Previous Page Next Page 
అసావేరి పేజి 28

    "సో వాట్?"
   
    "ఆధానుకున్న వస్తువేదీ నేను చేజార్చుకోవడం యిష్టపడను."
   
    "......."
   
    "అలాగే నువ్వూ చేతికున్నదేదీ కావాలని చేజార్చుకోవడం కూడా యిష్టపడను. టేకిట్...."
   
    తెరచుకున్న రాజేందర్ పిడికిలిలోని రిస్ట్ వాచ్ చూసి అప్రతిభురాలయింది.
   
    అదే అప్పుడెప్పుడో తనకు అన్నయ్య ప్రెజెంట్ చేసింది. ఇందాక హోటల్లో శంకూని రక్షించాలని హోటల్ యజమానికి ప్రజెంట్ చేసిందీను.
   
    ముందు అవాక్కయిన సావేరి వెంటనే తేరుకుంది.
   
    తన వ్యక్తిగతమైన విషయాలలో అమ్మానాన్నలు సైతం జోక్యం చేసుకోవడం ఇష్టపడని పెంకిఘటమాయె.... బావెంత....
   
    అందుకే మొండిగా అంది పెదవుల్ని రోషంగా వంచుతూ "చూడు మిస్టర్ రాజేందర్ ....నువ్వు అమ్మకి తమ్ముడివి కాబట్టి నాకు బావనవుతావేమోగాని ఇంకెప్పటికీ ఏమీకావు..... ఐ థింక్ యు ఫాలోమి సో.... నీ చరిత్ర గురించిచెప్పి నన్ను బెదిరించాల్సిన పనిలేదు! ఐ కెరెఫిన్ ఫర్ యువర్ థ్రెట్...." తన ఇంగ్లీషుమీడియం పరిజ్ఞానాన్ని అన్వయిస్తూ తల పొగరుగా ఎగరేసి గదిలోకి నడిచింది విసవిసా....
   
    అప్పటికే తేలుకుట్టిన దొంగలా ఓ మూల నిలబడ్డ మంగ "ఏం జరిగిందమ్మా?" అంది అర్ధమయీకాని ధోరణిలో.
   
    సావేరి చెప్పుకుపోయింది శంకూకి జరిగిన అవమానం గురించి తనుచేసిన నిర్వాకం గురించీను.
   
    ఇక్కడ సావేరిని అభినందించాలో ఇప్పుడు రాజేందర్ ని అలా రెచ్చగొట్టినందుకు బాధపడాలో బోధపడలేదు.
   
    రోజు రోజుకీ శంకూ ప్రమాదంలోకి నెట్టబడుతున్నాడు. అదే ఆలోచిస్తూంది మంగ....ఏమైపోతారీ పసిపిల్లలు....ఈ కథ యింకా ఏ మలుపు తిరగబోతూంది.
   
    "తప్పుకదమ్మా...." మంగ సాలోచనగా అంది. "ఎంతయినా రాజేందర్ బాబు నీకు కాబోయే భర్త...."
   
    "చంపుతానొపేయ్.....భర్తేమిటే....బోడి...."
   
    "కాక...శంకూ నీకేమౌతాడని...."
   
    "నీకనవసరం.... ఆ మాటకొస్తే మీకందరికీ అనవసరం ఆ....అంతే...."
   
    "నువ్వింకా పసిపిల్లవి సావేరీ...."
   
    "అలా అన్న వాళ్ళని చంపేయాలనిపిస్తుంది- కాలేజీ కెళుతున్నాగా ఇంకా పసిపిల్లనేమిటీ...."
   
    "ఫర్ గెటిట్.....ఆ విషయం మరిచిపోవే..." ఊబిలో కూరుకుపోతున్న ఇంకా పైకి రాగలనన్న అందరిలాంటి నమ్మకమే సావేరి గొంతులో "చూడూ...." క్షణం ఆగి ఏదో గుర్తు చేసుకుంటున్నట్టు, "అమ్మ కడుపునా పడ్డాను. అంత సుఖంగా వున్నాను. నీచే దెబ్బలు తిన్నాను నిప్పులగుండం తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను. చెప్పు దీనికి జవాబేమిటి?"
   
    మంగ జవాబు చెప్పలేదు వెంటనే. ఓ పొడుపు కథకి జవాబు చెప్పమని శంకూ మారాంచేస్తే సావేరి ముందు శంకూ ఓడిపోకూడదని జవాబు చెప్పింది.
   
    అక్కడ గెలిచిన శంకూ మరో పొడుపు కథ చెప్పమంటే ఇదే కథ ఇందాకే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ సావేరి గెలవాలని జవాబుకోసం నిలదీస్తూంది.
   
    ప్రేమ అడ్డకత్తెరలో రెండు పదునైన అంచులు మధ్య తను పోకచెక్కగా మారిపోతూంది.
   
    "నిప్పులగుండం తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను...."
   
    ఆ వాక్యం మననం చేసుకుంటుంటే మంగకి మరేదో కోరని భావం స్పురించింది.
   
    జరగబోయేది అదేపని.
   
