Previous Page Next Page 
నల్లతంబి పేజి 27

అప్పుడే ఇద్దరు వ్యక్తులు హడావుడిగా ట్రంకు పెట్టెలతో వచ్చారు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ బోగీల్లో మొదటిదాని దగ్గరే ఆగిపోయారిద్దరూ.
ఆ యిద్దరిలో ఒకరు ఆ బోగీ టి.టి.ఇ. రెండోవ్యక్తి కోచ్ అటెండెంట్.
వాళ్ళు నిలచిన బోగీ ప్రక్క కంపార్టుమెంటు టి.టి.ఇ. వారి దగ్గరకొచ్చి ఏదో అడగబోయి అనుమానంగా ఆగిపోయాడు.
"వణక్కం అప్పా....ఉంగళ్ పేర్ రామ్ కుమార్ దావా.....రొంబ లేట్ అయిపోయిడ్చి...." మందహాసం చేస్తూ తమిళ యాసలో పలకరిచాడు కొత్తగా వచ్చిన టి.టి.ఇ.
తోటి ఉద్యోగి పేరేమిటో తనకు తెలియక పోయినా....తన పేరు తెలుసుకుని పలకరిస్తున్న అతన్ని ఏమని సంబోధించాలో అంతుబట్టక పలకరింపుగా నవ్వి వూరుకున్నాడతను.
"సిటీబస్ ట్రాఫిక్ లో జాం అయింది. అందుకే లేట్ గా వచ్చానప్పా. ఈరోజు రిజర్వేషన్ చార్టులు మీ దగ్గర వున్నాయని చెప్పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోటింది. ఈ కోచ్ చార్తుల్ని ఇస్తారా...."
"అంటే....మీరు...."
"ఈ ఫస్టు క్లాస్ బోగి టి.టి.ఇ. వేలాయుధంని నేనే. ఇతను కంపార్ట్ మెంట్ అటెండెంటు మిస్టర్ సుబ్బారావు."
"అదేమిటి మీరు తమిళవారా."
"అవునప్పా. నా భార్య ఇక్కడే కోఠీలోని ఆంధ్రాబ్యాంక్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా చేస్తుంది. అందుకే కావాలని సౌత్ సెంట్రల్ రైల్వేలో వేయించుకున్నానప్పా."
"అవునులే. భార్యాభర్తలిద్దరూ ఒకచోట వుంటేనే బాగుంటుంది."
గార్డు విజిల్ వినిపించింది.
తనపై బడిన పనిభారం తగ్గినందుకు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు రామ్ కుమార్.
గార్డు నుంచి కూడా సిగ్నల్ రావడంతో కూతపెట్టి బయలుదేరింది నర్సాపూర్ ఎక్స్ ప్రెస్.
టి.టి.ఇ. లు ఇద్దరూ హడావుడిగా ఎవరి బోగీలో వారెక్కారు. రెండు మూడు బోగీలకు ఒకడే అటెండెంటు వుండడంవల్ల ఆ ఇద్దరికన్నా ముందే తన డ్యూటీలో నిమగ్నమైపోయాడు కోచ్ అటెండెంట్ సుబ్బారావు.
ఘట్ కేసర్ స్టేషన్ దాటుతుండగా ప్రయాణీకుల టికెట్స్ చెక్ చేసి తన సీట్లో కూర్చున్నాడు వేలాయుధం. సుబ్బారావు బయట అటెండెంట్ సీటుమీద కూర్చున్నాడు.
ఎవరితోటీ సంబంధంలేని ఆ ఎక్స్ ప్రెస్ వేగాన్ని పికప్ చేసుకుని ముందుకు దూసుకుపోతోంది. అర్ధరాత్రి దాటిన తరువాత నల్గొండలో ఆగింది ఆ ట్రయిన్.
ఆ సమయంలో ఓ కూపే తలుపు తెరచుకుని బయటకు తొంగి చూసింది ఓ అందాల బొమ్మ. ఆమెను చూడగానే హడావుడిగా సమీపించాడు వేలాయుధం.
తెలుగులో ఒక వెలుగు వెలిగి, తమిళంలో, హిందీలో అగ్రనాయికగా స్థానం సంపాదించి లక్షలకు లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ క్షణం కూడా ఖాళీలేని టాప్ స్టార్ గా, మూడు భాషల సినీ ప్రపంచాన్ని తన ఓరకంట ఆడిస్తున్న ప్రముఖ తెలుగునటి కుమారి 'తార' ఆమె.
