ఒక మొండిచెయ్యి మూలుగుతూ గంతులు వేస్తూ పక్కనున్న మొండెంవద్దకు వెళ్ళింది.
"హలో బ్రదర్ నీ దగ్గర ఏంటీసెప్టిక్ ఏదేనా వుందా"
"ఏం"
"నా వొళ్ళింకా రక్తం కారుతోంది. నాకు భయంగా వుంది. నేను చచ్చిపోతానంటావా! అబ్బా" అని మొండిచెయ్యి భయంకరంగా ఏడ్చింది.
మొండెం విషాదంగా, వెకిలిగా సకిలించింది. "ఫూల్ నువ్వు యిదివరకే చచ్చిపోయావు. నువ్వు ఒక శరీర భాగానివి. నువ్వు యిప్పుడు మొండిచెయ్యివి"
నిజం మొండిచెయ్యికి యుద్దం అంతా తిరిగి కళ్ళకి గోచరించింది. దడదడలాడింది."పోనీ నా కుటుంబానికి ఏదేనా ప్రభుత్వం సహాయం చేస్తుందా? నా మేరీ! నా ప్రియమైన తియ్యని మేరీ! అరే బ్రదర్ ప్రభుత్వానికి అప్లికేషన్ రాసిపారేస్తా"
"చచ్చినవాళ్ళకి ప్రభుత్వం ఏ సహాయం చేస్తుంది. నువ్వు మతి స్థిరంలేని వాడవులా కనబడుతున్నావు" అంది మొండెం.
ఇంతలోకి ఒక తలకాయ కుంటుకుంటూ అక్కడికి వచ్చి ఇలా అంది. "చచ్చినవాళ్ళకి అంటే మనకి, ఒక పెద్ద స్మారకచిహ్నం కట్టిస్తారు. ఇంకేం చేస్తారు?"
మొండెం వెనక్కి తిరిగి చూసి రోషంతో ఇలా అంది. "ఎవరు నువ్వు...... 'థింకర్'వి (Thinker) అయితే చెప్పు! నేనెవణ్ణి. నేనెందుకు ఈ యెడారికి వచ్చాను. ఎందుకు చచ్చిపోయాను. ఏమిటి ఫలితం? (గట్టిగా అరుస్తూ) చెప్పూ థింకరూ! నా బత్తాయితోట ఏమయిపోయింది. నా కొడుకు పరీక్షలో ప్యాసయాడా. నా భార్యకి ఎన్నవనెల గర్భం. నేను ప్రేమించి ఉంచుకొన్న మార్గరెట్ కి తిండి ఉందో లేదో! ఇవన్నీ ఎవరూ చూస్తారు? ఎవరు చూస్తారు? ఎందుకు యుద్దం? చెప్పు" మొండెం కోపంతో వణికిపోయింది.
థింకర్ తల గోక్కున్నాడు. "చచ్చిపోయినప్పట్నించీ ఇదే ఆలోచిస్తున్నాను. ఎందుకీ యుద్దం అని! నాకేం అర్ధమవడం లేదు."
ఒక శరీరంలో పైభాగం అక్కడికి దొర్లుకుంటూవచ్చి వొళ్ళు దులుపుకు కూర్చుంది. రెండు గ్లాసు ట్యూబులను జేబులోంచి తీసింది. "గుడీవినింగ్. నాకు కొంత పోటాషియం...... కావాలి ఇక్కడెక్కడా మందులకొట్లు లేవు. వఠ్ఠి యెడారి."
"నీకు మందులు ఎందుకు?"
"నేను ఓ పెద్ద నవ వినాశన కారకమైన యంత్రాన్ని కనిపెట్టుతానని నా ప్రభుత్వానికి మాట యిచ్చాను. చాలామటుకు అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పొటాషియమ్, రేడియమ్, ఒక మైక్రోస్కోపు...... ఇటువంటివే కావాలి."
