విశారద అతనివైపు తిరిగింది. ఆమె కోపంతో ముఖం ఎర్రగా జేసుకుని "మీ కేమైనా బుద్దుందా? అలాగేనా పిల్లలని మందలించవలసిన విధానం? వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ వినిపించుకోకుండా తల వాచేటట్లు చివాట్లు పెట్టాలి కాని, వాళ్ళ సంజాయిషీలు వింటూ, సమర్ధించటం తెలివైన పనా?" అంటూ దులిపేస్తుందనుకున్నాడు.
కాని ఆమె ముఖంలో ప్రశాంతత ఉట్టిపడుతోంది. కళ్ళలో కనిపించీ కనిపించనట్లు నీటి బిందువులు.
"మీరు... మీరు... ఎంత అమాయకులండీ? ఎంత సుకుమార హృదయమండీ మీది?"
అతనాశ్చర్యంగా చూస్తున్నాడు.
"పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసినా, వాళ్ళ ప్రవర్తనకు లోలోపల చెప్పలేనంత బాధపడుతున్నా గట్టిగా మందలిస్తే వాళ్ళు నొచ్చుకుంటారని, వాళ్ళు నొచ్చుకుంటే ఓర్చుకోలేరేమో అన్న భయంతో, వాళ్ళ వాదన సబబే అని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకునేందుకు ప్రయత్నించటం... మీలో ఎంత పసితనం ఉందండీ! అందుకే మీరంటే నాకు..."
అతనికి దగ్గరగా జరిగి క్రాఫ్ లోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతుంది.
ఇందాకట్నుంచీ ఏదో తప్పు చేసినట్లు కుమిలిపోతున్న అతనికి ఓ దేవత వరం ప్రసాదించినట్లు ఊరట కలిగింది.
ఆమె గుండెల్లోకి దూరి నిజంగా చిన్న పిల్లాడిగానే పడుకున్నాడు.
8
షార్జాలో ఇండియాకూ, పాకిస్తాన్ కూ మధ్య వన్ డే ఇంటర్నేషనల్ ఫైనల్ జరుగుతోంది.
పాకిస్తాన్ గెలిచింది.
టీ.వీ. చూస్తోన్న ప్రేక్షకులందరూ నిరాశపడిపోయారు.
"కపిల్ దేవ్ ఓడిపోవటంలో స్పెషలిస్ట్. అందులో ఇమ్రాన్ ఖాన్ మీద ఎప్పుడూ ఓడిపోతూ ఉంటాడు" అంది వినూత్న.
"టీమ్ లో దమ్ముంటే ఎలాగైనా గెలవచ్చు. పోయినసారి వరల్డ్ కప్ లో టాస్ ఓడిపోయి మొదట బాటింగ్ కు వచ్చి, నూట ఎనభై రన్స్ కే అవుటయిపోయినా మళ్ళీ బౌలింగ్ లో విజ్రుంభించి నూట నలభై రన్స్ కల్లా వెస్ట్యిండీస్ ని అవుత చేసెయ్యలేదా? ఇమ్తఃకుముందోసారి షార్జాలోనే మనకూ, పాకిస్తాన్ కీ మధ్య జైర్గిన మొదటి మేచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి వచ్చి నూట ఇరవై పై చిలుకు మాత్రమే రన్స్ చేసి, తిరిగి పాకిస్తాన్ ని ఎనభై పై చిలుకు రన్స్ కి అవుట్ చేసి పారెయ్యలేదా?" అన్నాడు రాఖేష్.
"నీ పైచిలుకు పైచిలుకు స్టాటిస్టిక్స్ కు సంతోషించాంగాని- అప్పుడేదో అదృష్టం కలిసొచ్చింది. తరువాత వరుసగా ఎన్నిసార్లు ఓడిపోలేదు? వన్ డే ఇంటర్నేషనల్ లో చేజింగ్ ఐడియల్. అవతలివాడు కొట్టిన రన్స్ ని బట్టి రన్ రేట్ కాలుక్యులేట్ చేసుకుని, అవసరమైతే బాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసుకుని, చేజ్ చేసుకుంటూపోవటంలో ఎంతో సుఖం ఉంది" అన్నాడు మనోజ్.
