Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 2


    'ఎవరు తీశారు, ఆ ఫోటో? తనూ, అక్కా తప్పితే ఎవరూ లేరు ఇంట్లో. ఇన్నాళ్ళూ తియ్యనిది ఇప్పుడెందుకు తీస్తుంది అక్క?'        
    ఆందోళనగా "అక్కా" అని పిలవబోయిన కళ్యాణ్ మాటలు గొంతులోనే ఉండిపోయాయి, కిలకిల నవ్వు వినగానే.
    అదే గదిలోనే కళ్యాణ్ మంచంపై పడుకొని ఉన్న విరిబాల లేచికూర్చుంది, ఇంకా చిలిపిగా నవ్వుతూనే.
    చిత్తరువే అయిపోయాడు కళ్యాణ్.
    "ఫోటో వెదుకుతున్నావా? నేనే తీశాను. నా చేతి లోనే ఉంది." నవ్వుతూన్న విరిబాల ముఖం హఠాత్తుగా గాంభీర్యం తాల్చింది. "పువ్వు నేలరాచి తావికోసం దేవుళ్ళాడితే ప్రయోజన మేమిటి, బావా?" కరుణ వ్యథలు సమ్మిళితమై ఉన్నాయి ఆ కంఠంలో.
    "ఎప్పుడు వచ్చావు, రాధా?"
    కళ్యాణ్ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు విరిబాల. "ఎవరి కోసం మనిషిని వదులుకొన్నావో ఆ మనిషిమీద మమత కూడా తెంచుకొంటే మంచిది. దారిలో అడ్డమైన దిక్కుమాలిన దరిద్రుడే నీకు సర్వస్వమై పోయినప్పుడు ఒకపక్క ఇంకా ఈ ఆరాధన లెందుకు?" కళ్ళు రెండూ కోనేరు లయ్యాయి.
    "రాధా! చెయ్యి అడ్డంగా ఊపుతూ బాధగా కళ్ళు మూసుకొన్నాడు కళ్యాణ్. "నా దురదృష్టాన్ని ఏవిధంగా నైనా ఎత్తి చూపుగాని, పరోక్షంగా, ప్రత్యక్షంగా ఏవిధంగాకూడా గోకుల్ పై నిందారోపణ చెయ్యకు. నేనది సహించను. పాపం పుణ్యం తెలియని పసివాడు. అతడిని ఆడిపోసుకుంటావేం?"
    "ఏ జన్మలో చేసిన పాపమో పగబట్టి ఈ రూపంలో అవతరించినట్లుంది. కాకపోతే వీడు కారణంగా మనసిచ్చినవాడికికాక మరొకరికి మనువెందుకు పోతాను?" కుమిలి కుమిలి ఏడ్చింది.
    ఎప్పుడో వచ్చిన కృష్ణప్రియ అనునయంగా విరిబాల భుజం తట్టింది. "ఏడవకు, ఏడవకు. కర్మబద్ధమై సాగిపోయే జీవితాలివి. తెలివితక్కువగా పాకులాడవద్దు. ఎప్పటికప్పుడు జ్ఞానోదయానికి ఏవో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కావాలని కళ్ళు మూసుకొని చూడకుండా తప్పించుకుపోవడానికి ప్రయత్నించవద్దు. ఒకరి దుఃఖానికి మరొకరు కర్తలు కాదు. ఎవరి, కర్మ వారిది. ఎందుకు ఆ పసికందును అడ్డం పెట్టుకొని తెలివితక్కువగా వాపోతావు?"    
    విషాదజీవుల దుఃఖోపశమనానికి ఏకైక సాధనం ఈ వేదాంతం!
    "వేదాంతం సుఖమే ఇవ్వచ్చు; కాని భరించడం ఎంత కష్టం, కృష్ణవదినా! హృదయసరసిలో కోరికల కాలవలు విరిసే తరుణ యౌవనంలోకి వైరాగ్యభానుణ్ణి ఆహ్వానించడం ఎలా, కృష్ణవదినా?" దుఃఖావేగంతో అంది విరిబాల.
    "మరి గత్యంతరం లేదు." బరువుగా నిట్టూర్చ్జింది కృష్ణప్రియ. "పద కృష్ణా, భోజనానికి" కదులుతూ.
    అన్నం కలుపుతూ ప్రశ్నించాడు కళ్యాణ్! "రాధ ఒక్కత్తే వచ్చినట్లుంది; భర్త రాలేదా?"
    "రాధను మామయ్య పంపించాడు, నీ దగ్గిరికి."
