Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 28


    "బోర్ కొట్టేసిందా ఇంట్లో?" అడిగాడతను.
    "అవును! నువ్వెంత త్వరగా వస్తావా అని ఎదుర్చూస్తూ కూర్చున్నాను....."
    ఆ మాట అతనిని కదిలించివేసింది. ఇంత తీయనిమాట హేమ ఎప్పుడూ ఎందుకు అనలేదు?
    "సరే! నేను పావుగంటలో స్నానం అదీ చేసివచ్చేస్తాను! అలా ఎక్కడయినా తిరిగివద్దాం!" అనేసి  హడావుడిగా లోపలకు నడిచాడతను.
    అతని హడావుడి చూచినాగమణి నవ్వుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ రోడ్డుమీద కొచ్చారు.
    "ఇదిగో! నీ బెజవాడ సిటీబస్సులు ఎలా ఎక్కాలి, ఎక్కి ఎలా నిలబడాలి? ఆబ్రేకులకు బొక్కబోర్లాపడకుండా ఎలా పట్టుకోవాలీ, ఆ తరువాత కిందకు ఎలా దిగాలి? అన్న విషయం ట్రైనింగ్ యిస్తాను. ఎందుకంటే రేపట్నుంచీ పాపం నువ్వూ ఈ బస్సులబాధితురాలివేకదా!" నవ్వుతూ అన్నాడతను.
    ఇద్దరూ బస్ స్టాప్ దగ్గరనిలబడ్డారు.
    అతివేగంగా బస్ వచ్చి నిలబడిందక్కడ. పది నిముషాల తర్వాత ఇద్దరూ గవర్నర్ పేటలో దిగి ఓ ఎయిర్ కండిషన్డ్ రెస్టారెంట్ కి వెళ్ళారు. అతని బలవంతంమీద కాఫీ ఫలహారాలు తీసుకుంది నాగమణి.
    "ఇవాళ హేమ వాళ్ళ నాన్న దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది......" రోడ్డుమీద నడుస్తూ అన్నాడతను.
    "ఏమిరాశారు?" అడిగిందామె ఆత్రుతగా.
    "హేమకు మూడో నెలట! నన్ను రమ్మనిరాశారు....."
    "అలాగా! కంగ్రాచ్యులేషన్స్!" అభినందిస్తూ అందామె.
    అతనేమీ మాట్లాడలేదు.
    "మరి ఎప్పుడు వెళ్తున్నావక్కడకు?" అడిగిందామె.
    "వెళ్ళదల్చుకోలేదు!"
    "ఇంట్లోనుంచి తనే వెళ్ళిపోయింది. అంచేత తనేరావాలి! నేను వెళ్ళిపిలవనక్కరలేదు!"
    "బాగుందిబావా! ఇద్దరూ అలా పంతాలుపడితే ఎలా?"
    "ఫరవాలేదు! నా సంసారం పాడయిపోయినా సరే! ఆమొండిదానికో పాఠం నేర్పాలి...." నాగమణి ఇంకేమీ మాట్లాడలేదు.
    రాత్రి తొమ్మిదవుతోండగా హోటల్లోనే భోజనం ముగించి ఇల్లు చేరుకున్నారిద్దరూ.
    అతను హల్లోనూ, నాగమణి పక్కగదిలోనూ పడుకున్నారు.
    ఆ రాత్రి చాలాసేపటివరకూ శ్రీనివాసరావ్ కి నిద్ర పట్టలేదు. అతని ఆలోచనలన్నీ పక్క గదిలో పడుకున్న నాగమణి మీదే ఉన్నాయ్ ఆమె అందం, ఆకర్షణ అన్నీ అతనిని కదిలించివేసినయ్. ఎంతోకాలంగా దూరమయిన స్త్రీ స్పర్శ అతనిలో కాంక్షను రగిలిస్తోంది. నాగమణి తనకంటే యిష్టం. ఆనాడు బంధువుల పెళ్ళిలోనే ఆమె తనను ప్రేమించింది మనస్ఫూర్తిగా తనే భర్తగా కావాలనికోరుకుంది.
    కానీ తనే ఆమెను నిరాకరించి అవమానపరచేడు. అయినా ఆమెకు తనమీదున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు చేరువయితే? ఆమెను తన సొంతం చేసుకుంటే?
    లేచి హాల్లోనే పచార్లు మొదలెట్టాడతను. టైము ఒంటి గంటవుతోంది. బయట వెన్నెలతెల్లగా అలముకుంది. నెమ్మదిగా నాగమణిగదిలోకి నడిచాడతను. నాగమణి గాఢనిద్రలో ఉంది. నైట్ బల్బ్ కాంతిలో ఆమె రూపం మరింత ఆకర్షణీయంగా కనబడుతోంది. ఎగసి పడుతున్న ఆమెగుండెలు కోర్కెను మరింత పెంచుతున్నాయ్.