రాజాచంద్ర, విశారద మౌనంగా కూర్చున్నారు. ఆరోజు క్రికెట్ గురించి విజ్ఞత అన్న మాటలు మనసులో మెదులుతున్నాయి. మనుషుల్లో ఓ లెథార్చీ, నల్లమందులాంటి నిషా, కొని తెచ్చుకున్న టెన్షన్.... రోజుల తరబడి నేషనల్ ఎనర్జీని వృథాచేస్తున్న క్రికెట్...అందుకే మొదటి నాలుగైదు రోజులూ మేచ్ లు చూడకుండా ఆఫీసుకెళ్ళిపోయాడు. కాని ఈరోజు ఫైనల్స్, అందులో బద్ద ప్రత్యర్ధులయిన ఇండియాకూ, పాకిస్తాన్ కూ.... టెంప్టేషన్ అణచుకోలేక పోయాడు. "ఈరోజు ఆఫీసుకు వెళ్ళను" అని నిర్ణయించుకుని టీ.వీ ముందు కూర్చున్నాడు.
గవాస్కర్, శ్రీకాంత్ బాటింగుకు వచ్చారు.
ఇమ్రాన్ ఖాన్, వాసిమ్ అక్రం చెరోవైపు నుంచి పేస్ బౌలింగ్ మొదలుపెట్టి బ్యాట్స్ మెన్ ను అదరగొట్టెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.
గవాస్కర్, శ్రీకాంత్ తొణక్కుండా ధాటీగా ఆడుతున్నారు. శ్రీకాంత్ బాట్ నుంచి పరుగుల ప్రవాహం మొదలయింది. వాసిం అక్రం ఎంత అద్భుతంగా బౌల్ చేసినా, నిర్భయంగా ఆడుతూ ఫోర్లు కొడుతున్నాడు.
బౌండరీ కొట్టినప్పుడల్లా ఒకసారి ముక్కు పీల్చి మెళ్ళో ఉన్న లాకెట్ ని సవరించుకుని, సూర్యుడికేసి తిరిగి దణ్ణాలు పెట్టేస్తున్నాడు.
గవాస్కర్ కూడా శ్రీకాంత్ తో పోటీపడినట్లుగా ఆడుతున్నాడు.
ఇరవై ఓవర్లు పూర్తి కాగానే వంద రన్స్ కు పైగా వచ్చేశాయి.
"ఇలా ఆడితే మనం మూడొందల రన్స్ ఈజీగా తీయొచ్చు" అన్నాడు మనోజ్.
"అదిగో ఆ కామెంట్సే వద్దన్నాను! నీ వెధవనోరు విప్పితే ఎవడో ఒకడు అవుటైపోతాడు" అన్నాడు రాఖేష్ విసుగ్గా.
కెమెరా ప్రేక్షకులవైపు తిప్పి ప్రముఖుల్ని చూపిస్తున్నారు.
అరబ్బీ సుల్తాన్ ఇంతింత పొడుగ్గా ఏప్రాన్స్ లాంటి గొప్ప గౌన్లు వేసుకుని హుందాగా అటూ ఇటూ కదుల్తున్నారు.
"అదిగో దిలీప్ కుమార్!" వినూత్నా ఉత్సాహంగా అరిచింది.
"షమ్మీకపూర్ ఇక్కడ ఎంతలావుగా, మొద్దుగా అయిపోయాడు! ఈ మద్య పాత సినిమా 'తుమ్ శా నహీఁ దేఖా' వస్తే చూశాను. అందులో ఎంత హ్యాండ్ సమ్ గా ఉన్నాడు" అన్నాడు మనోజ్.
"సైరాబాను దిలీప్ కుమార్ పక్కన. అదిగో అక్కడ కూర్చుంది రీనారాయ్ మోసిన్ ఖాన్ పెళ్ళాం" అంది వినూత్న.
"ఇప్పుడు టీ.వీ. సీరియల్స్ లో వేస్తోన్న విజయ్ ఆరోరాతో రీనారాయ్ ఏక్ట్ చేసిన మొదటి చిత్రం 'జరూరత్ మోసిన్ ఖాన్ చూసి ఉండడు. చూస్తే రీనారాయ్ ని పెళ్లి చేసుకుని ఉండేవాడు కాదు. అందులో సెక్సూ, ఆఖరి సీన్ లో..."
డాడీ, మమ్మీ వింటున్నారని కనుసైగ చేసి చూపించింది వినూత్న.
అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్ చేస్తున్నాడు.
బాల్ ని ఆ చేతిలోంచి ఈ చేతిలోకి, ఈ చేతిలోంచి ఆ చేతిలోకి మార్చుకుంటూ, విచిత్రంగా కదులుతూ స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడు. లెగ్ స్పిన్.