Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 30

   

    "తన చదువుగురించి, భవిష్యత్తులో ఆలోచనల గురించి ఎప్పుడన్నా చెబుతూ వుండేదా?"

    "తాను గొప్ప డాక్టరుకానీ, యింజనీరుకానీ కావాలని కలలు కంటూ వుండేది."

    "అంతకుపూర్వం చెప్పుకోదగ్గ జబ్బు ఎప్పుడూ చెయ్యలేదా?"
   
    "లేదు."
   
    "కంటివిషయంలో పాపకేం జరిగింది?"
   
    "మొదట ఎడమకన్ను ఎర్రబడింది."
   
    "ఎప్పుడు?"
   
    "షుమారు అయిదారు నెలలక్రిందట."
   
    "అప్పుడు మీరు నిర్లక్ష్యం చేశారా?"
   
    "లేదు."
   
    "ఏం చేశారు?"
   
    "వెంటనే మా ఫ్యామిలీ డాక్టరుదగ్గరకు తీసుకెళ్ళాను."
   
    "ఆయన ఏమన్నారు?"
   
    "ఊరంతా వైరల్ కన్ జక్టివైటిస్ వుంది కాబట్టి అదేననే ఉద్దేశంతో మందిచ్చారు."
   
    "తగ్గిపోయిందా?"
   
    "లేదు."
   
    "మరి ఏం చేశారు?"

    "డాక్టర్ గుర్నాథ్ అని ఓ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళాం."
   
    "ఆయన ఏమన్నారు?"
   
    "కంట్లో కన్ జక్టివైటిస్ లేదనీ, క్యాన్సర్ కు సంబంధించిన ట్యూమర్ లా వుందనీ అనుమానించి, డాక్టర్ అశోక్ పేరు ఆయనే సజెస్ట్ చేసి పంపించారు."
   
    "ఏ కంట్లో?"
   
    "ఎడమ కంట్లో."
   
    "డాక్టర్ అశోక్ గార్ని వెంటనే కన్సల్ట్ చేశారా?"
   
    "చేశాము."
   
    "ఎక్కడ?"
   
    "ఆయన శ్రీలక్ష్మి హాస్పిటల్ లో పనిచేస్తూ వుండటంచేత అక్కడే కన్సల్ట్ చేశాం."
   
    "ఆయన ఏమన్నారు?"
   
    "కంట్లో క్యాన్సర్ కి సంబంధించిన ట్యూమర్ వుందనిచెప్పి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు."
   
    "ఏ కంటిలో?"
   
    "ఎడమ కంటిలో"
   
    "ఆపరేషన్ చేయించారా?"
   
    "చేయించాము."
   
    "ఎక్కడ?"
   
    "శ్రీలక్ష్మి హాస్పిటల్లో."
   
    "ఎవరు చేశారు?"
   
    "డాక్టర్ అశోక్."
   
    "తర్వాతేం జరిగింది?"
   
    "ఆపరేషన్ థియేటర్ లో నుంచి బయటకు తీసుకొచ్చాక అంతా నిర్ఘాంత పోయాం. ఎడమ కన్నుకు బదులు కుడికన్నుకు బ్యాండేజ్ వేసివుంది."
   
    "అంటే మీ ఉద్దేశం..."
   
    "జబ్బు ఎడమకంటిలో వుంటే కుడికన్నును తీసిపారేశారు. నా కూతురి జీవితాన్ని అంధకార బంధురం చేశారు. దాని భవిష్యత్తు సర్వనాశనం చేసేశారు. మా గుండెల్లో మంటలు రేపారు."
   
    "దట్సాల్ యువరానర్" అని ప్రదీప్ తన చీఫ్ ఎగ్జామినేషన్ ముగించాడు.
   
    తర్వాత ప్రతాపరావు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు.
   
    "మీకెంతమంది పిల్లలు?"

    "ముగ్గురు."
   
    "అంతా ఆడపిల్లలే కదూ?"
   
    "అవును."

    "వీళ్ళేనా? యింకెవరయినా పుట్టిపోయారా?"
   
    "వీళ్ళు తప్ప యింకెవరూ పుట్టలేదు."
   
    "మీ మొదటి యిద్దరిపిల్లలకూ, కాన్పులు ఎక్కడ అయాయి?"
   
    "ప్రైవేటు నర్సింగ్ హోంలో."

    "అంటే రాధ ప్రసవించిన నర్సింగ్ హోంలోనేనా? వేరేనా?"
   
    "అదే ప్రైవేట్ నర్సింగ్ హోం."

    "అంటే మొదటి రెండుసార్లూ తల్లీ పిల్లా బాగానే వున్నారు."
   
    "అవును."
   
    "అంటే డాక్టర్లు బాగానే చూశారు?"

    హనుమంతరావు ఏంచెప్పాలో తెలీక ఆలోచిస్తున్నాడు.
   
    "చెప్పండి. డాక్టర్లు బాగానే చూశారు. అవునా?"

    "అవును."
   
    "డాక్టర్లు బాగా చూసినా రోగి అలక్ష్యం వల్ల గాని, రోగ పరిస్థితినిబట్టిగానీ, యితర కారణాలబట్టిగాని అప్పుడప్పుడూ రోగి మరణించే అవకాశముంది. అవునా?"
   
    "....."
   
    "చెప్పండి. అవును, కాదు చెప్పండి."
   
    "అవును.'
   
    "కాబట్టి రోగికి మృత్యువుగాని, యితర కాంప్లికేషన్స్ గాని సంభవించి నప్పుడు డాక్టర్ల అజాగ్రత్తగా కారణమై వుండాలని లేదు, అవునా?"
   
    ".....అవును" అన్నాడు హనుమంతరావు బిక్కమొహం వేసి.
   
    "మీ అమ్మాయి రాధకు కంటికి జబ్బుచేసిందని మొదట ఎప్పుడు చూశారు?"
   
    "తారీఖు గుర్తులేదు."
   
    "పోనీ రాధకు కంటికి జబ్బుచేసిందని మీకెలా మొదటిసారి తెలిసింది? పాప మీకు చెప్పిందా? లేకపోతే మీరే చూశారా?"
   
    ".... గుర్తులేదు."
   
    "అసలు పాపకు జబ్బు చేసింది ఏ కంటికి?"
   
    "ఎడమకంటికి."
   
    "కుదికంటికి జబ్బుచెయ్యలేదని మీకెలా తెలుసు?"
   
    "మొదట ఎడమకన్ను ఎర్రబడింది."
   
    "అంటే తర్వాత కుడికన్నుకూడ ఎర్రబడిందా?"
   
    "అవును."
   
    "అంటే ఎడమకంటితో బాటు, కుడికంటికికూడా జబ్బుచేసి వుండవచ్చు కదా."
   
    హనుమంతరావు మాట్లాడలేదు.
   
    "చెప్పండి. రెండుకళ్ళూ ఎర్రబడినప్పుడు రెండింట్లోనూ జబ్బు వుండే అవకాశం వుంది కదా?"
   
    "ఎడమకంట్లో క్యాన్సర్ కి సంబందించిన ట్యూమర్ వుందనీ, కుడికంటిలో మామూలు కన్ జక్టివైటిస్ అని డాక్టర్ చెప్పారు."
   
    "ఏ డాక్టర్?"
   
    "డాక్టర్ గుర్నాథ్ అని ఐ స్పెషలిస్ట్."
   
    "మీరు వెళ్ళారుగా ఆయన దగ్గరకు?"
   
    "లేదు."

 Previous Page Next Page