"అదే! మా సిస్టర్ ఫ్రెండ్ టెలిఫోన్ ఎక్చేంజిలో పని చేస్తోందని చెప్పాను చూడండి! ఆమె".
"అవునవును! మరి ఎప్పుడూ దిగవచ్చు ఆ ఇంట్లో?"
"మీ ఇష్టం! మీరెప్పుడు కన్వీనియంట్ అనుకుంటే అప్పుడే!"
"అలాగయితే ఈ సాయంత్రమే వచ్చేస్తాను"
"ఓ! యస్! భవానీగారిక్కూడా ఫోన్ చేసి చెప్పేస్తాను" మీరు కొంచెం సహాయంచేయాలి మరి!"
"షరామామూలే నాకు మరో టీ పార్టీ బాకీ పడతారు! అంతే!" నవ్వుతూ అన్నాడతను.
"అవన్నీ ఎలాగూ ఎకౌంట్ మెయింటెయిన్ చేస్తున్నారుగా! అందులో రాసేయండి!" తనూ నవ్వేస్తూ అందామె.
సాయంత్రం ఆమెతో పాటు శ్రీనివాసరావ్ ఇంటికి వచ్చాడు చంద్రం. అప్పటికే శ్రీనివాసరావ్ ఇల్లు చేరుకున్నాడు.
"ఈయన చంద్రంగారు బావా! మా ఆఫీసులో టైపిస్ట్. ఈయన శ్రీనివాసరావ్! మాబావ!" అంటూ ఇద్దరికీ పరిచయం చేసింది నాగమణి.
"నమస్కారమండీ! వెరీగ్లాడ్ టు మీట్ యూ!" అన్నాడు చంద్రంకరచాలనం చేస్తూ శ్రీనివాసరావ్ మౌనంగా చేయి కలిపి ఊరుకున్నాడు.
అతనికేమీ అర్ధం కావటంలేదు.
నాగమణికీ చంద్రానికీ ఈ రెండురోజుల్లోనే ఇంత పరిచయం ఎలా అయిందో, ఇప్పుడామె అతనినెందుకు ఇంటికి తీసుకువచ్చిందో ఏమీ అవగాహనకావడం లేదు.
"ఈయన నాకోసం ఓ ఇల్లు చూశారు బావా! వీళ్ళింటిదగ్గరేనట! అక్కడ నాతోపాటు భవానీ అని ఈయనకు తెలిసినావిడ కూడా ఉంటుంది.ఇద్దరం కలిసేవంటా అదీ చేసుకుంటాం!"
శ్రీనివాసరావ్ మరింత ఆశ్చర్యపోయాడు. నాగమణి తనను హఠాత్తుగా మోసంచేసినట్లనిపించసాగింది. ఇద్దరి మధ్య ఇంతటి బాంధవ్యం ఏర్పడ్డాక కూడా ఆమె తనతో మాట మాత్రమయినా చెప్పకుండా ఇల్లువెతుక్కోవడం, అందుకు మరో వ్యక్తి సహాయం తీసుకోవడం అతనికి చిరాకుగా ఉంది.
"ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాను బావా! అందుకే ఈయనను వెంబడి తీసుకొచ్చాను!" కొద్ది క్షణాలాగి అందామె.
"ఆల్ రైట్ ఇంతకూ ఆ ఇల్లెక్కడ చంద్రంగారూ?" అడిగాడు శ్రీనివాసరావ్, మనసులోని ఆలోచనలను అణచివేసుకుంటూ.
చంద్రంగుర్తులు చెప్పాడు. నాగమణి లోపలికెళ్ళి తనబట్టలు సూట్ కేస్ లో అమర్చుకుని సూటు కేస్ బెడ్డింగ్ తీసుకొచ్చి హాల్లో ఉంచింది.
"రిక్షా తెమ్మంటారా?" అడిగాడు చంద్రం అతనికి శ్రీనివాసరావ్ ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంది. నాగమణి అక్కడినుంచి వెళ్ళటం అతనికి ఇష్టంలేదని కూడా అర్ధమయిపోతోంది. "తీసుకురండి!" అంది నాగమణి వెంటనే.
చంద్రం బయటకు నడిచాడు. నాగమణి తలుపు దగ్గరే నిలబడి బయటకు చూడసాగింది.
