్షస బలం వుంటుందని తనకింతవరకూ తెలీదు. కొద్ది క్షణాల తర్వాత పూర్తిగా అలసిపోయిందామె.
"నన్నోదులు - ఇచ్చేస్తాను" అంది నీరసంగా.
భవానీశంకర్ ఆమెని వదిలేశాడు. ఆమె రొప్పుతూ సోఫాలో కూలబడింది. ఆమె కళ్ళల్లో కోపం, నిస్సహాయత, ద్వేషం గమనించేసరికి నవ్వు వచ్చింది భవానీశంకర కి.
"కమాన్ కామ్రేడ్. మీ అందమైన ఫేస్ లో ఎక్స్ ప్రేషన్స్ వాచ్ చేసేంత టైం లేదు నాకు! క్విక్ - త్వరగా ఇవ్వండి అది- "
జాకెట్ జిప్ లాగబోయి అతనివేపు చూసిందామె.
"అటువేపు తిరగండి" అంది రోషంగా.
భవానీ శంకర్ వెనక్కు తిరిగి "జిప్" శబ్దం కోసం చెవులు రిక్కించి వినసాగాడు.
జిప్ శబ్దం బదులు అడుగుల చప్పుడు వినిపించేసరికి ఒక్క గెంతు గెంతి వెనక్కు తిరిగి చూసాడు. అప్పటికే పూలకుండీ అతని మీదకు బలంగా విసిరేసిందామె. వెంట్రుక వాసిలో అతని తల పక్క నుంచి దూసుకుపోయి గోడను కొట్టుకుని పెద్ద శబ్దంతో కిందపడిందది. వెంటనే గోడకున్న గాజు బొమ్మను అందుకోబోయిందామె. భవానీ శంకర్ యిక ఆలస్యం చేయలేదు. గాలిలోకి స్ప్రింగు లా యెగిరి ఆమె భుజం మీద బలంగా తన్నేడు. అతను ఊహించినదానికంటే బలంగా దెబ్బ తగిలేసరికి ఆమె సోఫాలో విరుచుకుపడిపోయింది. మళ్ళీ లేవటానికి ప్రయత్నించింది గాని నడుము నొప్పి పుట్టేసరికి మళ్ళీ సోఫాలోనే కూర్చుండిపోయింది.
"అబ్బా-" అంది మూలుగుతూ.
"కరాటే కమల " "మరాటీ విమల" లాంటి సినిమాలు చూడకు కామ్రేడ్. అవితెర మీదే గాని బయట పనికిరావ్ - " ఆమె దగ్గరగా నడిచి సమీపంగా కుర్చున్నాడతను.
ఆమె సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది బాధగా.
"హరీయప్ కామ్రేడ్! ఆ పాకెట్ త్వరగా ఇచ్చేస్తే మనం మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయి "స్నేహమేరా జీవితం ......." అంటూ పాడుకోవచ్చు-"
ఆమె జవాబివ్వలేదు -
"హలో - ఆమెను పిలిచాడతను గట్టిగా ఆమె భుజం కుదుపుతూ.
ఆమె జవాబివ్వలేదు. మగతగా కళ్ళు మూసుకుండిపోయింది. మరో రెండు మూడు సార్లు ఆమెను లేపటానికి విఫల ప్రయత్నం చేసి చివరకు తనే ఆమె జాకెట్ జిప్ లాగి , లోపలకు చేయి పోనిచ్చి పాకెట్ కోసం వెతికాడు. చాతికి ఓ మూలగా దొరికిందది. ఆత్రుతగా బయటకు లాగి చూశాడు.
అందంగా ఎర్ర కవరుతో ఉన్న చిన్న పుస్తకం అది. పుస్తకం తెరచి చూశాడు. లోపల అందమైన దస్తూరితో ఎవరెవరివో అడ్రస్ లున్నాయి. చివరివరకూ వడివడిగా చూశాడు.
అన్నీ అడ్రసులే, సుమారు అయిదారువందల చిరునామాలుంటాయ్. వాటి ప్రాముఖ్యతేమిటో అతనికేమాత్రం అర్ధం కావటం లేదు.