2
డబ్బాలోంచి పావులు తీస్తూ , నెమ్మదిగా ఒక్కొక్కటి వాటి స్థలం లో అమర్చుతూ అన్నాడు రామచంద్రయ్య -- "ఏమిటి వెంకు పంతులు గారూ? విశేషం?'
వెంకు పంతులు ఉలికిపడ్డాడు.
'విశేషమా -- ఏం లేదే?'
'లేకపోతె అంతగ ఆలోచించాల్సిన అవసరం ఏమిటండీ? ఏదో ఉంది-'
'నిజం , ఏమీ లేదండీ -- ' నవ్వుతూ అన్నాడు వెంకు పంతులు . 'అట మొదలు పెట్టనా?'
'ఉండండి .' తెల్ల పావులని తన వేపు తిప్పుకుంటూ అన్నాడు రామచంద్రయ్య . 'ఈసారి అట గెలిచి తీరాలి నేను. స్ట్రాటజీ అంతా మార్చేస్తాను-'
'అయితే మొదలెట్టండి.-'
రామచంద్రయ్య ఒక్కసారి తన పావుల కేసి చూసుకొని, సంతృప్తి గా నిట్టుర్చుతూ , పావులని కదిపాడు.
'అయితే ప్రొద్దున్న లేరుట, ఎక్కడికి వెళ్లారు?'
'రాఘవరావు గారబ్బాయి కి అక్షరాభ్యాసం చేయించాలన్నారు. వెళ్లి ఆ శుభ కార్యం జరిపించి వచ్చాను.'
'ఎంత ఇచ్చారు?'
'వాళ్ళసలు ఉత్త పిసినార్లండి, ఇచ్చిచావరు సరిగ్గా!' చెప్పడం ఇష్టం లేదన్నట్టుగా అన్నాడు వెంకు పంతులు.
'అసలు ఎంతిచ్చేరేమిటి?'
'ఆ మునసబు గారింట్లో జరిగిందా -- ఆ వేళ వాళ్ళు ఎంత ఇచ్చ్ఘారో తెలుసా మీకు?'
'ఎంత ఇచ్చారు ? - ఎత్తు మీదే!' అన్నాడు జ్ఞాపకం చేస్తూ రామచంద్రయ్య.
'పంచేల చాపు పెట్టి, పదిరూపాయలు ఇచ్చారు. పైగా మామూలు సంభావనా వగైరా లు ఉండనే ఉన్నాయి -- ఇదిగో . ఇదీ నా ఎత్తు --' ఏనుగును తీసి కాజిలింగ్ చేశాడు వెంకు పంతులు.
'ఉహు-- సరే అయితే --ఇంతకూ రాఘవరావుగారెంత ఇచ్చారు?'
'ఊ, అదీ ఒక ఇవ్వడమేనటండీ? ఇల్లు వదులుకోవడం ఇష్టం లేక గానీ లేకపోతె అసలు వెళ్ళకపోయే వాడిని -- ముష్టి అయిదు రూపాయలు అంతే!'
'అంతే?'
'అక్షరాలా అంతే! ఇస్తే ఇవ్వలేదంటానా?'
'అయితే మీ ఓటు ఈసారి....'
'మీరిలాటివి అడగకూడదు, నేను చెప్పకూడదు ! సీక్రెట్ బాలట్ గదండీ , సగం బతికాం--' గుంభనంగా నవ్వుతూ అన్నాడు వెంకు పంతులు.
'ఎక్కడ బతికాను?-- మీరేమో మళ్ళీ మంత్రికే పెట్టారుగా ఎసరు!-- ఇదేం బాగాలేదు -- వస్తానుండండి' రామచంద్రయ్య లోవబోయాడు.
'ఎక్కడికి?'
'ఇంధనం వేసుకు రావడానికి!'
వెంకు పంతులు నవ్వాడు--
ఆ నవ్వులో నిగూడంగా ఉన్న అర్ధం గ్రహించాడు రామచంద్రయ్య.
'సుమతీ!' పిలుస్తూనే ఇంట్లోకి చేరాడు రామచంద్రయ్య. 'కాఫీ గట్రా ఏవైనా.'
'మీరెళ్ళి ఆడుకుంటూ ఉండండి, నే తెస్తా! డికాషన్ తెరుకుంటోంది-'
మనసులో ఉన్నది పైకి చెప్పకుండానే గ్రహించ గలిగే సుమతి అంటే రామచంద్రయ్య కు ఎంతో ఇష్టం!
'నువ్వెంతైనా ఇల్లాలివే!' నవ్వుతూ బయటకు వచ్చాడు రామాచంద్రయ్య.
'ఎత్తు మీరే వెయ్యాలి --' రామచంద్రయ్య బయటకు రాగానే జ్ఞాపకం చేస్తూ అన్నాడు వెంకు పంతులు.