    అదురుతున్న గుండెలతో బయట చీకటినిచూస్తూ నిలబడిపోయిన మంగ ఈ కథ కొనసాగకుండా ఏం చేయాలా అని ఆలోచిస్తుండగానే-
   
    అక్కడ ఊరికి ఆవలవున్న అరటితోట దగ్గర రాజేందర్ మరో ముగ్గురు మనుషులకు రోషంగా ఏవో ఆదేశాలు యిస్తున్నాడు.
   
    ఊపుగా సాగిపోయే ప్రేమకావ్యానికి ఊహించని వారధిలా కాపు కోస్తున్న అరటితోటను నేలమట్టంచేసి శంకూపై పరోక్షంగా దెబ్బతీయాలనుకున్నాడు రాజేందర్ తన తొలి ప్రయత్నంగా.
   
    ఆ తోటే శంకూ బ్రతుక్కి జీవనాధారం.
   
    మారణకాండ మొదలైంది.
   
                                              *    *    *    *
   
    "బామ్మా" శంకూ వంట చేస్తున్న లక్ష్మమ్మని మహ అల్లరిపెట్టేస్తున్నాడు. "నీకస్సలు పొడుపు కథలు ఒక్కటీ రావటే...."
   
    "అబ్బా చేతిలో గిన్నె జారిపోతుంది. పక్కకి జరగరా గడుగ్గాయీ" ఎన్నడూ లేనిది శంకూ ఇలా ఉత్సాహంగా మాట్లాడుతుంటే అరగంట సేపటినుంచీ నివ్వెరపోతూనే ఆలోచిస్తూంది. శంకూని అలా చూడటం ఎంత ఆనందంగా వుందని.... "అయ్యో..... నన్ను పని చేసుకోనివ్వనా...."
   
    "అసలు చేసుకోనివ్వను. మరి నువ్వు జవాబు చెప్పడంలేదుగా" లక్ష్మమ్మ మెడచుట్టూ చేతులు బిగించబోతూంటే దూరంగా జరిగింది.
   
    "ఒరేయ్ శంకూ నాకేం కథలురావు. నీకేమైందిరా...."
   
    ఏమైందో చెప్పలేదు. సావేరి ప్రతిక్షణమూ గుర్తుకొస్తుంటే సావేరి లాంటి అందమైన అమ్మాయి తననిష్ట పడుతోందన్న నిజం స్పురణకి వస్తుంటే ఎంత ఆనందంగా వుందో బామ్మతో అస్సలు చెప్పకూడదనుకున్నాడు.
   
    పైగా ప్రేమ గురించి బామ్మతో ఎలా చెబుతాడు. రహస్యంగా వుంచాలిగా. పెద్దగా తెలీదుకాని తను పాటించాల్సిన నియమాలలో అదీ ఒకటి అని బోధపడిపోతూంది.
   
    "బామ్మా" మాట మార్చేస్తూ అన్నాడు. "తాతయ్య నిన్ను ప్రేమించాడటే?"
   
    ఉలికిపాటుగా చూసిన లక్ష్మమ్మ వేడిగా వున్నా పులుసు గిన్నెని పొయ్యి మీదనుంచి దించుతూ తల తిప్పుకుంది.
   
    "ఎందుకే సిగ్గుపడతావు. నాతో చెప్పొచ్చుగా" యిన్నాళ్ళకి బామ్మని ఆటపట్టించే అవకాశం దక్కినందుకు మహా సంబరపడిపోతూ అన్నాడు. "మాట్లాడవే...."
   
    ఎన్ని దశాబ్దాల క్రిందటి మాటని. నిజంగానే బిడియంగా అంది. "అవన్నీ ఎక్కడ గుర్తుంటాయిరా?"
   
    "అంటే మీరు ప్రేమించి పెళ్ళి చేసుకోలేదా?"
   
    తల అడ్డంగా వూపింది. "మా రోజుల్లో ప్రేమలేమిట్రా? గడుగ్గాయి బుద్దిగా పెద్దలు చెప్పిన మనిషి చేత తాళికట్టించుకునే కాలమది."
   
    "అందుకేనన్నమాట" మొత్తం అర్ధమైపోయినట్టు.
   
    "ఏమిటీ...." విస్తుపోతూ అడిగింది.
   
    "అదేనే....నీకు పొడుపు కథలు తెలీకపోవడానికి కారణం ఇప్పటికి తెలిసింది."
   
    ఈ స్టేట్ మెంటూ అర్ధంకాలేదు లక్ష్మమ్మకి. "ప్రేమకీ, పొడుపు కథలకీ సంబంధమేమిట్రా..."
   
    ఫకాల్న నవ్వేశాడు. ఆ రోజుల్లో ప్రేమలు లేకపోవడానికి కారణం పొడుపుకథలు తెలీకపోవడమే అన్న థియరీని ఆకళింపు చేసుకున్నట్టు "బామ్మా....నువ్వు వట్టి వెర్రిబాగులదానివే. అందుకే తాతయ్యని ప్రేమించలేకపోయావు."
   
    "ఓరి భడవా....ముదరపుచ్చకాయలా ఆ కబుర్లన్నీ దేనికీ మంకు వెధవ్వి అనుకుంటున్నానే .....కాలేజీలో చేరి నేర్చుకొస్తున్నదిదన్న మాట...." మందలింపుగా అంది.

 Previous Page Next Page