Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 2

   

     ఇంతలో బ్రహ్మరాక్షసి గర్జించినట్లు రైలుకూత వినిపించింది. ఒక్కసారిగా చెవులు గింగురుమన్నట్లయి అచేతనంగా వుండిపోయాడు. తమ ఇల్లు రైలుగేటు దగ్గర. ఈ వచ్చేపోయే రైలుబళ్ళ చప్పుళ్ళు రోజుకెన్నిసార్లో భరించవల్సి వస్తూంటుంది. అవి వినబడితేగానీ తోచనిస్థితి. ఆ మ్రోతలు ఆలకిస్తేగాని నిద్రపట్టని స్థితి. అవి వీనులవిందుగా సంగీతమాలపించినట్లు అనుభూతి పొందే పరిస్థితి ఇంకా రాలేదు.
   
    పగలైనా సరే ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుతున్న వాళ్ళల్లా రైలుబండి హోరు వినిపించగానే అది మరోశబ్దం వినబడటానికి తావియ్యదుకాబట్టి ఆ హోరు శాంతించేవరకూ ఒకరిముఖం ఒకరు చూసుకుంటూ స్తబ్దుగా వుండిపోతారు ఎవరితో మాట్లాడుతున్నా సరే.

    రైలు దడదడమని చప్పుడు చేసుకుంటూ గుండెలమీదనుంచి వెళ్ళిపోయి నట్లుగా వెళ్ళిపోయింది. చిన్న భూకంపం వచ్చినట్లు గదిలో నేల గజగజా వణికిపోయింది.
   
    రైలుబండి రేపిన అలజడిలో అతనికి కలిగిన అంతరాయం మరో గంటవరకూ కొనసాగింది.
   
    కష్టంమీద తర్వాత కునుకు వచ్చింది.
   
    ఇంతలో డబడబమని సుదూరంలో మోటార్ సైకిల్ షెడ్డుదగ్గర్నుంచి కర్ణ కఠోరమైన ధ్వని బయల్దేరి అతని ఆశల్ని అడియాశలు చేసింది. వంద మోటారుసైకిళ్ళు రేసులో పాల్గొంటున్నట్లు చెవులు చిల్లులు పడేలా ఒకటే ధ్వని. వాడెవడో యెక్కడా చోటు లేనట్లు మోటారుసైకిలు షెడ్డు తీసుకువచ్చి ఫ్యామిలీ లొకాలిటీలో పెట్టాడు. రాత్రీపగలూ ఒకటే మోత. ఇప్పుడు అర్ధరాత్రి దాటాక నైట్ డ్యూటీ మొదలు పెట్టినట్లున్నాడు. ఇలాగే రాత్రిళ్ళు గోలగా వున్నదని ఇరుగుపొరుగుల్లో ఒకాయన ఓసారివెళ్ళి షెడ్ వాడితో దెబ్బలాడాడు. షెడ్డువాడు తొణకలేదు సరికదా 'నీఇష్టం వచ్చినవాడితో రిపోర్టు చేసుకోపొమ్మన్నాడు' పాపం ఆ మానవుడు కిమ్మనకుండా తిరిగి వచ్చేశాడు. రిపోర్టు చెయ్యటంవల్ల ఆ షెడ్డువాడికి శత్రువు కావటంమినహాయించి ప్రయోజనమేమీ ఉండదని గ్రహించి. ఆ లొకాలిటీమీద కసి తీర్చుకుంటున్నట్లుగా అప్పట్నుంచీ అర్ధరాత్రి పూట మోటార్ సైకిళ్ళ చప్పుళ్ళు మరీ ఎక్కువయినాయి.
   
    ఇంతలో కరెంటువచ్చి బెడ్ లైటు వెలిగి ఫ్యాన్ తిరగటం మొదలైంది వయ్యారంగా.
   
    కుమార్ మెల్లిగా ప్రక్కమీద లేచి కూర్చున్నాడు. వెంటనే ఇహ ఎలాగూ నిద్రపట్టదు కాబట్టి ఏదయినా చదువుకుందామనిపించింది.
   
