"పక్కింట్లో దొంగతనం చేసేయ్ జూనియర్! ఇలాంటి అత్యవసర సమయాల్లో దొంగతనాలు శుభ్రంగా చేసేయవచ్ఘు! ఏం ఫర్లేదు."
"ఛీ వద్డంకుల్....."
"అల్ రైట్! అయితే ఇందిర వాళ్ళ మమ్మినీ అర్జంటుగా నిద్రలేపి పంచదార అప్పు అడుగు!" ఆ పిల్ల పరుగుతో వెళ్ళిపోయింది.
వెంటనే డ్రస్ మార్చుకుని రడీ అయేసరికి ఓ గ్లాసులో "టీ" తీసుకొచ్చి అందించిందతనికి.
"థాంక్యూ జూనియర్! రెండ్రోజుల్లో దేవుడు నిన్ను కోటీశ్వరురాలీని చేసేయుగాక."
"రెండ్రోజుల్లో ఎలా చేస్తాడంకుల్?"
"దేవుడు తలచుకుంటే రెండ్రోజులు కూడా అనవసరం జూనియర్! నిన్ను డిఫెన్స్ మినిస్టర్ ని చేశాననుకో . ఒక్క గంటలో భోఫర్స్ డీల్ లాంటిది చేస్తే 70 కోట్లు కొట్టెయ్యొచ్చు."
టీ తాగి తలుపు వేసుకుని బయటకు నడిచాడతను.
మూడవుతోంది టైము. చల్లనిగాలి ఆహ్లాదకరంగా శరీరాన్ని తాకుతోంది.
రోడ్ పక్కనే వున్న అటో దగ్గరకు చేరుకున్నాడతను. అటో డ్రయివర్ ఆటోలో ముడుచుకుని నిద్రలో "డబల్ మీటరు త్రిబుల్ మీటరు మీటర్ పెదస్ రుపయా " అంటూ కలవరిస్తున్నాడు.
అతన్ని తట్టి లేపాడు భవానీశంకర్. అయిదు నిమిషాలలో షబ్నమ్ అపార్టుమెంట్స్ చేరుకున్నాడతను.
భవనం అంతా నిశ్శబ్దంగా వుంది. వాచ్ మెన్ జాడేక్కడా కనిపించలేదు. లిప్ట్ దగ్గరకెళ్ళేసరికి అది అప్పుడే రెండో ఫ్లోర్ చేరుకున్నట్లు నెంబరు మారుతూ కనిపించింది! భవానీ శంకర్ ఆశ్చర్యపోయాడు. ఇంతరాత్రి వేళ ఎవరో తను వెళ్ళాలనుకుంటున్న రెండో అంతస్తుకే వెళ్ళటం విచిత్రంగా కనిపించిందతనికి.
ఇంకొక్క క్షణం కూడా ఆలశ్యం చేయకుండా మెట్లు ఎక్కేస్తూ వేగంగా రెండో అంతస్తు చేరుకున్నాడు. అప్పుడే 20౩ ప్లాట్ ముందు నిలబడి తాళం చేత్తో తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుండా యువతి. ఆమె ఎవరో అతనికి కనిపించడం లేదు. తలుపు తెరుచుకుంది. ఆమె ఓసారి అటూ ఇటూ చూసి లోపలకు నడిచి తలుపు దగ్గరగా వేసింది! భవానీ శంకర్ ఆలస్యం చేయకుండా పిల్లిలా అడుగులు వేసుకుంటూ తలుపు దగ్గరకు నడిచి కొంచెం గా తోసి లోపలకు చూశాడు. ఆమె హల్లో వున్నా ఓ టేబుల్ ముందు నిలబడి టేబుల్ మీద వస్తువు లేవో వెతుకుతోంది. తరువాత లోపలి గదిలో కెళ్ళి లైటు స్విచ్ వేసింది. అక్కడ కూడా ఏదేదో వెతుకుతున్న చప్పుడు వినిపిస్తూనే వుంది. మరికొద్ది నిమిషాల తర్వాత తిరిగి హల్లో కొచ్చి టేబుల్ సోరుగులు తెరచి అందులోని కాగితాలు ఫైల్సు, చూస్తూ దేనికోసమో వెతకసాగింది. భవానీశంకర్ లోపలకు నడిచి తలుపు దబెలున మూసివేసి బోల్టు వేసేశాడు.
