Previous Page Next Page 
భారతి పేజి 2

    "అదంతా నాకు తెలీదు. నేను రాను  నా ఇష్టమంతే. ఆ మాట కొస్తే నా ఒంట్లోనూ స్వస్థతగా లేదు."

    భారతి  ఫక్కున నవ్వింది__"ఇది మరీ బాగుంది" అంటూ.

    కోపతాపాల గుప్తమయిన  మాలిన్యపు గాలి తెరలు  స్వచ్చమైన ఈ నవ్వుతో దూరంగా  తొలగిపోయి నట్లయింది. 'హమ్మయ్య' అని మల్లిక  మనసులో అనుకుంటూ. ఆ నవ్వువలన  ఏర్పడిన శుభ్రమైన గాలి గుండెలనిండా  పీల్చుకుంది  భారతి  అలా నవ్వితే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ నవ్వును  దర్శించటానికి  భారతి పలుచని  పెదవుల మధ్య అప్పుడు వెలువడే  ధ్వనిని  ఆలకించటానికి, యుగయుగాలు ఆమె నేస్తురాలిగా  జన్మించటానికి  సిద్ధపడుతుంది.

    పట్టుమని  పది  అడుగులయినా  వేశారో లేదో, దుమ్మును లేపుకుంటూ  ఒక కారు వచ్చి వారి ప్రక్కగా హఠాత్తుగా  ఆగింది  అవకతవకగా.

    ముఖం  మీదుగా  చెయ్యి విదిలించి, దుమ్ము దులుపుకుంటూ  స్నేహితురాళ్ళిద్దరూ  ఆ కారు డ్రైవ్ చేస్తూన్న వ్యక్తివంక కోపంగా తిలకించారు.

    అప్పటికే  తలుపు తెరుచుకుని, బయటకు దిగిన  ఓ యువకుడు వారిద్దరివంకా  క్షమాభిక్ష  నర్ధిస్తున్నట్లుగా  చూస్తూ "క్షమించండి మీకు  బాధ కలిగించాననుకుంటాను" అన్నాడు ఎంతో నమ్రతగా.

    "తప్పులు  చెయ్యటమూ  క్షమించమనటమూ ఈ కాలంలో పరిపాటి  అయిపోయింది. చూడండి, మీరు రేపిన దుమ్మువల్ల  నిక్షేపం లాంటి మా నీళ్ళు  కాస్తా ఎలా తగలడిపోయాయో. అయినా ఊళ్లోకి రహదారి శుభ్రంగా వుండగా, తగుదునమ్మా అని ఈ చెరువుకట్ట ప్రక్కనుంచీ  రావలసిన  అవసరమేమొచ్చె? అందులోనూ అదేం డ్రైవింగ్? ఎక్కడ మామీద పడతారోనని  హడిలిచచ్చాం కదా!" అంది దూకుడుగా మల్లిక.

    "మీరన్నది నిజమే. నాకు డ్రైవింగ్ సరిగా  చేతకాదు. కావాలంటే  ఆ మాట డ్రైవరు రాజయ్య నడిగి తెలుసుకోండి" అన్నాడా  యువకుడు  సిగ్గుపడుతూ.

    అప్పుడు చూశారు యువతులిద్దరూ  కారు ముందుసీట్లో  మరో వ్యక్తి కూడా  భయపడుతూ  కూర్చున్న సంగతి. పరిస్థితి  గమనించి పాపం ఆ డ్రైవరు ముఖం పక్కకి  తిప్పుకుని తల  గోక్కుంటున్నాడు.

    మల్లిక  నవ్వాపుకుంటూ  "డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా మహానుభావా? అయితే ఎల్ బోర్డేది? బోర్డూ గీర్డూ తగిలించకుండా  ఊరివారి మీద దండయాత్ర చేద్దామనుకుంటున్నారా?" అంది వదిలిపెట్టకుండా.

    ఆ యువకుడు  బిక్కుబిక్కుమంటూ  ఆమెవైపు చూసి  "చూడండి మిస్...." అంటూ  తడుముకుంటూంటే  'మల్లిక' అని పూర్తిచేసింది. వచ్చే నవ్వును  ఆపుకుని  సీరియస్ గా వుండటానికి  ప్రయత్నిస్తూ.

