"ఓ యస్. నాకేం అబ్జక్షన్ లేదు" అన్నది జయలక్ష్మి.
ఇద్దరూ బీచిలో కూర్చున్నారు.
"హరీ"
"ఏం జయా"
"మొన్నటి నాటకం 'మ్రోగించని వీణ' చూశావు కదూ ఎట్లా ఉంది"
"నా కసలు అలాంటి టైటిల్సు నచ్చవు. ఏం నాటకాలో ఏమిటో మ్రోగించని వీణ, తెగిన గొలుసు, వర్షించని మేఘాలూ, తెరువని తలుపులూ, ఛా ఛా ఏమిటీ టైటిల్సు. వాటిని బట్టే తెలుస్తుంది. వాటిల్లో పది వంతులు విషాదమూ, రెండు వంతులు వినోదమూ అని."
"పోనీ నాటకం ఎట్లా ఉంది. రచన, రంగాలంకరణ, నటన ఎట్లా ఉన్నయ్యి. పరిషత్తుకు తీసుకు వెళ్ళతారుట" అన్నది జయలక్ష్మి దూరాన హార్భరులో ప్రవేశిస్తున్న స్టీమరును చూస్తూ.
"ఏ ఊరు పరిషత్తుకో" అన్నాడు మురహరి.
"నాటక కళాపరిషత్తుకే వచ్చే జనవరి ఆఖరు వారంలోనే" అన్నది జయలక్ష్మి సంతోషంతో.
"అసలు పరిషత్తులు ఎన్ని? ఏది సర్వత్రా వప్పుకున్న పరిషత్తు? ఆ పరిషత్తుల స్థోమత ఏమిటో నాకు చెప్పు వింటాను" అన్నాడు మురహరి.
"అసలు నీ ఉద్దేశ్యం నే వేసే నాటకం పరిషత్తుకు వెళ్ళకూడదనేగా. ఎందుకో అంత ఈర్ష్య"
"ఈర్ష్య, కోపమూ కాదు జయా అసలు పరిషత్తుల విషయం చెపుతున్నాను. ఈ రోజుల్లో ఊరి కొక పరిషత్తు ఉంది. నలుగురు డబ్బు గల వాళ్ళు, నాటకాల రాయుళ్ళూ ఉంటే చాలు ఈ ఊరి పేరున ఒక పరిషత్తు వెలుస్తుంది. ఏ పరిషత్తులో పాల్గొంటే బావుంటుందో, ఏ పరిషత్తుకు ఎంత విలువుందో తెల్సుకోటం మంచిదని నా అభిప్రాయం. పరిషత్తనేది ఒక ప్రజాహితైక సంస్థగా ఉండాలి. అది ఆంధ్ర దేశానికంతా ప్రాతినిధ్యం వహించాలి. అలాంటి పరిషత్తు ఏర్పాటు అజమాయిషీలో, నాటక రంగంలో పేరు ప్రతిష్ఠలూ, అనుభవమూ కలిగిన వారి పర్యవేక్షణలో నాటకాలూ, నాటికలూ ఎన్నుకుని, ఒకే పరిషత్తు నీడన పోటీలు పెట్టి అందులో ప్రైజులు తెచ్చుకుంటే అది ఘనంగా, హుందాగా, ఆనందంగా ఉంటుందిగాని, కుక్క గొడుగు పరిషత్తుల్లో ప్రైజులు తెచ్చుకుంటే అందులో ఘనతేం లేదు. కారణం అలాంటి పరిషత్తు నడిపే పెద్దలు ఆ ఊరి కరణం, మునసబులూ, పెద్ద రైతూ, బొర్ర పెంచుకున్న లాల్చీరాయుళ్ళూ కనుక వాళ్ళకి నాటక కళ విషయం ఏం తెలుస్తుంది. నోట్లు అడగటం తెలుస్తుంది గాని" అన్నాడు మురహరి.
జయలక్ష్మి నవ్వింది.
"ఎందుకు నవ్వుతావ్ జయా"
"పరిషత్తులంటే నీ కింత కోపం ఎందుకా అని, కొంపతీసి నువ్వు హీరో వేసిన నాటకం పరిషత్తుకు వెళితే అందులో ఏ ప్రయిజూ రాలేదేమో"
"నే నసలు హీరో వేషం వేస్తేనేగా ఆ విధంగా కోపం రావటానికి నే నెప్పుడూ నాటకాల్లో వేషాలు వెయ్యలేదు."