    ఆమె పక్కనే కూర్చుని మీదకు వరిగాడతను.
    మరుక్షణం ఆమె అతని కౌగిట్లో కళ్ళు తెరిచింది.
    కొద్దిక్షణాలు ఆమెకు జరుగుతున్నదేమీ అర్ధం కాలేదు.
    "నాగూ!" అంటూ తన పెదాలమీద ముద్దు పెట్టుకుంటున్న శ్రీనివాసరావ్ ని చూడగానే ఆమె ఖంగారు పడింది.
    "బావా!" అంది ఆశ్చర్యంతోనూ, భయంతోనూ.
    "నాగమణి! నీలాంటి అందమయిన అమ్మాయిని చేతులారాదూరం చేసుకున్న తెలివి తక్కువవాడిని నేను!" ఆమెను పూర్తిగా ఆక్రమించుకుంటూ, ముద్దులతో ముంచెత్తుతూ అన్నాడతను. అతనిని దూరంగా నెట్టడానికి వృధా ప్రయత్నంచేసిందామె. నాగమణిలో యవ్వనం అతని స్పర్శకు రగులుతోంది. అతనిని వారించాలని వుంది. అతని చేతులనుంచి తప్పించుకోవాలని వుంది జరుగబోయే అనర్ధాన్ని ఆపాలనీ వుంది.
    కానీ నోరు మెదపలేకపోతోంది. అతని నుంచి తప్పించుకోలేకపోతోంది. అసలు ప్రతిఘటించడమే సాధ్యం కావడం లేదు. నిస్సహాయంగా అతని చేతుల్లో నలిగిపోసాగింది. నాగమణి ఇద్దరి ఆవేశమూ చల్లారేసరికి చాలా రాత్రి గడిచిపోయింది. ఆమెకు దూరంగా జరిగి కూర్చున్నాడు శ్రీనివాసరావు.
    "నాగమణీ!" ఆమెవంక చూడకుండానే పిలిచాడతను.
    "ఊ!" జరిగినదానికి బాధపడుతున్నావా?"
    ఆమె జవాబివ్వడంలేదు ఏం మాట్లాడాలో తెలీటంలేదు. తను జరిగిన దానికి బాధపడుతోందా? భవిష్యత్తు గురించి తల్లడిల్లిపోతోందా! అసలు తన మానసికపరిస్థితేమిటో తనకే తెలీటంలేదు.
    "సారీ నాగూ! ఒకవేళ నిన్నుబాధపెడితే నన్ను క్షమించు" ఆమెను దగ్గరకు తీసుకుని పెదాలు చుంబించబోయాడతను.
    నాగమణి అతన్నుంచి తప్పించుకుని దూరంగా జరిగింది. అతనింకధైర్యం చేయలేకపోయాడు. మిగతా రాత్రంతా ఇద్దరూ చెరో గదిలో నిద్రలేకుండా గడిపేశారు. మర్నాడు ఆఫీసులో జాయినయింది నాగమణి.
    శ్రీనివాసరావే ఆమెను తీసుకెళ్ళి ఆఫీస్ చూపించి తనువెళ్ళిపోయాడు. చాలా చిన్న ఆఫీసది. అంతా కలిపి పాతికమందికంటే ఎక్కువ లేరు. టైపింగ్ సెక్షన్ లో తనతోపాటు మరో ఇద్దరు అమ్మాయిలున్నారు. అందరినీ పరిచయం చేసిందోఅమ్మాయి. కొద్ది సేపటి తర్వాత ఓ యువకుడు ఆమె దగ్గరకొచ్చి నిలబడ్డాడు. అతని బట్టలు బాగామాసిపోయినయ్ చొక్కాకి రెండు మూడు చోట్ల అతుకులు కూడా ఉన్నాయ్.
    "నమస్కారమండీ! నా పేరు చంద్రం. ఇవాళ ఆఫీసుకి లేటుగా వచ్చాన్లెండి అందుకే మీతో పరిచయంచేసుకుందామని వచ్చాను. నేను డిస్పాచ్ క్లార్క్ గా పని చేస్తున్నాను."
    అతనికి ప్రతి నమస్కారం చేసింది నాగమణి.