"నాగూ! ఆమెకు సమీపంగా వచ్చి పిలిచాడు శ్రీనివాసరావ్.
"ఊ!" అందామె అతనివంక చూసి.
"ఎందుకింత హఠాత్తుగా వెళ్ళిపోతున్నావ్?"
"వెళ్ళిపోవాలనిపించింది బావా!"
"నాతో ఒక్కమాట కూడా చెప్పలేదేం మరి?"
"ముందే చెప్పాను బావా! నువ్వు మర్చిపోయావేమో! హాస్టల్లోనే చేరిపోదామనుకున్నాను ఈలోగా చంద్రంగారు హాస్టల్ కంటే ఇలాంటి చోటే బావుంటుందని అంటే సరేనని వప్పుకున్నాను".
"నేనంటే నీకు అయిష్టంగా ఉందా నాగూ?" తిరిగి అడిగాడతను.
నాగమణి చిన్నగా నవ్వింది.
"ఎందుకలా అనుకుంటున్నావ్ బావా?"
"అనుకోవడంకాదు నిజమే అది!"
చంద్రం రిక్షాతో తిరిగి వచ్చాడు.
రిక్షావాడు లోపలికోచి ఆమె సామాను తీసుకెళ్ళి రిక్షాలో పెట్టాడు.
"పదండి నాగమణిగారూ!" అంటూ సైకిల్ స్టాండ్ వేసి లోపలికొచ్చాడు చంద్రం.
"ఓ.కే. బావా! వెళతాను....." అనేసి బయటకు నడిచిందామె.
"వస్తాను శ్రీనివాసరావ్ గారూ!" శ్రీనివాసరావ్ తో కరచాలనం చేసి తనూ బయటకు నడిచాడు చంద్రం.
ఆమె రిక్షా వెనుకే అతను సైకిల్ మీద అనుసరించాడు.
శ్రీనివాసరావ్ అవమానంతో కృంగిపోయాడు. కనీసం తనను ఆ ఇంటివరకూ రమ్మనయినా న\నాగమణి ఎందుకు ఆహ్వానించలేదు? తనకంటే ఆ ముక్కూ మొఖం తెలీని చంద్రం ఎక్కువయిపోయాడా ఆమెకి? చాలాసేపు అక్కడే కూర్చుండిపోయి ఏవేవో ఆలోచనలతో సతమతమయి పోసాగాడతను.
తండ్రి శ్రీనివాసరావ్ కి టెలిగ్రామిచ్చాక అతను తన కోసంకాకపోయినా కనీసం పాపాయిని చూడ్డానికయినా వస్తాడేమో అనుకుంది హేమ. కానీ అతని జాడ లేకపోయేసరికి అతనిమీద మరింతకోపం పెరిగిపోయింది. అతనికంతపట్టుదల ఉంటే తనకేనా లేనిది? పైగా తనవల్ల ఏ తప్పూ జరగనిదే తనెందుకు ఓటమిని అంగీకరించాలి?
అసలు తన తండ్రి ఆ టెలిగ్రామివ్వడం కూడా తనకిష్టంలేదు కానీ అలా తెలియజేయకపోవడం మంచిదికాదనీ, ఎంత చెడ్డా పాపాయి పుట్టిన విషయం తండ్రికి తెలపడం ధర్మమనీ వాదించాడాయన. తను ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఒకవేళ మనసు మార్చుకుని, చేసిన తప్పు తెలుసుకుని, పశ్చాత్తాపంతో వస్తాడేమోనని ఊహించింది. తన భ్రమగానీ అలాంటి రాతిగుండె కలవాడికోసం ఎదురుచూడడం కూడా అనవసరం.
ఆ మధ్యాహ్నం ఒక పబ్లిషర్ వచ్చాడామెకోసం.
"హేమగారు మీరేనా?" అడిగాడతను.
"అవునండీ! మీరెవరు?"
"నేను పబ్లిషర్ ని! నా పేరు కాశ్యప్! క్రాంతి పబ్లికేషన్స్ నాదే!"
"రండి కూర్చోండి!" అతనిని లోపలికి ఆహ్వానింహింది హేమ.