"అదే, జీవితంలోనే తప్పు"
ఈ మాటకు గతుక్కుమన్నాడు మురహరి. "సరే దానికేంగాని, ఎవరభిప్రాయాలు వాళ్ళవి. ఇంతకీ నన్ను కూడా వెళ్ళమంటావా లేదా"
"వెళ్ళు హీరోయిన్ వి. నువ్వు లేకపోతే నాటకం ఎట్లా సాగుతుంది" అన్నాడు మురహరి విసుగ్గా.
"ఎందుకని హరీ అంత విసుగ్గా ఉన్నావ్ ఇవాళ. పోనీ నువ్వు వద్దంటే నేను నాటకంలో వేషం మానేస్తాను. వాళ్ళు ఇంకోళ్ళని చూసుకుంటారు. నీ కిష్టంలేని పని నే నెప్పుడూ చెయ్యను. నేను నాటకంలో వేషం వేస్తుంటే నువ్వు సంతోషిస్తావనుకున్నా గాని, ఇంత అయిష్టతగా ఉంటావనుకో లేదు హరీ. సరేనా" అన్నది జయలక్ష్మి అంతవరకు ఇసుకలో కట్టిన పిచ్చుక గూడును చేత్తో తోసి వేస్తూ.
"వేషం మానెయ్యమని కాదు జయా నాటకాలన గాని, నాట్య కళనుగాని, కళాత్మకంగానే చూడాలి గాని కళారాధన పేరుతో ఆత్మవంచన చేసుకోకూడదు."
"అంటే" అంటూ బరువుగా అతనివైపు చూసింది జయలక్ష్మి. అతని మనస్సులో ఏదో తెలియని వ్యధ గూడు కట్టుకుని ఉందనుకుంది జయలక్ష్మి. ఆ వ్యధ తనని గురించో లేక ఏ భావం వల్ల కలిగిందో ఆమెకు తెలీలేదు. "ప్రస్తుత కాలంలో పౌరాణిక నాటకములు ధన సంపాదనకు మాత్రమే ఉద్దేశించి ప్రదర్శిస్తున్నారు. నాటకాలు వేయించే కంట్రాక్టర్లు కూడా పౌరాణిక నాటకాలనే ఎన్నుకుంటారు కాని సాంఘికాలు కాదు. ఇంక సాంఘిక నాటకాలూ, నాటికలు ఉన్నయ్యంటే అవి ఉన్న డబ్బును ఖర్చు చేయించేందుకే. ఒకవేళ టిక్కట్టు పెట్టి ఆడినా ఆ రాబడి కర్చులకు సరిపోదు. కొన్ని సమయాల్లో వచ్చేటప్పుడు చార్జీలకు కూడా ఉండవు. అలాంటి నాటకాల వల్ల నటులకు మిగిలిందేమిటంటే శ్రమతో కూడిన తృప్తి. ఈ తృప్తి పది చోట్ల నాటకాలు వేసినందువల్ల రావచ్చు. స్టేజి ఎక్కి నటించావనుకోవచ్చు. నేనూ ఒక మహా నటుడవైపోయాననుకోవచ్చు. ఆ స్థితి కొచ్చాక ఒకటి రెండు సార్లు ఏ ఊరు పరిషత్తులోనో రెండు ప్రైజులు తెచ్చుకుంటే, ఇంక సినిమా లోకానికి నిచ్చెన వేసి అందని ద్రాక్ష పళ్ళకు అర్రులు జాచవచ్చు. ఇంకపోతే నటికిగాని, నటునికి గాని ముఖ్యంగా మూడు లక్షణాలు ఉండాలి. ఒకటి జితేంద్రియత్వము, రెండు వినయము, మూడు మంచి నడవడిక, ఈ మూడు లక్షణాలూ ప్రాణంతో సమంగా చూసుకుంటే ఏ చెడ్డ పేరూ రాదు. ఎందులో కాలు జారినా ఇంక అగాధంలోకి పోవటమే" అన్నాడు మురహరి.
అతని భావం జయలక్ష్మి కి అర్ధమైంది.
