Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 28

 

    అందరూ నవ్వేశారు.
    రామచంద్రమూర్తి నవ్వాపుకోలేక కుర్చీలో కూలబడి మరీ నవ్వసాగాడు.
    సీత ముఖం వాడిపోయింది.
    "కనుక ఉమాదేవిగారిది ఎక్కువ ఏజ్ అనకండి! కరెక్ట్ వయసులో వుంది."
    అతను మాట్లాడుతుండగానే బిలబిలమంటూ చుట్టుపక్కల వాళ్లందరూ వచ్చేశారు.
    అతని చుట్టూ మూగిపోయి ఎవరి ధోరణిలో వాళ్ళు ఏవేవో ప్రశ్న అడిగేయటం ప్రారంభించారు.
    "మీరు యాక్ట్ చేసిన మా యింటిదేవత సినిమా అంటే మాకెంతో యిష్టమండీ! పదహారు సార్లు చూశాను."
    "నేను ఆరుసార్లు చూశానండీ!"
    "పెద్దింటొల్ల పిల్ల ఎనిమిదిసార్లు చూశానండీ!"
    "కళ్యాణ గ్రంధంలో మాత్రం మీరు చాలా సూపర్బ్ గా నటించారండీ!"
    కొంతమంది స్టూడెంట్స్ వచ్చి అటో గ్రాఫ్ లు తీసుకోసాగారు.
    అప్పుడు వచ్చింది ఉమాదేవి ఫుల్ మేకప్ తో.
    "నమస్తే" అంది సిగ్గుపడిపోతూ.
    "నమస్తే, నమస్తే. రండి! మీకు నూరేళ్ళు. మీ గురించే మాట్లాడుతున్నాం. నేనూ సీతగారూ.'
    సీత కొంచెం కంగారుపడింది.
    "నా గురించా? నేన్నమ్మను" ఆశ్చర్యపోతూ అంది.
    "నమ్మక తప్పదండీ! మీ అంత అందమయిన అమ్మాయి సినిమాల్లో కెళితే తెగ షైనయిపోతుందని అంటున్నాను.'
    ఉమాదేవి మరింత సిగ్గుపడిపోయింది. పైటను కొంచెంగా జార్చి మళ్ళీ పైకి లాక్కుంది.
    "నన్నేడిపించడానికే అలా అంటున్నారులెండి! నాకు తెలుసు.'
    "నోనోనో......భలే వారే! నేను ఎవరినయినా నవ్వించాటానికే ప్రయత్నిస్తాను గానీ, ఏడిపించటం మన డిపార్ట్ మెంట్ కాదు! ఆ పని విలన్ ది. కొంపదీసి నేను విలన్ లాగా కనబడుతున్నానా ఏమిటి?"
    ఉమాదేవితో పాటు అందరూ నవ్వేశారు.
    మరి కొంతమంది వచ్చి అటో గ్రాఫ్ ల కోసం అతని మీద పడిపోయారు.
    "ఏమిటది? ఇలా మీద పడిపోతున్నారు? నాకు వూపిరాడాలా లేదా? ఓ సినిమాలో యిలాగే కైమక్స్ తీస్తున్నప్పుడు అందరూ చనిపోయిన హీరో మీద పడి ఎడ్చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు, నలుగురు హీరో తల్లులూ, ఒక తండ్రీ, ఇద్దరు పశ్చాత్తాపడే విలన్లు, నలుగురు హీరో ప్రెండ్స్ ఇంతమంది గంటన్నర సేపు ఎనిమిది టేకులు తింటూ ఎడ్చేశాక ఆఖర్లో షూటింగయ్యాక చూస్తే హీరో లేవటం లేదు. వాళ్ళందరి వెయిట్ కీ ఊపిరాడక స్పృహ తప్పాడు. అప్పటికప్పుడు హాస్పిటల్ కి పంపించారు. కనుక మీరు నన్ను కూడా........"
    అందరూ నవ్వి దూరంగా జరిగారు.
    అందరికీ అటో గ్రాఫ్ లు చేశాడతను.
    "గురూ........గురూ! మాకేమయిన సినిమాల్లో నటించే చాన్స్ ఇప్పిస్తారా సార్? అడిగాడో స్టూడెంట్.
    "నాకే ఛాన్స్ ల్లేక హైదరాబాద్ వచ్చాను. భలేవాడివేలే నువ్వు. నీకు తెలిసిన వాళ్ళెవరయినా ప్రొడ్యుసర్లుంటే నాకు రికమెండ్ చెయ్."
    చాలాసేపటి తర్వాత అందరినీ బయటకు పంపి తలుపు వేసేశాడు నటరాజ్.
    "ఇలా వూరుకుంటే వాళ్లిక యిరవై నాలుగ్గంటలూ యిక్కడే ఉంటారు సార్."
    "ఆ మాట నిజమే! కానీ ఉమాదేవిని మాత్రం పంపించకుండా ఉండాల్సింది! ఆమె వప్పుకుంటే నిజంగానే సినిమాల్లోకి రికమెండ్ చేద్దామని వుంది నాకు" అన్నాడు శ్రీనాద్.
    "దాన్దేముంది ! ఆమెతో మాట్లాడటం పెద్ద సమస్యేమీ కాదు మీకు! సెన్సార్ బోర్డ్ తో 'బాన్' చేయబడిన ఆ కిటికీ తెరిస్తే చాలు! ప్రత్యక్షమవుతుంది" అన్నాడు రామచంద్రమూర్తి.
    "సెన్సార్ బోర్డేవరు?"
    రహస్యంగా చెప్పాడు రామచంద్రమూర్తి "సీత?"
    శ్రీనాద్ కిటికీ తలుపు తెరిచాడు.
    ఉమాదేవి అప్పటికే యింకో సిల్కుచీర మార్చేసి కిటికీ దగ్గర కూర్చుని ఉంది.
    శ్రీనాద్ ని చూసి చిరునవ్వు నవ్వింది.
    "ఇందాక అంతమందిలో అడగడానికి సిగ్గేసింది. నిజంగా నాకు సినిమా ఛాన్స్ దొరుకుందంటారా?" ఆమె కళ్ళల్లో ఆశ స్పష్టంగా కనిపిస్తోంది.
    "అది నాకొదిలేయండి! మీకు ఆసక్తి వుండాలే గానీ కళ్ళకద్దుకుని వేషం యిస్తారు."
    "అంటే జ్యోతిలక్ష్మి, సిల్కు స్మితలు చేసే వేషాలాంటివి కదూ."
    "ఒకప్పుడు జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మితలు సెక్సీ వాంప్ వేషాలు వేసేవారు! ఇప్పుడు హీరోయిన్ వేషాలే సెక్సీ టైప్ అయిపోయాయి. కాబట్టి హీరోయిన్ గా కూడా సేటిలవ్వచ్చు మీరు.'
    ఆమె ఆలోచనలో పడింది.

 Previous Page Next Page