Previous Page Next Page 
ఆకాశ దీపాలు పేజి 2

 

    'డబ్బులిచ్చి ఎన్ని కొనుక్కోగలం చెప్పండి?'
    'ఆ-- అదే నేనూ అనేది ..' అంది.
    'నాకు పడేవి పది ఒట్లయినా , అవి నాకోసం పడాలే గానీ, నా డబ్బు కోసం మాత్రం కాకూడదు -- ' శారద కలగజేసుకుంటూ అంది.
    'దట్స్ రైట్--' శర్మ అన్నాడు ఆఖరికి.
    'ఇంతకీ ఫలహారం తోనే సరిపోయిందా? కాఫీ లేదా?' స్వర్ణలత జ్ఞాపకం చేసింది.
    'సారీ -- ఇప్పుడే ఒక్క క్షణం --' అంటూ లోపలికి వెళ్ళింది శారద.
    కాఫీలు తాగాక అందరూ కదిలారు వెళ్తామన్నట్లు--
    మోహనరావు మాత్రం అక్కడే ఉండిపోయాడు --
    'మీ అమ్మగారు ఎక్కడున్నారు?'- మెల్లగా అడిగాడు మోహనరావు.
    'చెట్లకు నీళ్ళు పడుతోంది -- ' అంది శారద.
    'శారదా -- మీ అమ్మగారికి తెలుసా నువ్విలా ఎలక్షన్ లో....
    'లేదు చెప్పాలి--'
    'ఏమీ అనరుగా --' మోహన్ ఆత్రుతతో అడిగాడు.
    'ఏమీ అనదు, అనుకోదు -- కానీ ......'
    'ఏమిటి మళ్లీ కానీ....'
    'ఓడిపోతావేమోనండి ...భయంగా ఉంది. చెబితే మీరు వినరు --'
    'శారద , నామాట నమ్ముతావా ?--'
    'ఏమిటి ?--'
    'నువ్వు ఓడిపోవటం కల్ల, ఒకవేళ ఓడిపోయావే అనుకో --'
    '.....ఊ, అనుకున్నాను ...' అంది శారద నవ్వుతూ.
    'నువ్వు ఓడిపోతే శిక్ష నాకు వెయ్యాలి, అవునా?'
    'ఆ-- ఆఫ్ కోర్స్ ....'
    'ఒకవేళ అదృష్టవశాత్తూ నువ్వు ఓడిపోతే ,, యూనియన్ ఇరాగారేషన్ కాక ముందే, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా -- చాలా ఈ శిక్ష ?'
    'యూ సిల్లీ --' అంది శారద నవ్వుతూ.
    'సిల్లీ గాదు సీరియస్ గా చెబుతున్నా -- వెళ్ళనా మరీ?' అనడిగాడు మోహనరావు. శారద నవ్వింది.
    మోహనరావు కదిలాడు -- అతను సందు మలుపు తిరిగేవరకూ అక్కడే వుండి లోపలికి తిరిగి వచ్చింది శారద.
    శారద ను అమ్మ లోపలికి రాగానే అడిగింది -- 'ఏమిటి హడావుడి?'
    'హడావిడే మరి, కాలేజీ ఎలక్షన్స్ .... నేను పోటీ చేస్తున్నా....' అంది శారద గర్వంగ.
    'ఎలక్షన్లో నిలబడితే మరి వాగ్దానాలు గట్రా ........'
    'ఓ, బోల్డు చేసేసా -- నాకు ఓటు వేసే వాళ్ళందరి కి వారడిగేది ....'
    'మరి నాకో?--'
    'నీకా? నువ్వు వూరుకో అమ్మా! నీకంటే నాకెక్కువ ఎవరే?........'
    'ఇస్తావా మరి?-'
    'మాట తప్పితే ఓడినంత ఒట్టు -- ' అంది శారద నవ్వుతూ --
    'నిజంగనేనా? -- అయితే ...' అంటూ కాగితాలందించింది శారద అమ్మ శారదకు.
    'ఏమిటమ్మా ఇదంతా?-'
    'చదువు , నీకే తెలుస్తుంది...'
