"మీ అమ్మకి నువ్వంటే చాలా యిష్టం సుకృతీ. ఎంత యిష్టమూ అంటే తన అనారోగ్యం గురించి సైతం నీకు తెలియనివ్వకూడదని చాలా జాగ్రత్త పడింది. అలాగే అయిదేళ్ళూ గడిపింది" సుకృతిని మానసికంగా ప్రిపేర్ చేస్తున్నట్టుగా అంది అలివేలు. వ్యవధిలేదు. సాధ్యమైనంత త్వరలో క్లుప్తంగానైనా కొన్ని నిజాల్ని సుకృతికి తెలియ చెప్పాలి.
"అయిదేళ్ళుగా....." దుఃఖం ముంచుకొచ్చింది సుకృతికి. "ఒంట్లో బాగోలేకపోయినా ఎందుకు యిలా దాచేరు మీరంతా?"
"తెలిస్తే నువ్వు తట్టుకోలేవన్న భయం."
"అమ్మ కన్నా నాకు చదువే ముఖ్యమా....."
నిర్వేదంగా చూసింది అలివేలు. "ముఖ్యమనేగా నిన్ను స్టేట్స్ పంపింది. అసలు మీ అమ్మ తన భార్యస్థానంకన్నా తల్లి స్థానాన్నే అపురూపంగా చూసుకునేది సుకృతి. అందుకే నిన్ను చిన్నతనం నుంచీ "మమ్మీ" అననివ్వకుండా "అమ్మా" అని పిలిపించుకునేది. అలా పిలిపించుకుంటే తప్ప తను తల్లిని కానేమో అన్న పిచ్చి ఆలోచనతోనే నీ చిన్నప్పటి మాటల్ని టేప్ లో వింటూ నీకూ దూరంగా బ్రతికేయగలిగింది యిన్నాళ్ళూ."
నటిగా ఎంత బిజీగా వున్నా షూటింగ్స్ నుంచి ఎంత అపరాత్రి వేళ యింటికి వచ్చినా రోజుకి ఓ అరగంట పాటైనా తనను ఒడిలోకి తీసుకుని జోకొట్టడంలో అమ్మ ఎంత ఆనందించేదీ సుకృతికి యిప్పటికీ జ్ఞాపకమే.
"అమ్మకేమైంది?"
క్షణం ఆగి అంది అలివేలు "లివర్ కేన్సర్"
సుకృతి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
చాలా ఆలస్యమైపోయాకనే తననే పిలిపించారని అర్ధమైపోయింది.
"తన పరిస్థితి గురించి నీకు ముందే తెలియచేయమన్నాను సుకృతీ.....కానీ వినలేదు మీ అమ్మ నిన్ను కంగారు పెట్టడం యిష్టం లేదంటూ దాటేసేది....ఇప్పుడైనా నీకు తెలియచేసింది నేనే."
తల వంచుకున్న సుకృతి చెంపలపైనుంచి నీళ్ళు ధార కడుతుంటే నెమ్మదిగా అడిగింది.
"నాన్న పట్టించుకుని వుండరేమో కదూ!"
అమ్మలాంటి మరో ఇద్దరు స్త్రీలకు భర్తయిన నాన్న ప్రత్యేకించి అమ్మ విషయంలో శ్రద్ద తీసుకుంటాడన్న నమ్మకం లేదు. అయినా అడిగింది.
"నిన్ను స్టేట్స్ లో చదివించడమంటే డబ్బు తగలెయ్యటంగా భావిస్తూ తరచూ మీ అమ్మతో పోట్లాడే మీ నాన్నకి ముఖ్యం మీ అమ్మ కాదు సుకృతీ! డబ్బు....." సాలోచనగా చెప్పింది అలివేలు.
"అసలు మీ అమ్మ మహానటి అయినా జీవితంలో హీరోగా నటించడం తెలీని ఆడది సుకృతీ! అందుకే తెరమీద హీరోగా నటించి కొద్దిపేరు మాత్రమే సంపాదించుకున్న రామన్ నిజ జీవితంలో అద్భుతమైన ప్రేమికుడిగా నటించేసరికి ట్రేప్ లో పడిపోయింది. అతడి తెర జీవితం మూలాన పడ్డా తను మాత్రం అతడ్ని త్రికరణశుద్ధిగా నమ్మింది. మనసు, శరీరాన్ని మాత్రమే గాక-ఆస్తినీ అతడి సొంతం చేసింది."
సుకృతి రెప్పవాల్చకుండా చూసింది. తండ్రితో ఆమెకు అంతగా చనువు లేదు. ఎప్పుడో వారానికోమారు తనను పలకరించడం తప్ప ప్రేమగా దగ్గరకు తీసుకోవటం ఆమెకు గుర్తులేదు. అయితే యింతకాలమూ తనకు తెలీని చాలా విషయాల్ని యిప్పుడు అలివేలు ద్వారా వింటూంది.