    "ఇప్పుడు నన్ను అందరూ ఇక్కడికి పంపించిన విశేషమేమిటంటే ఈ ఆఫీసులో ఓ రూలుంది. ఉద్యోగంలో జాయినయిన ప్రతివాడుముందు ఓ చిన్న టీ పార్టీతో ప్రారంభించాలి అందుకని......"
    "అలాగేలెండి! ఎంత ఖర్చవుతుంది?" అందామె అతని చొరవకు ఆశ్చర్యపోతూ. "ఎంతోనా? మొత్తం ఇరవైరూపాయలవుతుంది....."
    "సరే! ఇరవై నేనిస్తాను! కానీ దయచేసి ఆ ఏర్పాట్లేవో మీరే చూడాలి..." అందామె తన పర్సులోనుంచి డబ్బు తీసి అతనికిస్తూ.
    "అవన్నీ నిశ్చింతగా నాకొదిలేయండి ఇలాంటి విషయాల్లో చాలా ఎఫిషియంట్ ని నేను. ఓసారిలాగే మన జూనియర్ ఇంజనీర్ ట్రాన్స్ ఫర్ అయితే" అంటూ ఏదో చెప్పబోతుంటే పక్కనున్న లేడీటైపిస్ట్ రెండు చేతుల్తో నమస్కరించింది.
    "అయ్యా చంద్రంగారూ! ఆవిడ ఇవాళే కొత్తగా చేరారు. మీరు పురాణం మొదలుపెట్టి బోర్ కొట్టారంటే వచ్చే టీపార్టీకూడా పోతుంది-" అంది నవ్వుతూ.
    "ఈ ఫైల్ పుటప్ చేయమంటే నువ్వక్కడ కబుర్లు చెప్తున్నావేమయ్యా?" వెనుకనుంచి కూడా ఎవరో అరచేసరికి హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్రం.
    "ఆ బట్టలూ అవతారం చూస్తూంటే చిరాకుపుడుతుంది. మన ఆఫీసు ఫ్యూన్ ఇతనికంటే మంచి బట్టలువేసుకుంటాడు" అందా అమ్మాయి నాగమణితో.
    ఆమె మాటలకు నాగమణినొచ్చుకుంది.
    "అతుకులున్న బట్టలు వేసుకుతిరగాలని ఎవరుమాత్రం కోరుకుంటారు. అతనికున్న పరిస్థితులెలాంటివో" అనుకుందామె.
    మరికాసేపట్లో టీ పార్టీ ఎరేంజ్ మెంట్స్ అయిపోయాయ్.
    మధ్యాహ్నం 'టీ' టైమ్ లో టీ పార్టీ జరిగిపోయింది. ఆ తరువాత తిరిగి నాగమణిదగ్గరకొచ్చాడు చంద్రం.
    "నాగమణిగారూ! ఇక్కడ ఇంకో ఆచారం కూడా ఉంది" అన్నాడు నవ్వుతూ. "చెప్పండి ఏమిటో?"
    "ఈ 'టీ పార్టీ' వగయిరా చేసినందుకుగాను నాకు ప్రత్యేకంగా ఓ టీపార్టీ ఇవ్వాల్సి వుంటుంది మీరు".
    "ఇస్తాన్లెండి దాన్దేముందీ?"
    "ఏమండోయ్ మీకింకా చంద్రం సంగతితెలీదు. ఏ మాత్రం ముఖమాటపడ్డారోజుకి అరడజను సార్లు మీ దగ్గర 'టీ'లు తాగేస్తాడు. జాగ్రత్త" మరొకతను అందరూ వినేటట్లుగానే నాగమణికి చెప్పాడు.
    "అన్యాయంగురూగారూ! నా నోటిదగ్గర 'టీ' పడగొట్టేయడం మీ ధర్మంకాదు" అతనితో అన్నాడు చంద్రం.
    సాయంత్రం నాలుగవుతోండగా 'టీ' తాగి కుర్రాడిని డబ్బులు నాగమణి దగ్గరతీసుకోమని పంపించాడు చంద్రం.
    "అబ్బ! జలగ అనుకోండి! అందరికీ ఏ పని కావాలంటే ఆ పని చేసి పెట్టిమొఖమాటం లేకుండా కాఫీలు, పలహారాలు కొట్టేస్తూంటాడు" నవ్వుతూ చెప్పింది నాగమణి పక్కనున్న అమ్మాయి. సాయంత్రం ఆఫీస్ అయాక బయటకొచ్చి వరండాలో నిలబడింది నాగమణి. తనదారిన తను ఇంటికి చేరుకోగలదుగానీ ఈ ఒక్కరోజు శ్రీనివాసరావ్ తను వచ్చి తీసుకెళతానని చెప్పాడు.

 Previous Page Next Page