"ఇంద. ఈ ఛురిక నీవు తీసుకో నేను టార్చి చూపుతాను. ఈ వంకనించి శబ్దం వినిపిస్తోంది యిటుపద" అంటూ ఒక దిక్కుని నిర్దేశించింది ఆమె.
భయంకరమయిన చలిలో, ఎటుచూచినా అంతు తెలియని మంచుకొండల మధ్య భయాన్ని మరచి వారివురురూ శబ్దం వినిపించే దిక్కుకు నడవసాగారు.
పావుగంట అలా నడిచిన తరువాత సిన్హా కంఠ స్వరం మరింత దగ్గర అయింది.
దాన్ని బట్టి ఆ జంతువు తనకన్నా వేగంగా ముందుకు పోవటంలేదని గ్రహించింది మాలతి. కాని వెలుతురు చూస్తే జంతువులు పరుగెడతాయి. అందునించి టార్చి లైటుని ఆర్పివేసిందామె. ఏ జంతువు అయినా నిప్పుచూస్తే జడుసుకుంటుంది.
కాస్సేపు కళ్ళు మూసి తెరచిన తరువాత దారి కొంచెంగా కన్పిస్తోంది. వారు మరింత వేగంగా నడిచి సిన్హాను మోసుకుపోతున్న ఆకారాన్ని సమీపించారు.
ఆ ఆకారం మానవాకృతి పోలిఉండటం గమనించి మరింత ఆశ్చర్యపడిపోయింది మాలతి. ఇంక ఆ ఆకారం రెండు గజాల దూరంలో ఉందనగా దానికి ఛురికను గురిపెట్టి విసరాలని ప్రయత్నించాడు ఫిజో!
అలా చేయకుండా వారించింది మాలతి. "ఫిజో ఛురిక సిన్హాను తగిలితే ఏం చేస్తావు" అంది ఫిజో అంతటితో ఆ ప్రయత్నం మానుకున్నాడు.
అలికిడి అయినట్లు తెలుసుకున్న ఆ ఆకారం చివ్వున వెనుదిరిగింది. రెండు మానవాకృతులు తనను అనుసరించి వస్తున్నాయని అర్ధంచేసుకుంది. సిన్హాను నేలమీదకి వొదిలేసి వారి మీదికి వచ్చింది.
దాని చెరనించి బయటబడిన సిన్హా బ్రతుకు జీవుడా అని చావు పరుగులంకించుకున్నాడు. అది వచ్చిన విసురుకు ఫిజో తూలిపడిపోయినాడు. కత్తి ఎక్కడో జారిపడిపోయింది. మాలతి చేతిలోని టార్చి విసురుగా నేలను తాకి అద్దం పగిలిపోయింది.
ఫిజో తనను తాను సంభాళించుకుని లేచేలోపు ఆరున్నర అడుగులపొడవున్న ఆ-ఆకారం మాలతిని భుజంమీదికి ఎత్తుకుంది. ఆ పట్టునించి విడిపించు కోవాలని విఫల ప్రయత్నం చేసింది మాలతి.
ఆ ఆకారం వడిగా పరుగు తీయసాగింది. ఫిజో ప్రాణాలను తెగించి దాన్ని అనుసరించసాగాడు. కొంత దూరం పోయాక చదునుఅయిన ప్రదేశం ఆసాంతమయింది. అక్కడ నిలువునా దిగిపోయిన లోయ!
ఆ ఆకారం సునాయాసంగా లోయలోకి దిగిపోతుంది. పోవాలని ప్రయత్నించి మూడుసార్లు క్రిందిపడిలేచాడు ఫిజో! అడుగు అయినా ముందుకి సాగలేదు.
"ఫిజో నీవింకరాకు. వెనుదిరిగి వెళ్ళిపో!" అని అరుస్తోంది మాలతి. క్రమంగా దూరమవుతున్న ఆ అరుపువింటూ పిచ్చివానిలా అయ్యాడు ఫిజో!
2
సిన్హా దిక్కు తెలియకుండా గంటన్నరసేపు కొండదారుల వెంట పిచ్చి పరుగు తీశాడు. అప్పటికి చందమామ నడిమింటికి వచ్చింది.
