Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 29


    అందరూ వెళ్ళిపోయాక ఏదో ఫైల్ తీసుకుని బయటికొచ్చాడు చంద్రం.
    "అరె! మీరిక్కడే నిలబడ్డారేమిటి? ఇంటికి వెళ్ళలేదూ?" ఆశ్చర్యంగా అడిగాడామెని చూచి.
    "లేదండీ! మా బావ కోసం వెయిట్ చేస్తున్నాను. కొత్తగదా! ఇవాళ ఒక్కరోజు గడిచిందంటే రేపట్నుంచీ నేనొక్కదాన్నేవెళ్ళిరాగలను"
    "మీఇల్లెక్కడ?" అడిగాడతను "అసలు మాది ఈ ఊరు కాదులెండి. ప్రస్తుతం మా బావ వాళ్ళింట్లో ఉంటున్నాను రేపోమాపో వర్కింగ్ ఉమెన్ హాస్టల్లోచేరాలి"
    "అలా అయితే మీకింకో సహాయంకూడా చేయగలను నేను. అయితే దానికి వేరే టీపార్టీ ఇవ్వాల్సివుంటుంది" "అలాగే చేస్తాను! ఏమిటి మీరు చేయబోయే సహాయం?"
    మా సిస్టర్ ఫ్రెండ్ ఒకమ్మాయ్ యిక్కడే టెలిఫోన్ ఎక్స్చేంజిలో పని చేస్తోంది. ఆమె ఓ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లోనే ఉంటోంది ప్రస్తుతం. కానీ అక్కడి వాతావరణం ఆమెకు ఏమాత్రం నచ్చటంలేదు. అక్కడున్న అమ్మాయిలు చాలామందికి బాయ్ ఫ్రెండ్స్- వాళ్ళందరితోనూ సరదాలు-సరసాలూ-అట! అంచేత బయట ఎక్కడయినా ఇల్లు తీసుకుని ఉండాలనిఅనుకుంటోంది కానీ ఒక్కర్తే ఉండాలంటే భయం! పోనీ మీరిద్దరూ కలిసి ఓ ఇల్లు తీసుకుంటే బావుంటుంది కదా! ఇల్లు కుదిర్చే బాధ్యత నాది ఏమంటారు?
    నాగమణి కొద్దిక్షణాలు ఆలోచించింది. ఆ ఆలోచన బాగానే ఉన్నట్లనిపించిందామెకి.
    "సరే! అలాగే బాగానే ఉంటుందనుకుంటాను. కానీ ఎంత త్వరగా ఇల్లు ఎరేంజ్ చేయగలిగితే అంత మంచిది...." అందామె.
    "ఎంత త్వరగా ఏమిటి? రేపుదయానికే ఇల్లు తెచ్చి మీముందు పెడతాను నా సంగతి మీకింకా తెలీదనుకుంటాను. ఒక కప్పు కాఫీకోసం ఎంతటి అసాధ్యమయినా ఇట్టే సాధ్యం చేసేస్తాను కాఫీ ఫలహారం కూడా ఆఫర్ చేసేరంటే అది నాకు లైఫ్ అండ్ డెత్ కొశ్చన్ గా తీసుకుంటాను" నాగమణికి నవ్వాగటంలేదు.
    "ఇదిగో ఈ ఫైల్ చూశారా! ఇది నిజానికి నాకు సంబంధించిన పనికాదు. షరీఫ్ ది రాత్రంతా దీంతో తంటాలుపడితే రేపు నాకు అతను పెద్ద టీ పార్టీ ఇచ్చేస్తానని మాటిచ్చాడు. అంచేత మీక్కూడా పనితగ్గించుకోవాలంటే ఫైల్సన్నీ నా మొఖానపడేయండి తెల్లారేసరికల్లా అప్ టు డేట్! ఏమంటారు? అంతా ఫ్యూర్ బిజినెస్ కదూ!" నవ్వుతూ తలూపిందామె.