'అవును లెండి. కాస్త కాఫీ పడితే గాని, ఎత్తు పడేలా లేదు. సీరియస్ గా పావుల కేసీ చూస్తూ ఆలోచించసాగాడు రామచంద్రయ్య.
సుమతి రావటం, కాఫీ అందించటం దాన్ని మౌనంగా వెంకు పంతులు స్వీకరించటం రామచంద్రయ్య కు తెలీదు.
'కాఫీ తీసుకోండి --' అన్న సుమతి హెచ్చరికతో ఆలోచనల నుండి తేరుకున్నాడు రామచంద్రయ్య.
సుమతి లోపలికి వెళ్లిపోయింది.
అయినా రామచంద్రయ్య కే విధమైన ఎత్తూ అంతు దొరకలేదు.
కాఫీ మెల్లగా చప్పరిస్తూ అన్నాడు వెంకు పంతులు: 'ఇంతకీ అసలు సంగతి చెప్పటం మర్చిపోయాను --'
'ఏమిటి విశేషం ?' తలెత్త కుండానే ప్రశ్నించాడు రామచంద్రయ్య.
వెంకు పంతులేమీ మాట్లాడలేదు.
క్షణం సేపు చూసి అన్నాడు రామచంద్రం -- 'చెప్పరేం?'
'ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా -- అంతే!'
'అసలేం సంగతి?'
ఏముందీ -- ఇందిర విషయమే!'
'ఇందిర విషయమా' - హటాత్తుగా తలెత్తుతూ ప్రశ్నించాడు రామచంద్రయ్య. 'మా ఇందిర సంగతేనా? ఏమైనా పెళ్ళి సంబంధమా?'
'ఛ, ఛ. అలాంటిదేం కాదు --'
'మరి?-' ఈసారి రామచంద్రయ్య కంఠం అదోలా ధ్వనించింది.
'ఏం లేదు, ఎత్తు వెయ్యండి--'
క్షణం వెంకు పంతులు కేసి తీక్షణంగా చూసి, బోర్డును పక్కకు నెట్టేస్తూ అన్నాడు రామచంద్రయ్య -- 'ఇవాళ్టి కిక ఎత్తు పడదు-- ఇవాళ మీరే గెలిచారు -- ఇపుడు అసలు సంగతి చెప్పండి -'
ఆ కంఠం లో ఆత్రుత, ఆదుర్దా, కూతురు భవిష్యత్తు పై వేయి ప్రశ్నలు తలెత్తాయి. సందేహ నివృత్తి కోసం అయన వెంకు పంతులు కేసి చూశాడు.
'ఏం జరగలేదులెండి, మీరాడండి--'
'పంతులు గారూ, మీరేదో దాస్తున్నరలే ఉంది. స్పష్టంగా చెప్పండి -- ఇక ఆటంటారా, ఇక ఆడటం నా తరం గాదు --'
'అయితే మీ ఇష్టం -- ' వెంకుపంతులు ఓసారి బొడ్లోంచి నశ్యం డబ్బా తీసి ఒక పీల్పు పీల్చి, డబ్బా రామచంద్రయ్య కు అందించాడు. మిగతా సమయాల్లో, అంటే అట మరీ రంజుగా ఉన్నప్పుడు తనూ ఓ పట్టు పట్టేవాడు రామచంద్రయ్య. కానీ, ఇవేళ మౌనంగా డబ్బా అందుకొని పక్కన పెట్టేశాడు.
'ఎవరెవరో ఏదో అన్నారనుకొండి. లోకులు కాకులనే నేనూ ఒప్పుకుంటాను.'
'విషయం ఎందుకు నానుస్తారు మీరు?' సూటిగా చెప్పండి!'
'నిజమేననుకోండి -- నేను మీ శ్రేయస్సు కోరేవాడిని. అందుకే ఓసారి చెప్పటం నా ధర్మం అని భావించాను గాబట్టి....'
'వెంకు పంతులు గారు!' ఆవేశంగానే అన్నాడు రామచంద్రయ్య.
'ఆవేశ పడకండి, ఇలాటి విషయాల్లో ఆవేశం అసలు పనికి రాదు--'
'అసలిది ఎలాటి విషయం ?' రామచంద్రయ్య ప్రశ్నలో అసహనం స్పష్టంగ ప్రతిధ్వనించింది.
'అదే, ఆ జడ్జీ గారబ్బాయి రాంబాబు లేడూ....'
'ఊ, ఏమైంది?'
'ఏమీ కాలేదు--'
'అమ్మయ్య ,, ఏమీ కాలేదు గదా!-' రామచంద్రయ్య నిట్టూర్చాడు.
'ఏమీ కాలేదు, కాకూడదనే నేనూ ఇలా వచ్చాను. అమ్మాయి అతనితో మరీ చనువుగా ఉంటోంది. ఒకళ్ళో , ఇద్దరో అడిగారు కూడా -- అయినా వాళ్ళు అలా అడగడం లో తప్పేమీ లేదు.... నేను ఏదో సర్ది చెప్పానను కొండి ..కానీ ...మీ ఇష్టం --'
'వెంకుపంతులు గారూ!' రామచంద్రయ్య కంఠం లో ఆవేదన.
