Read more!
 Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 3


    "ఒకరిని విడిచి ఒకరు వుండలేకపోవడమే ఆప్యాయతలకి కొలమానమా?" కాస్త హేళనగా అడిగాడు.
    
    "కాదు! ఒకరి కోసం ఒకరం ఏదయినా చేసి అవతలివారిని ఆనందపరచాలన్న ఆరాటం, నా వాళ్ళు సుఖంగా లేనప్పుడు నాకు ఎన్ని సుఖాలున్నా వ్యర్ధం అనుకోవడం ఇవన్నీ ఆప్యాయతలకి ఋజువులు అంతే కానీ- ఆప్యాయతల్ని కొలవడం ఎవరి తరం కాదు" ఉక్రోషంగా అంది.

    "అలాంటప్పుడు విడిగా వుండి, నీ కుటుంబానికి సాయపడటంలో నీకు అభ్యంతరం ఏమిటీ? ఆలోగా డబ్బు యొక్క ప్రాముఖ్యత యీ కుటుంబ సంబంధాలలో ఎంతవరకూ వుంటుందో నీకూ అర్ధమవుతుంది" స్పష్టంగా వుంది ఆయన కంఠం.
    
    "డబ్బుకోసం మేము ఎప్పుడూ మారిపోము. ఉన్ననాడు. లేనినాడూ ఒకే రకమయిన ప్రేమ మా మధ్యన వుంటుంది" అంది రోషంగా.
    
    ఆయన కొంచెం ముందుకి వంగి కళ్ళద్దాలు సవరించుకుంటూ "నీ మాటల్లో నిజం మాటెలా వున్నా నాకు ఇంకో కారణం కూడా వుంది...." అన్నాడు.
        
    ఆమె ఏమిటి అన్నట్లు చూసింది.
    
    "కుటుంబం అన్నాక రకరకాల ప్రాబ్లెమ్సు వుంటాయి. వాటి తాలూకు ప్రభావం నీ మీదపడి, నువ్వు  నీ కర్తవ్యాన్ని జాగ్రత్తగా నిర్వర్తించలేకపోవచ్చు. అందువలన నేను నీకిచ్చే జీతంలో ఒక్కరూపాయి నష్టం వచ్చినా నేను భరించలేను. నేను పక్కా మెటీరియలిస్టుని" ఆయన వెనక్కి వాలుతూ అన్నాడు.
    
    ధృతి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి "ఆర్ యూ సీరియస్!" అని అడిగింది.
    
    "ఎస్, అఫ్ కోర్స్!"
    
    ఆమె లేచి నిలబడి "ఎంతోమంది కుటుంబంతో కలిసి వుండకుండా విడిగా వుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ మీరు చెప్పిన కారణం వల్ల మాత్రం కాదు! మనసు సంతోషంగా, ఆహ్లాదంగా వుండేందుకు కుటుంబ వాతావరణం ఎంతగానో తోడ్పడుతుంది. నా స్వంతవాళ్ళవల్ల నాకు మనశ్శాంతి వుండదు అనుకునే పక్షంలో, అసలు వాళ్ళు 'నా వాళ్ళు' అని ఎలా చెప్పుకుంటాను?" అంది ఆవేశంగా.
    
    ఆయన అంతా విని "ముందు కూర్చో" అన్నాడు ప్రశాంతంగా.
    
    ఆమె మళ్ళీ కూర్చుని కొంగుతో ముఖం తుడుచుకుంది.
    
    ఆయన శాంతగంభీరస్వరంతో "నీతో వాదించటానికీ, నిన్ను ఒప్పించాటానికీ నాకు అంత టైమ్ కానీ, అవసరం కానీ నిజానికి లేవు. నువ్వు ఇంటర్వ్యూలో మార్క్స్ బాగా స్కోర్ చేసినందువలనా, నీ ప్రవర్తన నాకు ఆసక్తికరంగా వున్నంధుఆ నీతో ఇలా ఓపిగ్గా మాట్లాడుతున్నాను. నీ కుటుంబ సభ్యులతో యీ విషయం సంప్రదించు. వాళ్ళ ఉద్దేశ్యము ఇలాగే వుండాలనే రూలేం లేదుకదా!" అన్నాడు.    

    ధృతికి ఆ మాట సూటిగా వెళ్ళి హృదయంలో గుచ్చుకుంది.
    
    "అంటే మీ ఉద్దేశ్యంలో డబ్బు తన మనుషుల మధ్య మరేబంధంలేదా? డబ్బుకోసం ఏవైనా త్యాగం చేసేస్తారా? డబ్బు ఓ అమ్మనీ, నాన్ననీ, చెల్లెల్నీ, తమ్ముడ్ని బంధించగలదా? కుటుంబంలో అంతర్లీనంగా ప్రవహించే ఆప్యాయతానుబంధాలు ఎంత గొప్పవో అనుభవిస్తే కానీ తెలియదు. బహుశా ఆ రుచి మీకు తెలియదనుకుంటాను" అంది అనాలోచితంగా సన్నగా కంపిస్తూ.
    
