ఈమారు చురుక్కుమందేమో.... "పొడుపు కథలు తెలీదుగాని__" గొణుగుతూ అణువంత రోషాన్ని ప్రకటించేశాడు.
అప్పుడు దగ్గరకు తీసుకుంది శంకూని. చేతులతో జుట్టు సవరిస్తూ తలని గుండెలకు హత్తుకుంది.
నూరేళ్ళపాటు అ పసికందులో అలాంటి చైతన్యాన్నే చూడాలను కుందో, యిందాకటి నవ్వులు శంకూ అనుక్షణం రువ్వుతుంటే అందులో రత్నాలనే ఏరుకోవాలనుకుందో గొంతు తడబడుతుండగా అంది నెమ్మదిగా. "ఎంత మార్పురా చిన్నితండ్రీ....పెదవి విప్పడం రానివాడివి. ఇన్ని పలుకులేలా నేర్చావురా?"
బామ్మ మెచ్చుకోలుతో కోపం చల్లారింది.
వెను వెంటనే, తన మనసుగూటిలో దాగున్న సావేరి ముసి ముసిగా నవ్వుతున్నట్టు అనిపించింది.
సిగ్గేమో-మంచుపొరలా వున్న మగత విసుగెత్తి ఆరిపోయింది.
అది లాలిత్యమో మరి.....కదిలే గాలి సావేరి చిరునవ్వులను గంధమై ఒడలను తాకింది.
ఆ ఊహే ఒక విరి నిర్మల మందాకిని ఎదలోయల నుంచి జారే ఊపిరి సరిగంలా కదిలే సిరి...సావేరి.
అలా ఎంతసేపు గడిచిందో తెలీదు అక్కడ పేరుకున్న నిశ్శబ్దం హఠాత్తుగా చెదిరిపోయింది. అదికాదు.... ఓ ఆక్రందనలా చెబుతున్నారెవరో.
"లక్ష్మమ్మా! నీ కొంపకూలింది తల్లీ! మీ అరటితోటని ఎవరో నాశనం చేశారు."
తూలిపడబోయిన ఆ వృద్దురాలు శక్తిని కూడగట్టుకుంటూ వేగంగా నడిచింది.
* * * * *
ఆ చీకటిలో....
కూలిన అరటిచెట్లు నేలరాలిన ఆశల్లా వున్నాయి. నెలల తరబడి కృషితో పెంచుకున్న అదరపు అక్కడలా కనిపించడంతో తనే మొదలు నరికిన తరువు కాబోయిన లక్ష్మమ్మ అవాక్కయి తోట అంచున అరక్షణం నిలబడింది.
రేపు ఎలా అన్న ఆలోచనే మెదిలిందేమో కూడదనుకుంటున్నా కళ్ళలోనుంచి నీళ్ళు రాలుతున్నాయి.
ఇన్నాళ్ళూ ఈ మాత్రమైనా ఆసరా వున్నందుకు నిబ్బరంగా బ్రతికిన ఆమె ఇప్పుడు ఒక్కరాత్రిలో జవసత్వాలు పూర్తిగా ఉడిగినట్టు తూలుకుంటూ తోటలోకి నడిచింది.
మరో రెండు నెలల్లో చేతికందవచ్చిన ఫలసాయం పురిటిలోనే ప్రాణాలు కోల్పోయింది.
చుట్టూ చేరిన జనం వ్యాఖ్యానాలు వినిపించడం లేదామెకి. శంకూ భవితవ్యం కనిపిస్తూందక్కడ బూడిదయిన చితుల మధ్య మునుపటి శవాల రూపాలు వెదుక్కుంటున్న కాటికాపరిలా ఎంతసేపు నిలబడిందో, ఎంతదాకా నడిచిందో లక్ష్మమ్మకి గుర్తులేదు.
చాలా సేపటినుంచి నిభాయించుకున్న ఆమె గుండెవాగుకి గండిపడింది.
"బామ్మా...." బావురుమనబోతున్న ఆమెకు ఆసరా యిచ్చాడు శంకూ.
'ప్రేమ'ను హర్షించని 'పగ' పడగ విప్పినప్పుడు చిగురులైతే చేనులాంటి ఆ ప్రేమ వెన్నుని ఇలాగే విరిచేస్తారని తెలీని శంకూ....
ప్రేమను ఆమోదించని కర్కశత్వం నెత్తిపై నిఘా కత్తిలా చాటుగా దాక్కుంటే చీకటిలో ప్రేమికుల తలలు యిలా నేలరాలడమే చరిత్రని తెలీని శంకూ....
రాలిన తోటకన్నా కూలిపోయే వటవృక్షంలా కుమిలిపోతున్న బామ్మ కోసమే ఎక్కువ కలవరపడుతున్నాడు.