ఆమె అదిరిపడి వెనక్కు తిరిగింది.
అతన్ని కొద్ది క్షణాలు నిశ్చేష్టురాలయి చూస్తుండిపోయింది భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
"భయపడకు కామ్రేడ్! మీరు టి.వి.లు చూడలేదూ? మనమంతా ఒకే జాతి ఒకే ప్రజ" అన్నాడు సమీపంగా నడుస్తూ.
"ఎవర్నువ్వు?" ధైర్యం తెచ్చుకుంటూ అడిగిందామె.
"ప్రస్తుతానికి ఆ ప్రశ్నను వాయిదా వేద్దాం కామ్రేడ్! మనిద్దరం తెలుసుకోవలసిన విషయాలు వేరే వున్నాయి. ముందు మీరిక్కడి కెందుకొచ్చారో కొంచెం చెపితే -"
ఆమె కోపంగా చూసిందతనివేపు "అది నీ కనవరసరం."
భవానీ శంకర్ ఆమెను పట్టించుకోకుండా హాలంతా ఓసారి చూసాడు. చాలా ఖరీదయిన ఫర్నిచర్ తో నిండి వుంది. టేబుల్ మీద రాక్ లో కొన్ని బుక్స్ అందంగా, వరసగా పేర్చి వున్నాయి. గోడల పెయింట్ చూస్తూ "నా ప్రశ్నకు త్వరగా జవాబు కావాలి కామ్రేడ్" అన్నాడు. "మనకి మూగగా మాట్లాడుకునేంత టైం లేదు -"
"ఇది మా స్నేహితురాలి ఇల్లు. ఆమె కోసం వచ్చాను.-" అంది గొంతు పెగల్చుకుని.
"ఇంకొంచెం మంచి కధ అల్లడానికి ప్రయత్నించండి ఫ్రెండ్ అ\ఇదేమంత ఆసక్తికరంగా లేదు........" సోఫాలో కూర్చుంటూ అన్నాడతను.
ఆమె తలుపు వేపు అడుగులు వేసింది "నేను వెళ్ళిపోతున్నాను అంటూ.
భవానీ శంకర్ లేచి మెరుపులా పరుగెత్తి ఆమెకు అడ్డు నిలబడ్డాడు.
"అలాంటి తొందరపాటు చర్యలు వద్దు కామ్రేడ్! విషయాలు తెలుసుకోకుండా మిమ్మల్ని వదుల్తాననుకోవటం కల్ల! త్వరగా చెప్పండి--"
ఆమె వెనక్కి తిరిగి వచ్చి సోఫాలో కూర్చుంది మౌనంగా.
"మనిద్దరం ఒకే వస్తువు వెతకడం కోసం ఇక్కడి కొచ్చాం కామ్రేడ్! నాకంటే మీరు ముందు లోపలికొచ్చారు కనుక అది మీరు కాజేసి ఉంటారని నాకు సెంట్ పర్సెంట్ నమ్మకంగా ఉంది -" మళ్ళీ మాట్లాడాడతను.
ఆమె కలవరపాటుతో చూసిందతనివేపు.
"ఏమిటా వస్తువు?"
"నా ముందు మీ నటన వృధా చేయవద్దు కామ్రేడ్! నేనసలే హైదరాబాద్ దూరదర్శన్ తాలూకు ఆడిషన్ నటుడినీ! వళ్ళు మండి నేనూ నటించడం ప్రారంభిస్తే - మీరేమయిపోతారో ఒక్కసారి మీరే ఊహించు కొండి!"
ఆమె కొద్ది క్షణాలు ఆలోచించింది.
"నాకా వస్తువు దొరకలేదింకా! వెతుకుతుండగానే మీరొచ్చేశారు." అంది అతని వంకే అనుమానంగా చూస్తూ.