    'ఏమిటమ్మా ఇది కధా? నవలా?? నువ్వు రాశావా?--'
    'కధ గాదు , నవలా కాదు -- జీవితం తల్లీ ఇది -- ఇది నువ్వు చదవాలి. తప్పదు. చివరి దాకా ఏమీ అడక్కు. అంతా నీకే అర్ధమౌతుంది --'
    తల్లి ముఖం లో క్షణం వెలిగిన సందేహం పోగొట్టడానికి , శారద అయిష్టంగానే ఆ కాగితాలు చదవ నారంభించింది.
    
                                                          *    *    *    *
    గోధూళి వేళ.
    సాయంకాలపు నీరెండ ఆ పెంకుటింటి పెంకుల పై పడి వింత వింత కాంతులీనుతోంది. తెల్లని గోడల పై పడ్డ ఆ ఎండ వల్ల ఆ ఇల్లు మరింతటి అందాన్ని సంతరించుకుంది.
    ఇంటి ముందు చిన్న చెక్కల గేటు, గేటు కు రెండు ప్రక్కలా రెండు ఇంకా పూర్తిగా ఎదగని పోక చేట్లుండి, గాలికి అటూ ఇటూ ఊగుతూ , ఇంటిలోకి ప్రవేశించేవారికీ స్వాగతం చెబుతున్నట్లుగా ఉంటుంది. ఇంటి వసారా దగ్గిర దగ్గర లో ఒక ఎత్తైయిన కొబ్బరి చెట్టు, గాలి వీచినపుడు బహు సోయగం తో కదలాడుతూ , వయ్యారం ఒలికిస్తూ వింతైన స్వరాలు పలుకుతున్నట్లనిపిస్తుంది.
    ఆ ఇంటికి యజమాని రామచంద్రయ్యే గానీ, ఇదేమీ రామచంద్రయ్య స్వార్జితం మాత్రం కాదు. రామచంద్రయ్య తాతగారి పూర్వికులెవరో కట్టి పెట్టారనిపిస్తుంది. అది నిజమేనని అక్కడక్కడ గోడల మీద కనిపించే బీటలు పలుకుతూనే ఉంటాయి. అయినా రామచంద్రయ్యకు ఈ ఇల్లంటే ఇష్టమే గానీ ఏ విధమైన నిర్లక్ష్యం లేదు. తనకీ ఇష్టంటే ఇష్టం అన్నట్లు చెప్పడానికి ప్రతి దీపావళికి- వెల్ల వేయిస్తాడు. పైపెచ్చు నవ్వుతూ అంటాడు అప్పుడప్పుడు 'ఇందులోనే కదండీ నేను పుట్టింది.' అని.
    నిజమే, కాదనను ; తను పుట్టిన ఇల్లు అంటే ఎవరి కిష్టం ఉండదు?
    సాయంకాలం సమయాల్లో రామచంద్రయ్య ఎక్కడికీ వెళ్ళడానికి ఇష్టపడడు. పెరట్లో తను స్వయంగా పాతిన మామిడి చెట్ల కు , మనో రంజితం చెట్లుకు , నందివర్ధనం చెట్టుకు, అరటి చెట్లకు తను స్వయంగా నీరు పడితే గాని, పోసినట్లే అనిపించదు రామచంద్ర య్యకు. అందుకే ప్రతి రోజూ సాయంత్రం అటూ ఇటూ రోడ్ల మీద తిరిగి, అనవసరంగా కాలయాపన చేయడం కన్నా, ఇంటి పని- ముఖ్యంగా తోట పని చేసుకోవడం -- రామచంద్ర య్యకు చాల ఇష్టము. ఆసక్తి దాయకం కూడాను.
    ఏరోజైనా అనుకోకుండా విసుగు కలిగినా, చెట్ల కు భార్య నీరు పడతానన్నా రామచంద్రయ్య నిక్షేపంగా అంగీకరిస్తాడు. అలా వీలు కలిగిన సమయాల్లో అతడు అలా వెళ్లి ' ఓ అట వేసుకుందామా' అని అడుగుతాడు వెంకటేశ్వర్లునో, వెంకు పంతులునో!
    అలాగని అతడాడేది చతుర్ముఖ పురాణం కాదు.
