భయవిహ్వలమైపోయిందామె వదనం.
"అందుకే నాపై ప్రేమాభిమానాలను పెంచుకోవద్దని చెప్పేది."
"సరేలే....మళ్ళీ మొదటికే వచ్చేస్తున్నావు. నీ సొమ్ము నీ ఇష్టం. మధ్యలో నేనెవరిని నిన్ను కాదనడానికి! కానీ, నాదొక సందేహం. నువ్వు రాజశేఖర్ అంత పెద్ద మొత్తంలో దోచిన బంగారం, డబ్బు అందజేస్తున్నావు కదా, నువ్వు వాటిని ఎలా సంపాదించావో అతనికి తెలుసా?"
సూటిగా అతని ముఖంలోకి చూస్తూ అడిగింది ఈసారి.
ఆ ప్రశ్నకు అవాక్కయ్యాడతను. క్షణంలోనే తేరుకున్నాడు. అతను వూహించని ప్రశ్న అది.
ఏ సమాధానం చెబుతాడోనని చెవులు రిక్కించుకుని మరీ వినడానికి సిద్దంగా వుంది సంజీవి.
"అసలు నేనెవరో అతనికి తెలియదు. కేవలం పార్శిల్ ద్వారా పంపుతూ లెటర్ వ్రాస్తున్నాను అంతే."
"నమ్మశక్యంగా లేదు. ముక్కూముఖం తెలియని వ్యక్తి అంత పెద్ద మొత్తంలో ఎందుకు తీసుకుంటాడు."
"నీకు అన్నీ అనుమానాలే. అయినా, అనవసర విషయాల్లో తల దూర్చి కోపం తెప్పించకు."
"సారీ! నిజం తెలుసుకుందామని అడిగాను."
అధికారి మౌనం వహించాడు. అతని ముభావం వెనుకగల సంఘర్షణను గ్రహించింది సంజీవి. అతనేదో దాస్తున్నాడని మాత్రం అర్ధం చేసుకోగలిగింది.
తరచి తరచి అతన్ని అడిగి అతని సహనాన్ని పరీక్షించదలుచుకో లేదు. అతను సూట్ కేసులో బట్టలు సర్దుకోవడం చూసి ఇక ఉండబట్టలేక పోయిందామె.
"మళ్ళీ ఎక్కడికి ప్రయాణం?"
"వివరాలు అడగొద్దు."
"అయితే నేనూ వస్తాను నీతో."
"సారీ ఇకనుంచి నువ్వు నాతో రావడానికి వీల్లేదు."
"ఇంతవరకు నువ్వు ఎక్కడకు వెళ్ళినా నేనూ వచ్చాను. ఇప్పుడు కూడా నీతోపాటు నేనూ వస్తాను." బింకంగా అన్నది సంజీవి.
"సంజీవి!"
అతని ముఖం కందగడ్డలా అయింది.
"నువ్వు అరచి గీపెట్టినా, కొట్టి చంపినా నేనూ నీతో వస్తాను." తన నిర్ణయానికి తిరుగు లేదన్నట్టు అన్నది సంజీవి.
"ప్లీజ్ సంజీవి! నేను చెప్పేది విను. అసలు నాకు ఈ జీవితం పైనే రోత పుడుతోంది. అనుక్షణమూ విశ్రాంతి లేక సంఘర్షణతోనే రోజులు గడచిపోతున్నాయి. కొంతకాలంపాటు ఈ నేరాలకు దూరంగా ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. అసలు ఇకనుంచీ నేరాలు మానేద్దామనుకుంటున్నాను. అందుకే ఇదే చివరి దోపిడీ. ఇది తప్ప ఇక ఎలాంటి నేరమూ చేయదలచుకోలేదు. ఇది అతి ప్రమాదకరమైనది. అందుకే ఆడదానివి నువ్వు నా వెంట రావద్దు ప్రమాదం కొనితెచ్చుకోవద్దు."
"చాలా సంతోషం.....నీ నిర్ణయానికి నువ్వు కట్టుబడితే నాకు అంతకన్నా కావలసినది ఏముంది. ఈ చివరిసారి కూడా నీతోపాటు నేనూ వస్తాను." పట్టుపట్టింది సంజీవి.