    "రాధను మామయ్య పంపించాడా!" ఆశ్చర్యపోయాడు కళ్యాణ్.
    "మామయ్యే పంపించాడు. జరిగిందేదో జరిగింది; ఇప్పటికయినా నువ్వు దారిలోకి వస్తే చిన్నమామయ్య కూతురును నీ కిచ్చి చేస్తారట, మొదట భోజనంకానీ, ఉత్తరం రాసి రాధవెంట పంపించాడు మాధవమామయ్య. చదువుకో, అన్ని సంగతులూ తెలుస్తాయి."
    త్వరత్వరగా భోజనం కానిచ్చి బయటికి వచ్చాడు కళ్యాణ్. విరిబాల దగ్గిరనుండి ఉత్తరం తెచ్చి తమ్ముడికి ఇచ్చింది కృష్ణప్రియ.    
    కవరు విప్పి ఉత్తరంతీసి చదువుకొన్నాడు కళ్యాణ్,
    "చిరంజీవి కృష్ణచంద్రుడిని,
    మీ పెదమామయ్య ఆశీర్వదిస్తూ వ్రాయునది. ఎటువంటి పట్టుదలలకు పోయినా, ఎంతటి కార్పణ్యాలు పూనినా పెంచిన మమకారం అవన్నీ ఒక్కసారిగా మరిపింపజేస్తుందిరా, కృష్ణా! నువ్వు ఒకనాడు నన్ను ఎదిరించి నిలిచినా, నా మాటను తిరస్కరించినా నీ సుఖమే కాంక్షిస్తూ ఈ ప్రయత్నానికి పూనుకొంటున్నాను. మీ అమ్మ పోతూ నా కప్పగించిన బాధ్యత పూర్తిగా నెరవేర్చనిది నా హృదయానికి నెమ్మదిలేదు. పిన్ననాడే తల్లి తండ్రుల్ని పోగొట్టుకొన్న నిన్నూ, నీ అక్కనూ పెంచి పెద్దజేశాను. దాన్ని గౌరవప్రదమైన ఒక కలిగిన ఇంటికి ఇస్తే దాని రాత అలా అయింది.
    దిక్కూ దివాణం లేని నీ ఆస్తి కాపాడుతూ నిన్ను ఇంతవాణ్ణి చేశాను. మీ అమ్మ ఆఖరి కోరిక తీర్చాలనీ, రాధను నీ కిచ్చి చేద్దామనే కదా ఇద్దర్నీ డాక్టరీ చదివించి, ముచ్చటగా దంపతులను విదేశాలకు పంపించి, ఇంకా పెద్ద చదువులు చదివించాలని ఉవ్విళ్ళూరింది? తీరా లగ్నం పెట్టుకొన్నాక అటువంటి అవాంతరం వస్తుందని ఎవరనుకొన్నారు? విధిరాత తప్పించలేరు. కనకనే నువ్వు ఆనాడు అంత మూర్ఖించి నాలో పౌరుషం రేకెత్తించి, పట్టుదల కలిగించి చేజేతులా రూప విద్యాశీలవతి అయిన రాధను దూరం చేసుకొన్నావు! నువ్వు చేసిన, చేస్తూన్న పని ఏం మంచిది చెప్పు, కృష్ణా? రైల్లో ఎవత్తో హృదయంలేని పాపాత్మురాలు నిర్ధయాగా వదిలివేసిన ఆ అభాగ్యున్ని తీసుకువచ్చి పెంచుతున్నావంటే ఏం మాట? వాడి కుల మేమిటి? వాడి జన్మకారకుల చరిత్ర ఏమిటి? ఏ పాపఫలమో వాడు! శుద్ధ బ్రాహ్మణుడి ఇంట్లో వాడు పెరుగుతున్నాడంటే ఎన్ని సమస్యలకు కారణమౌతాడో ఆలోచించవేం? ముందు నీ కుటుంబానికి వాడు ఒక సమస్య కాడూ? వాణ్ణి ఒక కొడుకులా పెంచుకొన్నాక ముందు నీ బిడ్డలతో ఆస్తి పంచి ఇవ్వకుండా ఉంటావా? ఇన్ని విషయాలూ నీకు ఆనాడే తెలియజెప్పాను. నీకు రాధే కావాలో, నీ అదృష్టానికి రాహువులా దాపరించిన ఆ దరిద్రుడే కావాలో తేల్చి చెప్పమన్నాను. రాధనైనా వదులుకొన్నావు గాని వాడిని విడవడానికి అంగీకరించలేదు నువ్వు, ఏమన్నా అంటే మానవత్వం అంటావు. అటువంటి అనాథలకు శరణాలయాలు బోలెడు ఉన్నాయి దేశంలో, వాణ్ణి ఏ అనాథ శరణాలయంలోనో చేర్పించడం మనిషిగా నువ్వు చెయ్యవలసిన పని. కాని వాడి భారమంతా మీద వేసుకొని ఇంట్లో పెంచడం నీ జీవితానికి మంచిది కాదు. నీ దగ్గిర ఓ పిలవాడు పెరుగుతున్నాడంటే నీకు పిల్ల నివ్వడానికి ఎవరూ సాహసించరు. ఏది ఏమైనా ఒక ఇంటివాడివై ఇల్లు నిలుపవలసినవాడివి. ఇప్పటికీ మించి పోయినది లేదు. ఆ పిల్లవాణ్ణి ఏ అనాథశరణాలయం లోనో వదిలివెయ్యి. చిన్నమామయ్య తన కూతురు అనూరాధను నీకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు నేను చెప్పిన పనిచేస్తే. ఇంకా మూర్ఖించి సంబంధాలు తెంచుకోకు. పెద్దమనిషి మాటకు నిలవ ఉంచు. బుద్దిగా నడుచుకొని సుఖపడు. ఇట్లు,
        మీ పెదమామయ్య మాధవరావు."