    మెల్లిగా మంచం దిగాడు.
   
    ప్రక్కన మంచాలమీద మొగపిల్లలిద్దరు. పాప నిద్రపోతూ కనిపించారు.
   
    హఠాత్తుగా మనిషి జీవితం ఎంతో ఇరుకనిపించింది. తనకు పెళ్ళయిన మొదటి అయిదేళ్ళలోనూ ముగ్గురు పిల్లలు పుట్టేశారు. జరిగిందానికి విచారించటం మానేసి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టి ఊరుకున్నాడు.
   
    దాన్ని గురించికాదు బాధ. పిల్లలకు విడివిడిగా పడుకోవటం అలవాటు చేయాలనీ, అసలు తల్లితండ్రులున్న గదిలో కాకుండా వేరేగదిలో పడుకునే ఏర్పాటు చేయాలనీ ఎంతో ఉబలాటపడ్డాడు.
   
    ఒక్కటీ నెరవేరలేదు. వాళ్ళ ముగ్గురిలో ఒక్కరూ ఒక్కరోజయినా ఆ గదిలో కాకుండా బయట పడుకున్న పాపాన పోలేదు.

    జీవితంలో పెద్ద పెద్ద విషయాలలో మనిషి అనుకున్నది జరుగుతూ ముందుకు పోగలుగుతున్నాడు గానీ సాధారణమనిపించే అతి స్వల్ప విషయాలలో అడుగడుక్కీ పరాజయం పొందుతూ దారుణహింసకు గురిఅవుతూ వుంటాడు. అప్పుడప్పుడూ ఉలికిపాటుకూడా తప్పదు.
   
    అతనికి ప్రతినెలా రీడర్స్ డైజెస్ట్, ఇంప్రింట్స్ వస్తాయి. ఇంకా యాంటీసెప్టిక్, ఇండియన్ పీడియాట్రిక్స్ - ఇలాంటి మెడికల్ జర్నల్స్ వస్తాయి. అవన్నీ మొదటినుంచి చివరిదాకా చదివెయ్యాలని తాపత్రయమేగానీ ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకంటూ పోవటం, అవన్నీ టేబిల్ మీద పేరుకుపోవటం జరుగుతోంది.
   
    వాటిని చూస్తూంటే బాధగా వుంటుంది. మనశ్శాంతి వుండదు.
   
    జీవితంలో అశాంతి మనిషి చదవలేని పుస్తకాలలోంచే ఉత్పన్నమౌతుందేమో ననిపిస్తుంది.
   
    పెద్ద లైటువేస్తే పడుకున్న వాళ్ళకు అంతరాయం కలుగుతుందని నెమ్మదిగా ప్రక్కగదిలోకి వెళ్ళాడు.
   
    అది చాలా చిన్నగది. గెస్టెవరయినా వస్తే పడుకునేందుకు అక్కడో మంచం వుంది. అతని సామాన్యమైన లైబ్రరీ చిందరవందరగా ఆ గదిలోనే వుంది.
   
    ఆ గదిలో లైటు వెలిగించి ప్రేముకుర్చీలో కూర్చుని చేతిలోకి టేబిల్మీది పుస్తకం తీసుకున్నాడు.
   
    అర్ధరాత్రివేళ లేవటంవల్ల కళ్ళు మంటగావుండి అక్షరాలు మసకమసకగా కనిపిస్తున్నాయి. చదవాలని ఆరాటంగా వున్నా మనసు నిరాకరిస్తోంది.
   
    లేచి పుస్తకం ప్రక్కనపెట్టి కిటికీ దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. కిటికీలోంచి క్రిందికి చూసేసరికి క్రిందిగదిలో తండ్రి లేచినట్లున్నాడు. లైటు వెలుతురు బయటకు పడుతూ కనిపించింది.
   
    ఆయనకిది రోజూ వున్న అలవాటే. రాత్రి ఎనిమిదీ, ఎనిమిదిన్నరకల్లా పడుకుంటాడు. మళ్ళీ ఏ ఒంటిగంటకో, రెండు గంటలకో నిద్రలేచి ఒక గంటసేపు చదివి మళ్ళీ పడుకుంటాడు.
   