    "చూడండి మల్లికగారూ! జరిగిందానికి  నేను చాలా  విచారిస్తున్నాను. డ్రైవింగ్ నేర్చుకుంటూ  నలభైమైళ్ళ  దూరంలో వున్న మా వూరి నుండి  వస్తూ ఈ ఊరి వైపు దారి ఫ్రీగా  వుందని  యిటు  తిప్పాను. ఇంతలో  మా డ్రైవరు నీళ్ళు మారుద్దామని  సూచించగా  చెరువుందని ఇటువైపు  మళ్ళాను" అన్నాడతను సంజాయిషీ ఇస్తున్నట్లుగా.

    "ఇదన్నమాట సంగతి" అంది మల్లిక.

    "అవునండి"

    "మంచిపని చేశారు. మరి మా నీళ్ళన్నీ  పాడైపోయాయి. ఇప్పుడెలాగ?"

    ఆ యువకుడు  ఒక నిమిష మాలోచించి  "ఆ బిందెల్లో నీళ్ళు వంపేసి  యిలా ఇవ్వండి. నేను వెళ్ళి తీసుకువస్తాను" అంటూ ఆ పని చేయటానికి సిద్ధపడినట్లుగా  ఒక అడుగు ముందుకు వేశాడు.

    ఇదే  అదనుకుని  మల్లిక  నిజంగానే  నీళ్ళు  క్రింద  ఒలకబోయటానికి  ఆయత్తపడింది.

    భారతి  ఇందాకటినుంచి   నోటమాట  లేకుండా  కళ్ళప్పగించి  చూస్తూంది. ఇప్పుడు  జరగబోయేది స్పురించి  ఒక్కసారిగా  తెలివిలోకి  వచ్చి స్నేహితురాల్ని  రెక్క పుచ్చుకుని ఆపి  "ఛీ మల్లికా! నీకేమైనా మతిపోయిందా! అసలిప్పుడేమంత  విశేషం  జరిగిందని  పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. మనం వెళ్ళి మళ్ళీ  నీళ్ళు  తెచ్చుకుంటే సరిపోయె. ఒక కొత్తాయన్ని  ఇలా  వేళాకోళం  పట్టించటం  తప్పుకాదూ?" అని మందలించింది.

    అప్పుడు చూశాడా  యువకుడు  భారతివంక. సృష్టిని నిర్వచనం తెలిసినట్లు  ఇన్నాళ్ళూ  అజ్ఞాతంగా  తను వెతుక్కుంటూన్న  అందం ఆమె రూపంలో  ఎదుట  సాక్షాత్కరించినట్లూ  అనుభూతి చెంది  విస్మయంగా  నిలబడిపోయాడు  కన్ను తిప్పుకోలేదు.

    "మహా అక్కడికి  నువ్వు మంచిదానివయినట్లున్నూ. నేను చేద్దదాన్నీనూ. ఏం?" అంటూంది  మల్లిక.

    భారతి కామె మాటలు సరిగ్గా  వినిపించలేదు. శరపరంపరలుగా మీదపడి  గుచ్చివేస్తున్న  అతని  చూపుల ధాటికి  తట్టుకోలేక కళ్ళు క్రిందికి దించుకుని  నిలబడిపోయింది.

    మల్లిక ఆమెవైపు  విడ్డూరంగా చూసి  "పోదాం రమ్మని  మందకొడిగా  నిలబడిపోయా వదేం  చిత్రం? రా మరి, త్వరగా పోదాం" అంటూ చెయ్యి పుచ్చుకు లాగింది. మంత్రముగ్ధలాగా  భారతి  మౌనంగా ఆమె ననుసరించింది.

    బిందెల్లో నీళ్ళు ఒలకబోసి, మళ్ళీ నింపుకుని, వెనక్కు మరలి, ఏమీ జరగనట్లు, తనవంక  చూడనైనా  చూడకుండా  తమదారిని వెళ్ళిపోతున్న  యువతులిద్దరికేసి  బొమ్మలా  చూస్తూ నిలబడ్డాడతను. వారు తనను దాటి నాలుగయిదు అడుగులు  వేసేసరికి  కొరడాతో  ఛళ్ళుమని  చరిచినట్లయి, హటాత్తుగా  తెలివి తెచ్చుకుని, ఎవ్వరూ వూహించని విధంగా  ఓ సాహసవాక్యం పలికాడు.

