రెండు నిమిషాలు మౌనంగా గడిచాయి. అతను గొంతుసవరించుకుని "ఆ విషయం ఆలోచించా నక్కయ్యా?" అని అడిగాడు.
"ఏ విషయం?"
"తెగతెంపులు స్పష్టం చేసుకునే సంగతి ఆ రామకృష్ణయ్య గుడినీ, గుళ్ళోలింగాన్నీ మింగగల శక్తివంతుడు. మనది మనకు దక్కాలంటే ప్లీడరుని పిలిచి రాతకోతలు ముగించుకుంటే మంచిది. నేనిక్కడ వున్నన్నాళ్ళూ నిన్నెవరూ మోసం చెయ్యలేరనుకో కాని ఎన్నాళ్ళని నాకు తీరుబడి అవుతుంది. అవతల నేను చూసుకోవలసిన వ్యవహారాలు అలాగే మూలుగుతున్నాయా మరి?" అని ఆగాడు.
ఆమె విని ఆలోచిస్తున్నట్లు వూరుకుంది.
అతను మళ్ళీ ఆరంభించి "ఇక్కడ వుండి సదుపాయం చేసుకుందామనుకున్నా-నేను ఇక్కడచేరి పడేసుకు తింటున్నానని లోకం ఆక్షేపిస్తుంది. అది నేను సహించలేను. నా అభిమానం దెబ్బతింటుంది. అందుకని ఒక పని చెయ్యకూడదూ? నువ్వు నాకు పరాయిదానివా ఏమన్నానా? ఇక్కడ నీకు నా అన్నవాళ్ళెవరున్నారు? మా ఇంటికి పోదాం దా.
నీకు ఒక్క పూచిక పుల్ల నష్టం పోకుండా నీ వ్యవహారాలన్నీ నేను చూచి పెడతాను. అదీగాక.." అని అర్ధోక్తిలో ఆగాడు.
రాధమ్మగారు ప్రశ్నార్ధంకంగా చూసింది.
"ఇక్కడ వుండి ఆ రామకృష్ణయ్యగారి తతంగమంతా చూస్తూ నేను ఊరుకోలేను. వాడు ప్రతిదాంట్లో వేలు పెట్టడం నాకసహ్యం. ఈ ఇంట్లో వాడయినా వుండాలి, నేనైనా వుండాలి"
ఇప్పటికి రాధమ్మగారికి బాగా వేడి కలిగింది. తమ పెంపుడుకొడుకు సొంత తండ్రిమీద ఆమెకు లోలోపల విపరీతమైన జుగుప్సా భావం వుంది.
అసలు లెక్కప్రకారం చూస్తే సత్యమూర్తి తమ కొడుకు. తనూ, వాడూ ఏదో తలక్రిందులవుతారు, తంటాలు పడతారు. మధ్య ఎక్కడనుంచో పరాయివ్యక్తి వచ్చి యీ ఇంట్లో అధికారం సంపాదించట మేమిటి?
"ఆ సత్యాన్నిలా రమ్మను. ఇవాళే యీ సంగతి తేల్చిపారేస్తాను" అంది కోపోద్రిక్తురాలై.
వీరభద్రం ఉత్సాహంగా లేచి నిలబడి "ఆ సత్యంకూడా యీ మధ్య గడుసుతనం నేర్చుకున్నాడు. అతనేమైనా మెత్తగా మాట్లాడితే జారిపోక" అని సలహా యిచ్చి అక్కడినుంచి సత్యమూర్తి గదివైపు గబగబా నడిచి వెళ్ళాడు.
ఓ అయిదునిమిషాల తదనంతరం సత్యమూర్తి తల్లి గదిలోకి వచ్చి మంచానికి దగ్గరగా నిలబడి "పిలిచావుట" అన్నాడు మృదువుగా వీరభద్రం గది లోపలికి రాలేదు. బయటెక్కడో వసారాలో తచ్చాడుతున్నట్లుగా వున్నాడు.