"కొందరి జీవితాలు చాలా మార్గదర్శకమైపోతుంటాయి సుకృతీ! ఆ కొందరూ చారిత్రకమైన వ్యక్తులు అవునో కాదో నాకు తెలీదు కానీ మీ అమ్మ మాత్రం రేపటి నటీనటులకి గొప్ప స్పూర్తి. నటిగానే కాదు, ఓ వ్యక్తికి భార్యయిన నటిగా కూడా! ఇలా ఎందుకంటున్నానూ అంటే ఏ భార్యయినా ఎలా వుండకూడదో తన పతనం ద్వారా చాలామందికి తెలియచెప్పింది కాబట్టి..... నేనిలా మాట్లాడుతున్నందుకు నన్ను తప్పుబట్టకు సుకృతీ! నాలా పెళ్ళికాకుండా మిగిలిపోయిన ఆడవాళ్ళు పెళ్ళయిన స్త్రీలను చూసి ఇన్ ఫీరియర్ గా ఆలోచించడం ఆనవాయితీ అయినా మీ అమ్మ చేసిన తప్పేమిటో తెలిశాక నేనే చాలా అదృష్టవంతురాలినని అనుకునేదాన్ని అసలు ఏ నటి అయినా సాధించేది, సాధించాలనుకునేది ముందు కీర్తి! ఆ కీర్తితో వచ్చే ఆత్మసంతృప్తి. అయితే ఆ తర్వాత డబ్బు ఆటోమేటిక్ గా సంపాదించడం జరుగుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఏ నటి అయినా జాగ్రత్తపడాలి సుకృతీ! లేకపోతే ఈనగాచి నక్క పాల్జెయ్యడం అంటారే అలా అయిపోతుంది జీవితం! కీర్తి, ఆత్మసంతృప్తి, డబ్బు, దానితో చుట్టు ముట్టే వందిమాగధులు, జీవితానికి సంబంధించిన విశ్లేషణ మిస్ కావడం ఎండమావికి, నీటి చెలమణీ తేడా తెలుసుకోలేని భ్రాంతి. ఆ తర్వాత చిత్రముగా పేరుకునే వెలితి. ఆ వెలితిని పూడ్చడానికి నేనున్నానంటూ వలలు విసిరే వ్యక్తులు. అందులో ఏ వ్యక్తికో లొంగిపోవడం, ఆ లొంగిపోవటాన్ని ప్రేమనుకోవడం, పెళ్ళిదాకా దారితీయడం, ఆ తర్వాత తాను వంచించబడ్డానని తెలిసి కూడా కాంప్రమైజ్ అయి బ్రతుకుని కొనసాగించడం!!"
క్షణం ఆగింది అలివేలు.
"ఇది ఒక్క మీ అమ్మ జీవితానికి మాత్రమే వర్తించేది కాదు సుకృతీ! పేరొచ్చిన ప్రతి నటి జీవితమూ యింతే! ఓ మామూలు అమ్మాయినా సినీ రంగంలో అడుగుపెట్టి చాలామంది తెరకి పనికిరాదని తిరస్కరించినా, నిరుత్సాహపడకుండా నటిగా ఎదగటానికి అహోరాత్రులు శ్రమించిన రాజ్యం అనబడే మహానటి దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ నటి స్థానం సంపాదించటానికి పట్టించి ఎన్నేళ్ళయినాగాని, రామన్ అనబడే ఓ తమిళ నటుడి ట్రేప్ లో చిక్కటానికి పట్టింది కేవలం ఆరు నెలలు మాత్రమే! నిరంతరమైన తపస్సుతో ఓ స్థానాన్ని సంపాదించుకున్న నీ తల్లి మనసులో పేరుకున్న వెలితిని పూడ్చటానికి ఓ ఆసరా కోరుకుంటూ మీ నాన్నకి దగ్గరైంది. రామన్ సంగతి తెలిసిన శ్రేయోభిలాషులు చాలామంది ఇది కూడదని హెచ్చరిస్తున్నా అతడికి భార్య అయిపోయింది. ఆ తరువాత తెలిసింది అప్పటికే రామన్ కి యిద్దరు భార్యలున్నారని, తనో అమర ప్రేమికుడిగా నటించింది డబ్బు కోసమని! అయినా అతడ్ని విడిచిపెట్టలేక పోయింది. కారణం ఎంతో ఓడి ఆ స్థానాన్ని చేరుకున్న ఆమె జీవితంలో ఓడిన భావాన్ని తను అంగీకరించలేకపోవడం. అది లక్షలమంది అభిమానులకు తెలియడం యిష్టం లేకపోవటం. ఆ తర్వాత తాగుడికి అలవాటు పడింది. ఆ తాగుడిలో మనశ్శాంతిని వెదుక్కుంటూ క్రమంగా కెరీర్ ని నాశనం చేసుకుంది. ఆ ఉన్మాదంలో తన గురించి తానే కాక, తన ఆస్తి గురించి పట్టించుకోవడం మానేసింది. ఆ స్థితిలోనే నిన్ను స్టేట్స్ కి పంపించింది. నీకు దూరంగా వుంటూ, నీ శ్రేయస్సును కోరుకుంటూ గడవటం అలవాటు చేసుకుంది. రెండేళ్ళ క్రితమే తెలిసింది మీ అమ్మకి, తన ఆస్తిని తనకు తెలీకుండా రామన్ పరం చేసిందని. డబ్బు కోసం అడిగితే దూరం జరిగిపోయాడు. తాగుడు మరింత ఎక్కువైంది. ఉన్న ఇంటిపై అప్పులు చేస్తూ నీ చదువుకి డబ్బు పంపేది. ఆ తర్వాత తన జబ్బు సంగతి తెలిసింది. అదీ చాలా ఖరీదైన జబ్బు రావడంతో దానికి పెట్టుబడిగా మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. అయినా రాజ్యం ఆలోచన ఒక్కటే సుకృతీ! నీ చదువు పూర్తికావాలి. నీకు తెలీని పేదరికం గురించి నీకు తెలీకుండా జాగ్రత్తపడాలి. అలా అంతా అయిపోయాక ఈ మధ్యనే ఇల్లు వేలంవేస్తే, ఆ మహానటి కట్టుబట్టలతో రోడ్డు మీద పడింది. కనీసం అప్పుడైనా మీ నన్న సహకరిస్తే నిబ్బరంగా నిలబడేదేమో! ఇప్పుడు చావు బ్రతుకుల సంధికాలంలో అడుగుపెట్టినట్టు కోమాలోకి జారిపోయింది"