ఇందిర ఆవేళ, ఆనందానికి అంచులు తాకింది. పొద్దున్నే లేచి, ఎవరి ముఖం చూసిందో ఏమో గానీ ఆ వేళ అంతా ఇంత ఆనందంగా గడిచి పోయింది. ఆనందం తోటి, ఉత్సాహంతోటి మనసు ఊహిసలాడిపోతోంది. తనువంతా ఏవేవో పులకింతల తోటి పులకరించి పోతోంది.
నిజమే --
పొద్దున్న నుండీ జరిగిన సంఘటన లన్నిటిని గుర్తుకు తెచ్చుకుంటే, ఈ ఆనందానికి కారణం అర్ధమవుతుంది.
ప్రొద్దున్న అమ్మ వచ్చి లేపింది -- లే ఇందూ! శుక్రవారం పూట ఇంకా ఎంతసేపు ఈ పడకా?' అంటూ.
ఇందిరకు లేవాలని లేకపోయినా మౌనంగానే లేచింది, లేవకపోతే ఈసారి చివాట్ల తోటి అమ్మ సుప్రబాతం పాడుతుందని తెలుసు గనుక!- శుక్రవారం వస్తే ఇంతే బాధ -- తొందరగ లేవాలి. తలంటు పోసుకు తీరాలి-- పోసుకున్న తర్వాత బాగానే ఉంటుంది నిర్మలంగా. కానీ, పొసుకోవాలంటేనే విసుగు! అందుకే శుక్రవారం అనగానే భయం భయంగా ఉంటుంది, భయం కన్నా బాదే అధికం -- వెధవది , ఆరింటి కల్లా లేవాలి బాబూ!
ఆరింటికి లేపినా, అదే దండకం , అయిదింటి కి లేపినా అదే దండకం -- 'ఇంకా ఎంతసేపు ఈ పడక?'
పళ్ళ పొడి చేతిలో వేసుకొని, చెంబుతో నీళ్ళు ముంచుకొని, దొడ్లో కి దారితీసింది. నందివర్ధనం చెట్టు ఈ వేళ విరగబూసింది. వెళ్ళి బద్దకంగా నీళ్ళను అక్కడ పెట్టి కూచుంది. నోట్లో నీళ్ళు పోసుకొని మెల్ల మెల్లగా పళ్ళు తోముకోసాగింది.
'ఏమయింది? అయిందా లేదా ఇంకా?'
అబ్బ!-- ఈ అమ్మకు ఒకటే తొందర , ఇంకేముందీ కాఫీ కలిపేసి ఉంటుంది. చల్లారిపోయిన కాఫీ తాగినా ఒకటే ,, తాగకపోయినా ఒకటే!
తొందర తొందరగా మొహం కడుక్కుని, వంటిల్లు చేరింది. అప్పటికే గ్లాసులో పోసిన కాఫీ అందించింది అమ్మ.
'నీకోసం సుందరి వచ్చింది --'
'సుందరా?'
'ఆ -- రావడం , వెళ్ళిపోవడం కూడా జరిగింది .'
'ఎప్పుడోచ్చిందే?'
'అప్పుడే గంటయిందేమో!'
'మరప్పుడే లేవలేక పోయావా?' సుందరి వచ్చినా లేవలేదనేసరికి, ఒళ్ళు మండిపోయింది ఇందిరకు.
'ఇప్పుడు లేపినందుకే ఇన్ని సణుగు'తున్నావు-- ఇంకా తొందరగా లేపితే ....'
అమ్మ వాక్యం పూర్తీ చేయలేదు.
కానీ ఇందిరకు ఆ వాక్యం ఎలా పూర్తీ కావాలో తెలుసు!
నవ్వొచ్చింది ఇందిరకు -- అమ్మకు తనంటే భయమా? ఇష్టమా/
రెండు సమపాళ్ల లో ఉంటాయా ? ఏమో!
'ఏమన్నా చెప్పిందా ?'
'ఆ, తల అంటుకున్నాక పంపమంది.'
ఇందిర పకపకా నవ్వింది -- వాక్యం లో మొదటి సగం అమ్మ సొంతం!
ఖాళీ గ్లాసు పక్కన పెడుతూ అంది ఇందిర-- నే వెడుతున్నా అయితే!'
ఇందిర వంక చుర చుర చూస్తూ అంది సుమతి -- 'తలంటుకొని మరీ బయలుదేరు తిరుగుడుకు! అయినా అడ్డగాడిదలా ఏమిటది?'
'అడ్డగాడిద అనకూడదే, అడగాడిద ౦-' నవ్వుతూ అంది ఇందిర.
సుమటికీ నవ్వొచ్చింది.
'ఒక్కసారి వెళ్ళొస్తానే అమ్మా--'
'ఇప్పుడెం కొంప మునిగి పోలేదులే, తలంటు కున్నాక దేముడి గుడికి తోడు కోసం.' ఇందిరకు గుర్తొచ్చింది-- తలంటుకొని గుడికి వెళ్లాలని క్రితం రోజే నిర్ణయించు కొన్నారు ఇద్దరూ.
