Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 28

  

    "అయ్యో" అనుకుంటూ "రాధా!" అని కేకేసింది.
   
    డాక్టర్ అశోక్ అటుకేసి చూసి ఆమె అక్కయ్యో ఎవరో అయివుంటుంది అనుకున్నాడు. బహుశా తనని హాస్పిటల్లో చూసే వుంటుంది. గుర్తు పడుతుందేమో అనుకున్నాడు. అతని గుండె దడదడమని కొట్టుకున్నది. ఒకప్పుడు ఇంటర్వ్యూ పొందటానికి గంటల తరబడి వేచి వుండాల్సి వచ్చేటంత పొజిషన్ లో వున్న మనిషి పద్దెనిమిదేళ్ళ యువతిని చూసి ఉలికిపడే స్థితికి వచ్చాడు.
   
    సునీత వాళ్ళ దగ్గరికి వచ్చింది. "రాధా! యిదేమిటి రోడ్డుమీదకు వచ్చేశావు?" అంది రాధ ఏమీ జవాబివ్వలేదు.
   
    "పాపా కారుకు అడ్డంగా వస్తుంటే...." అన్నాడు డాక్టర్ అశోక్.
   
    సునీత సహజంగా మితభాషి, మృదుస్వభావురాలు. హాస్పిటల్లో అతన్ని పెద్దగా గమనించలేదు. పత్రికల్లో ఫోటోలు అవీ వచ్చినా అంత గుచ్చి గుచ్చి చూడలేదు. అదీగాక అక్కడ చీకటిగా వుంది. అసలు పరాయి వ్యక్తి మొహం లోకి చూసి మాట్లాడే అలవాటు ఆమెకు లేదు. అందుకని గుర్తుపట్టలేదు.
   
    "రాధా! ఏమిటి నువ్వు చేసిన పని" అంటూ దగ్గరకు తీసుకుంది.
   
    "ఎవరు వచ్చారు?" అనడిగింది జూలీ.
   
    "ఆమె సిస్టర్, మనం యిహ వెడదాం" అన్నాడు డాక్టర్ అశోక్.
   
    జూలీ తలవూపి చేయిజాపి రాధచెయ్యికోసం తడిమింది. ఆమె ఉద్దేశ్యం గ్రహించి సునీత రాధ చెయ్యి అందించింది.
   
    జూలీ రాధ చేతిని మృదువుగా ముద్దుపెట్టుకుని "వస్తాను బేబీ!" అంది.
   
    జూలీ చెయ్యిపట్టుకుని డాక్టర్ అశోక్ కారుదగ్గరకు తీసుకెళ్ళాడు.
   
    రాధ తల్లో ఆలోచన మెదుల్తోంది. ఎప్పుడో విన్నట్లున్న అతని గొంతు.
   
    చప్పున ఏదో గుర్తువచ్చింది. "అక్కయ్యా! నన్ను త్వరగా కారుదగ్గరకు తీసుకెళ్ళు" అంది ఆతృతగా.
   
    సునీత రాధచేయి పట్టుకుని కారు దగ్గరకు తీసుకెళ్ళింది. అప్పటికి జూలీ కారులో కూర్చునివుంది. డాక్టర్ అశోక్ కారు స్టార్ట్ చేసి గేర్ మారుస్తున్నాడు.
   
    "ఆంటీ!" అంది రాధ. "అంకుల్ పేరేమిటి?" అనడిగింది ఇంగ్లీషులో.
   
    "అశోక్! డాక్టర్ అశోక్!"
   
    ఈ ప్రశ్నా, జవాబు అతను విన్నాడు. తర్వాతేం జరుగుతుందో అతనికి తెలుసు. యాక్సిలేటర్ నొక్కి ఎవరిమాటలూ వినిపించటానికి వీల్లేనంతటి శబ్దం సృష్టించాడు.
   
    "అతనే.... అతనే" అంది రాధ గట్టిగా అరిచి, సునీత చేతుల్లోంచి గింజుకుంటూ.
   
    "నా కళ్ళు.... అతన్ని.... అతన్ని..." అంటూ ఆవేశంగా ముందుకు పరిగెత్తబోయింది.
   
    కాని....
   
    విమానంలా శబ్దంచేస్తూ... ఫియట్ కారు ఒక్కదూకుతో ముందుకు దూసుకెళ్ళిపోయింది.
   
                              * *  *
   
    "అశోక్ డియర్!" అంది జూలీ రాత్రి తొమ్మిది గంటలవేళ తడుముకుంటూ అతనిదగ్గరకు వచ్చి.
   
    "జూలీ."
   
    "డ్రింక్ చెయ్యటం పూర్తికాలేదా?"
   
    అతనేమీ జవాబివ్వలేదు.
   
