"డాక్టర్ల వృత్తిగురించీ, అందులోని సాధక బాధకాల గురించీ చెప్పటానికి నాకో సమర్ధత వున్న సాక్షి కావాలి. ఆ సాక్షిగా నిన్ను తీసుకుందామనుకుంటున్నాను."
"అన్నయ్యా!"
"అవును నువ్వొక డాక్టరువి, ఆ వృత్తిలోని గొప్పతనాన్ని, ఒకవేళ ఆ డాక్టరువల్ల పొరపాటు జరిగితే దానివెనక గల చరిత్రను నీచేత బాగా చెప్పించ గలను. అందుకే నిన్ను ఓ ముఖ్యమైన సాక్షిగా వుంచటానికి నిర్ణయించుకొన్నాను."
మాలతి ముఖం ఆవేశంతో కొంచెం ఎర్రబడింది పెదవులు చిన్నగా వణికాయి.
"నేను డాక్టరుని కావచ్చు. డాక్టరు ఓ పొరపాటు చేయటంలో కారణం ఏదైనా కావచ్చు. కాని ఆ పొరపాటువల్ల ఓ ప్రాణి జీవితం అల్లకల్లోలమైపోయి నప్పుడు, ఓ జీవి జీవితం అంధకార బంధురమైపోయినప్పుడు, ఆ జీవితాలు నాశనమైపోయినప్పుడు - అందుకు డైరెక్టుగానో యిన్ డైరెక్టుగానో బాధ్యుడైన డాక్టరును ఓ దోషిగా సమాజం ముందు నిలబెట్టవలసిన అవసరం, బాధ్యత గల ఓ పౌరునికి వుంది."
"అందుకని...."
"ప్రదీప్ తరపున సాక్షిగా వుండడానికి అంగీకరించి నా పేరిచ్చాను."
ఆమె అతని జవాబుకోసం ఎదురు చూడకుండా చకచక అడుగులు వేస్తూ కారుదగ్గరకు వెళ్ళిపోయింది.
14
క్రిమినల్ కోర్టులో హనుమంతరావు, శ్రీలక్ష్మి హాస్పిటల్ మీద పెట్టిన కేసు మొదలయింది.
మొదట హనుమంతరావు బోనెక్కి కేసు స్వభావాన్ని మొదట్నుంచీ వివరించి, తన కుమార్తె రాధ జీవితం అంధకార బంధురమైపోవటం, ఆ పాప భవిష్యత్తు. జీవితం నాశనం కావటం, డాక్టర్ అశోక్ నిర్లక్ష్యంవల్లనే యిదంతా జరిగిందని చెప్పి, అతనికీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరు ఉపేంద్రకూ వాళ్ళవల్ల జరిగిన నేరానికిగానూ తగు శిక్ష విధించి తనకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరి, తన విన్నపాన్ని ముగించాడు.
ఫిర్యాదులో బలం లేకపోతే మేజిస్ట్రేట్ కేసు విచారణకు స్వీకరించదు.
మేజిస్ట్రేట్ హనుమంతరావు విజ్ఞప్తిని ఆలకించి కేసు విచారణకు స్వీకరించారు.
పదకొండు గంటలుదాటాక రెండునిముషాలకు బిళ్ళబంట్రోతు 'సైలెన్స్' అని హెచ్చరించి "పబ్లిక్ కోర్టు" అని అరిచాడు.
కోర్టుహాలులో రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్న లాయర్లూ, బెంచీల మీద కూర్చున్న ఫిర్యాదులూ, ముద్దాయిలూ, నేరస్థులూ, వారితోబాటు వున్న పోలీసువారూ లేచి నిలబడ్డారు.
మేజిస్ట్రేట్ ఛాంబర్స్ లోనుండి 'బెంచి' మీదకు వచ్చి కోర్టుకు నమస్కరించి సీటులో ఆశీనులయ్యారు.
కాల్ వర్క్ మొదలయింది.
