Previous Page Next Page 
మనస్విని పేజి 29

 

    "అదెలా సాధ్యం బావా?"
    
    "ఏమో"
    
    "అయితే అడగనా?"
    
    "అడుగు......"
    
    "......."
    
    "ఎందులోనూ సందేహం వలదుబాలా? అభ్యంతరంగా అడిగెయ్"
    
    "ఛీ! అదిగో అప్పుడే హాస్యపట్టిస్తున్నావే"
    
    "ఏదీ నా చేతిలో ఏమి లేందే?"
    
    నవ్వుకుంది.
    
    చందమామ లేని ఆకాశం మల్లెపూలు ముడవని మగువశిరోజాలంకరణంలో వుంది.
    
    చక్కని చుక్కల రవిక తొడుక్కుంటోంది గగనాంగన.
    
    "బావా!"
    
    "ఊ"
    
    "చెప్పనా?"
    
    "చెపుతావా? అడుగుతావా?" 

   

    "ఏదైనా ఒకటి?"
    
    "మరి ఇంకా నాంది కాలేదే?"
    
    "ముహూర్తం కుదిరిందిగా?"
    
    "కుదిరిందిగా"
    
    "నిజంగానా బావా?"
    
    ఆమె కంఠంలో ధ్వనించిన సంతోషానికి సాగరాలే ఉప్పొంగుతాయ్.
    
    ఆమె ముఖంలో అప్పుడు గోచరించిన సంతోష చిహ్నమైన వెలుగు ముందు ఏ శరీర కాంతీ నిలువదు. వెల వెలా బోతుంది.
    
    "అవును"
    
    "అయితే చెప్పనా?"    

 

    "చెప్పు"
    
    "నిజం"
    
    "ఊ"
    
    మరికాస్త దగ్గరగా జరిగింది"
    
    బావచేయి తన చేతిలోనికి తీసుకొని మృదువుగా వేళ్ళని నిమిరింది.
    
    తర్వాత ఆ చేతిని అలాగే తీసుకుని చెంపకి రాచుకుంది.
    
    మెల్లగా ఆ వేళ్ళతో పెదవుల్ని సుతారంగా ఒత్తుకుంది.
    
    వేళ్ళన్నీ ఒక్కొక్కటి మధురంగా మెల్లగా మునిపంటితో కొరుకుతూ చెప్పసాగింది......
    
    సారధి ఆమెవైపు చూస్తూ ఆమె విచిత్రమైన చర్యలకి ఆశ్చర్యపడసాగాడు.
    
    తల వంచుకుని ఇలా అంది.
    
    "ఓ అందాల చందమామకి వరుస అయిన ఓ చక్కని చుక్క వుంది. ఆ మామమనసు తెలుసుకోలేనిచుక్కకి బ్రతుకుగగనంగా వుంది"
    
    తలెత్తిచూసింది.
    
    తదేకంగా తనవైపే చూస్తున్న బావను చూసి మరీ సిగ్గుపడింది.
    
    "పో బావా! అలా చూడక చూస్తేనే చెప్పను!"
    
    "సరే"
    
    "ఆ మామకి మల్లెలంటే ఇష్టం. మగువలంటే మక్కువ మల్లెకన్నా మనోహరమైన తనను కాదని మరేమగువ మల్లెమొగ్గలో చిక్కుకుంటాడోనని ఆ మరదలి మనసులోబాధ-"
    
    వింటున్నాడు సారధి!
    
    "ఏమిటేమిటో పిచ్చిగా చెపుతుందే-అనుకుంటూ"
    
    "మల్లెపూవుకి వయసొచ్చింది. మనసు విరిసింది తనువూ విరిసింది. మనసూ వయసూ మల్లెపూవంటి సొగసూ తన బావ కివ్వాలని మగువ మక్కువపడుతోంది. వెన్నెలవంటి సౌందర్యం మల్లెలవంటి సౌరభ్యం మగువలోవున్న సౌలభ్యం అన్నీ చూశాడు బావ.
    
    "ఇప్పుడు చెప్పు బావా ఆ కోమలికి సమాధానం?"
    
    ఉలిక్కిపడి ఆమె చేతిలోని తన చేతిని లాక్కుని అన్నాడు.
    
    "ఏమిటి?"
    
    "సమాధానం"
    
    "దేనికి"
    
    "నేనడిగిన దానికి"
    
    "ఏమడిగావ్?"
    
    గుండెలో గాయమైనట్లై అంది సరోజ.
    
    "అదేమిటి బావా? నా మనసుని అంత మనోహరంగా కల్పననీ చేసి నీ పాదాలముందు పెడితే తన్నివేయటం అలా వుంచి కాలరాస్తానంటావు? నిజానికి శిరసులో ముడుచుకోవలసిందీ-వయసులో దాచుకోవలసిందీ....."
    
    "ఎంతటి భావుకత!"
    
    ఆమె భావనా బలానికి పొంగిపోయాడు.
    
    "బావా?"
    
    "ఊ"
    
    "వింటున్నావా?"
    
    "ఊ"
    
    "అయితే సమాధానం చెప్పు"
    
    "కథలు రాయరాదా సరోజా"
    
    "గేలిసేయక బావా"
    
    "ఎగతాళికాదు సరూ......కథలు రాయ్"
    
    "నాబ్రతుకు ఒక కథ కాకుండా చూడు"
    
    గుండెలో ఎక్కడో గుభేల్ మంది?"
    
    "ఔను బావా! నిన్ను వలచివచ్చాను నా మనసు నీది ఏనాడో అయింది. తనువూ నీదేచేసుకో"
    
    కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది మనసులోని భావాన్ని.
    
    "ఏమిటి సరోజా?"
    
    "ఔను బావా అది నా మనసులోని మాటే......ఈ రోజు నీ అంగీకారం పొందుదామని వచ్చాను"
    
    మౌనం వహించాడు సారధి.
    
    "జవాబు చెప్పు బావా?"
    
    జవాబు ఇవ్వలేదు అతను.
    
    "మౌనం అర్ధాంగీకారం అనుకోనా?"    
    
    కఠినంగా అన్నాడు.
    
    "సరోజా! మగువకు అంత భావనపనికిరాదు వెళ్ళు"
    
    "జవాబు కావాలి బావా?"    

 

    "తప్పక ఇవాలా?"
    
    "అవును బావా"
    
    "అయితే విను"
    
    "వినటానికి సిద్ధమయ్యే వచ్చాను బావా"
    
    మనసుని వేయి కవాటాలుగా చేసుకుని కూర్చుంది.
    
    ఏదో ఒక దారం నుంచి అయినా బావమనసులో ప్రవేశించాలనుకుంది.

 Previous Page Next Page