గోపీ పరిచయం చేయబడగానే హాల్లోనివారందరూ చప్పట్లుకొట్టారు. ఒకరొక్కరే గోపీని సమీపించి అతడికి షేక్ హ్యాండిచ్చి వెడుతున్నారు.
నాయుడు అతడికి షేక్ హ్యాండిచ్చి నప్పుడు ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరుసూటిగా చూసుకున్నారు. ఆ చూపుల భావాలు వారిద్దరికే తెలియాలి.
తర్వాత చందూ షేక్ హ్యాండిశూ-"నువ్వు నన్ను మోసంచేశావు-" అన్నాడు.
"అంటే నువ్వు మోసపోయావనేకదా అర్ధం-నిన్ను మోసం చేయగలిగాను కాబట్టి నువ్వు నాచేతిలో ఓడిపోయావు-అవునా?" అన్నాడు గోపి నెమ్మదిగా.
"నీకు తెలుసు నేను ఉక్కుముక్కల్ని పిండి చేయగలను-"
"ఉక్కుముక్కల్ని పిండిచేయగల యంత్రాలమీటలు మనిషిచేతిలో ఉంటాయి-" అని నవ్వాడు గోపీ.
చందూ వెళ్ళిపోయాడు.
అతిథులందరూ ఒకరొక్కరే వెళ్ళిపోయాక చౌదరి గోపీతో- "నీకోసం మంచి బంగళాను సిద్దం చేశాను. విశాలను అక్కడికి ముందుగా పంపించేయ్. నేను నీతో కాసేపు మాట్లాడాలి-" అన్నాడు.
తను తరువాత వస్తానని చెప్పి గోపీ విశాలను ముందుగా ఇంటికి పంపించివేశాడు. అప్పుడు చౌదరి అతడిని ఒక గదిలోనికి తీసుకునివెళ్ళి-" "నీవంటి వాడిని నేనెక్కడా చూడలేదు. నాయుడి మనుషులు నిన్ను వేటాడతారనుకున్నాను. కానీ వాళ్ళు నిన్ను నాయుడికంటే భద్రంగా చూసుకున్నారు. నాయుడి నెదిరించి నారక్షణలేకుండా ఒక్కరోజుకు మించి ఎవ్వరూ ఈ ఫిరంగిపురంలో బ్రతకలేకపోయారు. వారంరోజులు నువ్వు ప్రాణాలు కాపాడుకోగలవని నేననుకోలేదు. ఈ అద్భుతాన్ని సాధించడం వల్లనే నిన్ను మారాలోచన లేకుండా నా భాగస్వామిని చేసుకున్నాను-" అన్నాడు చౌదరి.
"ఇది నేను ఎలా సాధించానని అడక్కు ఎవరి పద్దతులు వాళ్ళకుంటాయి-" అన్నాడు గోపీ మందహాసంచేస్తూ.
"నీ రహస్యాలేమీ తెలుసుకునే ఉద్దేశ్యంలేదునాకు. నా రహస్యాలే చెబుతాను నీకు-పద-నీకిప్పుడో అమ్మాయిని చూపిస్తాను-" అన్నాడుచౌదరి.
ఇద్దరూ మరో గదిలోకి వెళ్ళారు. అక్కడ ఓ యువతి ఉన్నది. ఆమె జీన్సులో ఉన్నది. ఆమె పక్కన నిలువెత్తు కొయ్యబొమ్మ ఉన్నది.
ఆమె చౌదరినిచూసి పలకరింపుగా నవ్వింది.
"ఈమెను చూస్తే నీకేమనిపిస్తున్నది?" అన్నాడు చౌదరి.
"మనిషి నాజూకైనది. ముఖం అందమైనది-" అన్నాడు గోపీ.
"అక్కడే అందరూ పొరపడతారు. నాజూకుగా కనిపించే ఈమె కాలిమడమగట్టితనం ఎవ్వరూ ఊహించలేరు-" అన్నాడు చౌదరి.
"కాలిమడమ ఎవరికైనా గట్టిగానే ఉంటుంది-" అన్నాడు గోపీ!
"మిస్ శకుంతలా-ఇతడిపేరు గోపీ- నా పార్ట్నర్. అంటే నీకు కొత్త బాస్ అన్నమాట. ఇతడికి నీ మడమ గట్టితనాన్ని చూపించు-" అన్నాడు చౌదరి.
శకుంతల గోపీని సమీపించి అతడి భుజాలపై చేతులు వేసింది. గోపీ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. అతడేదో అనేలోగానే ఆమె కదిలింది. ఆమె కాలు శరవేగంలో గాలిలోకి లేచింది. పక్కనే ఉన్న నిలువెత్తు కొయ్యబొమ్మ పడిపోయింది. శకుంతల అతఃడిని వదిలి- "నేను బొమ్మ నుదిటిపై తన్నాను-" అన్నది.
"ఇదో పెద్దవిద్యా?" అన్నాడు గోపీ తేలికగా.
"అంటే?"
"ఏ బొమ్మను తన్నినా క్రిందపడిపోతుంది-" అన్నాడు గోపీ.
చౌదరినవ్వి- "మిస్టర్ గోపీ-ముందు నువ్వా బొమ్మను నిలబెట్టు-" అన్నాడు. గోపి ఆ బొమ్మను నిలబెట్టడానికి ప్రయత్నించాడు. ఆకొయ్యబొమ్మ అతడూహించని బరువులో ఉన్నది. అది కదపడమే కష్టంగా ఉన్నది.