రాధమ్మగారు ఓపిక చేసుకుని మంచంమీద లేచికూర్చుంది ఇంతసేపూ యీ అక్రమాన్ని గురించే ఆలోచిస్తున్నదేమో బాగా ఆవేశపడుతోంది "అవునా! ఆ రామకృష్ణయ్య ఇంకా ఇక్కడ్నుంచి కదలడా?" అనేసింది గట్టిగా ఉపోద్ఘాతం లేకుండా.
ఇంత కటువుగా, అసభ్యంగా తల్లి నోటినుండి ప్రశ్న వెలువడేసరికి ఒక క్షణంపాటు అతనూ నిర్ఘాంతపోయాడు. అసలు ఇవాళ సత్యానందంగారు ఆయన కుమార్తె తన ఇంటికి పార్టీకి వస్తారని, చిన్నదే అయినా ఆ ప్రయత్నంచేస్తూ యీ విషయాలనే విస్మరించి వున్నాడు. ఆ వాతావరణాన్ని భస్మం చేస్తున్నట్టుగా ఇలాంటి కటువాక్యం వినేసరికి తెల్లపోయి, మెల్లిగా తేరుకుని "ఇప్పుడెందుకా ప్రసక్తి?" అన్నాడు సాధ్యమైనంతవరకూ ఉద్రేకాన్ని అణుచుకుంటూ.
"ఇప్పుడే కావాలి...ఆఁ...ఆఁ అంతే. ఇప్పుడే ఆ సంగతి తేలిపోవాలి" అన్నది మరింత ఆగ్రహంగా.
"ఆయన నా తండ్రి" అన్నాడతను కోపోద్రేకంతో.
"కాని నువ్వేప్పుడైతో పెంపుడు వచ్చావో అప్పుడే ఆ సంబంధాలన్నీ తెగిపోయినాయి. ఏదో చుట్టం చూపుగా వచ్చి వెళ్ళితే ఆ దారి వేరు కాని ఇక్కడ హోదా, అధికారం వెలగబెట్టటానికి ఆయన కేమీ హక్కు లేదు. కుటుంబాలకు కుటుంబాలు ఇక్కడ నెలల తరబడి పడివుండటానికి ఇదేమీ సత్రము కాదు."
సత్యమూర్తి మళ్ళీ నిగ్రహించుకునేందుకు యత్నిస్తూ "నాన్నగారి ఆస్తి వ్యవహారాలన్నీ అనేక చికాకులతో కూడివుండి, జఠిలంగా వున్నాయి. మా నాన్న అనుభవజ్ఞుడు. ఆయనిక్కడ కొంతకాలంపాటు వుండటము నాకూ, నీకూ అందరికీ శ్రేయస్కరము" అన్నాడు.
ఆమె అసహ్యంగా అతనివైపు చూస్తూ "ఇంత చదువు వెలగ బెట్టావు. ఈ మాట అనటానికి సిగ్గులేదూ? ఇంత అప్రయోజకుడివి అయినావా? నీ పన్లు చేసుకోవటము నీకు చేత కాదూ?" అంది వెగటుగా.
అతను యీ అవమానాన్ని భరించలేకపోయాడు. అతన్లో కోపం, ఉక్రోషం కట్టలు తెగి ప్రవహించింది. "నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను. మీ తమ్ముడ్ని వాళ్ళ కుటుంబాన్నీ నువ్వు యింట్లో పెట్టుకుని పోషిస్తున్నట్లే, నాకు అయినవాళ్ళనీ, మా కుటుంబాన్నీ నేనూ ఇక్కడే వుంచుకుని పోషిస్తాను. వాళ్ళనిక్కడ ఎందుకు వుంచుకున్నావని నిన్ను నే నెన్నడూ ప్రస్నించలేదు. అలాగే నా మీద నువ్వు అధికారం చలాయించటము అర్ధం లేదు" అన్నాడు గట్టిగా అరుస్తూ.