"నీ మనస్సుని అర్ధం చేసుకున్నాను. నా ప్రవర్తనలో, నడవడిలో ఏ మార్పూ రాదు. అలాంటి ఉపద్రవమే వస్తూంటే నన్ను ఒడ్డుకు చేర్చటానికి నీకు సర్వ అధికారాలూ ఇస్తున్నాను. ఏమీ అడ్డు చెప్పను. ఒక్కమాట. నాటకంలో వెయ్యటం మాత్రం మానను. నా సంతృప్తి కోసమనే కాదు. నాటక కళ యందు నాకూ అభిమాన మున్నదని నిరూపించుకోటానికి ప్రతి జీవికీ ఒక విలక్షణ మైన జిజ్ఞాస ఉంటుంది. మనం జీవిస్తున్నా మంటే కేవలం పరస్పర ఆనందం కోసమే జీవించకూడదు. అదే ధ్యేయంగా పెట్టుకుంటే అదీ ఒక రకమైన అనర్ధకాలకి దారి తియ్యవచ్చు. మనస్సుకు ఆనందమనేది అనేక రీతుల్లో కలుగుతుంది. అన్నింటికీ మించినది పరమార్ధమైన ఆనందము. కళాత్మకమైన జీవితం గడపటంలో కూడా పరమార్ధమైన ఆనందం ఉంది. అట్టి ఆనందం అనుభవించటానికి సంగీత సాహిత్యముల తోడ్పడతయ్యి. కాని సంగీతము నా గొంతుకు సరిపడనిది. సాహిత్యము నీ సొత్తు. నువ్వు రాసే కధలు, నవలలు, పద్యాలూ, భావ గీతాలూ చదువుతుంటే నాకు అట్టి పరమార్ధమైన ఆనందమే కలుగుతుంది. ఇంక నాకు మిగిలింది నాటకాలూ, నాటికలూ ఇంత వరకూ అయిదారు నాటకాల్లో నటించాను. ఆ నాటకాల్లో నటిస్తుంటే నా మనస్సుకు ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను. దైవికమైన పరమార్ధం నాకు అప్పుడే కలుగుతుంది. అలాంటి నటన నా నిజ జీవితంలో ఎప్పుడూ ప్రవేశించి, నాకే విధమైన కళంకమూ తీసుకు రాకూడదనే నా వాంఛ నా కోరిక ఇందుకు భిన్నంగా నే నెప్పుడూ నడచుకోను" అన్నది జయలక్ష్మి.
బరువుగా నిట్టూర్పు విడిచి తృప్తిగా జయలక్ష్మి కళ్ళల్లోకి చూశాడు మురహరి. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, "నీ మనస్సుకు బాధ కలిగించాను జయా, నన్ను క్షమించు. ఇంక పోదామా" అన్నాడు.
"అట్లాగే ఒక్కమాట మొన్నటి నాటకంలో వేషం వేసిన ప్రతాప్ నన్ను 'టీ' కి పిల్చాడు వాళ్ళింటికి. ఎల్లుండి ఆదివారం సాయంత్రం నాలుగింటికి. నాతో బాటు నిర్మల కూడా వస్తుంది వెళ్ళిరానా."
"అవును అతను 'మ్రోగించని వీణ'లో నాయకుడు నువ్వు నాయకివి. నిర్మల అతని చెల్లెలు. వెళ్ళిరా. టీ పార్టీలకూ, విందులకూ వెళ్ళి రావటం కూడా ఒక కళగా భావించకు. అవకాశాలకోసం సృష్టించబడే తతంగమే టీ పార్టీలూ, డిన్నరు పార్టీలూను" అన్నాడు మురహరి.
మర్నాడు జయలక్ష్మి, నిర్మల కలిసి ప్రతాప్ ఇంటికి వెళ్ళారు. మహారాణి పేటలోనే వాళ్ళ ఇల్లు.
వాళ్ళిద్దర్నీ సాదర పూర్వకంగా ఆహ్వానించాడు ప్రతాప్. కొంత సేపటికి ఆహ్వానితులంతా వచ్చారు. అంతా ఆ నాటకంలోని వాళ్ళే.
"ఇంతమంది ఉండగా వీణ మోగకుండా ఉంటుందా ప్రతాప్" అన్నది నిర్మల. అంతా నవ్వుకున్నారు. అంతా కలిసి పదిహేనుమంది అయినారు. అంతమందిలో జయలక్ష్మి, నిర్మలా ఇద్దరే లేడీ స్టూడెంట్సు.
