Read more!
 Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 2

    కిరాయి రౌడీలు తన నెదుర్కొనగానే సుహాసిని కరాటే విద్యను ప్రదర్శించి వారిని చిత్తు చేసింది. ఆ తర్వాత ఆ రౌడీలే శంకర్ ని చావాదన్నారు. శంకర్ వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. మధ్యలో సుహాసిని అతన్ని చూడ్డానికి వచ్చి -"మీరు నడిచే దారి మంచిది కాదు. ఆ దారిలో ఒంటరిగా వెడితే రౌడీలుంటారు. ఆ దారిలోనే మీకు నడవాలని ఉంటే నన్ను సాయం తీసుకువెళ్ళండి!" అంది.   
    ఆమె చేతిలో చిత్తయిన రౌడీలచేతిలో తను దెబ్బలు తినడం శంకర్ కి చాలా అవమానమనిపించింది.  
    "సుహాసిని నీకు బాగా తెలుసా? మీ యిద్దరికీ మాట్లాడుకునేటంత పరిచయముందా?" అనడిగాడు రాయుడు.   
    "ఒకప్పుడామె ఈ వీధిలోనే ఉండేది. రెండేళ్ళక్రితం వాళ్ళు ఇల్లు మారారు. మా వీధిలో ఉన్నప్పుడు మేము అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం!"   
    రాయుడు సాలోచనగా - "దీన్నిబట్టి నా సినిమా అసహజమనడం అన్యాయం. నా హీరోలాగే నువ్వు కూడా కరాటే రాని అమ్మాయిని ప్రేమించాల్సింది" అన్నాడు.   
    "అప్పటితో అయిపోలేదుగదా! ఇంకా ఉంది" అన్నాడు శంకర్.   
    రాయుడు తీసిన ఇంకో సినిమాలో ఓ పేద హీరో ధనికుల అమ్మాయిని ప్రేమిస్తాడు. మామూలుగా అయితే ఆమె అతడివంక చూడనైనా చూడదు. ఓ శుభముహూర్తాన అతడామెకో ఉత్తరం రాశాడు. తనామె అందానికి ఆకర్షితుడైనాడనీ, తనుకోరేది ఆమెప్రేమను మాత్రమేననీ అందులో రాశాడు. తర్వాత రెండు రోజులాగి ఇంకో ఉత్తరంలో ఆమెను ఫలానా పార్కులో, ఫలానా చోటుకు రమ్మనమని వ్రాశాడు. ఆమె అక్కడకు వస్తుంది.   
    "నువ్వేనా నాకుత్తరం రాసింది" అంటుందామె.   
    "నిజంగానే నువ్వొచ్చావే?" అంటాడతను.   
    ఆమె అతన్ని నిందిస్తుంది. ఆమె మాటలు అతడికి అర్ధంకావు. కొంతసేపయ్యాక అతడు అసలు సంగతి చెబుతాడు. "నా మిత్రుడు భాస్కర్ కి అంతులేని ఆస్తి ఉంది. అతను నాతో చెప్పాడు- రాధ నిన్ను ప్రేమిస్తోంది. ఫలానా పార్కులో ఫలానాచోట నిన్ను కలుసుకోవాలనుకుంటోంది అని! అతడికి పరాచికాలాడే అలవాటుంది అయినా అతడి మాటల్లో ఎంతవరకూ నిజమున్నదో చూడాలని ఇక్కడకు వస్తే, నిజంగానే నువ్వొచ్చావు."  
