Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 3

                                 

   
    "సరస శారద చంద్రికా స్థగిత రజిత
    యామున తరంగ నౌకా విహారములకు
    నన్ను రమ్మని చెప్పి బృందావనమున;
    కింటిలో హాయిగా కూరుచుంటివేమి?
    
    ఎంత తడవయ్యె నే వచ్చి -ఎంతనుండి
    వేచియుంటిని  - పొదరిండ్లు పూచి - వలపు
    వీచికలు లేచి - హృదయాలు దోచికొనెడి
    యీ శరజ్జ్యోత్స్నలో - పుల్కరించి పొంగి
    మ్రోతలెత్తెడి యమునానదీ తటాన.
    
    ప్రేయసి నుపేక్ష సేతువే ప్రియవయస్య!
    ఇంత నిర్దయ పూనెదవే దయాళు!
    ఇంతగా చిన్నబుచ్చెదవే మహాత్మ!
    ఇట్లు గికురింతువే నన్ను హృదయనాథ!"
    
    కలికి యిటు వచ్చిరాని పేరలుకతోడ
    సజలనయనాల జీవితేశ్వరుని గాంచె.
    
    సరస సంగీత శృంగార చక్రవర్తి
    సకల భువనైక మోహన చారుమూర్తి
    రాధికా మానస విహార రాజహంస
    మందహాసమ్ము కెమ్మోవి చింద పలికె.
    
    "ఆలసించుట కాగ్రహ మందితేని
    వెలది! విరిదండ సంకెలల్ వేయరాదొ!
    ముగుద! పూబంతితో నన్ను మోదరాదొ!
    కలికి! మొలనూలుతో నన్ను కట్టరాదొ!"
    
    రాధికా క్రోధ మధురాధర మ్మొకింత
    నవ్వెనో లేదొ! పకపక నవ్వె ప్రకృతి;
    నవ్వుకొన్నది బృందావనమ్ము; యమున
    నవ్వుకొన్నది; చంద్రుడు నవ్వినాడు;
    విరుగబడి తమ పొట్టలు విచ్చిపోవ
    నవ్వినవి రాధ తలలోని పువ్వులెల్ల!!
    
    వాలుగన్నుల బాష్పాలు జాలువార
    నంత రాధిక వివశయై అంఘ్రియుగళి
    వ్రాలిపోయిన ప్రియుని కెంగేల నెత్తి
    చిక్కుపడిన ముంగురులను చక్కనొత్తి
    చెఱగిపోయిన తిలకమ్ము  సరియొనర్చి -
    
    "అవునులేవోయి! కపటమాయాప్రవీణ!
    ధీరుడవు మంచి శిక్షనే కోరినావు?
    నిత్య సుకుమారమైన సున్నితపుమేను
    నాదు చేబంతి తాకున నలిగిపోదె?
    సొక్కి సోలిన నీ మోము చూడగలనె?
    చేతు లెట్లాడు నిన్ను శిక్షింప నాథ!
    
    ఎంత నిర్దయురాలనో పంతగించి
    కృష్ణ! నీచేత నిట్లు మ్రొక్కించుకొంటి
    నవ్య వనమాల కంఠాన నలిగిపోయె
    చెక్కుటద్దాల తళుకొత్తె చిగురుచెమట
    కొదమ కస్తూరి నుదుటిపై చెదరిపోయె
    బర్హిబర్హంబు చీకాకుపడియె మౌళి.
    
    పొందనేర్తునె నిన్ను నా పూర్వజన్మ
    కృత సుకృత వైభవమున దక్కితివి నాకు!
    విశ్వసుందర చరణారవింద యుగళి
    ముద్దుగొని చెక్కుటద్దాల నద్దుకొను అ
    దృష్ట మబ్బిన దొక్క రాధికకె నేడు.
    తావకీన సౌందర్య సందర్శనాను
    భూతిలో పొంగి ప్రవహించిపోదునోయి!
    
    ఎంత కారుణ్య మున్నదో యెంచగలనె
    కమలలోచన! నీ కటాక్షములలోన!
    ఎంత లావణ్య మున్నదో యెంచగలనె!
    ప్రేమమయమూర్తి! నీముద్దుమోములోన!
    
    ఎంత మాధుర్య మున్నదో యెంచగలనె!
    సులలిత కపోల! నీ మృదుసూక్తిలోన -
    ఎంత యమృతమ్ము కలదొ భావింపగలనె!
    స్వామి! తావక మందహాసమ్ములోన -
    
    ఎంత మైకమ్ము కలదో యూహింపగలనె!
    రాధికానాథ! నీ మధురాధరమున;"
    
    అనుచు రాధిక పారవశ్యమున మునిగి
    వ్రాలె మాధవు స్నేహార్ధ్రవక్షమందు.
    
    "రాధపై ప్రేమ మధికమో మాధవునకు
    మాధవునిపైన రాధ ప్రేమయే ఘనమ్మొ"
    ఈ రహస్యము నెఱుగలే రెవరుకూడ
    ప్రణయమయ నిత్యనూత్నదంపతుల వారు!
    
                                  
                                       
                                       
    
    చూచెదవేలనో ప్రణయసుందరి! కాటుక కళ్ళలోని ఆ
    లోచన లేమిటో హరిణలోచని! నీ చిఱునవ్వులోని సం
    కోచము లెందుకో కుసుమకోమలి! నీ మధురాధరమ్ములో
    దాచుకొనంగ నేటికి సుధామయసూక్తి కళావిలాసినీ!
    
    భావోధ్యానమునందు క్రొత్త వలపుం బందిళ్ళలో కోరికల్
    తీవల్ సాగెను; పూలుపూచెను; రసార్ధ్రీభూతచేతమ్ముతో
    "నీవే నేనుగ" "నేనె నీవుగ" లతాంగీ! యేకమైపోద మీ
    ప్రావృణ్ణీరదపంక్తిక్రింద పులకింపన్ పూర్వపుణ్యావళుల్!
    
    మనదాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ము లోలోతులన్
    గనియెన్; సాగెను భాగ్యనౌక కవితా కాళిందిలో; నవ్య  జీ
    వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము! నే కొల్ల గొం
    దును నీ కోమల బహుబంధనములందున్ కోటి స్వర్గమ్ములన్ !  
                                                                                                                                                                              
    
    అంజనరేఖ వాల్గనుల యంచులు దాట, మనోజ్ఞ మల్లికా
    కుంజములో సుధామధుర కోమలగీతిక లాలపించు ఓ    
    కుంజదళాక్షి! నీ ప్రణయ గానములో పులకింతునా - మనో
    రంజని! పుష్పవృష్టి పయి రాల్చి నినున్ పులకింపజేతునా!
    
    క్రొంజిగురాకు వ్రేళుల కురుల్ తడియార్చుచు కూరుచున్న అ
    భ్యంజన మంగళాంగి! జడ లల్లుదునా - మకరంద మాధురీ
    మంజుల మామక ప్రణయ మానసభావనలే ప్రఫుల్ల పు
    ష్పాంజలిచేసి నీ యడుగులందు సమర్పణ చేసికొందునా!

 Previous Page Next Page