    "ఇంకవస్తానండీ! రేపు ఉదయంకనబడతాను మళ్ళీ!" అనేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయిదు దాటాక ఆమెకోసం ఆఫీసుకొచ్చాడు శ్రీనివాసరావ్.
    అతన్ని చూసి పొడిగా నవ్వింది నాగమణి.
    "ఇంటికి వెళదామా?" అడిగాడతను.
    "ఊ!" అంటూ కాగితాలన్నీ సర్దేసి అతనితోపాటు బయటకునడిచిందామె.
    "మధ్యాహ్నం భోజనం చేశావా?" అడిగాడతను ఆత్రుతగా.
    "ఊహు!"
    "అరె! ఎందుకని? మీ క్యాంటీన్ లో చేయవచ్చుగా?"
    చేయబుద్దికాలేదు. మధ్యాహ్నం టీపార్టీ జరిగింది. ఇంక ఆకలి వేయలేదు".
    "టీపార్టీ ఎందుకు?"
    "నేను ఇవాళ ఆఫీసులో చేరినందుకు!"
    "ఓహో! నువ్వే ఇచ్చావన్నమాట!" ఆటోలో ఇల్లుచేరుకున్నారిరువురూ స్నానాలు ముగించి హాల్లోనే కూర్చున్నారు. నాగమణి ఏదో పుస్తకం చదువుతోంది. ఆమె అలా నిశ్శబ్దంగా ఉండటం అతనికి నచ్చడంలేదు. తనను దోషిగా నిలబెడుతున్నట్లుందా నిశ్శబ్దం! ఆమెకు అన్యాయంజరిగినట్లు ప్రకటిస్తోంది. లేచి  నెమ్మదిగా ఆమె దగ్గరకు నడిచాడతను.
    "నాగమణీ!"
    "ఊ!" అతనివంక చూడకుండానే పుస్తకం పక్కనపెట్టి అందామె.
    "నామీద కోపంగా ఉందా?" ఆమె మాట్లాడలేదు. "పోనీనేను తప్పుచేస్తే ఆ విషయం చెప్పేయకూడదూ?"
    "జరిగినదాన్ని గురించి ఇప్పుడెందుకు ఆలోచించడం?"
    ఇంకేమీ మాట్లాడలేకపోయాడతను. కొద్దిసేపటి తర్వాత అతనే వెళ్ళి కారియర్ లో ఇద్దరికీ భోజనం తీసుకొచ్చాడు. తనే వడ్డించింది నాగమణి. మౌనంగానే భోజనాలు ముగిశాయి. తను వెళ్ళిగదిలో పడుకుంది నాగమణి.
    చాలాసేపటి తర్వాత అతను కూడా ఆమె దగ్గరికొచ్చి మంచం మీద కూర్చున్నాడు. "నాగమణి!"
    "ఊ!"
    "నేనంటే ఇష్టంలేదా నీకు?"
    "ఇదివరకుండేది." అతను ఆమె మీదకు వంగి మొఖం మీద ముద్దు పెట్టుకున్నాడు.
    ఆమె అతనిని తనకి దూరంగానెట్టివేయడానికి ప్రయత్నించింది.
    ఆమెను మరింత గట్టిగా అదుముకుని పూర్తిగా ఆమె మీదకు వంగిపోయాడతను. నాగమణి బొమ్మలాకదలికలేకుండా ఉండిపోయింది. నిర్జీవంగా ఉన్నట్లు కనబడుతున్న ఆమెను ఆత్రుతగా కుదిపాడతను.
    "నాగూ!"
    ఆమె పలకలేదు.
    "నాగూ!"
    "ఊ!"
    "నీకు ఆనందంగా లేదూ?"
    ఆమె జవాబివ్వలేదు.
    అతను నిరుత్సాహపడ్డాడు ఆవేశం నెమ్మదిగా చల్లారిపోయింది.
    ఆమెను కౌగిటినుంచి వదలి దూరంగా జరిగి పడుకున్నాడు.