    హీరోయిన్ కు చాలా కోపం వస్తుంది. భాస్కర్ ని తిడుతుంది. హీరో భాస్కర్ ని ఒక్కడినే కాదు, డబ్బున్న వాళ్ళందర్నీ తిడతాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ తను భాగ్యవంతుల పిల్లను చేసుకోనంటాడు. భాగ్యవంతుల్లో ఆడా, మగా అంతా ఒకటేనంటాడు హీరోయిన్ ఆవేశపడుతుంది. హీరో అభిప్రాయాలు తప్పని చెబుతుంది. అయినా హీరోవాదన ఆపకపోగా__"అయితే నా మీద మీ అభిప్రాయ మేమిటి?" అనడుతుంది. హీరో తడబడి, "మన పరిచయం చాలా స్వల్పం" అంటాడు. "ఈ రోజునుంచీ మనం స్నేహితులం"- అంటుంది హీరోయిన్.   
    ఆరోజునుంచీ హీరో, హీరోయినూ పార్కులో కలుసుకుంటూంటారు. హీరో ఆమెను కొంత ఆకర్షిస్తాడు. హీరో మాత్రం ధనికుల్ని తరచుగా దుయ్యబడుతూంటాడు. ఒకటి రెండు వారాలు గడిచేక హీరోయిన్ కి భాస్కర్ పేరుతో మరో ఉత్తరం వస్తుంది. తను హీరోయిన్ కోసం డైమండ్ నెక్లెస్ కొన్నాననీ, తనను బీచ్ వద్ద ఫలానాచోట కలుసుకొమ్మనీ ఉంటుందందులో ఆరోజు సాయంత్రం హీరోయిం పార్కుకు వెళ్ళడం మానేసి బీచ్ కి వెడుతుంది. అక్కడామెకు ఎవ్వరూ కనిపించరు. మర్నాడు పార్కుకు వెడితే హీరో కనిపిస్తాడు. "నిన్న నువ్వొస్తావని ఎదురు చూశాను. కానీ భాస్కర్ మాటలే నిజమయ్యాయి రాధా!" అంటాడు.   
    "భాస్కర్ మాటలేమిటి?" అంటుంది హీరోయిన్.   
    "నా కారణంగా మీరు స్నేహితులయ్యారు. అంత మాత్రాన మీరు నిజమైన స్నేహితులైపోరు. ఆడవాళ్ళకు డబ్బు తప్ప ఏమీ అక్కర్లేదు! నేనామెను డబ్బుతో ప్రలోభపెట్టి ఈరోజుకు నీ దగ్గరకు రాకుండా చేస్తాను. అన్నాడు భాస్కర్" అంటాడు హీరో.   
    హీరోయిన్ కు పౌరుషం వస్తుంది.   
    కనిపించని భాస్కర్ నిజంగా లేడనీ, హీరో సృష్టి అని తెలుసుకోకుండా ఆమె క్రమక్రమంగా హీరోకు దగ్గరవుతుంది.   
    ఇది సినిమా కథ. దీన్నాదారంగా చేసుకుని శంకర్ కూడా సుహాసినికి ఓ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో పార్కులో నిర్ణయించిన స్థలంలో తను కూర్చున్నాడు. అక్కడికి సుహాసిని వచ్చింది. అతను ఆశ్చర్యంగా - "నిజంగానే నువ్వు వచ్చావే?" అన్నాడు. సుహాసినికి అతడి మాటలు అర్ధం చేసుకునేందుకు కొంతసేపు పట్టింది. శంకర్ ఆమెకు వినోద్ అనే ఓ కల్పిత నామం చెప్పాడు.   
    సుహాసిని వెంటనే - "ఆ వినోద్ ని నాకు పరిచయం చేయవూ?" అనడిగింది. శంకర్ ఈ విధమైన ప్రశ్నఊహించ లేదు. రాయుడి సినిమాలో హీరోయిన్ ఎక్కడా భాస్కర్ గురించి అడగదు. అతన్ని అసహ్యించుకుంటుంది. ద్వేషిస్తుంది. చూడాలని మాత్రం ఒక్కసారి కూడా అనుకోదు.   
    ఏమనాలో తెలియక అలాగే పరిచయం చేస్తానన్నాడు శంకర్.   
    "ఎప్పుడో చెప్పు!" అంది సుహాసిని.   