'మీకు చెప్పటం నా ధర్మం అనుకోని చెప్పావే గానీ, ఇందిర నాకూ అమ్మాయి! -- ఇది అమ్మాయి మీద వేసిన అభాండం మాత్రం కాదు. పదిమంది నోళ్ళ లో పడక మునుపే....'
రామచంద్రయ్య ఏమీ మాట్లాడలేదు .
'మీ మీద నాకేదో ద్వేషం అనుకోకండి. నిజం చెప్పటం న్యాయం అనుకోని చెప్పాను, కానీ.... మీరు మరోలా అనుకోకండి...'
రామచంద్రయ్య నిస్సహాయంగా చూశాడు వెంకు పంతులు కేసి.
రామచంద్రం గారూ, బాగా ఆలోచించండి. అలోచించి కానీ ఏపనీ చేయకండి. ముఖ్యంగా మన బంగారం మంచిదయితే, ఇతరులను అనుకోనాక్కరలేదు -- క్షమించండి , మిమ్మల్ని బాధపెట్టానెమో !-- నేను వెళ్తాను మరి, చీకటి పడింది.'
రామచంద్రయ్య జవాబు కోసం వేచి చూడకనే వెంకు పంతులు లేచి అడుగులో అడుగు వేసుకుంటూ గేటు దాటాడు.
చీకటి పడిందని గదూ వెంకు పంతులు అన్నాడు-- ఇంకా చీకటి పడలేదు , చీకటి పడబోతోంది , దీపం పెట్టుకోండి అని మాత్రం చెప్పాడు వెంకు పంతులు.
'సుమతీ! ' దాదాపు అయిదు నిమిషాల తర్వాత అన్నాడో, అరిచాడో రామచంద్రయ్య కే తెలియదు.
'వస్తున్నా --' మూడు నాలుగు నిమిషాల తర్వాత వచ్చింది సుమతి. 'చీకటి పడింది, లైటన్నా వేశారు కారెం?'
'ఇందిరా ఉందా ఇంట్లో?'
భర్త ప్రశ్నకు ఆశ్చర్య పోతూ అతని కేసి చూసింది సుమతి.
ఈ రామచంద్రయ్య, కాఫీ అడిగిన రామచంద్రయ్య గాదు!
కూతురేదని ప్రశ్నించిన రామచంద్రయ్య! - ఇతను వేరు!
'రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళింది --'
'ఎప్పుడు వెళ్ళింది?'
'ఇందాకనేగా -- మిమ్మల్ని అడిగే వెళ్ళిందా?'
నిజమే -- ఇందిర అడిగే వెళ్ళింది-- జడ్జీ గారింటికని కాదు, రాంబాబు ఇంటికే వెళ్తానని అడిగింది. తనూ వెళ్ళమన్నాడు!
తప్పు ఇందిరది కాదు --
నిశ్చయంగా తనదే తప్పు--
తనోక్కడిదే కాదు-- తన భార్య సుమతిది కూడా!!
వయసొచ్చిన ఆడపిల్ల మరొక అబ్బాయితో తిరగకూడదని చెప్పాల్సిన బాధ్యత తల్లిది -- సుమతి ఇంత బాధ్యతా రహితంగా ఎలా ఊరుకోగలిగింది?
పోనీ, ఇప్పుడైనా మించిపోయింది లేదు, చెప్పవలసిన బాధ్యత తన మీద ఉంది -- అనుకున్నాడు రామచంద్రయ్య.
'ఎప్పుడొస్తానంది?'
'నాతొ ఏమీ అనలేదు .' అన్న సుమతి క్షణం ఆగి అడిగింది మళ్ళీ-- 'ఏమయిందండీ?'
రామచంద్రయ్య భార్య కేసి క్షణ కాలం చూశాడు. నెమ్మదిగా లేచాడు -- 'నేనలా జడ్జి గారింటికి వెళ్ళొస్తా--'
సుమతికి మతిపోయింది -- ఏమయిందంటే ఏమీ చెప్పరేం?'
ఈసారి ఈ ప్రశ్నకు జవాబిచ్చాడు రామచంద్రయ్య -- 'ఇంత వరకూ ఏమీ కాలేదుట!'
'అంటే?' సుమతికి రామచంద్రయ్య ఇచ్చిన జవాబు అర్ధం కాలేదు.
రామచంద్రయ్య కు సుమతి వేసిన ప్రశ్న అర్ధమయింది. అయినా జవాబివ్వకనే ముందుకు అడుగు వేశాడు.
సుమతి తెల్లపోయి నిలబడి పోయింది అక్కడే!
* * * *