Read more!
 Previous Page Next Page 
నల్లతంబి పేజి 2

తాను డ్యూటీలో వుండగా ఏ. సి. కంపార్టుమెంటులో దొంగ తనమా?
"కమాన్ టెల్ మీ.....టెల్ మీ వాట్ హాపెండ్? చేతికి పెట్టుకున్న రింగ్ మారిపోవడమేమిటి? దాని ఖరీదు ఎంత?"
"నేను ఎంతో పవిత్రంగా- నా ప్రేమ కానుకగా - నా ప్రేయసికి ప్రెజెంట్ చేశాను. పోయిన వస్తువు వెల గురించి అయితే పోతే పోయిందిలే అని వదిలేయవచ్చు. కానీ కొన్ని వస్తువులు విలువ కట్టలేనివి వుంటాయి. అవి దురదృష్టవశాత్తు చేయి జారిపోతే తిరిగి పొందడం కష్టం. ప్రేమ కూడా అటువంటిదే. అది నా ప్రేమకు కానుకగా ఇచ్చిన రింగ్" కడు రమ్యంగా రసాత్మకంగా, భావ స్పోరకంగా, కవితా మాధుర్యం అంతా తన భాషలో రంగరించి, చిలికించి మరీ చెబుతున్నాడు ఆ విదేశీయుడు.
"స్టాఫ్ దట్ నాన్సెన్స్! ఉపోద్ఘాతం ఆపి ఏం జరిగిందో అంతా రెండు ముక్కల్లో చెప్పండి" ఇన్ స్పెక్టర్ విసుగు గమనించిన ఆ యువకుడు మరి మాట్లాడలేనట్టు మౌనం వహించాడు.
"సారీ......అసలు ఏం జరిగిందో చెప్పమన్నానుగానీ, మిమ్మల్ని అసలు మాట్టాడవద్దని అనలేదే" వాళ్ళు హర్టు అయ్యారని అర్ధం చేసుకుని తిరిగి నచ్చచెబుతున్నట్టు అన్నాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
కెనడా యువకుడు ఓసారి స్వేచ్చగా గాలి పీల్చి దాని విలువ ఎంతో చెప్పాడు.
"వ్వాట్! ఎనిమిది లక్షల ఖరీదు చేసే డైమండ్ రింగ్ పోతే పోయిందా..." ఖంగుమని కుర్చీలో నిటారయ్యాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
కొన్ని క్షణాలలో తనని తాను సర్దుకుని వివరాలు తెలుసుకొని కేసు నమోదుచేసి, సిబ్బందిని జట్లు జట్లుగా ఈస్టుబుకింగ్....రెస్ట్ బుకింగ్.....ప్లాట్ ఫారమ్.....అన్నింటినీ కవర్ చేసి క్షణాలమీద అష్టదిగ్బంధంకావించాడు ఇన్ స్పెక్టర్.
ప్రయాణీకులందరినీ చెక్ చేయడం మొదలు పెట్టారు పోలీసులు.
 ప్రయాణీకుల నెవరినీ మరో మార్గం గుండా బయటకు పోనీయకుండా అన్ని దారుల్లోనూ అడ్డుకున్నారు కానిస్టేబుల్స్.
పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఎవరైనా టెర్రరిస్టులు ప్రవేశించారో లేక ఎక్కడైనా బాంబులను పెట్టారో అని హడావిడి పడిపోయారు ప్రయాణీకులు.
ఉన్నట్టుండి ధీరజ్ దృష్టి ఆ కెనడా దంపతులు దిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కంపార్టుమెంటు నిలిచింది.
వాళ్ళు రిజర్వ్ చేసుకున్న బెర్త్ ల కింద చెక్ చేశాడు. ఒక బెర్త్ క్రింద బయటకు కనిపించేలా అట్ట పెట్టె వుంది.
ప్రయాణీకులతోపాటు పోలీసు సిబ్బంది కూడా క్షణం కలవరపాటుకు గురయ్యారు.
"కమాన్, బ్రింగ్ దట్ బాక్స్" ధీరజ్ కమాండ్ చేశాడు.
ఒక కానిస్టేబుల్ ఆ బాక్స్ ను బయటకు తీసి ప్లాట్ ఫారమ్ మీదకు చేర్చాడు. బిక్కుబిక్కు మంటూనే అట్టపెట్టె మూతను తొలగించాడు ఆ కానిస్టేబుల్.
దానిలో నల్లని రంగులో వున్న టేప్ రికార్డ్స్.....
ఆ టేప్ రికార్డులో బాంబ్ వున్నదా?
టేప్ ఆన్ చేసిన మరుక్షణం అది అక్కడా విస్పోటనం కలిగిస్తుందా? -అన్న ఆలోచన ఆ క్షణాన ధీరజ్ రాలేదు. లేకుంటే దర్యాప్తు మరో మలుపు తిరిగేది.
దాన్ని బయటకు తీసి రెండు వైపులా పరిశీలనగా చూశాడు ధీరజ్. లోపల క్యాసెట్ వుండడం గమనించి ప్లే బటన్ నొక్కాడు.
"డార్లింగ్......టాయ్ లెట్ కి వెళ్ళొస్తాను."
"డియర్ బీ కేర్ ఫుల్....ఆ ఉంగరం ఇటు ఇచ్చి వెళ్ళు."