"మీ సీరియల్ చదువుతున్నానండీ నేను. పర్సనల్ గా నాకెంతో నచ్చింది. ఇటీవలి కాలంలో ఇంత చక్కటి నవల రాలేదు. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు. అనేకమంది అభిప్రాయాలు సేకరించాను. ఒక విధంగా చెప్పాలంటే అసలు ఎవరి నోటివెంబడి విన్నా మీ నవల గురించే మాట్లాడడం జరుగుతోంది. అఫ్ కోర్స్ మీకొచ్చే ఉత్తరాలబట్టీ మీకా విషయం తెలిసే ఉంటుందనుకోండి....." ఆగాడతను.
హేమ అతని మాటలకు ఆనందపడిపోయింది. "థాంక్యూ!" అంది మర్యాదకోసం. "మీనవల వచ్చేనెలలో పూర్తవుతుందని తెలిసింది. అది పబ్లిష్ చేయాలని అనుకుంటున్నాను ఆ వివరాలు మాట్లాడాలనీ"
హేమ నవ్వేసింది. "అవేవీ నాకు తెలీదు. మీరే చెప్పండి! ఇది నా మొదటి నవల అన్న విషయం మీకు తెలుసనుకుంటాను-".
"అవునవును!" అన్నాడతను. అని కొద్దినిమిషాలు ఆలోచనలో పడ్డాడు.
"చూడండి! నాదీ కొత్తగా ప్రారంభించిన పబ్లికేషన్స్! అంచేత మీ నవలకు ఇవ్వగలిగినంత ఇస్తాను! ఒకవేళ అది తక్కువ మొత్తమయితే అంత మాత్రాన మీ నవలను చిన్న చూపుచూసినట్లు భావించకండి? నా శక్తి మేరకే నేను చెపుతున్నాను అంతే!"
"ఫరవాలేదు చెప్పండి నేను వ్యాపారస్తురాలిని కాదుగదా!" నవ్వుతూ అంది హేమ.
"మీకు ఎనిమిది వందలిస్తాను. మొదటి ప్రచురణ రెండువేల కాపీలు ప్రచురిస్తాను. రెండో ప్రచురణ కొస్తే అయిదువందలిస్తాను. ఏమంటారు?"ఆమెకు అసలు ఈ విషయాలు బొత్తిగా అనుభవం లేదు. అంచేత ఏదొకటి "ఊ" అనడమే మంచిదనిపించింది.
'మీ ఇష్టం! అలాగే కానివ్వండి" అంది చిరునవ్వుతో.
అతను ఆనందంగా జేబులోనుంచి చెక్కు పుస్తకం తీసి ఆమె పేర ఎనిమిది వందలకు చెక్కురాసి ఆమెకిచ్చి, తన దగ్గర సిద్దంగా ఉన్న అగ్రిమెంట్ మీద ఆమె సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ వార్త వింటూనే రామరాజు ఆశ్చర్యపోయాడు. హేమ ఏదో కథలూ అవీ రాస్తుందని తెలుసుగాని వాటివల్ల ఇలా రాబడి వుంటుందని తెలీదతనికి.
ఆ సీరియల్ తెచ్చిన పేరు ప్రఖ్యాతులు ఆమెను తీరికలేని రచయిత్రిగా మార్చేసినాయి. అన్ని పత్రికల నుంచీ కథలూ, నవలలూ పంపమని అర్ధిస్తూ ఆమెకు ఉత్తరాలు వస్తున్నాయ్. కొన్ని పత్రికలు అడ్వాన్సుగా డబ్బు పంపించివేస్తున్నాయ్. అప్పుడే రెండో సీరియల్ ప్రారంభించింది ఆమె. అదికూడా ప్రారంభలోనే విశేషంగా పాఠకులను ఆకర్షించసాగింది. ముఖ్యంగా మగాడి నిరంకుశత్వాన్ని దుయ్యబడుతూరాయడం వల్లా పాఠకులలో ఎక్కువ భాగం స్త్రీలే కావడంవల్ల తేలికగా అందరినీ ఆకట్టుకోగలిగిందామె.
చంద్రకాంత్ కి హేమ అంత పేరు సంపాదించుకోవడం ఎంతో ఆనందం కలిగించసాగింది. తరచుగా ఆమెను కలుసుకుని మరింత ప్రోత్సాహం అందించసాగాడు. ఓ రోజు హేమ కోసం ఓ స్త్రీ వచ్చింది. నడివయసు వుంటుందామెకి.