"దాని బరువు తెలిసిందికదా-ఇప్పుడా బొమ్మ నుదిటిపై చూడు ఎర్రరంగు "L" గుర్తు ఉంటుంది-"అన్నాడు చౌదరి. గోపి ఆ విషయం గమనించాడు. చౌదరి వివరించాడు- "శకుంతల మడమపై ఆ "L" గుర్తు ఉన్నది. ఆమె తనవద్ద ఎప్పుడూ ప్రత్యేకమైన సిరాను ఉంచుకుంటుంది. అది కాలిమడమకు కాస్త రాసుకుంటే-ఆమె వరుసగా పదిమందికి నుదిటిపై ముద్రలు వేయగలదు...."
తర్వాత చౌదరి గోడవద్దకు వెళ్ళి ఏదో మీటనొక్కాడు. అప్పుడు కొయ్యబొమ్మ మళ్ళీ లేచినిలబడింది. చౌదరి గోపివంకచూసి-" ఆమె కాలిమడమల బలం నీకు తెలియాలంటే ఒక్కటే మార్గం. నువ్వీ బొమ్మను పడగొట్టడానికి ప్రయత్నించు-నీకు తోచిన విధంగా-" అన్నాడు.
గోపి ఆ బొమ్మను చేతుల్తో తోశాడు. కాళ్ళతో తన్నాడు. బలమంతా ఉపయోగించి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అది అంగుళం కూడా కదల్లేదు.
"శకుంతలా! ఈసారి బొమ్మ గట్టిగా నేలకు అతుక్కుపోయినట్లుంది. పడగొట్టడం నీవల్లనవుతుందేమో చూడు-" అన్నాడు చౌదరి.
శకుంతల గోపిని ఊతగా చేసుకుని మళ్ళీ బొమ్మను పడగొట్టింది. గోపి వెళ్ళి చూస్తే బొమ్మ నుదిటిపై మరో "L" మార్కు ఉన్నది.
గోపి అప్రయత్నంగా తన నుదురు తడుముకున్నాడు. శకుంతల నవ్వుతూ-"నా మడమ శత్రువులనే గానీ మిత్రులను బాధించదు-" అన్నది.
"ప్రస్తుతానికి మేము సెలవుతీసుకుంటాం మిస్ శకుంతలా!" అన్నాడు చౌదరి. గోపికూడా ఆమెకు వీడ్కోలు చెప్పాడు. ఇద్దరూ బయటకు వచ్చేక- "ఈమెకూడా నాయుడిపై పగబట్టినమనిషి. అతడి అంతం కోసం ఎదురుచూస్తున్న మనిషి!" అన్నాడు చౌదరి.
"నువ్వూ నాయుడివి అంతంచేయాలనుకుంటున్నావా?" అన్నాడు గోపి ఆశ్చర్యంగా.
"వాడిని అంతంచేయాలన్నదే నా కోరిక. వాడు నా నుంచి విడిపోయేటప్పుడు నన్ను లొంగదీయడంకోసం నా భార్యనూ, ఒక్కగానొక్క కొడుకునూ బంధించి తీసుకునిపోయాడు. నేను తనకు లొంగలేదన్న కసితో వాళ్ళను క్రూరంగా హింసించి చంపాడు. నేనూ అదే విధంగా వాడిమీద పగ తీర్చుకోవాలనుకున్నాను. కానీ వాడుచేసిన తప్పుకు వాడి బంధువులను హింసించడం నాకు నచ్చలేదు. నా దుఃఖాన్ని నాలోనే దిగమింగుకుని వాడిమీద పగతీర్చుకునే అవకాశంకోసం ఎదురుచూస్తున్నాను. తలచుకుంటే వాడిని సర్వనాశనం చేయగల సత్తా నాకున్నది. కానీ అప్పుడు నేను ఒంటరివాడినైపోతాను. నా పేరుచెప్పి కొన్ని వేలమంది జీవిస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా నేను పేరుసంపాదించాను. నేను కొనసాగిస్తున్న ఈవ్యాపారం కేవలం నా పగ కారణంగా నశించిపోకూడదు ఇది ఇలాగే కొనసాగాలంటే నాయుడి అవసరం ఎంతైనా ఉన్నది. నాయుడు జిత్తులమారి. వాడు పోలీసుల గురించి ఇట్టే ఆచూకీ సంపాదించి-వారిని మట్టుపెట్టేస్తున్నాడు. వాడి ట్రిక్స్ అద్భుతమైనవి. వాడి కారణంగా ఈ ఊరిలో నాకు కొంత రక్షణ ఏర్పడింది. వాడిని మట్టుపెట్టాలంటే వాడిని మించిన ట్రిక్స్ వేయగలమనిషి కావాలి నాకు. నీలో నాకా లక్షణాలు కనబడుతున్నాయి. ఇంతకాలం నా పనులు నేను చేసుకునిపోతూ నాయుడి విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. నాయుడుకూడా అట్టే నా జోలికి రాకుండా తనపనులు చేసుకునిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు. నాయుడిని మట్టుపెట్టి-ఈ ఫిరంగిపురంలో మళ్ళీ రెండు ముఠాలను ఒక్కటి చెయ్యాలి. నేను ప్రారంభించిన వ్యాపారం కలకాలం కొనసాగాలి...." అన్నాడు చౌదరి.