"ఏమిటి నీ ఉద్దేశ్యం? ఒక్క పోటీలోకూడా నువ్వు పాల్గొనడంలేదు. ఓటమిని అంగీకరించేస్తున్నావు-" అన్నాడు చందూ అనుమానంగా.
"నా శక్తినాకు తెలుసు. నువ్వు తేలికగా తీసుకోకు. ఈరోజుమన ఆఖరు పరీక్ష. ఇందులో నేనేమిటో తెలుస్తుంది నీకు...." అన్నాడు గోపీ.
ఆరోజు పరీక్ష ఏమిటంటే చందూఊళ్ళో ఎక్కడైనాదాక్కుంటాడు. సాయంత్రంలోగా గోపీ అతణ్ణి పట్టుకుంటాడు.
"తప్పించుకుని పారిపోదామనుకుంటున్నావా?" అన్నాడు చందూ.
"అందువల్ల నీకు నష్టమూలేదు. నాకు లాభమూలేదు. ఒప్పుకుంటావా?" అన్నాడు నకిలీ గోపీ.
"నువ్వు తప్పించుకుని పారిపోడానికి వీల్లేదు. ఎందుకంటే నాయుడి మనుషుల్ని నువ్వు బాగా వేధించావు. నిన్ను వదిలిపెట్టానంటే నాయుడు నన్ను బ్రతకనివ్వడు-"
"నేను నిజాయితీకి ప్రాణాలిచ్చేమనిషిని. నన్ను నమ్ము ఈ ఆఖరి పరీక్షలోకూడా ఓడిపోతే నేను నీవెంట ఫిరంగిపురం వచ్చి నువ్వు చెప్పినట్లు నడుచుకుంటాను-" అన్నాడు నకిలీ గోపీ.
"సరే- నేను నిన్ను వదిలిపెడుతున్నాను. కానీ అంతటితో అయిందనుకోకు. నేను నీకు కనపడకపోయినా నిన్ను వెయ్యి కళ్ళతో కనిపెడుతూనే ఉంటాను. పారిపోవడానికి ప్రయత్నించావంటే నీకు ప్రమాదం-" అన్నాడు చందూ.
నకిలీ గోపీ నవ్వి ఊరుకున్నాడు. చందూ వెళ్ళిపోయాక రోజంతా అతడు కులాసాగా గడిపాడు. చందూను వెతికే ప్రయత్నమే చెయ్యలేదు.
అనుకున్న గడువు ముగిసేక చందూ అతదివద్దకు వచ్చి- "నీవ్యవహారం నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నీవు నన్ను వెతికే ప్రయత్నం చేయలేదు-" అన్నాడు.
"మైడియర్ ఫ్రెండ్-పొట్టేలు కొండను ఢీకొనే ప్రయత్నంచేస్తే ఏమవుతుందో తెలియని వాణ్ణికాను నేను నాయింటిముందు ఇనుపగుండును పిండి చేసినప్పుడే నీశక్తి తెలుసుకున్నాను. నీవంటి మనిషి ఉండగా నాయుడు సోమును నామీదకు ఎందుకు పంపించాడో నాకు అర్ధంకాలేదు. నీలోఏమైనా బలహీనతలున్నాయేమో తెలుసుకుందామని నేను ఈ పరీక్షవంకతో నిన్ను ఫిరంగిపురంనుంచి బయటకుతెచ్చాను. ఇలారావడం నాకెంతో మేలుచేసింది. నువ్వు నాకు అర్ధం కావడమేకాక నీ స్నేహంకూడా లభించింది నీకు ఎవరైనా బాస్ ఉన్నారేమో తెలియదు కానీ ఈ క్షణంనుంచీ నువ్వు నాబాస్ వి. నేనిప్పుడు నీతో ఫిరంగిపురం రావడానికి సిద్దంగా ఉన్నాను-" అన్నాడు నకిలీ గోపీ.
ఈ మాటలకు చందూ పొంగిపోయాడు. ఆరాత్రికిద్దరూ ఆఊళ్ళోనే విశ్రాంతి తీసుకుని మర్నాడు ఫిరంగిపురం వెళ్ళారు.
"నేను ముందు నా ప్రియురాలికి చెప్పి అప్పుడు నీదగ్గరకువస్తాను. అయినా నేను రావలసిన అవసరమేముంది? ముందుగా ఫోన్ చేస్తాను. ఫోన్ నంబరు ఇస్తావా?" అన్నాడు నకిలీ గోపీ.
"చూడు-సరిగ్గా అరగంటలో అక్కడికి ఫోన్ చేయాలి-"అన్నాడు చందూ.
"ఎస్ బాస్-" అని నకిలీ గోపీ వెళ్ళిపోయాడు.
చందూ ఉత్సాహంగా నాయుడి వద్దకు వెళ్ళాడు.