నర్సాపూర్ ఆమె స్వస్థలమైనప్పటికీ, బొంబాయి నగరాన్ని వదిలి రావడానికి ఆమెకు తీరిక దొరకదనడంలో అతిశయోక్తి ఏమీలేదు. అందుకే కావాలనే ఈ సంవత్సరంలో పది రోజులపాటు ఎవరికీ కాల్షీట్లు ఇవ్వకుండా సపరివారంగా సొంతవూరికి బయలుదేరింది కుమారి తార.
ఇలా విశ్రాంతికోసం రావడం వెనుక మరో కారణం కూడా వుంది.
ఎన్నాళ్ళనుంచో విజయవాడలో ఇండస్ట్రీనొకదాన్ని స్టార్టు చేయాలని సంప్రదిస్తూ వస్తూన్నది తప్ప, సమయం లేనందువల్ల అది ఒక రూపాన్ని సంతరించుకోలేదింతవరకూ. ఎటూ ఆ విషయాన్ని చర్చించి ఓ అవగాహనకు వచ్చి ఎలాంటి ఇండస్ట్రీ అయితే బాగుంటుందో....దాని ప్లాన్ రూపొందించడం వగైరాలన్నీ పూర్తిచేయాలని ఆమె ఆలోచన.
ఏ వ్యాపారం చేయబోతున్నదో ఆ విషయమైతే ఇంతవరకూ బయటపెట్టలేదు కానీ-మొత్తానికి కొన్నికోట్లు వెచ్చించడానికి సిద్దపడిందనేది మాత్రం సినీ ప్రముఖుల ద్వారా వెల్లడైన నగ్నసత్యం.
'తార' అనే పేరు చూసి ఎవరో అనుకున్నాడే కాని....ఆంధ్రుల ఆరాధ్య నటి లేడీ సూపర్ స్టార్ తానున్న కూపేలోనే ప్రయాణిస్తున్నదని వూహించలేకపోవడంవల్ల అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
వచ్చిన ఛాన్స్ ను వదులుకోవడం ఇష్టంలేదతనికి. "మేడమ్....మిమ్మల్ని చూసి రొంబ సన్ దోషం కలిగింది. నేను ఈ బోగీ టి.టి.ఇ.ని. అంతేకాదు-ఉంగళ్ ఫాన్ ని. మీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి.నేన్ దా చేసి పెడతాను." సంతోషంగా గడగడా వల్లించేశాడు వేలాయుధం.
అతను సినీ తారను చూసి మెలికలు తిరగడం గమనించి ముసి ముసిగా నవ్వుకున్నాడు సుబ్బారావు.
ఇక్కడా ఈ గోల తప్పేలా లేదు దేవుడా అనుకుంటూ చిరు నవ్వును బలవంతాన ముఖాన పులుముకుని మంచినీళ్ళు కావాలన్నట్టు చేతిలోని వాటర్ ప్లాస్కుని ముందుకు చాపింది.
సంబరపడిపోతూ ఆ ప్లాస్క్ నందుకుని రెండంగల్లో మాయమైపోయి క్షణాలమీద వాటర్ తో ప్రత్యక్షమయ్యాడు వేలాయుధం.
అప్పుడతనితోపాటు కట్టూ....బొట్టూ నాగరికంగా వున్న ఓ యువతి కూడా వున్నది.
"ఉంగళ్ కు శ్రమ కల్పిస్తున్నాను"
"ఏమిటది...?"
"ఈ మేడమ్ కలెక్టరుగారి శ్రీమతి. నల్గొండలో ఎక్కారు. మీ కూపేలోనే ఖాళీ వుంది. వీరు గుంటూరు వరకు వస్తారు. మీ కూపేలోని నాలుగోబెర్తుని వీరికి కేటాయించాను."
ఆమెవైపు అనుమానంగా చూసింది తార.
"ట్రెయిన్ కదులుతుండగా హడావుడిగా ఎక్కారు. అందుకే-ఇప్పుడు తీసుకొచ్చాను"
ఆమె సందేహం తీరిపోయిందప్పుడు. కలెక్టరుగారి ఫ్యామిలీ అని చెప్పడంతో మౌనం వహించింది తార.

 Previous Page Next Page