వెనుకనుంచి ఆమె జడ పుచ్చుకొని ఎవరో లాగినట్లయింది. భుజం మీద ఇంకొకరి చెయ్యి పడింది. శరీరమంతా గజగజమని వణికిపోయింది. వంట్లోని శక్తినంతా కూడగట్టుకుని గబ గబ నడవడానికి ప్రయత్నించింది.
వెనుకనుంచి నవ్వులు ఒక చెయ్యి ఆమె వీపుమీద గ్రుచ్చినట్లుగా చేస్తోంది. మరో చెయ్యి ఆమె భుజం నిమురుతోంది. ఇంకో చెయ్యి ఆమె బుగ్గలు నిమురుతోంది.
ప్రజ్ఞకు ఏడుపొస్తోంది. వీళ్ళంతా కలసి తనను ...
'పది చేతులు తనని ఆక్రమిస్తోన్నట్టూ, నిర్దాక్షిణ్యంగా చుట్టుకుంటున్నట్టూ ...' ఆలోచనలు.
కెవ్వున అరవబోయింది.
ఇంతలో ఎదురుగా ఓ లైటు కళ్ళలోకి పడినట్టయింది. బహుశా ఓ స్కూటర్ తాలూకూ లైటు.
కొద్దిగా సంకోచించినట్లు ఆమె మీద ఆటలాడబోయిన చేతులు వెనక్కి జరిగాయి. ఆ కాస్త అవకాశాన్నీ ఉపయోగించుకుని ప్రజ్ఞ ముందుకు సాగిపోయింది ఇంచుమించు పరిగెత్తినట్టు.
మెయిన్ రోడ్డుమీదకు వచ్చేసరికి, జనసందోహం, పరుగులుతీసే వాహనాలు, కొద్దిదూరంలో నడిచివస్తోన్న పోలీస్ కానిస్టేబుల్, ఆ నలుగురు యువకులూ వెనక్కి తగ్గక తప్పలేదు.
పది నిమిషాలు గడిచాక ప్రజ్ఞ చిన్న డాబా ఇంటి ముందు నిలబడింది.
ఆ ఇంటి తలుపులు మూసి వున్నాయి.
ఎలా పిలవాలో తెలీక ఓ క్షణం సంకోచించి అటూ ఇటూ చూసి మెల్లిగా తలుపు తట్టింది.
జవాబు లేదు.
కొంచెంసేపు ఎదురుచూసి మళ్ళీ తలుపు తట్టింది.
తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మంలో ఓ యువకుడు నిలబడి వున్నాడు. లుంగీ, లాల్చీతో వున్నాడు. నోట్లోంచి చౌకబారు బ్రాందీ వాసన.
"ప్రజ్ఞా ! నువ్వా ?"
"అక్కయ్య ..."
లోపల్నుంచి ఓ యువతి నడిచివచ్చింది. సగం వూడివున్న చీరెకుచ్చిళ్ళు, పూర్తిగా విడిపోయివున్న జాకెట్ హుక్స్ కళ్ళలో ...మద్యం...అనుభవం కలబోసి కలిగించిన మత్తు.
ఆమెను చూసి ప్రజ్ఞ చెప్పదలచుకున్నది మరిచిపోయినట్లు ఆగిపోయింది.
"ఏమిటి చెప్పు" అన్నాడతను విసుగ్గా.
"అక్కయ్యకు...పెయిన్స్ వస్తున్నాయి."
"అయితే ఏం చెయ్యమంటావు?"
"దగ్గర ఎవరూ లేరు"
"నువ్వు వున్నావుగా"
"నాకేం తెలీదు. చాలా భయంగా వుంది."
అతను నవ్వాడు. ప్రపంచంలో వున్న క్రూరత్వం, వికటత్వం, వక్రత్వం అంతా ఆ నవ్వులో వుంది.
"ఇప్పట్నుంచే అలవాటుచేసుకో, భయంపోతుంది"
ప్రజ్ఞ 'ఛీ' అనుకుంది. అయినా మనసులోని భావాలనీ లోలోపలే దాచుకుని "బావా! ప్లీజ్ ! తొందరగారా, అక్కయ్య చాలా ప్రమాదంలో వుంది" అంది దీనంగా,
"మీ అక్కయ్యకు ఏడో నెల వచ్చాక _ నేనూ చాలా ప్రమాదంలో వుంటే నువ్వాదుకున్నావా ? లేకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా...
ప్రజ్ఞకు ఇంకోసారి 'ఛీ' అనిపించింది.
"బావా...!"
"సారీ ప్రజ్ఞా ! నేను చాలా బిజీగా వున్నాను. ఆ దగ్గర్లో ఎవరో మంత్రసాని వున్నట్టుంది. సాయం తీసుకో."
తలుపులు భడాల్న మూసుకున్నాయి.
ఒక్క నిమిషం ఆమె అచేతనంగా నిలబడిపోయింది. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
మనసు రాయి చేసుకుని, తర్వాత వెనక్కి తిరిగింది.
* * *
జీవితంలో నిస్సహాయస్థితి అనేది ఒకటుంది. ప్రతి మనిషినీ ఏదో సమయంలో అది ఆవహిస్తూ వుంటుంది.
రెండు గంటల దాటాక అరవై ఏళ్ళదయిన ఓ వృద్ధ మంత్రసాని సాయంతో, కేవలం ఓ రక్తబిందువును చూడడానికి గజ గజ లాడిపోయే ప్రజ్ఞ, చూడరాని భయానక దృశ్యాలన్నీ చూస్తూ, దీనాతి దీనంగా మూలుగుతున్న అరుంధతికి అండగా నిలబడి, అన్ని దశల్లోనూ చొరవతీసుకుంటూ...