    "రాధతో ఏం చెప్పి పంపదలుచుకొన్నావు?" ఉత్తరం చదవడం పూర్తిచేసిన కళ్యాణ్ ను ప్రశ్నించింది కృష్ణ ప్రియ.
    "చెప్పడానికి ఏముంది?"
    "ఏమున్నదంటే?"
    "ఆనాడు మనసైన రాధనే వదులుకొన్నాను, బాబు కోసం. ఇంక ఇప్పుడీ అనూరాధ ఎవరు?"
    "ఇదే నీ సమాధానమైతే మామయ్య మనస్సులో నొచ్చుకొంటాడు, కృష్ణా."
    "ఇరు పక్షాల వారి మనస్సులూ ఆనాడే విరిగాయి. ఇంక విరగడానికి ఏం మిగిలింది ఇక్కడ?"
    గది అవతల నిలబడి వీరి సంభాషణ వింటూన్న విరిబాల లోనికి వచ్చింది. "అయితే నీ నిశ్చయమేమిటి, బావా? పెళ్ళే చేసుకోవా?" అంది కంగారుగా.
    "ఆఁ! చేసుకోకూడదనే అనుకొన్నాను. గోకుల్ క్షేమం ఆశించే కాదు; నువ్వు దూరమైననాడే వివాహేచ్చకూడా వదిలిపోయింది."
    "ఒక పిల్లవాడికోసం నీ జీవితం వృధా చేసుకోవడం ఉచితంగా లేదు, బావా. అనూరాధకు ఏం లోటు? విశ్వవిద్యాలయ పట్టభద్రురాలు, నా అంత చక్కనిది కాకపోయినా రూపవతి కాదనలేము. గుణంలో నాకన్నా మెరుగు. నాలో కొంచెం అహంభావమైనా ఉన్నది కాని అది సాక్షాత్తూ వినయస్వరూపం. ముఖ్యంగా నువ్వంటే దానికి మనసు. అన్ని విషయాలు నీకు తెలియజెప్పి నిన్ను ఎలా గయినా ఒప్పించాలనే నాన్న పంపించాడు నన్ను. నా మాట కాదనకు, బావా."
    "మామయ్యకు నా మాటగా చెప్పు, కళ్యాణ్ బ్రతుకుతున్నది గోకుల్ కోసమేనని." కళ్యాణ్ లేచి వెళ్ళిపోయాడు తన గదిలోకి.
    కళ్యాణ్ వెనకే వచ్చింది కృష్ణప్రియ, "కాదు, కృష్ణా" అంటూ, "అమ్మా, నాన్నా ఏనాడూ వెళ్ళిపోయారు. పెళ్ళీ పేరంటం అనుకొని ఇల్లు నిలప వలిసిన వాడిని. నేను మాత్రం ఎన్నాళ్ళని ఉంటాను, నీ దగ్గిర? నాకు ఇల్లూ, వాకిలీ ఉంది. నువ్వు పెళ్ళి చేసుకొని ఇల్లూ, ఇల్లాలూ అనుకొన్నాక నేను వస్తూ పోతూంటే అందంగా ఉంటుంది.