    చతుర్ముఖ పురాణం అంటే రామచంద్రయ్య కు ఎలర్జీ ఉంది. ఈ పురాణం వాళ్ళ నరలోక ప్రాప్తి సంగతి దేవుడేరుగు కానీ ఇహ లోకం లోనే నరకం చవి చూసే సావకాశం ఉందని అతనికి తెలుసు!
    అందుకే అతను చతురంగ బలాలతో కూడిన చదరంగమే ఆడతాడు. ఇన్నాళ్ళ నుంచి ఆడుతున్నా , వెంకు పంతులు ఆటను తను కట్టించలేకపోతున్నాననే అతనికి దిగులు!
    వెంకు పంతులుది ఎడురిల్లె! పౌరోహిత్యం అతని వృత్తి. ఎంత పని ఉన్నా సాయంకాలం పూటలన్నీ అతనికి ఖాళీయే! అందుకే రామచంద్రయ్య వెళ్లి అడగటం తడవు వెంకు పంతులు ఆటకు సిద్దమయి వస్తాడు. ఇకపోతే , వెంకు పంతులుకు వీలు కానప్పుడు అంటే అనివార్య కారణాల వల్ల -- వెంకు పంతులు కున్న 'అనివార్య కారణాలు' అన్నీ అతని భార్యే -- రామచంద్రయ్యతో ఆడడానికి వచ్చేవాడు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు రిటైర్డ్ జడ్జి. కాస్తో కూస్తో ఉన్నవాడని ప్రతీతి. జడ్జీగా పనిచేసేటప్పుడు కొంచెం వెనక వేశాడంటారు. వెనక ఏమైనా ఉందొ లేదో గాని తిండికి మాత్రం లోటు లేదు.
    ఆవేళ కూడా రామచంద్రయ్య యధావిధి గా చెట్లకు నీళ్ళు పోస్తున్నాడు. 'తను స్వయంగా నాటిన చెట్లవి. ఆ చెట్ల కు నీళ్ళు తనే పోయాలి ' అంటాడతడు! రేపు ఈ చెట్ల ఫలం తననుభవించగలడో లేదో గాని, దానికింత చాకిరీ మాత్రం రోజూ చెయ్యాల్సిందే!
    'రామచంద్రం! పంతులు గారూ!'
    వీధిలోంచి కేక వినబడింది. ఆ కేక వెంకు పంతులిది!
    'సుమతీ! ఎవరో వచ్చారు చూడు!' భార్యను కేకవేస్తూ అన్నాడు రామచంద్రయ్య. సుమతి నిండుగా కొంగు కప్పుకొని వెళ్లి చూసి వచ్చింది. 'వెంకు పంతులు గారు!'
    'కూర్చోమనలేక పోయావ్?"
    మళ్లీ వెళ్ళింది ఈసారి చాపతో, చరంగం బోర్డు ను పావుల డబ్బాను అక్కడే పెట్టేసి లోపలికి వచ్చింది.
    "మీరు వెళ్ళండి-- నేను పోస్తా నీళ్లు.'
    'మరి. నీ పని అంతా అయిపోయిందా?'
    'కొద్దిగా ఉంది గాని, ఫర్వాలేదు లెండి , మీరు వెళ్ళండి.'
    'చూడు, ఆ మామిడి చెట్టుకు నీళ్ళు పట్టాను గానీ మరోసారి పట్టు -- మర్చిపోయేవు తడీపోడిగా కాక తగినన్నీ నీళ్ళు పొయ్యి.'
    రామచంద్రయ్య ఇంట్లోకి రాబోతూ, తడి చేతిని  భార్య కొంగుకు తుడుచుకున్నాడు. సుమతి అదోలా చూసింది -- రామచంద్రయ్య అదేం పట్టించుకోలేదు.
    రామచంద్రయ్య వీధిలోకి వచ్చేసరికి, వెంకు పంతులు పావులు సర్ది ఆటకు సిద్దంగా ఉండడం అలవాటు. కానీ, ఈవేళ అలా లేదు. రామచంద్రయ్య వెళ్లేసరికి వెంకు పంతులు ఇంకా అలాగే కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తూ.

 Previous Page Next Page