"ముఖ్యంగా ఈ పార్టీ ఎరేంజ్ చేసింది నాటకాన్ని గురించి చర్చించటానికే. మనం పరిషత్తుకు కూడా పోతున్నాం కాబట్టి ప్రతి చిన్న విషయం లోనూ జాగ్రత్త చూసి, శ్రద్దగా రసాభంగం కలక్కుండా నటించాలి. అందుకు జయలక్ష్మి కొంచం సహకరించాలి" అన్నాడు ప్రతాప్.
"పోర్షను రాలేదంటారా" -అన్నది నిర్మల.
"కాదు. కొంచం ఎఫెక్టివ్ గా యాక్ట్ చెయ్యాలి సిగ్గు పడకూడదు. పాత్రలో లీనమై నటిస్తేనే ఎంత చిన్న సన్నివేశమైనా రాణిస్తుంది" అన్నాడు ప్రతాప్.
జయలక్ష్మికి అర్ధమైంది. నాటకంలో హీరోని ఒక సన్నివేశంలో కావలించుకోవాలి. ఎంత చురుకుగా ఉన్నా ఆ సమయానికి సిగ్గుపడి కొంచం ఖంగారు పడేది జయలక్ష్మి అంతా ఊహించుకుని ప్రతాప్ భావాన్ని అర్ధం చేసుకుంది.
"పాత్రలో లీనమై నటించటానికి మనిషిని తాకుతూ ఉండనే అక్కర్లేదు. మనిషిని తాకకుండానే సందర్భానుసారంగా నటించవచ్చు. మనిషిని గట్టి కావిలించుకున్నంత మాత్రాన నాటకానికి పేరు, ప్రైజు వస్తుందనుకోవటం భ్రమ" అన్నది నిర్మల వైపు చూసి.
ప్రతాప్ ఖంగారుపడ్డాడు. అతనితో ఉత్సాహమంతా కరిగిపోయింది.
"నా ఉద్దేశ్యం అదికాదు జయలక్ష్మీ నటనలో స్వాభావికత ఉండాలన్నానుకాని ఆ సీనులో అట్లా చెయ్యమనలేదు" అన్నాడు.
మిగిలిన వాళ్ళంతా కూడా అదే భావాన్ని వ్యక్తపర్చారు. "పోనీ నే నొక విషయం చెప్తాను. అట్లా చేస్తే బావుంటుందేమో ఆలోచించండి" అన్నది జయలక్ష్మి.
అదేమిటోనని అంతా ఆత్రంగా జయలక్ష్మి వైపు చూశారు. నిర్మల వైపు చూస్తూ "పోనీ హీరోయిన్ పాత్ర నిర్మల కివ్వండి. చెల్లెలుగా నేను నటిస్తాను" అన్నది. నిర్మల ఆశ్చర్యపడింది. మిగిలిన వాళ్ళంతా ఖంగారు పడ్డారు. ప్రతాప్ కు పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్లయింది. "ఈ టీ పార్టీ ప్రమేయంతో ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావా" అనుకున్నాడు ప్రతాప్.
"ఏం నిర్మలా, నీకు ఇష్టమేనా" అన్నది మళ్ళీ జయలక్ష్మి.
"అందరికీ ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు. నా శాయ శక్తులా ఆ పాత్రకు న్యాయం చేకూరుస్తాను" అన్నది నిర్మల.
"ఇంకేం ఈ రోజునుంచీ పోర్షన్సు మార్చుకుందాం" అన్నది జయలక్ష్మి.
ప్రతాప్ తీవ్రంగా ఆలోచించాడు. అందరి వైపూ చూశాడు.
"రెండుసార్లు ఈ నాటకం స్టేజి చేశాక, ఈ చిన్న విషయానికి ఇంత రాద్దాంతం చేసుకుని పోర్షన్సు మార్చుకోవటం తగని పని. కాలేజి కల్చరల్ ఎసోసియేషన్ మెంబర్సు కూడా వప్పుకోరు. జయలక్ష్మి గారు వారిష్ట మొచ్చినట్లే నటించవచ్చు. ఈ చర్చను ఇంతటితో ఆపివేద్దాం" అన్నాడు.
టీ పార్టీ అయ్యాక అంతా వెళ్ళిపోయారు.