Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 3

    శక్తి మాయి వుందా?
   
    ఆనందయ్య గోడు గోవిందా!
   
    అది ఆ దైవానికే తెలియాలి.
   
                                                   3
   
    "ఏమైంది?" బాలమ్మ అడిగింది.
   
    "నాన్నని చూస్తుంటే తెలియటం లేదాఅమ్మా!" రామ్ దేవ్ వ్యంగ్యంగా అన్నాడు.
   
    కోడలు గుణవంతి ఓసారి తల ఎత్తి మామగారిని చూసి మళ్ళీ నిరాశగా తలదించుకుంది. కన్నీళ్ళు తుడుచుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు.
   
    ఆనందయ్య మాట్లాడక పోవటంతో "ఏమైంది?" అని మళ్ళీ అడిగే ప్రయత్నం చేయలేదు బాలమ్మ .
   
    ఆనందయ్య పై పంచెతో ముఖం తుడుచుకుని నులక మంచంలో కూలబడ్డాడు.
   
    వళ్ళంతా దెబ్బలు తగిలిన రామ్ దేవ్ బాధకి వోర్చుకోలేక మూలగాబోయి అంతలో తల్లి, తండ్రి, పెళ్ళాము గుర్తుకు రావటంతో పెదవి బిగించి పళ్ళు గిట్ట కర్చుకుని పైకి వ్యక్తం కాకుండా బాధని నొక్కిపడుతున్నాడు.
   
    పేదవాళ్ళని దగాపడ్డ వాళ్ళని అన్యాయమైపోయిన వాళ్ళని శక్తిమాయి ఆదుకుంటుందని చాలామంది నమ్ముతున్నారు. ఆ పేరు అలా ఆ నోటా ఆ నోటా పాకింది. పూర్తిగా నిజం మాత్రం బయటికి వచ్చిందిలేదు.
   
    అయితే-
   
    శక్తి మాయి ఎక్కడ వుంటుందో ఎలా వుంటుందో ఆమె కథా కమామీషు పూర్తిగా తెలియదు కాబట్టి తమ బాధలు గాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక కొట్టు మిట్టాడేవారు. వాళ్ళూ వీళ్ళూ చెప్పిందాన్ని బట్టి ఊరుకి ఆనుకున్న చిట్టడవిలోకి వెళ్ళి మనిషికోసం వెతికేవాళ్ళు మునులుతప్ప మనుషులు కనపడక పోవటంతో ఎలుగెత్తి అరచి అరచి చివరికి నిరాశతో తిరిగి వచ్చేవాళ్ళు.
   
    ఇప్పుడు ఆనందయ్య చేసింది కూడా ఇదే.
   
    "కున్నా ఎలా వున్నాడు?" బాలమ్మ ఈ మాట అంటూనే పెద్ద పెట్టున ఏడ్చింది.
   
    "ఊరుకో" అంటూ పైకి లేవబోయిన రామ్ దేవ్ కాలు కలుక్కుమనటంతో గట్టిగా గొడ్డులా మూలిగి వెనక్కి జారగిలబడ్డాడు.
   
    బాలమ్మకి మనవడంటే ప్రాణం నాయనమ్మని వదిలి క్షణం ఉండలేడు. మనవడికోసం ఆమె కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నది.
   
    గుణవంతి లేచి భర్త దగ్గరకు వచ్చింది. "కాపు పెడతాను" అంది.
   
    "మండిపోయే గుండెకాయకి ఏం కాపు పెడతావు?" రామ్ దేవ్ అడిగాడు.
   
    గుణవంతి గుడ్లనీరు కక్కుకుంది.
   
    నలుగురు అనుకునే మాట ఇరుగు పొరుగు చెప్పటంతో బాధపడ్డ హృదయాలకి కాస్త ఊరట ఆశకలిగాయి. రామ్ దేవ్ మాత్రం ఇదంతా హంబక్ అని కొట్టి పారేశాడు.
   
    గుణవంతి నమ్మింది. బాలమ్మ నమ్మింది. అప్పటికే ఇరుగు పొరుగు మాటలని గాఢంగా విశ్వసిస్తున్న ఆనందయ్య నమ్మాడు. అడవికి వెళ్ళాడు శక్తి మాయిని పిలిచాడు. ఫలితం కానరాలేదు. అణువణువునా నిరాశ ఆక్రమించగా దిగాలుగా ఇంటికి వచ్చి మంచానికి జార్లపడ్డాడు.
   
    శక్తిమాయి దేముడుకాదు. దేవతా అమ్మవారు కాదు. మంత్రగత్తె కాదు. మంత్రాలు తంత్రాలు తెలియని మహామాయావి.
   
    ఆమెదాకా ఈ వార్త వెళితే!
   
    ఈ వార్త ఎవరు చేరవేస్తారు?
   
    ఆనందరామయ్య ఆలోచిస్తున్నాడు.
   
                                                                              4
   
    బజర్ మ్రోగింది.
   
    బన్సీలాల్ ఇంట్లో లైట్లు వెలిగాయి.
   
    గుర్రమంత కుక్కతో నౌకరు తలుపు తీసుకొని వరండాలోకి వచ్చాడు.
   
    "ఎవరది?" చిన్న కొండలా వున్నా నౌకరు అక్కడ నుంచే అడిగాడు.
   
    "ఎవరొచ్చిందీ కళ్ళకి కనబడటం లేదా?" వీధి గేటు అవతల వున్నా పోలీసు నెత్తిన టోపీ సరిచేసుకుంటూ అడిగాడు.
   
    కటకటాల వీధిగేటు అవతల నుంచున్న ఇద్దరు పోలీసులు కనిపించారు.
   
    "చూడలేదు బాబూ! అయ్యగారితో చెప్పి వస్తాను" అని కుక్కని అక్కడే వున్న స్థంభానికి కట్టేసి నౌకరు లోపలికెళ్ళాడు.
   
    "తొందరగా రా!" అన్నాడు రెండోపోలీసు.
   
    నౌకరు లోపలి కెళ్ళింతరువాత ఇంట్లో అన్ని గదుల్లో లైట్లు వెలిగాయి.
   
    ఆ ఇంట్లో మొత్తం తొమ్మిదిమంది వున్నారు.
   
    బన్సీలాల్ నౌకర్లు అయిదుగురు వున్నారు.

 Previous Page Next Page