'సరే, నే వెడుతున్నా -- తలంటుకు' అంటూ లేచింది ఇందిర.
ఇందిర తలంటుకు అన్నీ అమర్చింది సుమతి. ఈలోగా ఇందిర చెవులకున్న దుద్దులు, మెళ్ళో గొలుసు తీసి దాచింది. స్నానం చేయగనే ఏమీ కట్టుకోవాలో అని ఆలోచిస్తూ అయిదు నిముషాల పాటు పెట్టె ముందరే గడిపి , ఏవో పట్టుకుని లేచింది.
'నే వెడుతున్నా మరి -- వేడినీళ్లు చాలక పొతే కేకెయ్ --' సుమతి బాత్ రూం లోంచి బయటకు వస్తూ అంది.
'సరేలే--'
దాదాపు పావుగంట తర్వాత --
ఎర్రని సిల్కు పరికిణి . అదే రంగు జాకెట్ -- వీటి రెంటి మధ్య సామరస్యం నెలకొల్పటానికన్నట్లు మల్లె పూవులాంటి , తెల్లని నైలాన్ వోణీ -- ఇవీ ఆనాడు ఇందిర శరీరాన్ని అంటి పెట్టుకోగలిగిన అదృష్టం చేసుకున్నవి.
తడి ఆరని తలను తుడుచుకుంటూ బాత్ రూం లోంచి బయట పడింది ఇందిర.
అగాధాలలోంచి వెతికి వెతికి ఆక్షణమే బయటకు తెచ్చిన మేలిరకపు ముత్యం లా ఉంది ఇందిర!
వియాత్నంగ లో జలకాలాడి ఆ క్షణమే భువి పైకి వివాహారానికి వచ్చిన రాయంచలా ఉంది ఇందిర!!
ఇలాటి క్షణం లో బయట నుంచి కేక వినిపించింది -- 'ఇందిరా!'
ఆ కుహూరము సుందరిది.
'రావే లోపలికి!'
సుందరి లోపలికి వచ్చింది మెల్లగా -- 'అయిందా పని?'
'ఇంకో అయిదు నిమిషాలు , ప్లీజ్....'
'కానీ మరి --' సుందరి అక్కడే కూల బడింది.
త్వరత్వరగా అడ్డం ముందు నిలబడి, అలంకరణ పూర్తీ చేసుకొని పది నిమిషాల తర్వాత లేచింది ఇందిర తాపీగా.
పువ్వు పూర్తిగా విచ్చుకుంది.
అందం ఉండగానే సరిగాదు ఆకర్షణా ఉండాలి. అపుడే ఆ అందానికి విలువ. వేయి పూలున్నాయి. నిన్నాకర్షించింది ఒకటీ లేకపోతె ఆ వేయి పూలూ వృధాయే! ఒకే పువ్వు నిన్నాకర్షించినదైతే చాలు, దాని పనిని అది నిర్వర్తించినట్లే!
ఇందిర ఈ క్షణం లో విచ్చుకున్న ఎర్ర కలువలా ఉంది.
ఇద్దరూ ఆలయం చేరుకున్నారు వేయి ఆకాంక్షలతో.
దేవిని దర్శించేసరికి మనసులోని కోటి కోరికలూ ఒకసారి విరబూసాయి.
మనసారా నమస్కరించుకున్నారు అదేవికి ఆ కన్నె పిల్లలు.
'ఎక్కడ కూర్చుందామే సుందరీ?'
'పోదాం పదవే, ఆలస్యంగా వస్తే శుక్రవారం పూట పూజ చేస్తానంది మా అమ్మ.' నవ్వుతూ అంది సుందరి.
ఇందిర నవ్వింది -- 'కానీ, దేవి దగ్గరకు వచ్చి, కూర్చోకుండా పోకూడదు , తెలుసా?'
సుందరి ఏమీ అనకపోవటం తో ఇందిర నాపరాళ్ళ మీద కూచుంది. సుందరీ కూర్చుంది.
'ఎమడిగావే సుందరీ?'
ఉలికిపడింది సుందరి-- 'ఎవర్ని?'
'ఎవరి నేమిటే? -- దేవిని --' ఇందిర అడిగింది.
'నువ్వేం కోరుకోన్నావు ?' సుందరి కొంటెగా అడిగింది.
'నాకు తెలీదసలు ఏం కోరుకోవాలో --'
'అయితే , నాకూ తెలీదు నాకోసం ఏం కోరుకోవాలో!' సుందరి అంది.
'ఇంకెవరి కోసమైనా కోరుకోగలవా?'
'ఆ, ఇపుడు చేసిన పని అదేగా!-'
'ఎవరి కోసం?'
'చెప్పనా?'