    మోటార్ సైకిళ్ళ చప్పుడు వుండి వుండి ఆగి మళ్ళీ విజ్రుంభిస్తోంది.
   
    కుమార్ కి అక్కడ కాసేపలా నిలుచున్నాక యిహ చదవాలని ఆసక్తి నశించి మళ్ళీ శరీరాన్ని మంచంమీదకు చేరవెయ్యాలనిపించింది. తిరిగి తమ గదిలోకి వెళ్ళాడు.
   
    భార్యను పలుకరించాలనిపించింది.
   
    ఆమె గాఢనిద్రలో వుందని తెలుసు. అయినా పలకరించాలన్న కోరికను నిగ్రహించుకోలేకపోయాడు.
   
    "ప్రభా!" అని పిలిచాడు.
   
    ఆ పిలుపామెకు అందలేదు.
   
    ఆమె ముఖంమీదకు వంగి మళ్ళీ పిలిచాడు.
   
    ఆమె కళ్ళు విప్పకుండానే 'ఊ' అంది.
   
    "చూడూ! లే, కాసేపు కబుర్లు చెప్పు, నాకు నిద్రపట్టటం లేదు."
   
    ఆమె ఒకసారి బలవంతంగా కళ్ళువిప్పి మళ్ళీ మూసేసుకుని "ఉష్! మాట్లాడకుండా పడుకోండి. లేవలేను" అంది.

    చాలామంది మనుషులు నిద్రపోకముందు ఒక రకం మనుషులు నిద్రలో పడ్డాక తిరిగి తెల్లవారేవరకూ మరోరకం మనుషులు ప్రభావతికూడా ఆ జాతికి చెందినదే.
   
    ఆమె స్వభావం తెలిసిందే అయినా ఉబలాటాన్ని చంపుకోలేక 'ప్లీజ్ ప్రభా!' అన్నాడు.
   
    "అబ్బ! ఏమిటండీ గోల అర్దరాత్రిపూట? నిద్రపోయేవాళ్ళని చూసి ఓర్వలేరా?" అని గట్టిగా గదమాయించేసి ఆమె గోడవేపు తిరిగి పడుకుంది.
   
    అతను హతాశుడైనట్లయి ఇహ ఆమె ప్రక్కన పడుకునేందుకు కూడా చిరాకని పించి అటూఇటూ చూశాడు. ఎక్కడా ఖాళీ కనిపించలేదు. అసలది తన ప్రక్క ఆమె చిన్నవాడి ప్రక్కలో పడుకోవాలి రివాజు ప్రకారం కానీ తన స్థానం ఆక్రమించేసిందామె.
   
    అతనిలో ఓ చిత్రమైన గుణంవుంది. నలుగురిలో వుంటే వంటరితనం కోరుకుంటాడుగానీ వంటరిగా వుంటే వంటరితనాన్ని అభిలషించలేడు. ప్రక్క గదిలోకి వెళ్ళి ఒక్కడూ పడుకుంటే చాలా వెలితిగా వుంటుంది.
   
    విధిలేక ఆమె ప్రక్కనే వెళ్ళి పడుకున్నాడు.
   
    మళ్ళీ చెయ్యివచ్చి మెడమీద పడింది.
   
    డొక్కలోకి కాళ్ళు ముడుచుకుని పడుకుందామని మహ కోరికగా వుంది కానీ తీరటంలేదు.
   
    ఇలా కళ్ళు మూసుకున్నాడో లేదో ఇంతలో వంటిమీదికేదో ప్రాకినట్లయింది.
   
    ఉలికిపడి చూసేసరికి అందరికంటే చిన్నవాడు. వాడి ప్రక్కమీదినుంచి ఎప్పుడు లేచివచ్చాడోగానీ, పందిరిమంచమెక్కి ఇద్దరిమధ్యా చోటు చేసుకుంటున్నాడు.

 Previous Page Next Page