    "అతన్ని కనుక్కుని రేపు చెపుతాను" అన్నాడు శంకర్.   
    మర్నాడు శంకర్ సుహాసినిని కలుసుకుని, "వినోద్ తన రహస్యం బైట పెట్టవద్దన్నాడు. మీకు మళ్ళీ ఎలాంటి ఉత్తరమూ వ్రాయనని హామీ కూడా ఇచ్చాడు" అన్నాడు.   
    సుహాసిని అతన్ని నొక్కించలేదు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకుని మాట్లాడుకోలేదు.
    "ఈ రెండు సంఘటనలు చాలు. మీ సినిమాలు అసహజమని చెప్పడానికి! ఆ తర్వాత ఇంకా మీ ట్రిక్కులు ప్రయోగించడానికి భయం కూడా వేసింది!"   
    రాయుడు హుందాగా నవ్వి, "నేను సినిమా లెందుకు తీస్తున్నాననుకున్నావ్? వినోదానికి ఆ వినోదం కూడా చూసిన మరుక్షణం మరిచిపోయే లాగుండకూడదు. ప్రేక్షకుల హృదయాల్లో గాఢమైన ముద్ర వేయాలి. నా సినిమాలు ఆడపిల్లలను వలలో వేసుకునే ఉపాయాలు చెప్పడానికి కాదు. అలా వలలో వేసుకునేందుకు కుర్రాళ్ళెలాంటి మాయలు చేస్తారో హెచ్చరించడం ముఖ్యం. నా హెచ్చరికలు బాగా పని చేశాయి. ప్రతి అమ్మాయీ నా సినిమాలను జాగ్రత్తగా గుర్తుంచుకుని, నీలాంటి వాళ్ళని దూరంగా ఉంచుతోందన్నమాట! ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది!" అన్నాడు.   
    శంకర్, రాయుడివంక ఆశ్చర్యంగా చూసి, "డబ్బుంటే చాలు, బుర్రలో ఏ తెలివీ లేకపోయినా ప్రొడ్యూసర్ కావచ్చునంటారు. నిన్ను చూస్తే నాకు అలా అనిపించడం లేదు. నీ చిత్రంలో లోపాలను నేను ఎట్టి చూపిస్తే- అవే నీ చిత్రంలోని విశేషంగా మార్చేశావు. నువ్వు రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తావు" అన్నాడు.   
    "నేను తెలివైనవాడినే! కానీ నా తెలివితేటల్ని ఎవరైనా మెచ్చుకుంటే మాత్రం పొంగిపోను. సాధారణంగా ఎదుటివాళ్ళ తెలివితేటల్ని ఎవరు మెచ్చుకుంటారో తెలుసా? వాళ్ళతో అవసరం ఉన్నవాళ్ళూ, వాళ్ళకంటే తెలివితక్కువాళ్ళూనూ!" అని నవ్వాడు రాయుడు.
    "నా గురించి నువ్వేమనుకున్నా నేను బాధపడను కానీ నీకో సవాల్ పారేస్తున్నాను. నీ సినిమాల్లో హీరో హీరోయిన్లకు రకరకాల కొత్త ఉపాయాలు చెప్పి పెళ్ళిళ్ళు జరిపించావు. తెరమీద ఇన్ని పెళ్ళిళ్ళు జరిపించావు. నిజజీవితంలో నీమేనల్లుడి పెళ్ళిజరిపించి, సినిమారంగంలోనే కాకుండా జీవితరంగంలో కూడా గొప్ప, ప్రొడ్యూసర్ వనిపించుకో! అయితే ఇదంతా అల్లాటప్పా వ్యవహారం కాదు. ఇక్కడ రచయిత చెప్పినట్లుగా కథ నడవదు. మాటలు వ్రాసినట్లుగా డైలాగులు పలకవు. నువ్వు చెప్పినట్లు సన్నివేశాలు నడిపించే డైరెక్టరుండడు" అన్నాడు శంకర్.

 Previous Page Next Page