గ్రుడ్డి వెన్నెలలో అతడు దూరంగా గుడారం ఉన్న చోటుని గుర్తించాడు. ప్రాణం లేచివచ్చినట్లుగా అయింది. అంతటి శీతల గాలులు శరీరాన్ని సోకుతున్నా చిరుచెమటలు క్రమ్మినాయి. భయం పారిపోయిన మరు క్షణాలనుంచి చలిగాలులకు తట్టుకోలేకపోయినాడు. వడివడిగా నడిచి గుడారం చేరుకున్నాడు.
మిత్రులంతా అతనిని చుట్టుముట్టి అతనిని ఎత్తుకుపోయిన విచిత్ర జంతువుని గురించి ప్రశ్నించసాగారు. సిన్హా ఆ విషయం గుర్తుకురాగానే తిరిగి భయ విచలితుడు అయిపోయాడు. మాటలు తడబడుతున్నాయి. అతని అవస్థను గుర్తించిన గోయెల్ మాట్లాడవద్దని మిత్రులందరికి సైగల ద్వారా తెలియచేశాడు.
ముఖర్జీ "స్టౌ" వెలిగించి క్షణాలమీద టీ తయారుచేసి మిత్రునికి అందించాడు, తొందరలో పాలపొడి మరింత వేయడం వలన అది చిక్కని ఒక విచిత్రమయిన ద్రవంలా తయారయింది. సిన్హా వేడి తేనీరు రుచితో నిమిత్తం లేకుండా గట గటా తాగేశాడు.
ఆ తరువాత రవంత స్వస్తుడయినాడు.
"ఫిజో ఎక్కడ?" అని అడిగాడు కుట్టి ఆదుర్దాగా.
"వాడితో పోరాడుతున్నాడు." అని బదులు చెప్పాడు సిన్హా.
వింటున్న వారంతా అవాక్కుపడిపోయారు.
"వాడు అంటున్నా వేమిటి? నిన్ను ఎత్తుకుపోయింది జంతువు కాదా?" అని ప్రశ్నించాడు ముఖర్జీ ఆ ప్రశ్నకు వెను వెంటనే సమాధానం ఇవ్వలేకపోయినాడు సిన్హా. రవంత సేపు కన్నులు అరమోడ్చి తనకు ఎదురు అయిన ఆ భయం కరమయిన అనుభవాన్ని తలపోశాడు. ఒళ్ళు జలదరించసాగింది.
"ఫ్రెండ్స్ మనిషి అవునో కాదో మీరు అంత ఖచ్చితంగా తేల్చి చెప్పమని అడిగితే నేనేమి చెప్పలేను. రెండు చేతులున్నాయి రెండు కాళ్ళున్నాయి. శరీరంమీద వెంట్రుకలు అధికంగా వున్నాయి. నన్ను అవలీలగా మేకపిల్లను ఎత్తుకున్నట్లు భుజాలమీదికి ఎత్తేశాడు.
తోడేలు, చింపాంజిలాంటి మృగాల దగ్గరగా వెడితే ఎలాంటి దుర్గంధం వస్తుందో అలాంటి వాసనే వస్తోంది అతడి దగ్గర. మాటలు రావనే అనుకుంటాను. నన్ను ఏమి చేయాలని భావించాడో తెలియదుకాని మాలతి, ఫిజోలదయ వలన బయటపడి పోయాను. "అన్నాడు సిన్హా వొగుర్చుతూ వింటున్నవారికి కంగారు మరింత అయింది.
"అయితే వారిద్దరినీ అలా ఆ మృగం దగ్గర వదిలేసి పారిపోయివచ్చినావన్న మాట." అంటూ కంఠస్వరంలో రవంత కోపాన్ని పలికించినాడు గోయెల్.
"అతడు నన్ను విడిచిపెట్టిన మరుక్షణం నాకేమీ తెలియలేదు. ప్రాణ భయంతో పరుగెత్తుకువచ్చేశాను." అంటూ తలదించుకున్నాడు సిన్హా. అతడి మాటల్లో నిస్సహాయత అర్ధమయిన మరుక్షణం వేరేమీ అనలేక పోయినాడు.
"మనం కూడా వారికి సాయం వెళ్ళాలి." అన్నాడు కుట్టి.