    చాలాసేపు ఇద్దరూ అలా నిశ్శబ్దంగానే ఉండిపోయారు.
    "నన్నేంచేయాలని ఇలా చేశావ్ బావా?" అడిగిందామె.
    "మనం పెళ్ళి చేసుకుందాం నాగూ!"
    "బావా!" ఆశ్చర్యంగా అందామె.
    "అవునునాగూ! నేను అన్నీ ఆలోచించాను! హేమా నేనూ కలిసి గడపడం అసాధ్యం! విడాకులు తీసుకుని ఎవర్దారినవాళ్ళుండటం ఇద్దరికీ మంచిది అప్పుడు మనం వివాహం చేసుకోవడంలో అనౌచిత్యమేముందీ? అసలు నీ మనసులో ఏముందో చెప్పు నాగమణీ! నన్ను వివాహం చేసుకోవడం నీకిష్టమేనా?"
    "ఏమో బావా! నా మనసు అంగీకరించడంలేదు. అక్కయ్యను కాదని ఆమెకు విడాకులిచ్చినన్ను చేసుకుంటే అక్కయ్య నా గురించి ఏమనుకుంటుంది? నన్నెంత అసహ్యంగా వూహించుకుంటుంది తనసంసారం నావల్లే నాశనమయిందని ఎంతగా బాధపడుతుంది?" కళ్ళవెంబడి నీళ్ళు తిరుగుతూండగా అందామె.
    "అవన్నీ పిచ్చి ఆలోచనలు నాగూ! మా సంసారం పాడవడానికి కారణం నువ్వు కాదని మనిద్దరకూ తెలుసుకదా! ఇంకెందుకీ అవమానాలు?" నాగమణి మాట్లాడలేదు.
    "నాగూ!" చాలా సేపటి తర్వాత పిలిచాడతను.
    "ఊ!" "అలా నిశ్శబ్దంగా ఉండిపోయావేం? ఆలోచిస్తున్నావా?"
    "నాకేమీతోచడంలేదు బావా! ఆలోచించేందుక్కూడానా మనసు సహకరించడంలేదు" నిస్పృహతో అందామె.
    అతను ఆమెను అంటిపెట్టుకునే నిద్రలోకి జారిపోయాడు. తనమీద ఉంచిన అతని చేతిని నెమ్మదిగా తొలగించిహాల్లోకి నడిచి సోఫాలో పడుకుంది నాగమణి. హఠాత్తుగా ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది నిస్సహాయంగా. ఎంతోసేపటికిగాని ఆమెకు ఉపశమనం కలుగలేదు.
    తన భవిష్యత్తేమిటో  తనకు తెలీదు. కానీ నిస్సందేహంగా ఈ పరిస్థితి మాత్రం కొనసాగకూడదు. ముందిక్కడనుంచి బయటపడాలి! ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా! ఒకవేళ చంద్రం రేపటికల్లా తనకో ఇల్లు ఏర్పాటుచేయకపోతే హాస్టల్లోనయినా చేరిపోవాలి. ఆ నిర్ణయానికొచ్చాక కొంత మనస్థిమితం కలిగిందామెకి.
    మర్నాడు ఉదయం ఆఫీస్ కెళుతూనే చంద్రకోసం వెతికిందామె. అతను పావుగంట ఆలస్యంగా ఆఫీస్ కొచ్చాడు.
    "మీవల్లే ఆలస్యం అయింది నాగమణిగారూ! మీకు ఇల్లు చూసి ఏర్పాటుచేసేసి వచ్చాను."
    నాగమణి ఆనందంతో పొంగిపోయింది.
    "ఎక్కడ?" "మా యింటి దగ్గర్లోనేండి! రెండు గదులు ఉన్నాయ్! అద్దె వందరూపాయలు అన్ని సౌకర్యాలు ఉన్నాయ్ లెండి, భవాని గారు కూడా వప్పుకున్నారు"
    "భవానీ ఎవరు?" ఆశ్చర్యంగా అడిగింది నాగమణి.

 Previous Page Next Page