'పెద్ద ఊరించక చేబుదూ!-'
రాంబాబు కోసం--'
ఇందిర ఉలికిపడింది -- 'బాబ్జీ కోసమా?'
'ఏం? బాబ్జీ కోసమే!' -- 'అమ్మా -- బాబ్జి కి మా ఇందిరే కావాలిట. కొంచెం దయ చూపించు తల్లీ' అని కోరుకున్నాను.
'ఛీ- నీ రికమండేషనా?'
'నీ కక్కర్లేదని నాకు తెలీదు మరి!' సుందరి నవ్వుతూ అంది.
'పోవే - నువ్వు మరీను....వెడదామా ఇంక-'
ఇద్దరూ లేచారు. ఇల్లు చేరుకునేసరికి ఎనిమిదిన్నర అయింది. ఇంటికి రాగానే అంది సుమతి-- 'నీకోసం బాబ్జీ వచ్చి వేళ్ళాడే--'
'ఎప్పుడు?'
ఇప్పుడే వెళ్ళాడు గానీ, ఈవేళ అతని పుట్టిన రోజుట నీకు చెబుదామని వచ్చాడు.'
'అరెరే, అలాగా -- అమ్మా, ఒకసారి వెళ్ళి వస్తానే!' ఇందిర ప్రాధేయ పూర్వకంగా అడిగింది.
సుమతి ఏమనుకుందో ఏమోగాని వెళ్ళమంది . 'త్వరగా వచ్చేసేయ్-'
ఇందిర ఆ మాట పూర్తిగా వినలేదు --
'నమస్కారమండీ' సావట్లో ఉన్న వెంకటేశ్వర్లు కు నమస్కరించింది.'
'రామ్మా...రా....' ప్రసన్న వదనంతో పిలిచాడు వెంకటేశ్వర్లు.
'బాబ్జీ....'
'వెళ్లు. ఆ గదిలో ఉన్నాడు-' అన్నాడు వెంకటేశ్వర్లు తన చేత్తో రాంబాబు ఉన్న గదిని చూపిస్తూ. ఇందిర మౌనంగా ఆ గది లోనికి వెళ్ళిపోయింది.
'బాబ్జీ....'
ఇటుకేసి తిరిగాడు రాంబాబు.
అతని కళ్ళు తిరిగిపోయాయి. ఒక్కసారిగా.
ఎరని ఆ దుస్తులలో ఇందిర అందం ఒక్కసారిగా ద్విగుణీకృత మయినట్లనిపించింది అతనికి. అతనిలో వేయి ఊహలు చెలరేగి, అతన్ని కలవర పెట్టాయి. ఆ కలవరాన్ని అణచుకుంటూ అన్నాడు రాంబాబు : 'రా ఇందిరా -'
'విష్ యూ హాపీ బర్త్ డే...' రాగ మిళితం గా అంది ఇందిర.
'థాంక్స్ -'
'నేను నీతో మాట్లాడను -- 'అంది ఇందిర.
'అదేం?-' రాంబాబు కలవరపడుతూనే అన్నాడు.
'అంతే -- మాట్లాడనంటే మాట్లాడను-'
'అదేం ఇందిరా ! - కారణం ఏమీ లేకుండానే, శిక్ష?- అయినా సరే, దాసుని తప్పులు దండంతో సరి- ఇప్పుడు చెప్పాలి ఇంక -' రెండు చేతులు జోడించి అన్నాడు రాంబాబు.
ఇందిర పకాలున నవ్వింది ఆ అభినయానికి. 'పోనీగదా అని వదిలేస్తున్నా -- సరే గానీ -- నిన్న నాతొ చెప్పలేదేం ఈ సంగతి?'
'ఏ సంగతి?' ఏమీ తెలియనట్లే అడిగాడు రాంబాబు.
'అదే - నీ పుట్టిన రోజు సంగతి.."
'ఊ , చెప్పడానికి ఏముంది ఇందులో! ఈవేళ చెప్పాగా !'
'అలాక్కాదు . నిన్న చెబితే ఏమయినా తెచ్చేదాన్నిగా -'
క్షణం ఆలసించి అన్నాడు రాంబాబు.'నువ్వు తెచ్చేదేదీ నా కక్కర్లేదు గనుక!'
'అదేం బాబ్జీ?'
'నాక్కావాల్సింది వేరే ఉంది, అది తీసుకుందామని....
ఇందిరకు అర్ధమయింది. అయినా ఏమీ మాట్లాడలేదు.
ఒకసారి తలెత్తి పైకి చూసింది కప్పు కేసి - ఫ్యాను తిరుగుతోంది గదిలో. ఆ ఫ్యాను గాలికి తలంటుకున్న ఆమె కురులు విలాసంగా ఆమెనుదుటి మీద నాట్యం చేస్తున్నాయి.
సరిగ్గా అదే సమయంలో రాంబాబు మనసులో ఆశలెన్నో దోబూచులాడాయి. ఆమె