అన్నయ్యకు బొత్తిగా వంట్లో బాగా లేదు. మనిషి చిక్కిశల్యమైనాడు. ఒకానొక భయంకరమైన జబ్బులోకి యిది దారితీయవచ్చునని_నా ఉద్దేశం. సెలవుమీద సెలవుగా పొడిగించటంవల్ల ఉద్యోగం వూడేటట్లుగా వుంది. దాంతో మరీ దిగులుపడిపోయాడు. నా గురించిణ బెంగ ఒకటి నేను చదువుకోకపోయినందుకు ఇప్పుడు ఎంతగానో విచారిస్తున్నాను. ఈ స్థితిలో అది ఎంత సహాయకారి అయేది?
మూర్తిగారూ! ఎప్పుడు లేనిది యీ మధ్య ఏడుపొస్తూంది. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నగారు అష్టకష్టాలు పడుతూ పెంచిన పెంపకంలో అన్నయ్యా, నేనూ పెద్దవాళ్ళమైనాము.నాన్న పోయాడు.
అన్నయ్య!
చిన్నతనంనుండి మేమిద్దరం ఒకర్నొకరు విడవకుండా ఒకర్నొకారు పెనవేసుకుంటూ పెరిగాం. నేను వాడి చెల్లెల్ని, కూతుర్ని, తల్లిని, అందుకనే ఇప్పుడు నాకు వాడి స్థితిచూస్తే భయంగావుంది. ఎంత ధైర్యం తెచ్చుకుందామన్నా అబలను. మీకు చెప్పుకొని, సానుభూతి సంపాదిద్దామనికాదుగాని_ఇప్పుడు నేను అండ కావల్సిన స్థితిలో వున్నాను. మీరు వస్తారని ఇన్నాళ్ళూ ఆశతో ఎదురుచూశాను. అవును మిమ్మల్నో ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఎందుకని రారు మీరు? రావాలనిపించటంలేదా? మేము గుర్తువస్తే విసుగునిపిస్తుందా? ఇంతేనా యీ ప్రపంచంలో స్నేహం విలువ? ఇందుకేనా కలుసుకుంటాం? ఇందుకేనా చనువుని ఏర్పరచుకోవడం?
లేకపోతే మీరు మాలాగే కష్టాల్లో వున్నారా? ఇక్కడికివస్తే మిమ్మల్నేమయినా చేసేస్తానని భయమా? ఇంతేనా మీరు నన్ను అర్ధం చేసుకుంది?
మీరు రావాలి. ఒకసారి చూడాలని వుందని లోగడ రాశాను. స్నేహ ధర్మాన్ని పాటించి అయినా రావాలి.
ఉత్తరం చిన్నదే అయినా చాలావిషయాలు రాశాను. నా మనస్తత్వానికి విరుద్దంగా-ఎంత నిగ్రహించుకుందామన్నా నిగ్రహించుకోలేక-విచ్చల విడిగా రాశాను. బహుశా ఇది నేను మళ్ళీ చదువుకుంటే చింపివేస్తానేమో. అందుకని చదువుకోను.
అన్నట్టు మీ బుల్లి ఉత్తరం అందింది. దానికిది జవాబుకాదు.
ఎదురుచూస్తూ
ఉష
అర్ధంలేని, అర్ధంకాని పనులుచేస్తూన్న సత్యమూర్తి ఉత్తరం మడిచి అర్ధంతో కూడిన కన్నీరు కార్చసాగాడు. అతని గుండె తూట్లుపడింది. కారణంలేని పర్యవసానాలు ఎంత బలమైనవి! ఎవరూ ఒప్పుకోరుగాని అసలీ లోకంలోని పర్యావసానాలలో ఎక్కువభాగం సరియైన కారణం లేనివే.
"వడ్డించాను బాబుగారూ!" అన్న వంటవాడి పిలుపులు అరణ్యరోదనమే అయినాయి.
10
కొన్నాళ్ళకు_ఒకరోజు మధ్యాహ్నం రాధమ్మగారు ఆ విశాలమైన భవంతిలో తన గదిలో మంచంమీద పడుకుని వున్నది. డాక్టరువచ్చి అంతకు ముందే చూసి వెళ్ళాడు. ఆవిడ ఆరోగ్యం రోజురోజుకీ దిగజారిపోతున్నది.
"భద్రం...!" అని పిలిచింది క్షీణస్వరంతో.
వీరభద్రం గోడవారగా వున్న సోఫాలో ఏదో లెక్కలువేస్తూ కూర్చుని వున్నాడు. సుభద్రమ్మ అక్కడలేదు. ఏదో చాప పరుచుకుని నిద్రపోతూ వుంటుంది.
"ఏమిటక్కయ్యా?" అన్నాడతను లెక్కలు చూడటం ఆపి ఆప్యాయంగా.
రాధమ్మగారికి దుఃఖం పెల్లుబికింది. తనకి ఒక్కగానొక్క కూతురు విజయ. తన ప్రాణంపోసి అతి అభిమానంగా పెంచింది. దాని బుద్ది గడ్డితిని యీ ఐస్వర్యం, సౌఖ్యం అన్నీ త్యజించి, తమందరిని ధిక్కరించి అది పరారయిపోయింది. వెళ్ళింది ఏమయినా సుఖపడిందా? నాశనమైపోతోంది. భర్తకు తెలీకుండా తను ఇన్నాళ్ళబట్టి సాయం చేస్తుంది. ఆయన చనిపోయినప్పట్నుంచీ దాని ఆచూకీ తెలియటం లేదసలు. ఎన్ని ఉత్తరాలు రాసింది! దాని మనసు తమమీద అంత విరిగిపోయిందా?
విజయమ్మ గురించి ఏమీ తెలీటం లేదురా. నా స్థితిచూస్తే ఇలా వుంది. నా తల్లి ఏమి కష్టాలు పడుతున్నదో!"
వీరభద్రం కూడా విచారాన్ని ప్రకటించాడు. "నేను మాత్రం ఏం చెయ్యనక్కయ్యా? అప్పటికీ నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అది ఇదివరకు వున్న వూళ్ళకి మనుషుల్ని పంపించాను. ఆ ప్రాంతాల్లో ఎక్కడా వాళ్ళు లేరని తెలిసింది. అవసరమైన చోటల్లా వాకబుచేస్తూనే వున్నాను. ఇహ పేపర్లలో వేయించాలి. కాని నలుగురికి డప్పకొట్టినట్లు ఇలాబహిరంగం చేస్తే మనకు ఎంత అప్రదిష్ట!"
"పేపర్లో మాత్రం వేయించవద్దు. ఈ విషయం ఎంతమందికన్నా తెలియని, తెలియనియ్యిగాక, మన రహస్యాన్ని మనమే చాటుగోవటం మరింత హేళనకు దారితీస్తుంది" అంది రాధమ్మగారు బాధగా.
"అందుకేగా అక్కయ్యా! దూరాలోచనచేసి నేను వూరుకున్నదీ." అని అతను మరింత బలపర్చాడు.