    "డిన్నరుకు రావా?"
   
    "నాకు ఆకలి లేడు జూలీ! నువ్వు భోజనంచెయ్యి నేను కంపెనీ యిస్తాను."
   
    "నాకూ ఆకలి లేదు అశోక్."
   
    రెండునిముషాలు నిశ్శబ్దంగా గడిచింది. "అశోక్" అంది మళ్ళీ జూలీ.

    "నువ్వు డ్రింక్ చెయ్యటం అయిపోతే నేను డిక్టేట్ చేస్తాను, టైప్ చేస్తావా? ఎందుకంటే యీ వేళ మంచి మూడ్స్ లో వున్నాను."
   
    "అలాగే జూలీ" అని అతను టైపుమిషన్, కాగితాలూ అన్నీ సిద్దం చేసుకున్నాడు. కానీ ప్రక్కన డ్రింకుగ్లాసు కూడా పెట్టుకున్న సంగతి ఆమెకు తెలియదు.
   
    ఆమె చాలా యిన్ఫిరేషన్ తో చెప్పుకుపోతూ వుంది. అతను మధ్య మధ్య డ్రింక్ చేస్తూ యాంత్రికంగా ఆమె చెప్పేది టైపు చేస్తూ వున్నాడు.
   
    పేజీలకు పేజీలు గడిచిపోతున్నాయి.
   
    ఆమె ఆవేశంగా, ఉద్రేకంగా డిక్టేట్ చేస్తోంది.
   
    She tried to open eyes. She could do it with some effort.... but.... but she could see nothing. It is all dark. Dark.
   
    Nothing is VISIBLE.
   
    she sent forth a screan all of sudden.
   
    డాక్టర్ అశోక్ వున్నట్లుండి త్రుళ్ళిపడి "ఇదేమిటి?" అన్నాడు.
   
    టైప్ రైటర్ మీది అతని వ్రేళ్ళు వణకసాగాయి.
   
    "మొదట నువ్వుచెప్పిన కథ వేరు. ఇది వేరు."
   
    "నువ్వు యిందాకట్నుంచీ గమనించలేదా అశోక్ మొదటనే మార్చేశానుగా."
   
    "నేను.... నేను....గమనించలేదు."
   
    "ఇందాక ఆ పాపని చూశాక.... నాకు కొత్త ఆలోచనలు వచ్చాయి. డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల ఓ పిల్ల అంధురాలయిపోతే.... తర్వాత ఏం జరుగుతుంది అని."
   
    "కాని యిందాక ఆ పాప అలా ఏమీ చెప్పలేదుగా?"
   
    "తను చెప్పలేదు. కానీ ఎందుకో ఆ పాపతో రెండు నిముషాలు గడిపాక ఆమెను తాకాక కొత్త యితివృత్తం స్ఫురించింది. ఆమె ఏమీ చెప్పలేదు. నిజమే కాని.... ఎందుకో అలా వచ్చేసింది. ప్లీజ్! టైప్ చెయ్యి డియర్, మళ్ళీ మూడ్స్ చెదిరిపోతాయి."
   
    అతను గ్లాసందుకుని గబగబ సిప్ చేసేశాడు. ముఖం ఎర్రబడిపోయింది. చేతులు వణకటాన్ని నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
   
    జూలీ చెప్పుకుపోతుంది.
   
    WhY?
   
    What happened?
   
    All her hopes of opening her eyes and seeing the bright world have been to pieces.
   
    Whose fault's is this?
   
    Is it Doctor's
   
    'నో' అనుకున్నాడు డాక్టర్ అశోక్. అతనికి వళ్ళంతా ముచ్చెమటలు పడుతున్నాయి. కళ్ళు ఎర్రబడుతున్నాయి.
   
    వ్రేళ్ళు అదేపనిగా వణుకుతున్నాయి.
   
    కాని టైపు చేస్తూనే వున్నాడు.
   
                                                   * * *

    డాక్టర్ మాలతి హాస్పిటల్ కు వెళ్ళటానికి తయారై కారుదగ్గరకు పోబోతుంది. ప్రతాపరావు ఫేముకుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటూ తల ఎత్తి "మాలతీ!" అని పిలిచాడు.
   
    ఆమె ఆగి వెనక్కి వచ్చింది. "ఏమిటన్నయ్యా?"
   
    "ప్రదీప్ చివరకు హనుమంతరావుతో ఆ కేసు ఫైలు చేయించాడు."
   
    మాలతి ఏమీ మాట్లాడలేదు.
   
    "వద్దని ఎంత చెప్పినా వినలేదు. శ్రీలక్ష్మి హాస్పిటల్ తరపున లాయరుగా నేను పనిచేస్తున్నాను."
   
    "తెలుసు" అంది మాలతి.

 Previous Page Next Page