"నాన్నా....శంకూ..." లక్ష్మమ్మ గొంతు రుద్దమైపోతూంది. "అయిపోయిందిరా.....పడ్డ శ్రమంతా వృధా అయిపోయింది. బ్రతుక్కేదిరా దారీ అని దేవుడికి మొరపెట్టుకుంటే ఓ దాత ఔదార్యం చూపించాడయ్యా ఇప్పుడు చేతికొచ్చిన పంట నోటికి రాకుండా చేజారిపోయిందే ఎవరి చెప్పుకోను ఒరేయ్ ఏం పాపం చేశాంరా? కడుపుమీద కొట్టేటంత తప్పు మనమేం చేశాం? ఏ దేవుడి శాపమయ్యా....ఎందుకీ శిక్ష విధించారు?"
నిశ్శబ్దంగా రోదిస్తూంది లక్ష్మమ్మ.
"బామ్మా...."
ఈసారి అలా అన్నది శంకూ కాదు....సురేంద్ర.
శంకూలా నిస్త్రాణగా నిలబడలేదు. ఆసరా యిస్తూ తోట బయటికి నడిపించాడు.
"బామ్మా" ఓదార్పుగా అన్నాడు సురేంద్ర. "కూడనిది జరిగితే మాత్రం ఇంతలా కుమిలిపోవాలా" అతడి తండ్రి బంగార్రాజు దయతలచి ఇచ్చిన చేలే అది. అయినా తండ్రిలోని సంస్కారమే తప్ప సురేంద్ర గొంతులో భేషజంలేదు. నీకు శంకూ ఒక్కడే కాదు బామ్మా! నేనూ మనవడ్నే. మేముండగా శంకూకి, నీకూ ఇబ్బందేంలేదు. ఉన్నదే కలసి పంచుకుందాం..."
ధైర్యం చెబుతూ తీసుకుపోతున్నడుగానీ సురేంద్ర మనసులో ఒకటే ఆలోచన. ఎవరు చేసుంటారీ పని?
స్వతహాగా నెమ్మదస్తుడయిన ఒక సైనికుడి కొడుకుగా సాహసంలో తనూ ఏం తీసి పోనివాడు.
ఈ అనర్దానికి కారణం ఎవడో తెలుసుకోవడం సమస్య కాదు. ఇరవైనాలుగు గంటలు చాలు.
తొలిసారి సురేంద్ర ప్రత్యర్ధి ఎంత బలవంతుడయినాగానీ పోరాటానికి సిద్దపడాలని నిర్ణయించుకున్నాడు.
శంకూ కోసం చూశాడు.
లేడు సమీపంలో....
* * * * *
"ఆడపిల్లలా ఏడుస్తున్నావా....?" గడ్డివాము దగ్గర తలవంచుకుని కూర్చున్న శంకూని సమీపించింది మంగ.
అప్పటికి పదిహేను నిమిషాల క్రితమే అరటితోట చుట్టూ చేరిన జనం వెళ్ళిపోయారు.
ఇక్కడ జరిగినది మంగకి ముందు తెలీదు. కానీ రాజేందర్ స్వయముగా చెప్పాడు మంగకి. అది చెప్పడమూ కాదు, తన శక్తేమిటో శంకూకి మాత్రమే తెలియాలని సావేరికి చెప్పకూడదని బెదిరిస్తూ చేసిన హెచ్చరిక.
అందుకే సరాసరి ఇటు వచ్చింది.
అది గుండెలార్చే దృశ్యమే.
అయినా రేపటి వూహించలేని విషాదంకన్నా ఈ కొద్దిపాటి నష్టమే నయము అని సరిపెట్టుకుంది.
అసలు ఎలాంటి దృఢనిశ్చయంతో మంగ అతడ్ని చేరుకున్నదీ శంకూకి తెలీదు. "నిన్నే....' గడ్డివాముపై వెనక్కి వాలిపోతూ రెట్టించింది.
తలతిప్పి చూసిన అతను ఎదజారిన ఆమె పైటపై దృష్టి సారించలేక మళ్ళీ తల వంచుకున్నాడు.
"ఏం....చూడాలనిపించడంలేదా?"
"ఏమిటి....?"
"నువ్విప్పుడు చూసింది."
"నేనేం చూశాను?"
"సావేరిలో ఏం చూడాలనుకుంటున్నావో అది."
అక్కడ గాలి స్థంభించినట్టయింది.
మొన్న రాత్రెప్పుడో మనస్సు మార్చుకున్న మంగకి ఇలా మాట్లాడటము జుగుప్సగా వుంది. అయిన అతడి దారి మళ్ళించాలి.
"శంకూ..." చేతుల్తో అతడి తలని తనవేపు తిప్పుకుంది. "నాలో ఏం తక్కువ?" ఆమె గొంతులో తెచ్చిపెట్టుకున్న కాంక్ష అసహ్యంగా వుంది. "ఒక్కసారి నన్ను బట్టల్లేకుండా చూస్తే సావేరికన్నా నేనే గట్టిగా వుంటానని ఒప్పుకుంటావు."
"వద్దు" వణికిపోతున్నాడు "నువ్వు మంచిదానివి మంగా. అలా మాట్లాడకు."
"మరో మగాడితో కలిసేవాళ్ళంతా చెడ్డవాళ్ళా...."
"అహ....అదికాదు" తొట్రుపడ్డాడు.