"ఎందుకు?"
"మన రైల్వేస్ కి ఇండియన్ రైల్వేస్ కి చాలా తేడా వుంది. ఇక్కడ విలువైన ఒక వస్తువు పోతే అది తిరిగి దొరకడం కష్టమే. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. మన టాయ్ లెట్స్ లో క్లీనింగ్ కు పేపర్ వున్నట్టు ఇక్కడ అలాంటివి ఏమీ వుండవు. వాటర్ వాష్ లో రింగ్ స్లిప్ అయితే దొరకడం కష్టం."
"అలానే డియర్....ఇదిగో రింగ్"
అంతే....ఆ తరువాత అంతా నిశ్శబ్దం.
"ప్చ్" ధీరజ్ దీర్ఘంగా నిట్టూర్చి తిరిగి అట్ట పెట్టెను మరొకసారి చెక్ చేశాడు. ఒక తెల్లకాగితం మడత పెట్టి వుంది.
"హల్లో యంగ్ కపుల్.......వెల్ కమ్ టు ఇండియా.....జీవితాంతం మీకు గుర్తుండిపోయే విధంగా ఈ చిన్న బహుమతుని ఇస్తున్నాను. ఎంతో ఆప్యాయంగా ఇచ్చిన టేప్ రికార్దరును మీతో తీసుకు వెళ్ళడం మరచిపోవద్దు....బైదిబై...మీరు ప్రేమతో ఇచ్చి పుచ్చుకున్న డైమండ్ రింగ్ ను నేను తీసుకువెళ్తున్నాను. నేను కూడా ఉంగరాన్ని ప్రేమగానే దాచుకుంటాను. గుడ్ బై....."__కమెండో.
లెటరు పూర్తిగా చదివిన ధీరజ్ భ్రుకుటి ముడిపడింది.
ఎవరతను.....?
డైమండ్ రింగ్ ని ఎలా దొగిలించాడు?
మాయ చేశాడా? వాళ్ళను హిప్నటైజ్ చేశాడా? లేక మత్తు మందు ఇచ్చాడా?
ఏమయినా అతనే గెలిచాడు. ఈ దొంగాటలో అతనిదే పైచేయి అయింది.
అప్పటికే కాలాతీతం అయింది.
ఇప్పటివరకు పోలీసు రికార్డులలోకి ఎక్కని అతని పేరు 'కమెండో'.
అతనెవరై వుంటాడబ్బా? అతను ఎవరు? ఎవరు?
తెలియని ఒక కొత్త తరహా నేరం.....అదీ అజ్ఞాత వ్యక్తి చేయడం! అంతా గజిబిజి గందరగోళం...
చిక్కుమడి వీడని పజిల్ లా వున్నఆ కేసును టేకప్ చేసిన....ఇన్ స్పెక్టర్ ధీరజ్ తన దర్యాప్తును ప్రారంభించాడు.
అయితే ఓకే చిన్న పొరపాటు జరగనే జరిగింది.
                                        *    *    *
చలి రాత్రి. మంచు పలచగా పరచుకుని ఆమడ దూరాన ఏమి ఉన్నదీ కనిపించడంలేదు.
అంత చలినీ, తుంపరులుగా రాలుతున్న మంచును లెక్క చేయక, చకచకా నడుస్తున్నాడు అతను.
క్లీన్ షేవ్ చేసిన గడ్డం, పై పెదవిని కప్పేస్తూ వంపు తిరిగిన మీసం, సైడ్ లాక్స్ వెనక్కు దువ్వున పలుచని తలకట్టు.
అతని రూపం ఆధునికంగా లేదు. తమాషాగా మాత్రం వుంది. మంచి శరీర సౌష్టవం. బ్లాక్ సూట్ ఆ ఒంటికి బాగా నప్పింది. హుందాగా వేగంగా నడుస్తున్నాడతను.
అతనొక శక్తి.....అతనిది ఒన్ మాన్ ఫోర్స్....
అతను అప్పటివరకూ రైల్వే ట్రాక్ వెంటే నడుస్తున్నాడు....
తన భుజానికి తగిలించుకున్న ఎయిర్ బ్యాగ్స్ ను, రెండు చేతుల్లోను వున్న రెండు పెద్ద బాక్స్ లను క్రింద పెట్టి, తలకు చుట్టుకున్న మఫ్లర్ ను చెవుల మీదకు లాక్కుంటూ, పట్టాలప్రక్కనే వరుసగా ఎత్తుగా పోసిన గ్రావెల్ గుట్టల మధ్య కూర్చున్నాడు.
చుట్టూ కనిపించిన మేరకు పరిసరాలను చూశాడు. చిన్న చిన్న పిచ్చిమొక్కలతో, తుప్పలతో నిండి వుంది ఆ ప్రదేశం. అంతా నిర్మానుష్యం!
ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో వున్న గూడూరు రైల్వే జంక్షన్ లోని లైట్లు దూరంగా కనిపిస్తున్నాయి.
అప్పుడప్పుడు కీచురాళ్ళ శబ్దం మాత్రం చిన్నగా వినిపిస్తున్నది.
కాలం కరుగుతున్న కొద్దీ అతనిలో అసహనం పెరిగిపోతున్నది.
అలా అరగటం గడిచాక...నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రైలు ఇంజన్ కూత.

 Previous Page Next Page