    ఆ చివరి మాటకు ఆయన ప్రతిస్పందిస్తూ, "అవును     ! నేను వాటిని నుభావించలేదు. బహుశా తెలివైనవారెవరూ అనుభవించలేరు. లాభం లేకుండా ఎవరూ యీ ప్రపంచంలో మరో మనిషి మీద నువ్వు చెపుతున్న ప్రేమా, ఆప్యాయతా, అభిమానం లాంటివి గుమ్మరించరు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి, పెద్దచేసిన తర్వాత వారికి తెలియకుండానే ఆ పిల్లలద్వారా సుఖాలూ, ఆనందాలూ పొందాలన్న స్వార్ధం మొదలవుతుంది. దానికి వారు కష్టపడి పెంచాము అన్న రీజనిమగ్ యిస్తారు. భార్యాభర్తల మధ్య కూడా.
    
    అంతా బార్డర్ సిస్టమే! నేను నీకు యిది యిస్తానూ, నువ్వు నాకు ఏమిస్తావ్? అనే పంధాలో సాగుతుంది. ఇక అన్నాచెల్లెళ్ళూ, అక్కా తమ్ముళ్ళూ లాంటి సంబంధాలు కేవలం ఎవరి కీవితం వారికి ఏర్పడేవరకే! ఆ తరువాత ఒకరి గురించి ఒకరు ఆలోచించటానికి కూడా అంత ఇంట్రస్టు వుండదు."
    
    "మీరు చెపుతున్నదానికి అంగీకరించను...." అంటూ ఆమె అడ్డుకోబోయింది.
    
    ఆయన అరచెయ్యి చూపించి వారిస్తూ "నేనూ అంగీకరించేవాడిని కాదు నీ వయసులో, అంటే ఇరవై రెండేళ్ళ అమాయకత్వంలో వున్నప్పుడు. ఆ వయసులో లోకమంతా స్వచ్చంగా కనిపిస్తుంది. మనం నవ్వితే నవ్వుతున్నట్లూ, మనం బాధపడితే బాధపడుతున్నట్లూ కనిపిస్తుందిగానీ, అది ఎప్పుడూ మనల్ని చూసి నవ్వుతూనే వుంటుంది. ఆనందంగా కాదు, హేళనగా! దాని నోరు మూయించేది     కేవలం డబ్బు మాత్రమే.....! అది నువ్వు పుష్కలంగా సంపాదిస్తే, నీ తప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తాయి అందరికీ. అది లేనినాడు నువ్వు చెప్పే బంధాలూ, ఆప్యాయతలూ ఏమీ వుండవు. దూరంగా పారిపోతాయి."    

    "బహుశా మీ జీవితంలో ఏవో గట్టి ఎదురుదెబ్బలు తగిలివుంటాయేమో! అందుకే ఇలా స్వంత మనుషుల మధ్యన వుండే అనుబంధాలూ, అనురాగాలను విమర్శిస్తున్నారు" ఆమె ముక్కుపుటాలు రోషంతో ఎర్రబడ్డాయి.    

    ఆయన ముఖంమీద మొదటిసారిగా లీలగా నవ్వు పొడచూపింది. "నీకు అనుభవం లేకపోవడం వలనా, అజ్ఞానంవలనా ఇలా వాదిస్తున్నావు. ఇవే మాటలు మరో ఇరవై ఏళ్ళు గడిచాక అనవు. అసలు నిన్ను చూస్తుంటే నాకు ఎందుకో నువ్వు నమ్ముకున్న సిద్దాంతాలన్నీ 'ట్రాష్' అనీ, డబ్బు తప్ప మరేదీ యీ ప్రపంచంలో మనిషినీ మనిషినీ కట్టి వుంచలేదనీ రుజువు చెయ్యాలనిపిస్తోంది" అన్నాడు.
    
    ఆమె ఆలస్యం చెయ్యకుండా "ఒకవేళ నేనే మీచేత నేను నమ్ముతున్న సిద్దాంతాలన్నీ నిజమనీ, ఆప్యాయతానుబంధాలు లేని డబ్బువల్ల ఆనందంలేదని ఒప్పించగలిగితే?" అంది.
    
    ఆయన ముఖంలో నవ్వు చెరిగిపోయింది. కనుబొమలు ముడిచి చూశాడు. "నాతో పోటీపడగలవా?" అన్నాడు దర్బంగా ఆ అడగటంలో నేను ఎవరో తెలుసా? అన్న గర్వం వుంది.
    
    ధృతి చిన్నగా నవ్వుతూ "పోటీలంటే నాకు ఇష్టం అందులోనూ ఈ పోటీవల్ల ఒక మనిషి తన జీవితంలో ఎంత విలువైనవి కోల్పోయాడో తెలుసుకోగలిగితే అంతకన్నా కావాల్సిందేముందీ.....?" అని అడిగింది.
    
    "పందెమేమిటీ?" అడిగాడు సీరియస్ గా.

 Previous Page Next Page