Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 3

           
                                               కదలే నీడలు

    "చీకటి" అన్నాడతను.

    "అవును" అంది ఆమె.

    ఇద్దరూ రోడ్డు మలుపు తిరిగారు. ఇప్పుడు వచ్చిన రోడ్డు మరీ పెద్దదిగా ఉంది. ఇరువైపులా ఉన్న మేడల వరుసలు ఆ నిశ్శబ్దంలో చీకటిలో ఆలోచనలులేని స్తబ్దమనస్సుల్లా ఉన్నాయి. మధ్యమధ్య వలంయగా నీడలు కల్పిస్తూ, బ్లాకౌట్ చేయబడిన విద్యుద్దీపాలు నగరపు మెల్లకన్నులులా ఉన్నాయి. అక్కడక్కడ షెల్టర్లూ, సగం సగం తియ్యబడిన గోతులూ, కంకర గుట్టలూ ఉన్నాయి. ఏదో ప్రమాదాన్ని పసికట్టినట్లు గాలి స్తంభించి పోయింది.

    "ఇలా ఎక్కడికి?" అంది ఆమె. తల పైకి ఎత్తినపుడు చెవిలోలకు మెరిసింది.

    "ఎక్కడికేఁవిటీ" అన్నాడతను. అతను తన చేతిని జేబులోనికి పోనిచ్చి తిరిగి తీసివేశాడు.

    "ఒక్కొక్కసారి చీకటి కూడా బావుంటుంది" అన్నాడు.

    "అవును" అందామె.

    "చీకట్లో ఏమీ కనపడవు" అతనన్నాడు ఏదో తృప్తిగా.

    "ఊహూ- మరీ స్పష్టంగా కనపడతాయి. భయపెడతాయి" అందామె ఆలోచనగా.

    "ఏమిటీ?"

    "మన ఊహలు....మన బాధలు....."

    అతను దగ్గాడు ఈ మాటలు ఇష్టంలేదన్నట్టు. చటుక్కున ప్రసంగం మార్చాడు.

    "కలకత్తా చాలా పెద్దపట్టణం" అన్నాడు. జేబులోకి చేతిని పోనిచ్చి తీసివేశాడు. ఆమె ఏం మాట్లాడలేదు.

    "మీరు చదువుకున్నారా! అంటే కాలేజీలో"

    "ఆఁ!"

    "మీ ఆయన ఏం చదివాడు."

    "నాలాగే బి.ఏ"

    "మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళిపోయాడు?" అతను మరొకవైపు చూస్తూ అడిగాడు.

    "లేకపోతే ఏం చెయ్యమంటారు!"

    "మీకు బాధగా లేదూ?"

    ఆమె నీరసంగా నవ్వి "ఎందుకుండాలీ?" అంది.

    "అంతే అంతే" అన్నాడతను. దేనికోసమో జేబులో చెయ్యిపెట్టి తీసివేశాడు.

    "ఈ రోడ్డు చాలా పొడుగు" ఏం తోచక అన్నాడతను.

    "అవును"

    పెద్ద లైట్లతో ఒక కారు వచ్చి వాళ్ళని దూసుకుపోయింది.

    ఆమె తప్పుకుంటూ అతనికి తగిలింది. మళ్ళీ చటుక్కున దూరంగా తప్పుకుంది.

    "పొగరు" అంది ఆమె.

    "లారీ మిలిటరీవాళ్ళది."

    "యుద్దం వస్తుందా?"

    అతను నవ్వాడు "రావడమేఁవిటి? ప్రచండంగా జరుగుతూంటే"

    "కాదు. మన దేశానికి కూడ?" అంది. ఆమె.

    "ఏమో"

    ఒక మిణుగురు ఆమె ముంగురులకి తగిలి వెళ్ళిపోయింది.

    రైలుగేటు దగ్గర ఎవరూ లేరు. రెండు కుక్కలుమాత్రం పట్టాకి కాస్త దూరంగా పడుకున్నాయి.

    "మీరేం ఆలోచిస్తున్నారు?" అని అడిగాడతను -గేటుదాటి కొంచెం దూరం వెళ్ళాక.

    "ఏమీలేదు?" స్వప్నంలోంచి మాట్లాడుతున్నట్లుంది ఆమె.

    "ఏం లేదూ!"

    "ఏమీలేదు" -స్పుటంగా కోపంగా అంది ఆమె.

 Previous Page Next Page