బెంచిక్లర్క్ ఒక్కొక్క ఫైలూ తీసి సి.సి. నంబరూ, కంప్లైనెంట్ పేరూ, ఎక్స్క్యూజ్ డ్ పేర్లూ చదువుతున్నాడు. బిళ్ళబంట్రోతు గుమ్మందగ్గరకు వెళ్ళి గొంతెత్తి ఆ పేర్లు అరుస్తున్నాడు. ఆ కేసుకు సంబంధించిన లాయర్లు లేచి నిలబడి రెడీ, నాట్ రెడీ చెబుతున్నారు. రెడీ చెప్పినవాళ్ళకు లంచ్ కు ముందో, పోస్ట్ లంచ్ సెషన్ లోనో విచారణ వుంటుందని చెప్పటం, నాట్ రెడీ చెప్పినవాళ్ళకి వాయిదాలు వెయ్యటం, అదేపనిగా వాయిదాలు అడిగినవాళ్ళని మందలించటం జరుగుతుంది.
హనుమంతరావు పేరు, డాక్టర్ అశోక్ పేరు, ఉపేంద్ర పేరు పిలిచారు.
లాయరు ప్రదీప్ లేచి నిలబడి రెడీ చెప్పాడు. ప్రతాపరావు కూడా లేచి నిలబడి తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు.
కాల్ వర్క్ పూర్తయ్యాక రెండు చిన్నకేసులయినాక వాళ్ళకేసు విచారణ మొదలయింది.
హనుమంతరావును బోనులో ఎక్కించాక బిళ్ళబంట్రోతు ప్రమాణ స్వీకారం చేయించాడు.
"దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. అబద్దం చెప్పను."
"మీ పేరు?"
"ఆర్. హనుమంతరావు."
ప్రదీప్ చీఫ్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టాడు.
"చూడండి. మీరేం చేస్తుంటారు?"
"ఒక ప్రైవేట్ ఫార్మస్యూటికల్ కంపెనీలో ఎకౌంటెంట్ గా పనిచేస్తున్నాను."
"మీకెంతమంది పిల్లలు?"
"ముగ్గురు."
"వాళ్ళ పేర్లు చెబుతారా?"
"సునీత, అరుణ, రాధ."
"మీ భార్య జీవించి వున్నారా?"
"లేరు."
"ఎప్పుడు పోయారు?"
"రాధను కన్నప్పుడు."
"ఇంటిలోనా? హాస్పిటల్ లోనా?"
"హాస్పిటలోనే."
"ఎందుకని? కాన్పు కష్టమయిందా?"
"మొదట్లో ఈమీ చెప్పలేదు. అడిగితే అంతా బాగానే వుందన్నారు. కన్నాక చచ్చిపోయిందన్నారు."
"మొదట్లో సీరియస్ అని చెప్పలేదా?"
"చెప్పలేదు."
"పోనీ సీరియస్ గా వున్నట్లు మీకు అనిపించిందా?"
"లేదు."
"మరి సీరియస్ గా లేక, డాక్టర్లు బాగానే వుందనిచెప్పి ఎందుకు మరణించి వుంటుందంటారు?"
"డాక్టర్లు సరిగ్గా చూడకపోవటంవల్ల."
"ఆ విషయం రూడిగా చెప్పగలరా?"
"ఆఁ చెప్పగలను."
"డాక్టర్లు జాగ్రత్తగా చూసివుంటే ఆమె జీవించి వుండటానికి అవకాశం వుండేదా?"
"ఉండేది."
"కాబట్టి ఆమె మరణానికి కారణం డాక్టర్ల అజాగ్రత్తేనని చెప్పవచ్చా?"
"అవును."
"మీ అమ్మాయి రాధ కెన్నేళ్ళుంటాయి?"
"ఎనిమిది యేళ్ళుంటాయి."
"ఏం చదువుతుంది?"
"ఇప్పుడు చదవటంలేదు."
"ఆపరేషన్ కు పూర్వం ఏం చదువుతూ వుండేది?"
"కాన్వెంట్ లో ఫోర్త్ స్టాండర్డ్ చదివేది."
"ఆ అమ్మాయికి చదువుమీద బాగా ఆసక్తివుందా?"
"చాలా! స్కూల్లో చేరినప్పట్నుంచీ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తూ వుండేది."
"రాధకు ఆటల్లో ప్రవేశంవుందా?"
"గేమ్స్ లో చాలాసార్లు ఫస్ట్ ప్రైజ్ లు తెచ్చుకునేది."