    "చూడండి, ఇంతకీ  మీరెవరో  తెలుసుకోనే లేదు."

    యుక్తవయస్సులో వున్న ఆ బాలికలిద్దరూ  అదిరిపడినట్లయినారు. మల్లిక వెనుదిరిగి  చుర్రుమని చూస్తూ  "ఈ చుట్టుప్రక్కల మరెవరూ లేకపోబట్టి  ఈ పల్లెటూళ్లో  మీరడిగిన  ప్రశ్నకు  ఈవేళ  మీ అదృష్టం బాగుంది....ఏం  పెళ్ళి సంబంధం  కుదురుస్తారా? మేమూ వేయికళ్ళు  తెరుచ్కుని  ఎదురు చూస్తున్నాం. అయితే వినండి మంచి పిల్ల  అని అప్పుడే మీ మనస్సులో  ఒక ముద్రవేసిన  ఈవిడగారు కుమారి  భారతీదేవిగారు. ఈ ఊరి కరణంగారమ్మాయి. నేను మునసబు గారమ్మాయిని. ఈ తబ్బీళ్ళు  చాలనుకుంటాను. పదవే భారతీ! ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఇహ  పోదాం" అంటూ ప్రతిమలా నిలబడిన  స్నేహితురాలి భుజంమీద  చేత్తో  పొడిచి, ముందుకు కదిలింది.

    మల్లెపొదలా  మల్లికా, సన్నజాజి తీగెలా  భారతి  ఆ సూర్యాస్తమయంలో  చివరికి మిగిలిన కాంతులో  కదిలి వెళ్ళిపోతూంటే  వచ్చిన పని మరిచి ఆ యువకుడలాగే  చాలాసేపు  నిలబడిపోయాడు.

    పక్క సందులోకి మళ్ళుతూ, కావాలని వెనక్కి తిరిగి చూసిన మల్లికకు ఇంకా కారుదగ్గర నిలబడి తమ వంక చూస్తూన్న  యువకుడూ, ఒక రేకు డబ్బా  తీసుకుని  నీటికోసం  చెరువుగట్టు  ఎక్కుతూన్న డ్రైవరూ కనిపించారు.

    "చూడు చూడు. దిష్టిబొమ్మలా  ఎలా చూస్తున్నాడో! దగ్గరగా వున్నప్పుడు  జెర్రిగొడ్డులా  బెదిరిపోయాడు గానీ" అంది మల్లిక.

    కాని భారతి  వెనక్కి తిరిగి చూడలేదు. మలుపు  తిరిగాక మెల్లిగా  "పాపం! అనవసరంగా హడలగొట్టేసేవాయాన్ని. చాలా  పెద్దమనిషిలా  కనిపిస్తున్నాడు" అంది  అతని అమాయకమైన  ముఖాన్నీ, బెదురుచూపుల్నీ  మననం చేసుకుంటూ.

    "పెద్ద మనిషికన్నా  నంగనాచిలా  కనిపిస్తున్నాడు. పోనీ  పిరికి వాడంటాను" అన్నది మల్లిక అతన్ని పూర్తిగా తీసిపారేస్తూ.

    "ఎంతటివారినైనా  తీసిపారేసేగుణం  నీకు పుట్టకతోనే  వచ్చింది. దుడుకు పిల్లా!"

    "అమ్మకచెల్లా! అంటూ  బిందెచుట్టూ చేతిని  మరింత  గట్టిగా  బిగించి, రెండవచేత్తో  బుగ్గ  నొక్కుకుంది. "ఇంతలోనే  వెనకేసుకొస్తున్నావు. ఏం జరిగిందేం?" అంతలోనే  ఏదో తోచి పక్కుమని నవ్వింది__"ఎంత అఘాయిత్యం జరిగిపోయిందో  చూశావా?" అంటూ.

    "ఏమిటంత  నవ్వాపుకోలేని  అఘాయిత్యం?"

    "బిందె నువ్వే ముంచి  తీసుకున్నావు నీళ్ళు."

    క్షణంలో  భారతి ముఖం రక్తంలేనట్లు  తెల్లగా  పాలిపోయింది. "ఎంతపని చేశావు మల్లికా?" అంది పొడిగా.

 Previous Page Next Page