"వెళ్ళినపని కాయా, పండా?" అన్నాడు నాయుడు.
"బాస్-అనవసరంగా ఇన్ని రోజులు వృధా చేశాం. మొదటిరోజున నా చేతిలో ఇనుపగుండు పొడికావడం చూసినప్పుడే వాడు బెదిరిపోయాడు. వాడిప్పుడు పూర్తిగా నాకు గులాం...." అన్నాడు చందూ.
"నీది ఓవర్ కాన్ఫిడెన్సు కాదు గదా-"
"చూస్తూండండి బాస్-ఇప్పుడు మీకు వాడినుంచి ఫోన్ వస్తుంది. అంతా అప్పుడే మీకు తెలుస్తుంది-" అన్నాడు చందూ.
"ఈ నాలుగురోజులూ నువ్వేంచేశావో తెలియదు కానీ వాడిక్కడ ప్రణయ విహారం చేశాడు తన ప్రియురాలితో వాళ్ళకు కాపలాకాయలేక మనవాళ్ళు నానా అవస్థా పడ్డారు-" అన్నాడు నాయుడు.
"అదెలాసాధ్యం?" అనుకున్నాడు చందూ అయితే చందూ బుర్ర చురుగ్గా పనిచేసింది. పరీక్ష పేరుతో తననక్కడ వదిలిపెట్టి వాడీ ఊరు వచ్చి తన ప్రియురాలితో తిరిగి-నాయుడి రక్షణ నుపయోగించుకుని ఉంటాడు-"యూ ఆరేస్మార్ట్ గై-"అని మనసులో అనుకుని నవ్వుకున్నాడు చందూ. ఈ విషయం పైకి మాత్రం అనలేదు. గోపీ తనను ఫూల్ చేశాడన్న విషయం నాయుడికి తెలియడం మంచిదికాదు, ఏది ఏమైతేనేం-వాడు తమకు దాసోహమన్నాడు గదా-అదే ముఖ్యం!
కొద్ది సేపట్లోనే అక్కడ బల్లమీద ఫోన్ మ్రోగింది. నాయుడు రిసీవర్ అందుకుని- "హలో!" అన్నాడు కొద్దిక్షణాల్లోనే అతడిముఖంలో రంగులు మారాయి.
చందూ నాయుడి వంకనే గర్వంగా చూస్తున్నాడు. నాయుడు ఫోన్ పెట్టేయగానే-"బాస్-వారు మన ముఠాలో చేరిపోయాడని మరీ సంతోషించకండి. వాడు మీరనుకున్నంత సమర్ధుడుకాడని నాకు అనిపిస్తున్నది-" అన్నాడు చందూ.
నాయుడు గంభీరంగా అతడివంక చూసి - "ఫోన్ ఎవరు చేశారో తెలుసా?" అనడిగాడు.
"సోమును చెదరగొట్టిన హీరోయే అయుంటాడు-"
"కాదు-చౌదరి-అని-" ఏమని చేశాడో తెలుసా?" ఆనందు నాయుడు.
"చౌదరి మీకేం ఫోన్ చేస్తాడో నాకేం తెలుస్తుంది బాస్!"
"అయితే ఇన్నాళ్ళూ నువ్వేం చేసినట్లు?" గద్దించాడు నాయుడు.
"నాకేమీ అర్ధం కావడంలేదు బాస్..." అన్నాడు చందూ.
"అయితే విను. ఆ హీరోగాడు తన ముఠాలో చేరినట్లు ఇప్పుడే చౌదరి ఫోన్ చేసి చెప్పాడు-" అన్నాడు నాయుడు.
చందూ మ్రాన్పడిపోయాడు.
15
గోపీ తన ముఠాలో చేరిన సందర్భంగా చౌదరి హోటల్లో ఒక పెద్దపార్టీ ఏర్పాటు చేశాడు. విశేషమేమిటంటే ఆ పార్టీకి ఆ ఊరిపెద్దలు, పోలీసు అధికారులు కూడా ఆహ్వానించబడ్డారు. పార్టీకి నాయుడు కూడా వచ్చాడు. అతడివెంట చందూ ఉన్నాడు. పార్టీ చాలా ఘనంగా జరిగింది. అతిధులకు డ్రింక్స్ కోరినంత ఇవ్వబడ్డాయి. హాల్లో భరతనాట్యం, డిస్కో ప్రదర్శన లివ్వబడ్డాయి.
"వృద్దుడైపోతున్నాను. మంచి పార్ట్నర్ కోసం చూస్తున్నాను. నా వ్యాపారం చూసుకునేందుకు మిస్టర్ గోపీ దొరికాడు. ఇతగాడికి నాకందించిన సహాయ సహకారాలు మీరంతా అందించవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను-" అన్నాడు చౌదరి పార్టీలో.