మొండిచెయ్యి భయంతో అరచింది. "ఇతను పిచ్చాడు,. పిచ్చాళ్ళంటే నాకు భయం"
శరీరం పైభాగం కళ్ళజోడు తీసిచూచి "పిరికి వెధవ్వి నువ్వు. నేను ఒక్కణ్ణి ఏకాంతానికి వెళ్ళి నా 'రీసెర్చి' చేసుకుంటాను. కాలం నాకు చాలా ప్రెషస్" అంటూ దొర్లుకుంటూ వెళ్ళిపోయింది.
మొండెం జేబులోంచి కొన్ని ఫోటోలు తీసింది. "ఇది నా తల్లి అది నా భార్య, ఇది నా...." అంటూ బావురుమంది.
మొండిచెయ్యి జాలితో కదలిపోయింది. థింకర్ దగ్గరగా వెళ్ళి మెల్లగా ఇలా అంది. "మనం మళ్ళీ బ్రతకలేమా! ఒకవేళ ఇప్పుడు వెళ్ళిపోయిన సైంటిస్టుమన్ని బ్రతికిస్తాడేమో..... మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మా ఆవిడ చేస్తుంది రొట్టె- బలే బలే రుచి... నోరూరిపోయింది."
మొండెం విసుగుతో, "ఏడిశావ్ వెధవాయి. నీకు నోరులేందే ఎలా ఊరుతుంది. నువ్వు వట్టి మొండిచెయ్యివి" అంది.
ఒక గుండెకాయ పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చి థింకర్ ని కౌగలించుకుంది. దాని కిరుప్రక్కలా స్టెతస్కోపు వేలాడుతూ ఉంది.
"నేను డాక్టర్ని యుద్దంలో చచ్చిపోయాను. చూడు మిష్టర్ ! నా గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తోంది. ఈ స్తెతస్కోపుతో ఒక్కసారి చూడు..... కొట్టుకుంటోందా?"
థింకర్ నవ్వాడు. మొండెం థింకర్ తో ఇలా అంది. "నీకు కాలక్షేపం ఎలా అవుతోంది."
థింకర్ వెళ్ళిపోతూ ఇలా జవాబిచ్చాడు. "చచ్చినవాళ్ళ జేబుల్లోంచి సెకండ్ హాండ్ పుస్తకాలు తీసుకుని ఓ మూలగా కూర్చుని చదువుకుంటాను."
మొండిచెయ్యి ఏడుస్తోంది. "ఓ నా భార్యా, నా తల్లీ.." రెండు నక్షత్రాలు కిందికి పారాచ్యూట్లలో దిగాయి. ఒక నక్షత్రం అంది ఇలాగ. "ఇదంతా ఏమిటి? ఈ పగిలిన సామాన్లూ, తలలూ చిందిన రక్తమూ? వీళ్ళందరూ ఎవరూ?" మగ నక్షత్రం మెల్లిగా చెవిలో ఇలా చెప్పింది. "వీళ్ళనే మనుషులంటారు."
ఆడనక్షత్రం నవ్వింది కాబోలు., చటుక్కుని మెరిసింది. "ఇవన్నీ ఏరుకుని ఇంటికి తీసుకుపోదాం. చాలా సరదాగా ఉంటుందది."
రెండు నక్షత్రాలు ఆకాశంమీదికి నిచ్చెన ఎక్కినట్లుగా ఎక్కి, సూర్యుడికి చంద్రుడికి మధ్య ఎక్కడో ఒకచోట నుల్చునిపోయాయి. ఈ విచిత్రం చూస్తోన్న మొండిచెయ్యి అంతవరకూ ఏడుపు మానివేసి, తిరిగి మొదలుపెట్టింది.
ఆ ఏడుపు నిర్జనమైన ఆ ఎడారిలో యుగ యుగాల వ్యర్ధ ప్రయత్నంలా, యుగయుగాల దిగులులా, చావులా, అర్ధంలేని జవాబులేని ప్రశ్నలా ఇసుకనీ, చెట్లమోడులనీ ఒరుసుకుంటూ అలాగే పోయింది.