    "గోకుల్ విషయంలో నువ్వు చింత ఏమీ పెట్టుకోనక్కర్లేదు, నాకుమాత్రం ఎవరున్నారు? ఒకనాటికి నా కొక ఆధారం కావాలి కదా? పల్లెలో లంకంత కొంప. కావలసినన్ని భూములూ, తోటలూ, గోకుల్ ను పెంచుకొని దత్తత చేసుకొంటాను."
    తీవ్రంగా తల ఆడించాడు కళ్యాణ్. "ఉహుఁ. గోకుల్ ను విడిచి నేను ఉండలేను, అక్కా, రాధ పెళ్ళికి ముందు నువ్వు అడిగి ఉంటే బహుశః పెంపకానికి నీకిచ్చేవాడినేమో? కాని ఇప్పుడు ఇవ్వలేను. ఎన్ని అవాంతరాలేనా రానీ, ఎన్ని కష్టాలేనా రానీ గోకుల్ నాదగ్గిరే పెరుగుతాడు." నిశ్చయంగా చెప్పాడు.
    మరి మాట్లాడలేక వెళ్ళిపోయింది కృష్ణప్రియ.
    చీకటి పడుతూ ఉన్నది.
    అంతవరకూ తోటలో చదువుకొంటూన్న విరిబాలలేచి ఇంట్లోకి వస్తూ వరండా అంచున గోకుల్ ను చూసింది. "పడితే పడనీ. నాకు వచ్చిందేమిటి?" అక్కసుగా లోనికి వెళ్ళిపోయింది.
    గేటులోంచి వస్తూన్న రూపవతి ఆదుర్దాగా పరిగెత్తుకు వచ్చింది, "పిల్లడు పడే, పడే" అంటూ గోకుల్ ను ఎత్తుకొని లోనికి వచ్చింది.
    "కృష్ణప్రియగారూ!" అని పిలిచింది హాలులో నిలిచి.    
    "ఎవరూ?" వంటగదిలోంచి పలికింది కృష్ణప్రియ.
    గోకుల్ ను ఎత్తుకొని వంటగదిలోకే వచ్చింది చొరవగా రూప. "కొంచెమైతే బాబు కింద పడిపోయే వాడు. వరండా చివరికి వచ్చి ఆడుకొంటున్నాడు" అని చెప్పింది ఆదుర్దా ప్రదర్శిస్తూ.
    "ఎక్కడికని చూడనమ్మా? ఏమరనివ్వడు పిల్లాడు!" కృష్ణప్రియ గోడకానుకున్న పీట వాల్చింది! "కూర్చో ఇప్పుడు నీ ఆరోగ్యం బాగున్నదా, రూపా? చనువుగా సంబోధిస్తూ కుశలపశ్న వేసింది.
    గోకుల్ ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చుంది రూప. "ఈ నాలుగైదు రోజులు హాయిగా ఉన్నానండీ. నిన్నరాత్రి మళ్ళీ కొంచెం జ్వరం తగిలింది. డాక్టరు గారికి చూపించుకుందామని వచ్చాను." రూప వాచీ చూచుకొని, "డాక్టరుగారు ఎప్పుడు వస్తారు?" ఆ ప్రశ్నించింది.
    "గంట గంటన్నర కావచ్చు. కూర్చొని చూపించు కుని వెళ్ళమ్మా" అంది ఆదరంగా. కుంపటిమీద గిన్నె దించేసి టీకి నీళ్ళు పెట్టింది కృష్ణప్రియ.
    "ఇంట్లో ఇంకెవరో ఉన్నట్లున్నారు?" రూప ప్రశ్నించింది.
    "మా మేనమామ కూతురు, విరిబాల. ఎమ్. బి. బి. ఎస్. డాక్టర్."
    "అలాగా!" కొంచెం సేపయ్యాక అంది: "పిల్లవాడు కిందపడే ప్రమాదం గుర్తించి కూడా పట్టనట్లు ఇంట్లోకి వచ్చింది. చూస్తూ ఆవిడ ఇంట్లోకి అలా వెళ్ళిపోయిందేమా అని ఆశ్చర్యపోయాను."
    "ఏమిటో అజ్ఞానం! పాపపుణ్యా లెరగని పసివాడిపై అక్కసు చూపుతూంది. ఆ పిల్ల." నిట్టూర్చింది కృష్ణప్రియ.
    "పసివాడిపై అక్కస్సా? ఎందుకూ?" కుతూహలంతో ప్రశ్నించింది రూప.
    "అదంతా ఓ కథ." బరువుగా చెప్ప నారంభించింది కృష్ణప్రియ.

                                 *    *    *

 Previous Page Next Page