Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 29


    "వీడి యాక్షన్ పెక్యూలియర్ గా ఉంటుంది. కొంత పోజ్ కోసమను కుంటాను" అంది వినూత్న.
    
    ఇంతలో ఖాదిర్ బౌలింగ్ లో శ్రీకాంత్ షాట్ కొట్టి, అక్రమ్ కాచ్ పట్టగా డెబ్బై అయిదు రన్స్ చేసి అవుటైపోయాడు.
    
                                             * * *
    
    అర్ధనారీశ్వరరావు ఇంట్లో కోలాహలంగా ఉంది. టీ.వీ. ఆన్ చేసి ఉందిగానీ ఎవరూ దాన్ని గమనించటంలేదు. మహేష్, వినోద్ ఇంకో అయిదుగురు ఫ్రెండ్స్ కూర్చుని ఉషారుగా రమ్మీ ఆడుతున్నారు. అందరి చేతుల్లోనూ మందు గ్లాసులున్నాయి.
    
    అందరికీ గొప్ప ఆటవిడుపుగా ఉంది.
    
    దేవీప్రియ గొప్ప ఆటవిడుపుగా ఉంది.
    
    దేవీప్రియ ఫోన్ దగ్గర కూచుని ఉంది. అతను మాట్లాడుతున్నాడు.
    
    "ఈవేళ.... మనం కలుసుకోబోతున్నాం" అంటున్నాడతను.
    
    "వద్దు నాకు భయం" అంటుంది ఆమె.
    
    "కాదు ఈవేళ కలుసుకుని తీరాల్సిందే!"
    
    "మా నాన్నగారు చంపేస్తారు."
    
    అతను నవ్వాడు. "మీ నాన్నగారూ, అమ్మగారూ ఊళ్ళో లేరనీ, మూడు రోజులదాకా రారనీ నాకు తెలుసు."
    
    ఆమె తెల్లబోయి ఊరుకుంది.
    
    "నువ్వు రోజూ నిల్చునే బస్ స్టాప్ కి అవతల ఉన్న వసంత విహార్ దగ్గర మారుతీ కార్ లో కూచుని వెయిట్ చేస్తూ ఉంటాను."
    
    ఫోన్ పెట్టేశాడు.
    
    దేవీప్రియ గుండె దడదడమని కొట్టుకుంటున్నది. నుదుట చెమట పడుతున్నది. అయినా వెళ్ళాలన్న కోరిక నరనరాలా ఆక్రమిస్తోంది.
    
                                                             * * *
    
    శ్రీకాంత్ అవుటయాక వెంగ్ సర్కార్ వచ్చాడు. గవాస్కరూ, అతనూ కలిసి నిలకడగా ఆడుతున్నారు.
    
    రన్స్ రావటంతో వేగం తగ్గింది. బౌలర్స్ కు బంతిమీద కంట్రోల్ వచ్చింది.
    
    గవాస్కర్ చాలా పట్టుదలగా ఆడుతూ ఎనభై రన్స్ దాటాడు.
    
                                                              * * *
    
    వసంత విహార్ దగ్గర కారులో అతను కూచుని ఉన్నాడు- స్టీరింగ్ దగ్గర.
    
    దేవీప్రియ కారు పక్కగా వచ్చింది. ఆమె అడుగులు తడబడుతున్నాయి.
    
    "దేవీప్రియా! అని పిల్చాడతను. ఉలిక్కిపడి అతని మొహంలోకి చూసింది.
    
    అందంగా, దర్జాగా ఉన్నాడతను. అతని కళ్ళలో ఓ వెలుగు ఉంది. ఏదో ఆకర్షణశక్తి అతనివైపు లాగుతుంది.
    
    "రా... కారెక్కు."
    
    ఆమె అటు నడిచి వెళ్ళింది. డోర్ తీశాడు. లోపలికి ఎక్కింది.
    
    కారు కదిలింది.
    
                                              * * *
    
    గవాస్కర్ తొంభై రెండు పరుగుల దగ్గర ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు.
    
    "అయ్యో! సెంచరీ కొడతాడనుకున్నాను అంది వినూత్న విచారంగా.
    
    అందరి మనసుల్నీ ఓ రకం దిగులావరించింది.
    
    పాకిస్తాన్ బౌలర్లు రెట్టించిణ ఉత్సాహంతో బంతులు వేస్తున్నారు.
    
    కీర్తి ఆజాద్ వచ్చి అక్రం బౌలింగ్ లో ఒక్క రన్ కూడా చేయకుండా అవుటైపోయాడు.
    
    "వీడెవడు? ఫాస్ట్ బౌలింగ్ లో మార్షల్ ని మించిపోయేటట్లు ఉన్నాడు" అన్నాడు మనోజ్.
    
    తరువాత కపిల్ దేవ్ వచ్చాడు.
    
    "ఇహ కొడ్తాడు చూడు సిక్సర్లూ, ఫోర్లూ" అంది ఉత్సాహంగా వినూత్న.
    
    ఓవర్లయిపోతున్నాయి.
    
    కపిల్ దేవ్ హడావుడిగా రన్స్ తియ్యటానికి ప్రయత్నించి పది పరుగులు చేసి, ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ లో అవుటైపోయాడు.
    
    అతని మీద ఆశలు పెట్టుకున్న అందరికీ ఉసూరుమనిపించింది.
    
    రాజాచంద్రకు నీరసం కమ్ముకొస్తుంది. చివరి ఓవర్లలో రన్స్ రావటం చాలా కష్టంగా ఉంది.
    
    వెంగ్ సర్కార్ ఏభై పరుగులు చేసి అక్రం బౌలింగ్ లో అవుటైపోయాడు.
    
    చేతన్ శర్మ, పండిట్ ఆడుతున్నారు. పండిట్ కష్టపడి తొమ్మిది పరుగులు చేశాడు. చేతన్ శర్మ ఒక రన్ తీసి అవుటైపోయాడు.
    
    ఏభై ఓవర్లు పూర్తయిపోయాయి.
    
    మూడొందల పరుగులు వస్తాయనుకున్నది రెండు వందల నలభై వచ్చేసరికి గగనమైపోయింది.
    
                                              * * *
    
    
    కారు ఊరి పొలిమేరలు దాటి ఎటో వెళ్ళిపోతున్నది.
    
    "మనం ఎక్కడకు పోతున్నాం?" అనడిగింది దేవీప్రియ భయంగా.
    
    "ఏం, భయంగా ఉందా?"
    
    "అలా అని కాదు..."
    
    "ఇలా...కొంచెం దగ్గరగా జరుగు.
    
    అతని మాటల్లోని ఆకర్షణశక్తి అటువైపు లాగేస్తుంది.
    
    దగ్గరగా జరిగింది.
    
    ఆమె భుజంమీద చెయ్యివేసి చటుక్కున వంగి బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు.
    
    "టెలీఫోన్ లో ముద్దు బావుందా? ఇది బావుందా?"
    
    ఆమె మాట్లాడలేదు. ఎడమ చేత్తో బుగ్గ తుడుచుకుంటుంది.
    
                                               * * *

 Previous Page Next Page