ఇక ఆమె మొండితనం ఎలాంటిదో తెలుసు కాబట్టి ఆమెతో వాదించి నెగ్గలేననుకుని మౌనం వహించాడు అధికారి.
ఇద్దరూ నెల్లూరు బస్టాండ్ చేరే సరికి జమ్మలమడుగు వెళ్ళే ఎక్స్ ప్రెస్ సర్వీస్ బయలుదేరడానికి సిద్దంగా వుంది.
కండెక్టర్ వెనుక నున్న రెండు సీట్లలో కూర్చున్నారిద్దరూ.
అధికారి ప్రక్కనే కూర్చునివున్న సంజీవి దాదాపుగా అతని భుజాలపైకి ఒరిగిపోయివుంది. అతనిలో ఎలాంటి రియాక్షన్ లేకపోయే నరికి మరింత అడ్వాన్సయింది.
ఎడమచేతిని మెల్లగా అతని మెడమీద వేసి, పెదవులతో సున్నితంగా కుడి చెవిని కొరికింది సంజీవి.
కోపంగా చూశాడామెవైపు. ఉలిక్కిపడుతూ సర్దుకుని కూర్చున్నదామె.
ఎంతో సమయం గడవకముందే, అల్లరిగా అతని కుడి చేతిని తన చేతులలోకి తీసుకుని నిమరసాగింది.
అతను ఎంత విసుక్కున్నా ఆమె ఏదో ఒకటి చేస్తూనే వుంది. మిగిలిన ప్రయాణీకుల దృష్టిని ఆకర్షించకుండా వుండడానికి అతను మౌనంగా వుండిపోయాడు.
ఆ విషయం గ్రహించిన సంజీవి నెమ్మది నెమ్మదిగా అతని వ్రేలికి వున్న డైమండ్ రింగ్ ని తీసే ప్రయత్నం చేసింది.
ఒక్క ఉదుటున చేయి లాక్కున్నాడతను.
"ఇంకోసారి ఉంగరం తీయాలని ప్రయత్నించావో ఊరుకోను, జాగ్రత్త" గుడ్లురిమి హెచ్చరించాడతను.
మూతి ముడుచుకుని కూర్చుంది సంజీవి.
బస్సు జమ్మలమడుగు చేరేసరికి రాత్రి పది గంటలయింది.
ఆ బస్సు దిగి వేరే బస్సు ఎక్కారు.
అది మహబూబ్ నగర్ చేరుకునేసరికి తెల్లవారుఝామున రెండు గంటలయింది.
తిరిగి బస్సు మారి, అక్కడా నుంచి హైదరాబాద్ వెళ్ళే సూపర్ డీలక్స్ బస్సులో ఎక్కి ఉదయం అయిదు గంటల ప్రాంతంలో భాగ్య నగరంలో కాలుమోపారు.
ఇలా కావాలనే, రైలు ప్రయాణం చేయకుండా, అదీ డైరెక్టర్ గా బస్ రూట్ లో కూడా రాకుండా రెండు మూడు బస్సులు మారి హైదరాబాద్ చేరుకోవడానికి అధికారి ముందుచూపే కారణం!
దగ్గరలోని రెస్టారెంట్ కు వెళ్ళి ఫ్యామిలీ రూమ్ లో కూర్చుని టిఫిన్ చేయడం ఐన తరువాత తన పథకం ఏమిటో వివరించాడు అధికారి.
పూర్తిగా విన్న సంజీవి అదరిపాటుతో నోరు వెళ్ళబెట్టింది.
* * *
ఆ రాత్రి పదీ ఇరవై గంటలకు నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరింది.
నత్తనడకలా సాగుతూ వచ్చిన ఆ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్లో కొచ్చి ఆగేసరికి ఇరవై నిమిషాల వ్యవధి పట్టింది.
రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకులు హడావుడిగా తమ తమ బోగీ నెంబర్లను వెదుక్కుంటూ ఉరుకులు పరుగులు పెట్టారు.
ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో ఎక్కిన ఖరీదయిన ప్రయాణీకులు చాలా నింపాదిగా తమ కూపేల్లో సర్దుకున్నారు.
సిగ్నల్ ఇచ్చినా గార్డ్ గ్రీన్ లైట్ చూపించని కారణంగా ట్రెయిన్ కదల్లేదు.